దర్శకుడు రాఘవేంద్రరావును అడ్డుకున్న ఓటర్లు
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లో ఉన్న ఫిల్మ్‌నగర్‌లో శుక్రవారం ఓటేసేందుకు వెళ్లిన ఆయనను ఓటర్లు అడ్డుకున్నారు. క్యూలో నిలుచోకుండా నేరుగా బూత్‌లోకి వెళ్తున్న రాఘవేంద్రరావును క్యూలో వెళ్లాలని కోరారు. దీంతో ఆయన ఓటు వేయకుండానే వెనుతిరిగారు. తర్వాత మళ్లీ వచ్చి ఓటు వేశారు. గత ఎన్నికల్లో చిరంజీవి కూడా ఇదే అనుభవం ఎదురైంది. దాంతో ఈసారి లైన్లో నుంచోని మరీ ఓటు వేశారు.
కల్వకుర్తిలో వంశీచంద్‌రెడ్డిపై దాడి
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి అసెంబ్లీ పరిధిలో ఆమనగల్లు మండలం జంగారెడ్డి పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం పోలింగ్ జరుగుతోన్న సమయంలో గ్రామానికి చేరుకున్న కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి పార్టీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నాడనే ఆరోపణతో భాజపా కార్యకర్తలు అడ్డుకున్నారు. దాంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కొందరు తనపై రాళ్లతో దాడి చేశారని వంశీచంద్‌రెడ్డి తెలిపారు. స్వల్ప గాయాలతో ఆయన ఆమనగల్లు పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు.
సెల్ఫీ తీసి.. పోలీసులకు చిక్కాడు!
ఓటు వేసేటప్పుడు గోప్యత పాటించాలని, ఫొటో తీసినా, సెల్ఫీ దిగినా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్ వెల్లడించిన సంగతి తెలిసిందే. అయినా ఓ యువకుడు అత్యుత్సాహం ప్రదర్శించాడు. పోలీసులకు చిక్కాడు. రాజేంద్రనగర్‌లో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడిని ఉప్పర్‌పల్లికి చెందిన శివశంకర్ గా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
జాబితాలో పేరు గల్లంతు.. గుత్తా జ్వాల ఆగ్రహం
ఓటర్ల జాబితాలో తన పేరు లేకపోవడంపై ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు వేసేందుకు శుక్రవారం ఉదయం ఆమె పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. అక్కడ జాబితాలో తన పేరు కన్పించకపోవడంతో ట్విటర్ వేదికగా జ్వాలా అసహనాన్ని వెళ్లగక్కారు. 'ఆన్‌లైన్‌లో చెక్ చేసినప్పుడు నా పేరు ఉంది. ఓటర్ల జాబితాలో పేరు కన్పించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఇలా జాబితాలో ఓటర్ల పేర్లు లేనప్పుడు ఎన్నికలు ఎలా పారదర్శకంగా జరుగుతాయి' అని జ్వాలా ట్వీట్‌లో ప్రశ్నించారు.
మోత్కుపల్లికి తీవ్ర అస్వస్థత
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటు రావడంతో ఆయనను హుటాహుటిన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అర్ధరాత్రి నుంచి వాంతులు, ఛాతినొప్పితో ఆయన బాధపడుతున్నారు. సకాలంలో అంబులెన్స్ రాకపోవడంతో ఆయనను సొంత వాహనంలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుత ఎన్నికల్లో యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గం నుంచి బీఎల్‌ఎఫ్ అభ్యర్థిగా మోత్కుపల్లి పోటీచేస్తున్నారు.
పోలింగ్ బూత్‌కు తాళం
సూర్యాపేటలోని తిరుమలగిరి మున్సిపాలిటీలోని బీసీ కాలనీ 291వ బూత్‌కి సిబ్బంది తాళం వేసి మధ్యాహ్నం 2గంటలకు భోజనానికి వెళ్లడంతో రిటర్నింగ్ అధికారి సంజీవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికలను బహిష్కరించిన ఆ రెండు తండాలు
సూర్యాపేట జిల్లా రంగాపురం తండావాసులు ఎన్నికలను బహిష్కరించారు. తమ గ్రామాన్ని నేతలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా వనపర్తి జిల్లా పశ్యా తండా వాసులు సైతం ఎన్నికలను బహిష్కరించారు.
ఓటు వేసేందుకు వచ్చి నలుగురు మృతి
ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌కు వచ్చి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన రెండు వేర్వేరు ప్రాంతాల్లో చోటు చేసుకుంది. వరంగల్ అర్బన్ జిల్లా భీమారం మండలం పైడిపల్లి గ్రామానికి చెందిన స్వామి (55) శుక్రవారం ఓటు వేసేందుకు వచ్చి పోలింగ్ బూత్‌లోనే ఆకస్మికంగా మృతి చెందాడు. అలాగే నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధుడు గుండెపోటుతో కన్నుమూశాడు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల్ డిబి తండాలోని 188 పోలింగ్ కేంద్రంలో ఓటు వేపిన గూగులోత్ దేశయ్య అనే వృద్ధుడు గండె పోటుతో మృతి చెందాడు. ఖైరతాబాద్‌లోని రాజీవ్‌నగర్‌లో ఓటు వేసి రోడ్డు దాటుతుండగా ఓ వృద్ధురాలిని కారు ఢకొీంది. అక్కడికక్కడే చనిపోయింది.
తెలంగాణ వ్యాప్తంగా సాంకేతిక సమస్యల కారణంగా పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. దీంతో చాలా చోట్ల ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. దీంతో ఓటర్లు అసహనానికి గురయ్యారు. కొన్ని చోట్ల ఓపిక నశించి వెనక్కి తిరిగి పోయారు. పెద్ద అడిశర్లపల్లిలోని 253 పోలింగ్ కేంద్రంలో గంటకు పైగా పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.
ఓటేసిన అనంతరం చింతపడకలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. 'వచ్చేది మన ప్రభుత్వమే కారుకే ఓటేయండి' అంటూ ఆయన ఓటర్లతో అన్నారు. దీనిని సీరియస్‌గా తీసుకున్ను టీఆర్‌ఎస్, బీజేపీలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఆయన అభ్యర్థిత్వాన్ని అనర్హతగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌లో ఐమ్యాక్స్ థియేటర్‌లో మార్నింగ్ షో రద్దు చేయడంతో టికెట్లు పొందిన ప్రేక్షకులు థియేటర్ ముందు ఆందోళన చేశారు.
కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలంలోని మల్లారెడ్డి గ్రామంలో 1500 ఓట్లు గల్లంతు కావడంతో గ్రామస్తులు బిక్కనూర్ ఎంఆర్‌ఓను నిలదీశారు. ఇదే జిల్లా రామారెడ్డి మండలంలోనూ 3 వేల ఓట్లు గల్లంతయ్యాయని స్థానికులు ఆందోళన చేశారు. హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి, ఆనంద్‌బాగ్‌లో వేలల్లో ఓట్లు గల్లంతయ్యాయి. -ఫిలింనగర్‌లోని ఫిలింక్లబ్ బూత్‌లో వెయ్యి ఓట్లు గల్లంతయ్యాయి.
-నిజామాబాద్ అర్బన్‌లో 25 వేల ఓట్లు గల్లంతు అయ్యాయి.
చంద్రాయణగుట్టలో 40 వేల ఓట్లు గల్లంతయ్యాయి. రక్షాపురంలో ఓట్లు గల్లంతయ్యాయాని ఓటర్లు ఆందోళన చేయడంతో సమాచారం అందుకున్న బీజేపీ అభ్యర్థి సయ్యద్ షాహెజాది ఘటనా స్థలానికి వచ్చి పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
సీనియర్ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్, డైరెక్టర్ రాజమౌళి భార్య రమా ఓటు కూడా గల్లంతైంది.
మంథని టీఆర్‌ఎస్ అభ్యర్థి పుట్ట మధు భార్య శైలజ పార్టీ కండువా కప్పుకుని పట్టణంలోని ఒక పోలింగ్ కేంద్రం వద్దకు రావడంతో ఆమెపై అధికారులు కేసు నమోదు చేశారు.
వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలం ఎల్లకొండలో కాంగ్రెస్ అభ్యర్థి కే.ఎస్. రత్న కారు ధ్వంసం చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది.
గద్దర్ దంపతులు వెంకటాపురం, భూదేవీనగర్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. తాను ఓటు వేయడం ఇదే మొటిసారి అని, ఓట్ల విప్లవం వర్థిల్లాలని ఆయన పిలుపు నిచ్చారు.
జనగామ మండలం చీటకూడుర్ గ్రామంలో ఓటర్లకు డబ్బులు పంచే విషయంలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు గండి విజరు, బొట్ల అశోక్ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన విజరుని ఆస్పత్రికి తరలించారు.
ఆపద్ధర్మ మంత్రి ఈటెల రాజేందర్ కుటుంబ సభ్యల ఓట్లు గల్లంతయ్యాయి. ఆయన తండ్రితోపాటు మరో ఇద్దరు కుటుంబ సభ్యుల ఓట్లు గల్లంతయ్యాయి.
కొడంగల్‌లో తమ ఓట్లు గల్లంతయ్యాయని స్థానికులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. కుట్రపూరితంగా
తమ ఓట్లు తొలగించారని ఆరోపిస్తూ కేసీఆర్ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు.
హుజూర్‌నగర్ మేళ్లచెరువు మండలంలోని వెళ్లటూరు గ్రామంలోని 139 పోలింగ్ బూత్‌లో ఓ వికలాంగుడు చెప్పిన పార్టీకి కాకుండా అధికారి మరో పార్టీకి ఓటేశాడు. వీవీ ప్యాట్ ద్వారా మోసాన్ని తెలుసుకున్న స్థానికులు అధికారిని చికతబాదారు.
శతమానం.. ఓటు స్ఫూర్తి ఘనం
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో 102 ఏండ్ల గోవిందాచారి అనే వ ద్ధుడు కుటుంబసభ్యుల సహకారంతో చక్రాల కుర్చీలో వచ్చి ఓటు వేశారు. ఓటు అంటే ప్రజాస్వామ్యబద్ధంగా దక్కిన హక్కు అని.. దాన్ని బాధ్యతతో వినియోగించుకోవాలని వీరంతా నిరూపించారు.
ఇంట్లో తల్లి మృతదేహం ఉన్నా.. ఓటు వేయడం కోసం..
ఓటు వేయని బద్దకస్తులకు ఇది ఓ కనువిప్పులాంటి ఘటన. సమాజంపై తమకు ఉన్న బాధ్యతను తెలియజేశారు ముగ్గురు యువకులు. ఇంట్లో తల్లి మృతదేహం ఉన్నా ముగ్గురు కొడుకులు ఓటు వేశారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం గుడూరులో ఈ ఘటన చోటు చేసుకుంది.
తొలిసారి ఓటేసిన గద్దర్
తెలంగాణ ఎన్నికల్లో ఓ వింత చోటు చేసుకుంది. తన జీవితంలో తొలిసారి ఓటు వేశారు ప్రజా గాయకుడు గద్దర్. తన సతీమణితో కలిసి ఆల్వాల్‌లోని వెంకటాపురంలో గద్దర్ ఓటు వేశారు. ఓటు వేయడానికి వచ్చిన సమయంలో గద్దర్ చేతిలో అంబేద్కర్ ఫొటో ఉండటం విశేషం. 70 ఏండ్ల గద్దర్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఓటు వేయలేదు.
Sat 08 Dec 00:51:28.707265 2018