
కొత్త జీవితం
ప్రసన్న ఇంటర్ పూర్తి చేసింది. ఆమెను బాగా చదివించాలని తల్లిదండ్రుల కోరిక. అయితే ప్రసన్నకు చదువంటే పెద్దగా ఆసక్తి లేదు. అందుకే పెండ్లి చేయాలనుకున్నారు. ఓ సంబంధం వచ్చింది. అబ్బాయి పేరు ప్రవీణ్. అతనూ పెద్దగా చదువుకోలేదు. కాబట్టి ఇద్దరికీ జోడి సరిపోతుందనుకున్నారు. అబ్బాయి వాళ్ళకు సొంత ఇల్లు, పొలాలు ఉన్నాయి. చెడు అలవాట్లు ఏమీ లేవు. ఇక అంతకన్నా ఏం కావాలి? అందుకే ఆ సంబంధాన్నే ఖాయం చేశారు. అడిగినంత కట్నం ఇచ్చి ఘనంగా పెండ్లి చేశారు.
ప్రసన్నకు పెద్దగా చదువు లేకపోయినా మంచి తెలివితేటలు ఉన్నాయి. ప్రవీణ్ సిటీలో పెద్ద స్వీట్‌షాపు పెట్టాలనుకున్నాడు. దీనికి అవసరమైన డబ్బు ప్రసన్న తల్లిదండ్రులు సాయం చేశారు. భర్త పెట్టిన స్వీట్ షాపు కోసం ప్రసన్న చాలా కష్టపడేది. వ్యాపారం అభివృద్ధి చేయడానికి తన శక్తి మేరకు కృషి చేసేది. ప్రవీణ్ ఏదో ఒకటి చెప్పి ఎప్పుడూ బయటే తిరిగేవాడు. షాపు మొత్తం ఆమే చూసుకునేది. కొన్ని రోజులు అంతా బాగానే ఉంది. ప్రసన్న నెల తప్పింది. వాంతుల వల్ల షాపుకు రాలేకపోయింది. ఇంట్లోనే ఉండిపోయింది. ప్రవీణ్ షాపుకు అని చెప్పి బయటకు వెళ్ళేవాడు.
ఉదయం ఇంట్లో నుండి వెళితే ఎప్పుడో రాత్రికి వచ్చేవాడు. భర్త ఒక్కడే షాపులో కష్టపడుతున్నాడని ప్రసన్న బాధపడేది. అయితే అతను అసలు సరిగ్గా షాపుకు వెళ్లడం లేదని కొన్ని రోజుల తర్వాత ప్రసన్నకు తెలిసింది. ఒక వేళ వెళ్ళినా కొద్ది సేపు ఉండి పని వాళ్లకు అప్పజెప్పి వచ్చిన డబ్బుతో స్నేహితులతో పార్టీలు చేసుకుంటున్నాడని తెలిసింది. ఆ విషయమే భర్తను నిలదీసింది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ప్రవీణ్ ఆమెపై చేయిచేసుకున్నాడు. దాంతో పుట్టింటికి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు పెద్ద మనుషుల్లో కూర్చోబెట్టి సర్ది చెప్పారు.
ఇకపై తన వల్ల ఎలాంటి పొరపాటు జరగదని ప్రవీణ్ పెద్దమనుషుల్లో మాట ఇచ్చాడు. అతని మాటపై నమ్మకంతో ప్రసన్న మళ్ళీ భర్త్తతో వెళ్ళింది. అయితే అతనిలో పెద్దగా మార్పేమీ లేదు. షాపుకు వెళ్ళేవాడు. కానీ ఒక్కపైసా కూడా ఇంట్లో ఇచ్చేవాడు కాదు. ఇంటి ఖర్చులు చూసుకోడు. పుట్టింటి సాయంతో ప్రసన్న ఇల్లు నెట్టుకొచ్చేది. ఇన్ని సమస్యల మధ్యనే ప్రసన్న మగబిడ్డకు జన్మనిచ్చింది. బాబు పుట్టిన తర్వాతైనా భర్త మారతాడనుకుంది. ఆ ఆశ కూడా ఫలించలేదు. పైగా సమస్యలు ఇంకా ఎక్కువయ్యాయి.
బాబు పుట్టిన తర్వాత ఆరు నెలలు ప్రసన్న పుట్టింట్లోనే ఉంది. ఆ సమయంలో ప్రవీణ్ షాపును వేరే వాళ్లకు అమ్మేశాడు. ఇతర ఆదాయం ఏమీ లేదు. అప్పులు చేశాడు. ఇదంతా ఎందుకు జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఏమైనా అంటే అప్పులు ఉన్నాయంటాడు. సడన్‌గా పెద్దగా అరుస్తాడు. కొద్దిసేపటికే తప్పయిందని క్షమించమంటాడు. చివరకు అప్పులు తీర్చడానికి పొలం అమ్మేశాడు. ప్రవీణ్ ప్రవర్తన ప్రసన్నకు అస్సలు అర్థం కాలేదు. బాధ్యత లేకుండా తిరుగుతున్న భర్త దగ్గరకు వెళ్ళనని ప్రసన్న తల్లిదండ్రులకు చెప్పేసింది.
తన దగ్గరకు రాకపోతే చచ్చిపోతానంటూ ప్రవీణ్ బెరించాడు. చేసేది లేక తల్లిదండ్రులు కూతురికే నచ్చజెప్పి భర్త దగ్గరకు పంపించారు. వచ్చిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నాడు. ప్రసన్న తల్లిదండ్రుల దగ్గర మళ్ళీ డబ్బు తీసుకుని స్వీట్ షాపును ప్రారంభించారు. సమస్య మళ్ళీ మొదటికొచ్చింది. ప్రవీణ్ షాపు గురించి పట్టింకోడు. బాబును చూసుకుంటూ ప్రసన్న ఒక్కతే వ్యాపారం చూసుకునేది. అతనికి డబ్బు అవసరమైనప్పుడల్లా వచ్చి డబ్బు తీసుకెళ్లేశాడు. ఆమె ఇవ్వనంటే షాపు దగ్గరే గోల చేసేవాడు. పరువు పోతుందనే భయంతో ప్రసన్న అతనికి అడిగినప్పుడల్లా డబ్బులిచ్చి పంపించేది.
బాబు ఎదుగుతున్నాడు. వాడి ఖర్చులన్నీ ప్రసన్న తల్లిదండ్రులే చూసుకుంటున్నారు. ప్రవీణ్ మాత్రం బాధ్యత లేకుండా అలాగే తిరుగుతున్నాడు. ప్రసన్న ఏమైనా అంటే చేయిచేసుకుంటాడు. ఆమె ఏడుస్తుంటే ''నువ్వంటే నాకు చాలా ఇష్టం. నన్ను వదిలి వెళ్లకు'' అంటూ బతిమలాడేవాడు. అతని ప్రవర్తనతో ప్రసన్నకు పిచ్చెక్కే పరిస్థితి వచ్చింది. ఒకవేళ తను వెళ్ళిపోతానంటే బాబును చంపి తనూ చచ్చిపోతానన్నాడు.
ఇలాంటి మనిషితో కలిసి బతకడం ప్రసన్నకు చాలా కష్టంగా ఉండేది. అయినా అలాగే తల్లిదండ్రుల సాయంతో పదేండ్లు గడిపింది. అతనిలో కాస్త కూడా మార్పు లేదు. ఇక భరించలేకపోయింది. ఒక రోజు ఇద్దరి మధ్య పెద్ద గొడవ. ఆ సమయంలో ప్రసన్న తల్లిదండ్రులు విదేశాల్లో ఉన్నారు. వాళ్ళు ఉంటే పుట్టింటికి వెళ్ళేది. అత్తమామలు లేకపోయేసరికి ప్రవీణ్ మరింతగా రెచ్చిపోయాడు. ఇక తను ఎన్ని మాటలన్నా ఎటూ వెళ్ళకుండా చచ్చినట్టు పడుంటుందనుకున్నాడు.
బయట జోరువాన. ఇంట్లో పెద్ద గొడవ. ఇల్లు దాటితే చచ్చిపోతానంటూ ప్రవీణ్ బెదిరింపు. ఇక చేసేది లేక తను ఎక్కడికి వెళ్ళనని భర్తను నమ్మించింది. అతను నిద్రపోయాడు. తనని ఎలాగైనా అక్కడి నుంచి తీసుకెళ్ళమని ప్రసన్న తన పెద్దమ్మకు ఫోన్ చేసింది. అర్ధరాత్రి, వానలో బయటకు వెళ్ళడం మంచిది కాదని, తెల్లవారిన తర్వాత తీసుకెళతామని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఆ రాత్రి అలా వదిలిపెట్టేస్తే ఏం చేసుకుంటుందో అనే భయంతో ఆమె ప్రసన్నను, బాబును తీసుకు వచ్చేసింది.
తెల్లవారింది. ప్రసన్న, బాబుతో ఎక్కడకు వెళ్ళిందో ప్రవీణ్‌కు అర్థం కాలేదు. బంధువులందరికీ ఫోన్ చేశాడు. ఎవ్వరూ తెలియదని చెప్పారు. చివరకు ప్రసన్న పెద్దమ్మ ఇంట్లో ఉందని తెలుసుకున్నాడు. వచ్చేయమంటూ ఫోన్ చేసి బతిమలాడాడు. విదేశాల్లో ఉన్న తన తల్లిదండ్రులు వచ్చిన తర్వాతనే ఏదైనా నిర్ణయం తీసుకుంటానంది.
వెంటనే రాకపోతే చచ్చిపోతానన్నాడు. ''చచ్చిపోతే చచ్చిపో, ఇంకా ఎన్నేండ్లు నిన్ను భరించాలి. నేనూ నా కొడుకైనా మంచిగా ఉంటాం. ఇలా బెదిరిస్తూ ఎన్నాండ్లు బతుకుతావు. భార్యను, కొడుకును సరిగ్గా చూసుకోవడం చేతకాదు. మా అమ్మానాన్న వచ్చే వరకు నేను రానంటే రాను'' అని కచ్చితంగా చెప్పేసింది. తర్వాత పదిహేను రోజులకు విదేశాల నుంచి ప్రసన్న తల్లిదండ్రులు వచ్చారు.
అర్ధరాత్రి ఇల్లు వదిలి వచ్చే పరిస్థితి తీసుకొచ్చిన అతని దగ్గరకు కూతురిని పంపకూడదని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ప్రవీణ్ తల్లిదండ్రులు వాళ్ళ తరపు బంధువులను తీసుకొచ్చి నచ్చజెప్పడానికి చూశారు. కానీ ఇకపై ప్రసన్న వినదలచుకోలేదు. అలాంటి వ్యక్తితో ఉండనంటే ఉండనంది. ఆమె తల్లిదండ్రులు కూడా అదే మాట చెప్పారు. చేతగాని భర్తనైతే ధైర్యంగా ఎదిరించింది. కానీ రోజూ దిగులుగా ఉండేది. దాంతో ప్రసన్నకు కాస్త ధైర్యం చెప్పాలని పెద్దమ్మ ఆమెను ఐద్వా లీగల్‌సెల్‌కు తీసుకువచ్చింది. లీగల్‌సెల్ సభ్యులు ఆమెకు కౌన్సెలింగ్ చేసి అప్పుడప్పుడు వస్తూ ఉండమని చెప్పారు. నెల రోజుల పాటు ప్రతి వారం ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చి అన్ని విషయాలు గమనించిన ఆమె ఓ రోజు...
''ఇన్నాండ్లు భర్త లేకపోతే ఈ సమాజంలో గౌరవం ఉండదని అతనితో బతికాను. ఇకపై అతనితో ఉంటే నేనూ, నా కొడుకు బతుకుతామనే నమ్మకం పోయింది. పిచ్చి వాడిలా ప్రవర్తిస్తాడు. డాక్టర్ దగ్గరకు వెళదామంటే రాడు. ఏమైనా అంటే నేను లేకపోతే చచ్చిపోతానంటాడు. ప్రశాంతత లేనప్పుడు ఎంత ప్రేమ ఉండి ఏం లాభం. కనీసం మందులు వాడితేనైనా ఎప్పటికైనా బాగుపడతాడనే నమ్మకం ఉండేది. ఆ పరిస్థితి కూడా లేదు. అందుకే చివరకు ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ సమాజంలో భర్త లేకుండా ఒంటరిగా మహిళలు బతకడం కష్టమంటూ నూరిపోస్తున్నారు. ఇప్పటి వరకు అలాంటి మాటలే నమ్మి ఏడుస్తూ బతికాను. ఇక్కడకు వచ్చిన తర్వాత మీ దగ్గరకు వస్తున్న వాళ్ళ సమస్యలు వింటే అర్థమవుతుంది. ఈ సమాజంలో ఆడవాళ్ళు ధైర్యంగా లేకపోతే మగవాళ్ళు ఎంతకైనా రెచ్చిపోతారు. అందుకే ఇకపై నా కాళ్ళపై నేను బతుకుతాను. అతనిలా కాకుండా నా కొడును మంచిగా పెంచుతాను'' అని తనకు తానే ధైర్యం చెప్పుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది ప్రసన్న.
- సలీమ