నవతెలంగాణ-సంగారెడ్డి ప్రతినిధి
ఉమ్మడి మెదక్ జిల్లాలో మహాకూటమి టికెట్ల పంపిణీ రోజుకో మలుపు తిరుగుతోంది. టీజేఎస్ అభ్యర్థుల ప్రకటనలతో కాంగ్రెస్ ఆశావహులు స్వతంత్రులుగా పోటీకి దిగుతుండడంతో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. జిల్లాలో టీజేఎస్‌కు మూడు స్థానాలు కేటాయించారు. దీంతో కాంగ్రెస్‌లో అసంతృప్తి నెలకొంది. మెదక్‌లో జనార్ధన్‌రెడ్డి, సిద్దిపేటలో భవానిరెడ్డి, దుబ్బాకలో చిందం రాజ్‌కుమార్ టీజేఎస్ నుంచి బరిలో దిగుతున్నట్టు ఆ పార్టీ నేతలు ప్రకటించారు. ఈ నిర్ణయం కాంగ్రెస్‌కు స్వయంకృతాపరాధం అవుతుందని ఆ పార్టీ స్థానిక నేతలు మదనపడుతున్నారు. దుబ్బాక నుంచి పోటీచేస్తున్న రాజ్‌కుమార్ 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 1,108 ఓట్లు మాత్రమే పొందారు. ఆయన సిట్టింగ్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి బలమైన ప్రత్యర్థి కాదని వార్తలున్నాయి. కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన మద్దుల నాగేశ్వర్‌రెడ్డి రెబల్‌గా పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు. గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన చెరకు ముత్యంరెడ్డిని ఆరోగ్య సమస్య కారణాలు చూపి కాంగ్రెస్ జాబితా నుంచి తప్పించారు. మెదక్ కాంగ్రెస్ టికెట్ ఆశించిన పటోళ్ల శశిధర్‌రెడ్డికి పార్టీ మొండిచేయి చూపింది. ఇక్కడి నుంచి విజయశాంతి పోటీ చేస్తారనే ప్రచారం జరిగినా ఆమె కూడా శశిధర్‌కు మద్దతు ప్రకటించారు. చివరికి అనూహ్యంగా ఆ స్థానంలో టీజేఎస్ నుంచి జనార్దన్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. దీంతో టికెట్ రాని శశిధర్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో దిగనున్నారు. కాంగ్రెస్‌కు టికెట్ ఇచ్చుంటే సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికి గట్టి పోటీ ఉండేదని పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. సిద్దిపేటలో వరుసగా గెలుస్తున్న హరీశ్‌రావుపై పోటీకి టీజేఎస్ పట్టుబట్టి టికెట్ సాధించుకుంది. ఆ పార్టీ తరఫున భవానిరెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ సీటు ఎలాగో గెలిచేది కాదనేది ఇరుపార్టీల అంచనాగా తెలుస్తోంది. ఇక్కడ 2010, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన తాడూరి శ్రీనివాస్ గౌడ్ రెబల్‌గా నామినేషన్ వేశారు. ఈయనతో పాటు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ వర్మ, ఇటీవల టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన దరిపెల్లి చంద్రం, వాహీద్‌ఖాన్, దేవులపల్లి యాదగిరి కూడా నామినేషన్లు వేశారు. వీరిప్పుడు టీజేఎస్‌కు మద్దతుగా నామినేషన్లు ఉపసంహరించుకుంటారో లేదో వేచి చూడాలి. టీఆర్‌ఎస్‌కు పట్టున్న ఈ నియోజకవర్గాల్లో బలమున్న కాంగ్రెస్ పోటీ చేయకుండా జిల్లాలో ప్రభావంలేని టీజేఎస్‌కు కేటాయించడం చేతులారా మూడు స్థానాలు కోల్పోవడమేనని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.
Sun 18 Nov 23:48:58.339443 2018