
అత్తమామల ఆస్తిపై కోడలుకు హక్కుందా?
ప్రశ్న: మేడమ్ , నేను ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తాను. మూడేండ్ల కిందట పెండ్లి అయ్యింది. నా భార్య చదువుకున్నది కానీ ఉద్యోగం చేయడం ఆమెకు ఇష్టం లేదు. మా అమ్మనాన్నలకు నేను ఒక్కడినే. వారితో కలిసి సొంతింట్లో ఉండేవాళ్లం. గొడవలతో అక్కడి నుంచి బయటకు వచ్చేశాం. ఉద్యోగరీత్యా ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాం. విడిగా ఉన్నా.. గొడవలే. సంవత్సరం కిందట పండగకు నా భార్య వాళ్ల ఇంటికి వెళ్ళింది. ఎన్నిసార్లు ఫోన్ చేసిన సమాధానం లేదు. నెలరోజుల కిందట మా అమ్మవాళ్లు వేరే ఊరికి వెళ్ళినప్పుడు తను ఇంట్లోకి వచ్చింది. తను ఒక గదిలో ఉంటూ తన వరకు తాను వంట చేసుకుంటుంది. వాళ్ల పెద్దవాళ్ళను రమ్మంటే ' మా అమ్మాయి పిలిస్తేనే వస్తాం' అంటున్నారు. మా పై 498(ఏ), డివిసి, ఎంసి కేసులు పెట్టింది. 'ఈ ఇల్లు రాసిస్తేనే గానీ కేసులు వెనిక్కి తీసుకునేది లేదు.. ఏం చేసుకుంటారో చేసుకోండి' అంటూ గొడవ చేస్తుంది. ఈ గొడవలు భరించలేక.. అమ్మనాన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఏం చేయాలి?
జవాబు: కలిసి ఉండాలన్న ఆలోచన ఇద్దరికీ లేనప్పుడు విడిపోవడమే మంచిది. ఆమె డిమాండ్ చేస్తున్న ఇల్లు మీ నాన్న సొంతంగా సంపాదించింది అయితే ఈ ఇంట్లో కోర్టు ఆర్డర్ లేకుండా బలవంతంగా ఉండే అర్హత నీ భార్యకు లేదు. మీ అమ్మానాన్నను ధైర్యంగా వచ్చి వారింట్లో వాళ్ళను ఉండమని చెప్పండి. మీ అమ్మవాళ్ళపై ఏదైనా గొడవ చేస్తే 100కు డయల్ చేయమని చెప్పండి. అలాగే మానవహక్కుల కమిషన్లో ఫిర్యాదు చేయమని చెప్పండి. తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా కన్నబిడ్డలకే వారింట్లో ఉండే హక్కు లేదు. కోడలికి అత్తమామల ఆస్తిలో హక్కు లేదు. ఈ విషయంపై సుప్రీంకోర్టు ఎస్ఆర్. బాత్రా వర్సెస్ తరుణ బాత్రా కేసులో తీర్పు ఇచ్చింది. కాబట్టి మీ అమ్మనాన్నలను భయం లేకుండా తమ ఇంట్లో ఉండమని చెప్పండి. ఇల్లు మీ నాన్న సొంతంగా సంపాదించినది కాబట్టి ఆ ఇంటిపై మీకు కూడా ఎలాంటి హక్కులేదు.మీ భార్య మీ మాట వినకపోతే ఉమెన్ కమిషన్లో ఫిర్యాదు ఇవ్వండి. మహిళల చట్టాలు కొడండ్లకే కాదు అత్తలకు కూడా వర్తిస్తాయి.
మన చుట్టూ నిత్యం ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. ఎన్నో కలహాలను చూస్తుంటాం. రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతల మేరకు ప్రతి వ్యక్తి నడుచుకోవాలి. అలా కాదని.. నేను.. నా ఇష్టం అంటూ ఎదుటివ్యక్తులకు కష్టం, నష్టం కలిగించేలానే కాదు.. మనసు బాధ పడేలా ప్రవర్తించినా.. వారికి శిక్ష తప్పదు అంటుంది మన ఇండియన్ పీనల్ లోడ్. మనకు జరిగిన.. జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించడం.. దాన్ని ఎలా ఎదుర్కొవాలో తెలుసుకోవడం.. చట్టంలో ఉన్న వెసులుబాటుల గురించిన అవగాహన ఇవ్వన్నీ తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్న వారికి, సమస్యలను ఎదుర్కొంటూ.. పరిష్కారం కోసం వెతికే వారికి సమాధానం ఇస్తారు ప్రముఖ న్యాయవాది ఆకుల రమ్యకుమారి. హైకోర్టు న్యాయవాదిగా తనకున్న అనుభవంతో ఆమె చెప్పే సూచనలు, సలహాలు 'నవతెలంగాణ' పాఠకులకు ఉపయోగపడుతాయని భావిస్తాం. ఇకపై ప్రతివారం లీగల్ కాలమ్లో మీ సమస్యలకు ఆమె సమాధానాలు తెలుసుకోండి. మీ సమస్యలు రాయల్సిన చిరునామా..