
కలత నిద్దురలో...
చిన్నపిల్లలు నిద్దర్లో ఉలిక్కిపడిలేచి ఏడుస్తున్నారా. ఇలాంటి సందర్భాలు తరచూ ఎదురవుతున్నాయంటే కాస్త ఆలోచించాల్సిందే అంటున్నారు నిపుణులు. చిన్నారులు నిద్దురలో హాయిగా నిద్రపోవాలంటే కింది చిట్కాలు పాటించాల్సిందే!
- కొన్నిసార్లు పీడకలలు వచ్చినప్పుడు పిల్లలు మెలకువలో ఉన్నా భయపడుతూనే ఉంటారు. అప్పుడు వారిని దగ్గరకు తీసుకుని హత్తుకుని సముదాయించాలి. కాసేపు వారి పక్కనే పడుకుని తల నిమురుతూ మాట్లాడాలి.
- కొందరు పిల్లలు తమకు వచ్చిన కలల గురించి చెప్పడానికి ప్రయత్నిస్తుంటారు. అప్పుడు వారి మాటలను అడ్డుకోవద్దు. వాళ్లు చెప్పేది ఓపికగా వినండి. ఎందుకంటే పిల్లల్లో ఉండే భయాలే వారిని కలల రూపంలో వెంబడిస్తుంటాయి. వాళ్లకెలాంటి కల వచ్చిందో తెలుసుకుంటే వాళ్ల భయాల గురించి కూడా తెలుస్తుంది.
- పిల్లలకు కలలు రావడానికి తల్లిదండ్రులు కూడా కారణమే. త్వరగా తినాలని, చెప్పిన మాట వినాలని.. లేదంటే దయ్యం వస్తుందంటూ భయపెడుతుంటారు. ఆ పసిమనసుల్లో ఈ మాటలు గట్టిగా నాటుకుంటాయి. బూచాడు ఎలా ఉంటాడో ఊహించుకుంటారు. ఆ రూపమే కలలోనూ వాళ్లని వెంటాడుతుంటుంది. అందుకని పిల్లలకు లేని పోని భయాలు కలిగించొద్దు.
- చీకటి అంటే చాలామంది పిల్లలకు భయం. రాత్రిపూట లైట్లన్నీ ఆపేసి పడుకోమని బలవంతపెట్టొద్దు. వాళ్లు నిద్రపోయే వరకు తక్కువ వెలుతురు ఉండే లైటు ఉంచాలి. నిద్రపోయాక లైట్ ఆఫ్ చేయాలి. పిల్లల గదిలో రాత్రంతా జీరో బల్బ్ వెలిగే ఏర్పాటు చేయాలి.
- రాత్రి పడుకునే ముందు కథలు వినడం పిల్లలకు ఓ సరదా. కథలు చెప్పమన్నారు కదా అని దెయ్యాల కథలు చెప్పొద్దు. ఇలాంటివి పిల్లలను పిరికివాళ్లుగా మారుస్తాయి. దాంతో నీడను చూసినా భయపడతారు వాళ్లు. ఇలాంటి కథలు చెప్పడం మంచిదికాదు.
- స్మార్ట్ఫోన్లో పాటలు పెట్టి నిద్రపుచ్చడం కాకుండా.. మీరే లాలి పాట పాడుతూ జో కొడితే పిల్లలు హాయిగా నిద్రపోతారు. పడుకునే ముందు వినే పాటలు నిద్రలో కలతలు రాకుండా చేస్తాయి.