రాష్ట్రంలో 14 శాతం మైనార్టీలుండగా వీరిలో మెజార్టీగా 12 శాతం ముస్లిం జనాభా ఉంది. క్రిస్టియన్స్, ఇతర మైనార్టీలు కలిపి మిగతా రెండు శాతం ఉన్నారు. ముస్లిముల్లో అత్యధికులు అస్థిరమైన ఆదాయ వనరులు, చిన్న వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నవారే. ఫుట్‌పాత్ వ్యాపారం, వీధి వ్యాపారం వంటి అసంఘటిత రంగంలో ఎలాంటి రక్షణ లేకుండా పనిచేస్తున్న వారిలోనూ ఇతర ఏ సామాజిక తరగతులకన్నా ముస్లిం జనాభానే ఎక్కువ అనడంలో సందేహం లేదు. పట్టణ ప్రాంతాల్లో 60 శాతానికి పైగా స్వయం ఉపాధిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అలాంటి వారికి ప్రభుత్వాల నుంచి సరైన ఆర్థిక సాయం అందడం లేదనేది వాస్తవం. మెజార్టీ ముస్లిములు వ్యవసాయేతర పనుల్లో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో వీరు తక్కువగా ఉన్నారు. స్థిరమైన ఆదాయ వనరులు లేని ఫలితంగా పేదరికంలో మగ్గుతున్నారు. ముస్లిం జనాభా స్థిరపడ్డ అన్ని ప్రాంతాల్లోనూ సామాజిక, భౌతిక వనరుల కల్పన కూడా తక్కువగానే ఉంది. విద్యా సంస్థలు, వైద్య సదుపాయాలు, రోడ్లు, బస్సు సౌకర్యము..కమ్యూనికేషన్ తదితర సేవలు, ఇతర మౌలిక వసతులకల్పనా తక్కువే. సచార్ కమిటీ ముస్లింల జీవన స్థితిగతులను, వారి నివాస ప్రాంతాల్లో అధ్యయనం చేసి తేల్చిన విషయమిది. ఉన్నత విద్యావకాశాలూ వీరికి తక్కువే. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎక్కువ కుటుంబాల్లో పిల్లలను చదివించలేక చిన్న చిన్న పనుల్లో పెడుతున్నారు. ఫలితంగా వీరి పిల్లలు బాలకార్మికులుగా మారుతున్నారు. దేశం మొత్తంగా చూసినా వీరి జనాభా 13.5 శాతమైతే బాలకార్మికుల్లో 40 శాతం ముస్లింల పిల్లలే ఉన్నారు. ఆడపిల్లలకు సకాలంలో పెండ్లిళ్లు చేయలేని దుస్థితిలోనూ కొన్ని కుటుంబాలున్నాయంటే అతిశయోక్తి కాదు. ఇంతటి దయనీయ స్థితిలో బతుకుతున్న ముస్లిం ప్రజానీకం జీవన ప్రమాణాల మెరుగుదలకు పాలక ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలేంటి.? వారి శాశ్వత అభివృద్ధికి చేస్తున్న కృషి ఏంటి.? అంటే శూన్యమే అని చెప్పాలి. రాష్ట్రంలో 12 శాతంగా ఉన్న ముస్లిం జనాభా తమ వెంటే ఉందని చెబుతున్న కాంగ్రెస్ ఇన్నాండ్లూ వారిని ఓటు బ్యాంకుగానే వాడుకుంది. టీఆర్‌ఎస్ ప్రభుత్వమూ చిన్న చిన్న సంక్షేమ చర్యలకే పరిమితమవుతున్నది. విద్యా ఉద్యోగావకాశాల్లో 12 శాతం రిజర్వేషన్లు అని చెప్పినా అమలు కాలేదు. చట్ట సభల్లోకి పంపేందుకూ సుముఖంగా లేదు. తాజా ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కేవలం ముగ్గురికే టిక్కెట్లిచ్చింది. సబ్‌ప్లాన్ చట్టం తేవాలన్న డిమాండునూ పట్టించుకోలేదు. సామాజిక న్యాయం లక్ష్యంగా ఏర్పడ్డ బీఎల్‌ఎఫ్ 10 స్థానాలను కేటాయించింది. తాము అధికారంలోకి వస్తే మైనార్టీలకు జనాభా ప్రాతిపదికన సబ్‌ప్లాన్‌ను, రిజర్వేషన్‌లను, సచార్, సుధీర్, రంగనాథన్ కమిటీల సిఫార్సులను అమలు చేస్తామని తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించింది. వక్ఫ్ బోర్డులకు క్వాసీ జుడిషియల్ అధికారాలిచ్చి ఆస్తులను కాపాడుతామని స్పష్టం చేసింది. సంచార ముస్లిం జాతులకూ ఇండ్లు, ఇతర సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామని మ్యానిఫెస్టోలో పొందుపర్చింది. తురకకాశ, దూదేకుల కులస్తులకు ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేస్తామనీ బీఎల్‌ఎఫ్ చెబుతోంది.
Wed 21 Nov 23:37:58.279955 2018