
అన్నీ మాయ మాటలే
పావని పుట్టిన మూడేండ్లకే తులసి భర్త పోయాడు. తులసి తన రెక్కల కష్టాన్నే నమ్ముకుంది. ''చిన్నవయసులో ఇంత కష్టపడటం అవసరమా, మళ్లీ పెండ్లి చేసుకోవాల్సిందిగా చాలా మంది సలహా ఇచ్చారు. కానీ మళ్లీపెండ్లికి తులసి ఒప్పుకోలేదు. కూతురు పావని కోసమే బతుకుతానంది. దొరికిన పనల్లా చేసుకుంటూ కూతురికి ఏ లోటూ లేకుండా పెంచింది. బళ్లో కూడా చేర్చింది.
కూతురిని బాగా చదివించి, ఆమె మంచి ఉద్యోగం చేస్తుంటే చూడాలనేది తులసి కోరిక. పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులతో పాసైన పావనిని కాలేజీలో చేర్పించింది. అంతా బాగుంటే ఇక చెప్పుకోడానికి ఏముంటుంది. అసలు సమస్య ఇక్కడే మొదలయింది. కాలేజీలో రాజేష్ పరిచయమయ్యాడు. అతను పావనికి సీనియర్. పావనితో చాలా క్లోజ్‌గా ఉండేవాడు. అప్పటి నుంచి ఇద్దరూ కాలేజీలో ఎప్పుడూ కలిసే ఉండేవాళ్ళు. ప్రేమ పేరుతో ఇద్దరూ చాలా దగ్గరయ్యారు. చదువు పూర్తి చేసి ఉద్యోగం వచ్చిన తర్వాత పెండ్లి చేసుకోవాలనుకున్నారు.
ఇలా రోజులు గడిచిపోతున్నాయి. ఓ రోజు వీరిద్దరిని రాజేష్ తండ్రి చూశాడు. తర్వాత రోజు రాజేష్ కాలేజీకి రాలేదు. పావని ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. నాలుగు రోజుల వరకు అతని జాడ లేదు. ఓ రోజు అతనే ఫోన్ చేసి ''మన ప్రేమ గురించి మా నాన్నకు తెలిసింది. నన్ను ఇంట్లో నుంచి బయటకు రానీయడం లేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎలాగైనా మనిద్దరం పెండ్లి చేసుకుందాం'' అన్నాడు. పావని తన ప్రేమ గురించి తల్లికి చెప్పేసింది. విషయం తెలుసుకున్న ఆమె కూతురిని కొట్టి, ఏడ్చేసింది. కానీ, పావని మాత్రం అతన్నే పెండ్లి చేసుకుంటానని మొండి కేసింది. కూతురి బాధ భరించలేక తులసి పంచాయితీ పెట్టించింది.
రాజేష్ తండ్రిని, అన్నను తీసుకుని పంచాయితీకి వచ్చి ''ఈ అమ్మాయి ఎవరో తెలియదు. నేనసలు ఆమెను ప్రేమించలేదు. అసలు ఎప్పుడూ ఆమెతో మాట్లాడనే లేదు'' అన్నాడు. ఆ మాటలకు పావని ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పంచాయితీకి వచ్చిన పెద్దలు మరో మాట మాట్లాడకుండా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత రోజు రాజేష్, పావనికి ఫోన్ చేసి ''నువ్వంటే నాకు చాలా ఇష్టం, నిన్ను పెండ్లి చేసుకుంటే మా అమ్మా, నాన్న చనిపోతామంటున్నారు. అందుకే పంచాయితీలో అలా చెప్పా'' అన్నాడు.
దాంతో పావని మళ్ళీ పంచాయితీ పెట్టించింది. రాజేష్ అక్కడకు వచ్చి మళ్ళీ ఆమెను ప్రేమించడం లేదనే చెప్పాడు. దాంతో పెద్దలు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి రాజేష్‌పై కేసుపెట్టమన్నారు. అయితే పావని కేసు వద్దని, అతన్నే పెండ్లి చేసుకుంటానని అడిగింది. కానీ రాజేష్ పెండ్లికి ఒప్పుకోలేదు. కూతురి జీవితం ఏమైపోతుందోనని తులసి బెంగపెట్టుకుంది. తెలిసిన వారు చెబితే పావనీని తీసుకుని ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చింది. జరిగిందంతా తెలుసుకున్న వాళ్ళు పావని చివరి అభిప్రాయాన్ని అడిగారు. ''అతనికి నేనంటే చాలా ఇష్టం. ఇంట్లో వాళ్ళకు భయపడుతున్నాడు. ఒక్కసారి రాజేష్‌ని పిలిచి మాట్లాడండి. ఎలాగైనా మా పెండ్లి జరిగేలా చూడండి. ఇప్పుడు అతను చేసుకోకపోతే నా జీవితం నాశనమైనట్టే'' అని ఏడ్చేసింది. ఎంత చెప్పినా అర్థం చేసుకోని కూతురి ప్రవర్తనకు ఆ తల్లి కుమిలిపోయింది.
''నువ్వు రాజేష్ మాయమాటల్లో పడ్డావు.పెండ్లి అనగానే అతన్ని గుడ్డిగా నమ్మేశావు. కాని ఇప్పుడతను ఇంట్లో వాళ్ళకు భయపడి ప్రేమించ లేదంటున్నాడు. నువ్వు చెప్పిన విషయాన్ని బట్టి రాజేష్‌ది నిజమైన ప్రేమ కాదు. కేవలం ఆకర్షణ మాత్రమే. అతన్ని పెండ్లి చేసుకోకపోతే నీ జీవితమే లేదంటున్నావు. ఇది కరెక్టు కాదు. అతను మోసగాడు. ఈ విషయం నీకు అర్థం కావడం లేదు. అయినా నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి అతనితో ఓసారి మాట్లాడదాం. రెండు వారాల తర్వాత వాళ్ళను రమ్మని లెటర్ పంపుతాం. నువ్వు కూడా అప్పుడు రా'' అని లీగల్‌సెల్ సభ్యులు చెప్పి పంపారు.
రెండు వారాల తర్వాత రాజేష్ తన తండ్రిని, బావను, స్నేహితులను వెంటబెట్టుకొని వచ్చాడు. ''నేను ఆమెను ప్రేమించలేదు. తనే అనవసరంగా అలా ఊహించుకుంది. నేను తనను స్నేహితురాలి గానే అనుకున్నా, ఆమెను పెండ్లి చేసుకునే ఉద్దేశమే లేదు'' అన్నాడు.
''చూడు రాజేష్ ఇన్ని రోజులు పావనితో సరదాగా తిరిగావు. ఇప్పుడు ప్రేమ కాదు స్నేహం అంటున్నావు. తెలిసీ తెలియని వయసులో మీరు ప్రేమ పిచ్చిలో పడి పొరపాట్లు చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది. ఆమెతో ప్రేమ కబుర్లు చెప్పేటపుడు అమ్మనాన్నలు గుర్తుకు రాలేదా? ఇప్పుడు పెండ్లి చేసుకోమంటే వాళ్ళు గుర్తు కొస్తున్నారు. ప్రేమించడం, తర్వాత ముఖం చాటెయ్యడం నీలాంటి వారికి ఫ్యాషనైపోయింది. ఆమె నీపై కేసుపెడుతుంది. ప్రేమపేరుతో మోసం చేసినందుకు నీపై నిర్భయా కేసు పెడతారు, అప్పుడు ఏం చేస్తావ్?'' అన్నారు. ''అవసరమైతే జైలుకైనా వెళ్తా, ఆమెను మాత్రం పెండ్లి చేసుకోను'' అని కచ్చితంగా చెప్పాడు.
దాంతో సభ్యులు రాజేష్ తండ్రి, అన్న, బావ, స్నేహితులను పిలిచారు. తండ్రి మాట్లాడుతూ ''వాడికి ఇష్టమైతే పెండ్లి చేసుకోమనండి. అయితే ఆ పెండ్లి తర్వాత వాడికీ మాకూ ఎలాంటి సంబంధం ఉండదు'' అని తెలివిగా తప్పించుకున్నాడు. రాజేష్ మాత్రం ఎన్ని సార్లు అడిగినా పెండ్లికి ఒప్పుకోలేదు.
దాంతో సభ్యులు పావనితో, ''రాజేష్ పెండ్లికి ఒప్పుకోవడం లేదు. వాళ్ళ కుటుంబం నుండి కూడా సహకారం లేదు. ఇక అతని గురించి ఆలోచించడం అనవసరం. ముందు నీ చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగం తెచ్చుకో. తర్వాత ఓ మంచి అబ్బాయి నీ జీవితంలోకి తప్పక వస్తాడు. మీ అమ్మ నీ కోసం చాలా బాధపడుతుంది. నీకోసం ఆమె ఎంత కష్టపడిందో, ఎన్ని త్యాగాలు చేసిందో నీకు తెలుసు. నువ్వు ఆమె గురించి కూడా ఆలోచించాలి. ఇది మా అభిప్రాయం. ఇక నీ నిర్ణయమేమిటో ఆలోచించుకొని చెప్పు'' అన్నారు.
వారం తర్వాత పావని ఫోన్ చేసి ''మేడమ్, ఎన్ని సార్లు అడిగినా రాజేష్ పెండ్లికి ఒప్పుకోవడం లేదు. అలాంటి వాడిని నమ్మి పెద్ద పొరపాటు చేశా. అందుకే ఇక మీదట అతని గురించి ఆలోచించను. మీరు చెప్పినట్లు నేను నా చదువుపై దృష్టి పెడతా, అమ్మను బాగా చూసుకుంటా'' అన్నది. పావని తీసుకున్న నిర్ణయానికి లీగల్‌సెల్ సభ్యులు ఆమెను ఎంతో అభినందించారు.
''మేడమ్ నా కూతురి భవిష్యత్ ఏమౌతుందోనని చాలా భయపడ్డా. తను నాలా కష్టపడకూడదని, బాగా చదువుకోవాలనుకున్నా. మంచి ఉద్యోగం చేస్తూ హాయిగా బతుకుతుంటే చూడాలకున్నా. అలాంటిది ప్రేమ అంటూ అది చేస్తున్న పిచ్చి పనుల వల్ల ఇక నా కోరిక తీరదని భయపడ్డా. అలాంటిది మీ వల్ల ఇప్పుడు నా కూతురు మారింది. చాలా సంతోషంగా ఉంది. నా కూతురి జీవితాన్ని నిలబెట్టారు. ఇక నాకు నమ్మకం వచ్చింది. ఇక నా బిడ్డ బతుకు బాగుపడినట్టే'' అంటూ పావని తల్లి సంతోషంగా చెప్పి వెళ్ళిపోయింది.
- సలీమ