- నీతీ నియమాలకు నిలువుటద్దం
- చైతన్యమైన పోరాటాలపై చెరగని సంతకం
- బీఎల్‌ఎఫ్ బలగంతో బరిలో బీఎల్‌పీ, సీపీఐ(ఎం)
ఖమ్మం..తెలంగాణలో కమ్యూనిస్టులకు గెలుపు గుమ్మం.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ అవిభాజ్య జిల్లా నుంచే బీఎల్‌ఎఫ్ బోణీ కొట్టబోతున్న సంకేతాలు వెలువడుతున్నాయి. బీఎల్‌ఎఫ్ బలగాల అండ, మెజారిటీ ప్రజల మద్దతు వల్ల సీపీఐ(ఎం), బీఎల్‌పీ అభ్యర్థులు కదం తొక్కుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని తాజా రాజకీయ కదలికలు ఈ కబురు అందిస్తున్నాయి!
ఖమ్మం జిల్లాలో పాలక పార్టీల పటాటోపాలను జనం నిశితంగా గమనిస్తున్నారు. ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తుకొచ్చే ఆ పార్టీల విస్మయకర విన్యాసాలు, పోకడలను అర్థం చేసుకుంటున్నారు. కూటమి గట్టిన కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ల గోలనూ తిలకిస్తున్నారు. టీఆర్‌ఎస్ వర్ణిస్తోన్న 'బంగారు తెలంగాణ'లోని డొల్లతనాన్నీ చూస్తున్నారు. 'ఎలక్షన్ టు ఎలక్షన్' అలంకారల ఆర్భాటాలనూ అంచనా కడుతున్నారు. ఆయా పార్టీల అభ్యర్థులు, పెద్ద పెద్ద లీడర్ల రాకపోకల తీరుతెన్నులనూ లెక్కగడుతున్నారు. అదే సమయంలో ఎన్నికలతో నిమిత్తం లేకుండా నిరంతరం తమ మధ్యే ఉండే కమ్యూనిస్టుల ఆత్మీయ త్యాగాలనూ మననం చేసుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు సహా అగ్రవర్ణాల్లోని బీదల పార్టీగా మొత్తం జనాభాలో 98 శాతం పబ్లిక్ గొంతుగా అవతరించి, ఈ ఎన్నికల్లో దిగిన బీఎల్‌ఎఫ్‌ను తమంతట తాముగా గౌరవపూర్వకంగా ఆదరిస్తున్నారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్(బీఎల్‌ఎఫ్) బలపర్చిన సీపీఐ(ఎం), బహుజన లెఫ్ట్ పార్టీ(బీఎల్‌పీ) అభ్యర్థులను గుండెల్లో పెట్టుకొంటున్నారు. పాత ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా, సీపీఐ(ఎం) 5 స్థానాల్లో, బీఎల్‌పీ 4 సీట్లలో పోటీ చేస్తున్నది. ఒకచోట ఎన్‌డీ రాయల వర్గానికి మద్దతిస్తున్నది.
ప్రత్యామ్నాయమే ప్రచారాస్త్రంగా..
పాలక పార్టీల మాయమాటలపై జనాన్ని చైతన్యపర్చడంలో కమ్యూనిస్టులది చెరగని సంతకం. సమస్యల్ని లేవనెత్తుతూ పరిష్కారాలనూ చూపుతూ ఖమ్మం ప్రజల చెంతనే ఉంటోన్న బీఎల్‌ఎఫ్ ప్రత్యామ్నాయ విధానాలు, సామాజిక న్యాయమే ప్రచారాస్త్రాలుగా ఇంటింటి 'తలపు'తడుతున్నది. తలాపున గోదావరి నది ఉన్నా తాగు నీటికి కటకటే. దండకారణ్యంలోని ఆదివాసీల కనీస హక్కులపై దాడి. పోడు భూములకు పట్టాలపై సవాలక్ష అడ్డుపుల్లలు..ఇట్లా దీర్ఘకాలిక సమస్యలపై ఇన్నాండ్లుగా సాగిస్తోన్న పోరాటాలను బీఎల్‌ఎఫ్ అభ్యర్థులు ప్రస్తావిస్తున్నారు. 'గూడాల్లో సీపీఐ(ఎం) అభ్యర్థి బాబురావు కలియతిరుగుతున్నారు. మొఖం చెల్లని కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు టౌన్‌లో ఏదో హడావుడి చేస్తున్నాయి..' అంటూ యథార్థాలను భద్రాచలంలోని ఆటో కార్మిక సోదరుడు రామచంద్రుడు 'నవతెలంగాణ' ప్రత్యేక ప్రతినిధితో పంచుకున్నారు. ఎవరెన్ని తియ్యటి మాటలు చెప్పినా, ఎంతలా ప్రలోభాల వలలోకి లాగినా..'కట్టుబాట్ల గీత దాటని, ప్రజాసేవే ధ్యాసగా జీవించే కమ్యూనిస్టులు, బీఎల్‌ఎఫ్ వైపే ఇక్కడి జనం మొగ్గుతారు..' అని భద్రాచలంలో ప్రముఖ హౌటల్ వ్యాపారి ఒకరు తేల్చిచెప్పడం పూర్వ ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టుల ప్రాభవం, నిబద్ధతను చాటుతున్నది. భద్రాచలంలో సీపీఐ(ఎం) తరపున మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబురావు పోటీలో ఉన్నారు. అట్లే సీపీఐ(ఎం) నుంచి వైరాలో భూక్యా వీరభద్రం, సత్తుపల్లిలో మాచర్ల భారతి, పాలేరులో బత్తుల హైమావతి, పినపాకలో కాటిబోయిన నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. బీఎల్‌పీ అభ్యర్థులుగా మధిరలో డాక్టర్ కోట రాంబాబు, అశ్వారావుపేటలో తానం రవీందర్, ఖమ్మంలో పాల్వంచ రామారావు, కొత్తగూడెంలో ఎడవల్లి కృష్ణ బరిలో నిలిచారు. ఇల్లందులో న్యూడెమక్రసీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యకు బీఎల్‌ఎఫ్ మద్దతు ఇస్తున్నది. ఈ అభ్యర్థులందరికీ ఆయా నియోజకవర్గాల ప్రజల్లో మంచి పేరున్నది. అన్ని వర్గాల్లోని పేదల పక్షం వహించే వారిగా గుర్తింపు ఉన్నది.
వీరభద్రం పాదయాత్ర..విజయానికి శక్తి మాత్ర!
పలు పార్టీలు, ప్రజా పౌర సంఘాల సంయుక్తమైన బీఎల్‌ఎఫ్ ప్రత్యామ్నాయం ఈ ఎన్నికల్లో నలుమూలల్లో చర్చానీయాంశమైంది. ముందుగా 'సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి' లక్ష్యంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో 2016-2017లో తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించిన 'మహాజన పాదయాత్ర' జనం మదిలో కదలాడుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో మరెవరూ చేపట్టని నాటి సాహసోపేత పాదయాత్ర ఖమ్మం జిల్లాలో పోటీలో ఉన్న బీఎల్‌ఎఫ్ అభ్యర్థులకు శక్తి మాత్రగా ఊతమిస్తున్నది. నాటి పాదయాత్రలో నమోదైన ప్రజల వ్యక్తిగత, సామూహిక సమస్యలకు పరిష్కారాల సమాహారమైన బీఎల్‌ఎఫ్ మ్యానిఫెస్టో విశ్వసనీయతను ప్రతిఫలిస్తున్నది. బీఎల్‌ఎఫ్ కన్వీనర్ తమ్మినేని, చైర్మన్ నల్లా సూర్యప్రకాశ్‌తోపాటు సీపీఐ(ఎం) జాతీయ, రాష్ట్ర నేతలు ఖమ్మం జిల్లాలో బీఎల్‌ఎఫ్ అభ్యర్థుల గెలుపునకు విశేషంగా ప్రచారం చేపట్టారు. సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్ ఇప్పటికే వైరా, భద్రాచలం వంటి నియోజకవర్గాల ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. దేశంలో మోడీ, రాహుల్‌గాంధీ, రాష్ట్రంలో కేసీఆర్‌ల నిజస్వరూపాలను కండ్లకు కడుతూ ప్రజల్ని ఆలోచింపజేస్తున్నారు.
-ఇల్లెందుల దుర్గాప్రసాద్
Sun 25 Nov 00:48:50.783706 2018