- నిత్యావసరాల రవాణాకు ఆటంకం
- ఇబ్బందులు పడుతున్న గిరిజనులు
ఛత్తీస్‌గడ్, తెలంగాణా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు గిరిజనుల పాలిట శాపంగా మారాయి. ఒక వైపు పోలీసులు, మరోవైపు మావోయిస్టుల హెచ్చరికలతో వారాంతపు సంతలు ఆగిపోయాయి. దుమ్ముగూడెం మండల సరిహద్దున గల ఛత్తీస్‌గడ్ దండకారణ్యంలోని పలు గిరిజన గ్రామాల్లో నిర్వహించే సంతలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలయినప్పటి నుంచి బ్రేక్ పడింది. దీంతో భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలకు చెందిన సంత వ్యాపారులకు కష్టాలు వచ్చాయి. సోమవారం ధర్మపేట వారాంతపు సంత, మంగళవారం కిష్టారం, బుధవారం గొల్లపల్లి, శుక్రవారం బూర్గులంక సంతలు నిర్వహిస్తుంటారు.
ఛత్తీస్‌గఢ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే మావోయిస్టుల బూచి చూపి బూర్గులంక సంతకు వెళ్లవద్దని వ్యాపారులను పోలీసులు హెచ్చరించారు. దీనికి తోడు నిర్వహిస్తే అన్ని సంతలూ నిర్వహించాలని లేకపోతే సంతలన్నీ ఆపేయాలని మావోయిస్టులు కూడా హుకూం జారీ చేశారు. దీంతో రెండు నెలలుగా వారాంతపు సంతలు నిలిచిపోయాయి. సంత లేకపోవడంతో దండకారణ్యంలో ఏర్పాటు చేసుకున్న బేస్ క్యాంపులకు, మన్యం ప్రజలకు నిత్యావసర సరుకులు అందుబాటులో లేవు. మండలానికి చెందిన కొంతమంది సంత వ్యాపారులు మాత్రం బేస్ క్యాంపుల వద్ద అర్డర్లు తీసుకుని వారికి నిత్యావసర సరుకులు రవాణా చేస్తున్నారు. గిరిజనులు సేకరించిన అటవీ ఉత్పత్తులను ఇక్కడ వ్యాపారులకు విక్రయించి వారికి కావాల్సిన నిత్యావసరాలు కొనుగోలు చేస్తారు. క్యాంపు పోలీసులకు ఎలాగోలా సరుకులు లభిస్తున్నా సంతపైనే ఆధారపడ్డ గిరిజనులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు.
Wed 21 Nov 23:47:56.266867 2018