
పారదర్శక పరిపాలనతో..
మహిళల చేతికి రాజ్యాధికారం వస్తే.. ఎన్నో ఏండ్ల నుంచి పరిష్కారం కాని సమస్యలెన్నో ఒక కొలిక్కి వస్తాయి. స్థానిక సంస్థల్లో వచ్చిన 50శాతం మహిళా రిజర్వేషన్లు కొత్తతరం మహిళా రాజకీయవేత్తలను తయారు చేస్తున్నది. పదవికాలంలో గ్రామాభివృద్ధికోసం వారు చేస్తున్న కార్యక్రమాలు.. మహిళా సాధికారతకు దర్పణం పడుతున్నాయి. మహిళలకు అవకాశం వస్తే అద్భుతాలు సృష్టిస్తారడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. సూర్యాపేట జిల్లాలోని ఐదువేల మంది జనాభా ఉన్న బూరుగుగడ్డ గ్రామ సర్పంచ్‌గా దేశ్‌ముఖ్ రాధికా అరుణ్‌కుమార్ సాధించిన విజయాలను చూస్తే.. ఇలాంటి నేతలే కదా మనకు కావల్సింది అనిపిస్తుంది. గ్రామప్రజల కనీస అవసరాలను గుర్తించి.. వారికి మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఆమె కృషి చేస్తున్నారు. ఊరిలో 90శాతం సిసి రోడ్లు వేయించడంతో పాటు 95శాతం ఇండ్లకు మంచినీటిని అందుబాటులోకి తీసుకు వచ్చారు. గ్రంథాలయాల ఏర్పాటు ఆవశ్యకతను గుర్తించి తమ గ్రామప్రజలకు పుస్తకాలతో సహవాసం పెంచారు. ఆమె పరిచయం...
'పాలమూరు జిల్లా కోయిల్‌సాగర్ మండం కొండాపూర్ మా సొంతఊరు. నాన్న వెంకట్రావు, పట్వారిగా పనిచేసేవారు. అమ్మ ఇంట్లోనే ఉండేది. మేం నలుగురం అమ్మాయిలమే. అయినా.. మా అందరికీ చదువు చెప్పించారు. పదోతరగతి వరకు కొండాపూర్‌లో చదివిన నేను ఇంటర్ మహబూబ్‌నగర్‌లో పూర్తి చేసాను. ఇంటర్ పూర్తికాగానే ప్రస్తుత సూర్యపేట జిల్లా హుజూర్నగర్ మండలంలోని బురుగుగడ్డలోని అరుణ్‌కుమార్‌తో పెండ్లి అయ్యింది.
ఇరువైపుల..
నాన్న పట్వారిగా గ్రామస్తులందరికీ అందుబాటులో ఉండేవారు. ఎప్పుడు తమ సమస్యల పరిష్కారం కోసం, సలహాల కోసం వచ్చేవారితో ఇల్లంతా సందడిగా ఉండేది. అత్తింట్లోనూ అదే వాతావరణం. మా మామగారు ఇరవైఐదేండ్లు కో-ఆపరేటివ్ ప్రెసిడెంట్‌గా పనిచేసారు. గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా మా ఇంటి తలుపు తట్టేవారు. మా ఆయన అరుణ్‌కుమార్ నాగేంద్ర యువ మండలి ఏర్పాటు చేసి యువతను సమాజసేవలో భాగస్వామ్యం చేసేవారు. ముఖ్యంగా కబడ్డీ క్రీడాకారులకు మా ఊరు కేంద్రంగా ఉండేది. మా ఊరి నుంచి జాతీయ స్థాయిలో కబడ్డీ పోటీలకు వెళ్లిన క్రీడాకారులు ఉన్నారు. 1995లో మా ఆయన బురుగుగడ్డ సర్పెంచ్గా గెలిచారు. ఇరువైపుల కుటుంబాల్లోనూ రాజకీయ వాతావరణం ఉండేది.
రిజర్వేషన్ల కారణంగా..
ఊరి ప్రజలందరికీ మా కుటుంబం బాగా తెలుసు. అధికారంలో ఉన్నా.. లేకపోయినా. గ్రామస్తులతో కలిసే ఉంటూ.. వారికి ఎలాంటి కష్టం వచ్చినా.. అండగా ఉండేవాళ్లం. 2013లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మా ఊరి గ్రామపంచాయితీ మహిళా రిజర్వేషన్ అయ్యింది. దాంతో గ్రామస్తులంతా నన్ను పోటీ చేయాల్సిందిగా కోరారు. వారి కోరిక మేరకు నేను పోటీ చేసి విజయం సాధించాను. స్థానిక సంస్థల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు ఇవ్వడంతో ఎంతో మంది మహిళలు రాజకీయాల్లోకి వచ్చారు. మా మండలంలో తొమ్మిది గ్రామపంచాయితీలు ఉంటే అందులో ఐదుగురు మహిళా సర్పంచులే ఉన్నారు. మహిళల చేతికి రాజ్యాధికారం వస్తే గ్రామాలు స్వయం సమృద్ధి సాధిస్తాయి.
మంచినీటి సమస్య..
ఐదు వేల జనాభా ఉన్న మా గ్రామంలో మంచినీటి సమస్య ఎక్కువగా ఉండేది. పన్నుల ద్వారా వసూలు అయ్యే గ్రామపంచాయితీ ఆదాయం అంతంత మాత్రమే. దాంతో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ నిధుల నుంచి కొంత మొత్తం గ్రామానికి కేటాయించమని కోరాం. ఆ నిధులతో మంచినీటి సమస్య తీర్చేలా బోర్లు వేసి.. ప్రతి ఇంటిని తాగునీటిని అందుబాటులోకి తీసుకువచ్చాం. వర్షం వస్తే మా ఊరి రోడ్లన్నీ బురుదమయం. ఇటీవలే గ్రామంలోని 90శాతం రోడ్లన్ని సిసిరోడ్లుగా మార్చాం. ప్రతి ఏటా కొన్ని పనులు చేస్తూ.. ఇప్పుడు ఊరిలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచాం. గ్రామపంచాయితీ సొంత భవనం నిర్మించాం. పశువుల ఆసుపత్రి, సబ్‌స్టేషన్ ఏర్పాటుచేసాం.
సాహిత్యం చేరువ చేస్తూ..
మా ఊరిలో పదోతరగతి వరకు ప్రభుత్వ పాఠశాల ఉంది. 200మంది విద్యార్థులున్నారు. గత ఐదేండ్లుగా పదోతరగతిలో నూరుశాతం పాస్ అవుతున్నారు. ఊరిలో ఉన్న నాలుగు అంగన్వాడీ కేంద్రాల ద్వారా బడి ఈడు పిల్లందరినీ స్కూలుకు పంపిస్తున్నాం. వ్యవసాయంపై ఆధారపడే కుటుంబాలు ఎక్కువగా ఉన్నా.. అందరీ తమ పిల్లలను బడికి పంపించేలా అవగాహన కల్పిస్తున్నాం. మా ఊరిలోని విద్యా వంతుల సహకారంతో గ్రంథాలయం ఏర్పాటుచేసాం. మనోవికాసానికి అవసరమైన మంచిసాహిత్యాన్ని ప్రజలకు చేరువ చేసే ప్రయత్నం చేస్త్తున్నాం.
ప్రజలకు అందుబాటులో ఉంటూ..
పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్ని పూర్తి చేసుకుని.. పంచాయితీ ఆఫీస్‌కు వెళ్తాను. ఊరిలోని అన్ని సందులు తిరుగుతాను. ఓటు వేసి గెలిపించి.. తమ సమస్యలను తీర్చుతారని భావించిన ప్రజలకు అందుబాటులో ఉండాలన్నది మా పెద్దవారి నుంచి నేను నేర్చుకున్నాను. ఎక్కడ సమస్య ఉన్నా.. వెంటనే పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. కుటుంబసమస్యలు, ఇతర ఏ సమస్యలు ఉన్నా ప్రజలు నేరుగా పంచాయితీ ఆఫీస్‌కు వచ్చేస్తారు. వారికి ఎప్పుడు అందుబాటులో ఉంటాను.
నిర్ణయం మాత్రం..
మహిళలకు అధికారం అనగానే.. వారి భర్తలదే పెత్తనం అన్న భావన సరికాదు. మా ఆయన గతంలో సర్పెంచ్గా చేసారు. మొదట్లో ఆయన నుంచి నేను కొంత నేర్చుకున్నాను. ఆ తర్వాత నేనే స్వయంగా ప్రజల మధ్యకు వెళ్లడం, వారి సమస్యలను తెలుసుకోవడం చేస్తున్నాను. ఏదైనా పెద్ద సమస్య ఉంటే ఆయనతో చర్చిస్తాను. ఆయన సహకారం తీసుకుంటాను. చివరగా నిర్ణయం మాత్రం నాదే.. చాలా అంశాల్లో మన కోణంలో ఆలోచిస్తేనే.. సరైన పరిష్కారం లభిస్తుందని నేను నమ్ముతాను'
- దేవిక