
సాహిత్యమే ఆలంబనగా...
అసహనం, అభద్రతాభావం, నిస్సహాయత ఇవన్నీ నేటి సామాజిక రుగ్మతలని అంటారు ప్రముఖ రచయిత్రి దాసరి శిరీష. ఇటువంటి పరిస్థితుల్లో కొత్తగా ఏర్పడే సమాజాలకి సాహితీచైతన్యం అత్యంత అవసరమని దృఢంగా నమ్ముతారు ఆమె. చిన్నతనం నుండి సాహిత్యంతో చేసిన సహవాసమే తనను సమాజం పట్ల ఓ బాధ్యత గల మనిషిగా తయారు చేసిందని గర్వంగా చెబుతున్న ఆమె గురించి మరిన్ని విశేషాలు....
శిరీష తెనాలిలో పుట్టారు. విజయవాడ పరిసర ప్రాంతల్లో పెరిగారు. చదువంతా అక్కడే సాగింది. చిన్నప్పటి నుండి ఇంట్లో కమ్యూనిస్టు వాతావరణం. ఇంటి నిండా పుస్తకాలు. ఫలితంగా అభ్యుదయ భావాలు అలవడ్డాయి. ఒంటరిగా ముగ్గురు పిల్లలతో సంసారాన్ని నెట్టుకొచ్చిన తల్లి నంబూరి పరిపూర్ణం ప్రభావం శిరీషపై చాలా ఉండేది. పరిపూర్ణం కూడా పుస్తకాలు బాగా చదివేవారు. అదే అలవాటు శిరీషకు కూడా వచ్చింది. పత్రికలతో ప్రారంభమైన ఆమె అధ్యయనం శరత్, ప్రేమ్‌చంద్ నవలలతో పెరిగింది. తర్వాత చదివిన గోర్కి 'అమ్మ' నవల ప్రభావంతో సమాజాన్ని అర్థం చేసుకున్నారు.
పుస్తకాలతోనే సహవాసం
విస్తారంగా చదివే వారు సహజంగానే రాయగలుగుతారు. దాంతో ఆరో తరగతి నుంచే శిరీష రాయడం మొదలుపెట్టారు. స్కూల్లో జరిగే వ్యాసరచన పోటీల్లో పాల్గొనేవారు. విజయవాడకు వచ్చిన తర్వాత ఆమె రచనలు చూసి అందరూ మెచ్చుకునేవారు. ఆ ప్రోత్సాహంతో ఇంకా ఎక్కువగా రాసేవారు. పుస్తకాలతోనే ఆమె సహవాసం. విశాలాంధ్రవారు విద్యార్థులకు పెట్టిన కథల పోటీల్లో మొదటి బహుమతి రావడంతో ఆమె ఉత్సాహం మరింత పెరిగింది.
మలుపు తిరిగింది
బికాం పూర్తి చేసిన తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం వచ్చింది. భర్త శేషుబాబుది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగమే. వీరికి అరుణ్, అపర్ణ పుట్టారు. శిరీష తెనాలిలో కొంత కాలం పని చేశారు. తర్వాత అక్కడక్కడ బదిలీలు అవుతూ పుత్తూరు చేరుకున్నారు. అప్పటికే కొడుకు ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అమ్మాయి ఎనిమిదో తరగతి. ఇల్లు, ఆఫీస్ పనుల్లో ఎంత బిజీగా ఉన్నా స్త్రీల సమస్యలపై కథలు, వ్యాసాలు రాస్తూ వివిధ పత్రికలకు పంపేవారు. పుత్తూరుకు చేరేటప్పటికి పిల్లల బాధ్యత నుండి కాస్త వెసులుబాటు వచ్చింది. అక్కడే ఆమె జీవితం తను అనుకున్న మలుపు తీసుకుంది.
యువతకు మార్గదర్శకులు లేక..
మనిషి మనిషిగా జీవించే పరిస్థితులు అంతరిస్తున్నందుకు ఆవేదన చెందారు శిరీష. సాహిత్యం ఒకనాడు సమాజానికి దిక్సూచిలా పని చేస్తే, ఇప్పుడు అదే సాహిత్యం వెర్రితలలు వేస్తూ వికృత పరిణామాలకు దారితీయడం పట్ల వ్యథ చెందారు. తల్లి భాషను నిర్లక్ష్యం చేస్తూ.. సాహితీ స్పర్శకి దూరమవుతున్నందుకు విచారించారు. యువత సరైన మార్గదర్శకులు లేక సాహితీ ప్రపం చానికి దూరమై గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆవేదనపడ్డారు. తరాల మధ్య అంతరాలు తగ్గి సాహితీ ప్రమాణాలు సజావుగా సాగాలని అభిలషించారు. పుత్తూరులో ఉన్నప్పుడే ఇలాంటి ఆలోచనలతో సతమతమయ్యేవారు.
సాహిత్య చర్చలతో...
సాహిత్యం గురించి, సమాజం గురించి ఇంతగా ఆలోచించే ఆమె జీవితంలో పుత్తూరు పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. బ్యాంక్‌లో పని చేసే వారి భార్యలతో పరిచయం పెంచుకున్నారు. తనలా ఆలోచించే వారు దొరకడంతో ఎంతో సంతోషించారు. యువత కోసం 'యూత్ వరల్'్డ పేరుతో ఓ వేదిక ఏర్పాటు చేశారు. దీని ఆధ్వర్యంలో యువతకు వ్యక్తిత్వ వికాసంతో పాటు, సామాజిక చైతన్యం కలిగించే ప్రయత్నం చేశారు. మహిళలంతా ఓ టీంమ్గా ఏర్పడి ప్రతి వారం సమావేశం పెట్టుకునేవారు. ఏదో ఒక కార్యక్రమం చేసేవాళ్ళు. సాహిత్య చర్చలు జరిపే వాళ్ళు. తిరుపతిలో జరిగే సాహిత్య కార్యక్రమాలకు కూడా హాజరయ్యే వారు. దాంతో పరిచయాలు మరింతగా పెరిగాయి.
పిల్లలతో కాసేపు గడపాలని
1999లో వీరి కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. మరోపక్క ఆమెకు ప్రమోషన్ వచ్చింది. దాంతో చాలా రోజులు ఉద్యోగం కోసం పుత్తూరుకు రైలు ప్రయాణాలు చేసేవారు. అక్కడ ఆమెకు కనిపించిన కొన్ని దృశ్యాలు మనసును కదిలించాయి. ఎంతో మంది పిల్లలు చదువులేకుండా బాలకార్మికులుగా కనిపించారు. ఇది ఆమెను ఎంతో బాధించింది. ఓ స్నేహితురాలు కూడా ఇలాగే బాధపడుతుంటే పేద పిల్లలతో కాసేపు గడిపితే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. వారికి రోజుకు రెండుగంటల పాటు చదువు చెప్పాలనుకున్నారు. దాంతో కొంతైన వారి జీవితాల్లో మార్పు తీసుకు రావొచ్చనుకున్నారు. అనుకున్న వెంటనే మరికొంతమంది స్నేహితుల సహకారంతో 'ఆలంబన' ప్రారంభించారు.
పూర్తి సమయాన్ని కేటాయించాలని
ఉద్యోగం చేసుకుంటూనే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల్ని చేరదీశారు. వారు ఏ సబ్జెక్ట్‌లో వీక్‌గా ఉన్నారో గమనించి ప్రతిరోజు రెండు గంటల పాటు క్లాసులు తీసుకునేవారు. చదువుతో పాటు నీతి కథలు, విలువలు నేర్పేవారు. ఇంటికి వెళ్ళేటప్పుడు స్నాక్స్ పెట్టి పంపేవాళ్ళు. ఇది శిరీషకు ఎంతో తృప్తినిచ్చింది. రోజులో రెండు గంటలు కేటాయిస్తేనే ఇంత ఆనందంగా ఉంటే వీరి కోసం పూర్తి కాలం కేటాయిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. తన పిల్లలతో చర్చించి బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేస్తున్న ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ చేసి పూర్తి సమయాన్ని ఆలంబనకు కేటాయించారు. పేద, కార్మిక పిల్లల కోసం ప్రత్యేకంగా హైదరాబాద్‌లో ఓ స్కూల్‌ని ఏర్పాటు చేశారు.
నలుగురి సహకారంతో
2001లో ఇద్దరు వర్కర్లతో ప్రారంభమైంది ఈ 'ఆలంబన'. పిల్లల్ని స్కూల్‌కి రప్పించడానికి కొత్తలో చాలా కష్టపడ్డారు. చదువుపై ఎవ్వరికీ ఆసక్తి ఉండేది కాదు. చదువుకుంటే వచ్చే లాభాలను వివరించి తల్లిదండ్రులను ఒప్పించి పిల్లలను స్కూలుకు రప్పించేవారు. మెల్లమెల్లగా పిల్లల సంఖ్య పెరిగింది. దాంతో ఖర్చులు పెరిగాయి. ఎలాంటి మార్పయిన సాంస్కృతికంగా రావాలంటారు శిరీష. అందుకే తమ 'ఆలంబన' గురించి నలుగురికీ తెలియాలనే ఉద్ధేశంతో స్నేహితులు, బంధువుల సహకారంతో సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టేవాళ్ళు. టిక్కెట్లు పెట్టి అమ్మేవారు. వచ్చిన డబ్బుతో 'ఆలంబన' నడిపేవారు. ప్రస్తుతం ఆమె కుటుంబ సభ్యులతో పాటు, స్నేహితులు, తెలిసిన వారు ఎంతో మంది 'ఆలంబన'కు సహకరిస్తున్నారు.
ఎప్పుడైనా చేరొచ్చు
ఆలంబనకు ఎవరు ఏం ఇచ్చినా మెటీరియల్‌గానే తీసుకుం టారు. అలాగే దీని గురించి వెబ్సైట్లో కూడా పెట్టారు. గతంలో 80 -90 మంది పిల్లలు ఉండేవారు. ప్రస్తుతం 46 మంది ఉన్నారు. అడ్మిషన్లు ఇప్పుడే ప్రారంభమయ్యాయి. కాబట్టి మరో నెలలో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మరో విషయం ఏమిటంటే ఏడాదిలో ఎప్పుడు వచ్చినా ఇక్కడ పిల్లల్ని చేర్చుకుంటారు. పనుల కోసం కూలీలు ఎప్పుడు ఎక్కడికి వలస పోవాల్సి వస్తుందో తెలియదు. అలాంటి వారి పిల్లలకు ఇతర పాఠశాలల్లో అడ్మిషన్లు దొరకడం కష్టం. అందుకే వలస కార్మికుల పిల్లలను 'ఆలంబన'లో ఎప్పుడైనా చేర్చుకుంటారు. వారి పరిజ్ఞానాన్ని బట్టి క్లాసులు నిర్ణయిస్తారు. వల్లి, అన్నపూర్ణ, భారతి అనే ముగ్గురు ఉపాధ్యాయులు ఇందులో పూర్తికాలం పని చేస్తున్నారు. అలాగే మరో నలుగురు స్వచ్ఛందంగా వచ్చి సహకరిస్తున్నారు. వీరి సహకారంతోనే స్కూలు ఎలాంటి అడ్డంకులు లేకుండా నడుస్తుందంటున్నారు శిరీష.
చదువుతోపాటు...
'ఆలంబన'లో ఏడో తరగతి వరకు ఉంది. ఆ తర్వాత పై చదువులకు వెళ్ళాలనుకునే వారికి కూడా 'ఆలంబన' సహకరిస్తుంది. ప్రస్తుతం 33 మంది పిల్లలు పై చదువులు చదువుతున్నారు. వారి ఖర్చులన్నీ వీళ్ళే చూసుకుంటారు. ఏది ఏమైనా చదువు ద్వారా కొన్ని కుటుంబాల్లో మార్పు తీసుకువస్తున్నందుకు శిరీష సంతోష పడుతున్నారు. కేవలం మార్కుల కోసమే కాకుండా కథలు, విలువలు, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు... ఇలా అన్నింట్లో పిల్లల్ని ప్రోత్సహిస్తున్నారు. అలాగే పిల్లలకు సాహిత్యాన్ని పరిచయం చేయడం కోసం మంచి లైబ్రరీ కూడా ఏర్పాటు చేశారు.
సాహిత్య వేదికతో...
స్ప్రెడింగ్లైట్ పరిచయం తర్వాత ఆలంబనలోనే ఓ సాహిత్య వేదిక కూడా ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉన్న రచయితలందరూ కలిసి సాహిత్య చర్చలు జరుపుతున్నారు. స్కూలు పనుల్లో పడి కొంత నిర్లక్ష్యం చేసిన శిరీష సాహిత్యానికి ఈ వేదిక మళ్ళీ కొత్త ఊపిరినిచ్చింది. దాంతో ఇటీవల కాలంలో మనోవీధి, దూరతీరాలు, కొత్త స్వరాలు అనే మూడు పుస్తకాలను ముద్రించారు. అలాగే వీరి కుటుంబ సభ్యులు అందరూ కలిసి రాసిన కథలను 'కథా పరిపూర్ణం' పేరుతో ఓ పుస్తకంగా తీసుకువచ్చారు.
- సలీమ
ఫొటో: పిప్పల్ల వెంకటేష్