- సీట్ల కేటాయింపులో వివక్ష
- అధిక స్థానాలిచ్చిన బీఎల్‌ఎఫ్
ముస్లిం మైనార్టీలను రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయి. వారికి తాయిలాలు ప్రకటిస్తూ చట్టసభల్లో ప్రవేశానికి మాత్రం అవకాశం ఇవ్వట్లేదు. రాష్ట్రంలో 12 శాతం జనాభా ఉన్న ముస్లిం ఓటర్లు సుమారు 40 నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. అయినా వారికి పార్టీలు మొండిచేయి చూపించాయి. తెలంగాణలో హిందూ ముస్లిం ఐక్యత 'గంగా జమున తెహజీబ్' వంటిదని తరచూ చెప్పే కేసీఆర్ కూడా టికెట్ల విషయం వచ్చేసరికి మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల ప్రకటన, మైనార్టీ గురుకుల విద్యాసంస్థల ఏర్పాటు, షాదీముబారక్, రంజాన్‌కు కొత్తబట్టల పంపిణీ, ఇమామ్‌లకు జీతభత్యాలు వంటి పథకాలు పార్టీకి మేలు చేస్తాయని భావిస్తున్న కేసీఆర్ 119 స్థానాల్లో ముగ్గురు ముస్లిం అభ్యర్థులకు మాత్రమే టికెట్లు కేటాయించారు. అంటే 2.5 శాతం మాత్రమే. వాటిలో ఒకరు బోధన్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్. మిగతా రెండు పాతబస్తీలోని ఏ మాత్రం గెలిచే అవకాశాల్లే ని చార్మినార్, బహదూర్‌పురా నియోజకవర్గాలు. ముస్లింలు పార్టీ వెన్నెంటే ఉంటారని చెప్పే కేసీఆర్ వారిని ఓటు బ్యాంకుగా కాకుండా పాలనాపరంగా కూడా అవకాశం కల్పిస్తే బాగుండేదని పలువురు మైనార్టీ మేధావులు అభిప్రాయపడుతున్నారు. మహాకూటమి తరఫున 8 మంది ముస్లిం అభ్యర్థులకు..అంటే 6.7 శాతం టికెట్లు కేటాయించారు. వీరిలో ఏడుగురు కాంగ్రెస్ నుంచి, ఒకరు టీడీపీ నుంచి బరిలో దిగుతున్నారు. సెక్యులర్ పార్టీగా ఉన్న పార్టీకి ముస్లింలు మొదటి నుంచి ఓటు బ్యాంకుగా ఉన్నారని చెప్పుకుంటున్న కాంగ్రెస్ కేవలం ఏడు చోట్లనే టికెట్లిచ్చింది. టీఆర్‌ఎస్‌కు తీసిపోని విధంగా కాంగ్రెస్ కూడా ముస్లింపై వివక్ష ప్రదర్శిస్తోందనేది ఈ లెక్కలను బట్టే అర్థమవుతున్నది. టీడీపీ కేటాయించిన మలక్‌పేట ఏమాత్రం గెలిచే అవకాశాల్లేని స్థానం. ఇక్కడ ఎంఐఎంకు తిరుగులేదు. ముస్లింలతో ఎప్పుడూ వైరంగా ఉండే బీజేపీ రెండు సీట్లు అంటే..1.6 శాతం ఇచ్చింది. అవి కూడా పార్టీకి బలం లేని చంద్రాయణగుట్ట, బహదూర్‌పురా నియోజకవర్గాలను ఇచ్చింది. సామాజిక అభివృద్ధే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగుతున్న బీఎల్‌ఎఫ్ అత్యధికధికంగా పది స్థానాలను అంటే.. 8.4 శాతం ముస్లింలకు కేటాయించింది. మైనార్టీలకు ప్రత్యేక సబ్‌ప్లాన్ చట్టం ఏర్పాటు చేసి రూ.5 లక్షల నగదు రుణాలు అందజేస్తామని, వక్ఫ్ భూములను ముస్లింల అభివృద్ధికి పంపిణీ చేస్తామనే హామీలతో వారికి చేరువవుతోంది.
Wed 21 Nov 02:16:08.719515 2018