నవతెలంగాణ-నల్లగొండ ప్రతినిధి
నకిరేకల్‌లో బీఎల్‌ఎఫ్ బలపరిచిన సీపీఐ(ఎం) అభ్యర్థి జిట్టా నగేశ్ ప్రచారంలో దూసుకుపోతూ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. మూడు దశాబ్దాలుగా జిల్లా ప్రజల సమస్యల పట్ల అలుపెరుగని పోరాటం చేస్తున్న యోధుడుగా ఆయనకు గుర్తింపు ఉంది. ఆయన చిట్యాల సర్పంచ్, ఎంపీటీసీగా చేసిన సేవలు జనం గుండెల్లో చెరగని ముద్రవేసుకున్నాయి. ఎస్‌ఎఫ్‌ఐ సభ్యుడిగా విద్యార్థి సమస్యలపై అనేక పోరాటాలు చేశారు. ప్రజా నాట్యమండలి కళాకారుడిగా ప్రజల్లో చైతన్యం కలిగించారు. కుల వ్యతిరేక పోరాట సమితిలో సభ్యుడిగా కులదురహంకార హత్యలు, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి వేముల వీరేశం, కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్యలకు దీటుగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలో సాగు తాగు నీటి సమస్య, మౌలిక సదుపాయాల కొరత, విద్యా వైద్య రంగాల్లో వెనుకబాటుతనం, ఇసుక మాఫియా వంటి అంశాల్లో ప్రజలను చైతన్యవంతం చేస్తూ ప్రజాభిమానాన్ని చూరగొంటున్నారు. గతంలో ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన చిరుమర్తి లింగయ్య, వేముల వీరేశం నియోజకవర్గ అభివృద్ధిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరును ప్రచారంలో ఎండగడుతున్నారు. బీఎల్‌ఎఫ్ మ్యానిఫెస్టోలోని బువ్వ కేంద్రాల ఏర్పాటు, చదువుల సావిత్రి, నిరుద్యోగులకు రూ.5వేల భృతి తదితర అంశాలను ప్రజలకు వివరిస్తున్నారు.
Tue 04 Dec 00:15:58.367693 2018