
పసి ప్రాయంలో...
అన్ని ప్రాయాల కంటే కూడా బాల్యం అత్యంత అందమైనది, అద్భుతమైనది. మనలో చాలా మందికి చిన్ననాటి జ్ఞాపకాలు పదిలంగా మనసులో అలానే ఉండి ఉంటాయి. అవి చాలా అద్భుతంగా కూడా ఉంటాయి. కొత్తవి నేర్చుకోవడంతో పాటు, అందంగా జీవితం గడపటం తప్ప వేరే ధ్యాసేలేని ప్రాయం ఇది. ఉద్యోగ ఒత్తిడి ఉండదు. సంబంద బాంధవ్యాల సమస్యలు ఉండవు. ఆర్ధికపరమైన లక్ష్యాలు, ఆందోళనలు ఉండవు. భవిష్యత్తు కోసం బెంగ ఉండదు. ఇలా చీకు చింత లేని ఆనందకరమైన బాల్యం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే కొంత మంది పిల్లలు భయంకరమైన వ్యాధులతో బాధపడుతుంటారు. అలాంటి వాటిలో క్యాన్సర్ కూడా ఒకటి. ఇది సోకితే బాల్యం మొత్తం నరకప్రాయమే. అందుకే బాల్యంలో క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలన్నా, ఆ వ్యాధిని నివారించాలన్నా ఏమిచేయాలో ఈ రోజు తెలుసుకుందాం...
మీరే ఓ మంచి ఉదాహరణ: తల్లిదండ్రులు పిల్లల విషయంలో చేయాల్సిన పని ఏమిటంటే పిల్లలందరూ ఆరోగ్యంగా ఉన్నారా? లేదా? అనేది కచ్చితంగా చూసుకోవాలి. వీరిని సమాజానికి ఒక ఉదాహరణగా చెప్పుకునే విధంగా తీర్చిదిద్దాలి. ఆరోగ్యవంతమైన అలవాట్లను తల్లిదండ్రులే పిల్లలకు నేర్పించాలి. సాధారణంగా చాలామంది పిల్లలు, తల్లిదండ్రుల అలవాట్లని అనుకరిస్తూ ఉంటారు. వాటినే ప్రేరణగా తీసుకుంటారు. కాబట్టి ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం లాంటి అలవాట్లను చిన్న వయసు నుండే పిల్లలకు అలవాటు చేయడం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.
ధూమపానాన్ని వదిలివేయండి: పొగ తాగటం చాలా భయంకరమైన అలవాటు. పొగ తాగేవారే కాకుండా వారి చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా క్యాన్సర్‌తో పాటు మరెన్నో భయంకరమైన వ్యాధుల భారినపడే అవకాశం ఉంది. పొగ తాగేవారికంటే కూడా వారి చుట్టూ ఉండి ఆ పొగని ఎవరైతే పీలుస్తారో వారికే క్యాన్సర్ సోకే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా తల్లిదండ్రు లు పొగ తాగేవారైతే పక్కన ఉండే వారి పిల్లలకు క్యాన్సర్ సోకే అవకాశం ఎక్కువ. కాబట్టి ఈ అలవాటుని మీ అంతట మీరే మానుకోగలితే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రక్షించుకోగలుగుతారు.
పాలు ఎక్కువగా పట్టడం: సాధారణంగా చాలామంది తల్లులు బిడ్డకు ఏడాది నిండ గానే పాలు ఇవ్వడం మానేస్తారు. అయితే పిల్లలకు రెండు, మూడేండ్లు వచ్చే వరకు తల్లి పాలు పట్టడం మంచిదట. దీని వల్ల ఎన్నో రకాల లాభాలు ఉన్నాయట. తల్లిపాలతో పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రాణాంతకమైన వ్యాధులు రావు. క్యాన్సర్ వంటి మహమ్మారిని కూడా ఇది నిలువరించ గలుగుతుంది. కాబట్టి తల్లిపాలు ఎక్కువ రోజుల పాటు ఇవ్వడం వల్ల పిల్లలు క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారు.
తీసుకొనే ఆహారాన్ని పర్యావేక్షించండి: చాలా మంది పిల్లలు మంచి ఆరోగ్యవంతమైనవి తినమంటే మారాం చేస్తారు. ఇటువంటి సమయంలో పిల్లల ఆహారపు అలవాట్లను తల్లిదండ్రులు పర్యవేక్షించడం మంచిది. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పాలు తీసుకునేలా చేయాలి. దీనివల్ల వారి శరీరం ఆరోగ్యవంతంగా తయారయ్యి క్యాన్సర్ కణాలపై పోరాడు తుంది. అలాగే ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ అనే కొవ్వుకు సంబంధించిన ఆమ్లాలు మన ఆరోగ్యానికి ఎన్నో లాభాలను చేకూరుస్తాయి. జీవక్రియను పెంచుతుంది. అంతేకాకుండా ఇది శరీరంలో క్యాన్సర్ కణాలు వేగంగా వృద్ధి చెందకుండా, రెట్టింపు కాకుండా నిరోధిస్తుంది. కాబట్టి పిల్లలు తినే ఆహారంలో వాల్ నట్స్, కొబ్బరి నూనె, నెయ్యి మొదలగునవి ఉండేలా చూసుకోండి.
కాలుష్యానికి దూరంగా: సాధ్యమైనంత వరకు పిల్లలను కాలుష్యానికి దూరంగా ఉంచండి. ఎందుకంటే ఊపిరితిత్తులు, చర్మ క్యాన్సర్ వంటివి పిల్లల్లో అధికంగా వస్తున్నాయి. అందుకే సాధ్యమైనంత వరకు పిల్లలు కాలుష్యం లేని ప్రదేశాల్లో పెరిగేలా జాగ్రత్త పడాలి. చుట్టు ప్రక్కల చెట్లు ఉండేలా చూసుకోవాలి. బయటకు వెళ్ళినప్పుడు ముఖానికి మాస్క్ పెట్టుకునే అలవాటు చేయాలి.
గాడ్జెట్స్ కు దూరంగా : ప్రస్తుతకాలంలో పిల్లలే కాదు పెద్దలైనా గాడ్జెట్స్‌కు దూరంగా ఉండట మంటే సులభవైన పనికాదు. ఎందుకంటే వాట ితోనే పనిచేయవలసి ఉంటుంది. అయితే పిల్లలు సాధారణంగా వీటిని ఆడుకోవాలనే ఉద్దేశ్యంతోనే తీసుకుంటారు. ఎప్పుడైతే పిల్లలు సెల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, కంప్యూటర్లు ఎక్కువగా వాడటం మొదలు పెడతారో క్యాన్సర్ సోకే అవకాశం ఎక్కువగా ఉందట. కాబట్టి సాధ్యమైనంత వరకు మరీ అవసరమైతే తప్ప ఈ గాడ్జెట్స్ పిల్లలకు ఇవ్వకండి.
యాంటీ బయాటిక్స్‌ని నిషేధించండి: చాలా మంది పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు విపరీతమైన ఇన్ఫెక్షన్ల భారినపడుతుంటారు. ముఖ్యంగా జలుబు, పళ్ళ ఇన్ఫెక్షన్ల బారిన తరచూ పడుతూ ఉంటారు. చిన్నపిల్లల్లో రోగనిరోధక శక్తి ఇంకా వృద్ధి చెందే దశలోనే ఉంటుంది. ఎప్పుడైతే పిల్లలు ఈ వ్యాధుల బారిన పడతారో అటువంటి సమయాల్లో యాంటీ బయాటిక్స్‌ని వాడమని సూచిస్తూ ఉంటారు. అయితే యాంటీ బయా టిక్స్‌ని ఎక్కువగా వాడటం వల్ల రోగనిరోధక వ్యవస్థ దెబ్బ తింటుంది. దాంతో శరీరంలో క్యాన్సర్ కారక కణాలు చాలా సులభంగా పెరిగిపోతాయి. కాబట్టి యాంటీ బయాటిక్స్ ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
వ్యాయామం అలవాటు చేయండి: క్రమం తప్పకుండా వ్యాయామం చేసినట్లయితే, క్యాన్సర్‌తో పాటు మరెన్నో రకాల వ్యాధులను రాకుండా అరికట్టవచ్చు. కాబట్టి పిల్లలను వాళ్లకు ఇష్టమైన ఆటల్లో చేర్పించండి. వారు కోరుకునే వ్యాయామాన్ని నేర్పించండి. ఇలా చేయడం వల్ల బాల్యంలో క్యాన్సర్ రాకుండా సాధ్యమైన మేర అరికట్టవచ్చు.