- గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితురాలికి అన్యాయం
- రెవెన్యూ అధికారుల నిర్వాకంతో వీధిన పడిన మహిళా రైతు
- న్యాయం కోసం పన్నెండేండ్లుగా తిరుగుతున్నా పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ - హుస్నాబాద్
రైతుల కలల ప్రాజెక్టు ఎందరో అభాగ్యులను కన్నీరు పెట్టిస్తోంది. జీవనాధారమైన భూమిని మింగి కట్టుబట్టకే పరిమితం చేసింది. అధికారుల అవినీతి, ప్రజాప్రతినిధుల ధనదాహంతో నిర్వాసితులకు పరిహారం అందకుండాపోతోంది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో నిర్మిస్తున్న గౌరవెల్లి ప్రాజెక్టులో భూములు కోల్పోయిన ఎందరో రైతులు పన్నెండేండ్లుగా పరిహారం కోసం తిరుగుతున్నారు. ఇదే కోవలో గౌరవెల్లికి చెందిన సున్నపు శారద తనకున్న 2.5 ఎకరాల భూమిని కోల్పోయి బాధను అనుభవిస్తోంది. కొన్నేండ్ల క్రితం ఆమె భర్త కొమురయ్య అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో శారద, ఆమె ఇద్దరు పిల్లలు అఖిల, అర్చన పెద్దదిక్కును కోల్పోయారు. ఉన్న రెండెకరాల భూమి సర్కార్ గుంజుకుంది. అందులో సగం భూమికే పరిహారం రావడంతో అప్పులకే సరిపోయింది. తిండికి ఇబ్బంది ఎదురు కావడంతో శారద హుస్నాబాద్ లోని ఓ సామిల్లులో పనికి కుదిరింది. కూలి చేసుకుంటూ పొట్టపోసుకుంటోంది. ఇద్దరు ఆడపిల్లలను చదివించుకుంటోంది.
పెండ్లీడుకొచ్చిన ఆడపిల్లలు ఇంటిమీద ఉండడంతో, వారికి ఎలా పెండ్లి చేయాలో అని మనోవేదనకు గురవుతోంది. ఆమె బాధను చూసిన కొందరు పెద్దబిడ్డ పెండ్లి కోసం అప్పు ఇచ్చారు. దీంతో కొద్దినెలల క్రితమే కూతురు పెండ్లి చేసింది. తనకు రావాల్సిన పరిహారం వస్తే.. అప్పు తీర్చడంతోపాటు మరో బిడ్డ పెండ్లి చేయాలనుకుంది. పరిహారం కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగింది. అయినా వారు స్పందించకపోవడంతో తీవ్ర మనోవేదన అనుభవిస్తూనే ఉన్నతాధికారులను ఆశ్రయించాలనుకుంది. హుస్నాబాద్ ఆర్డీవో జయచంద్రారెడ్డి ఎదుట తన గోడు వెల్లబోసుకుంది.
అనర్హులు పొందిన పరిహారం రికవరీకి నోటీసులు..
శారద తనకున్న 2.5 ఎకరాల్లో 35 గుంటలకు ఒకసారి, 15 గుంటలకు ఒకసారి పరిహారం పొందింది. మిగిలిన 35 గుంటలకు పరిహారం రాకపోవడంతో అధికారుల చుట్టూ తిరుగుతోంది. రికార్డులను పరిశీలించిన ఆర్డీవో శారదకు రావాల్సిన పరిహారాన్ని వేరొకరు పొందారని గుర్తించారు. భూక్య పున్ని, ఏలేటి కమలమ్మ, ఆరె సరోజన, నర్రా రాజిరెడ్డి, నోముల మల్లారెడ్డికి పరిహారం ఎలా పొందారో తెలపాలని నోటీసులు పంపించారు. ఆ ప్రతులను అక్కన్నపేట తహశీల్దార్ వేణుగోపాల్ రావుకు కూడా పంపించారు. పదిహేను రోజుల్లోగా ఆర్డీవో కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2020 నవంబర్ 21న నోటీసులు పంపగా, స్పందన లేకపోవడంతో 2020 డిశంబర్ 22న మరోసారి నోటీసులు పంపించారు. మూడునెలలు గడిచిపోతున్నా వారు పరిహారం ఎలా పొందారో తెలపడంలేదు. పదిహేను రోజుల్లోగా సమాధానం చెప్పకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఆర్డీవో కూడా పట్టించుకోవడంలేదు. దీంతో బాధితురాలు మరింత కుంగిపోతోంది. ఇక తాను ఆత్మహత్యే చేసుకుంటానని కన్నీటి పర్యంతమవుతోంది. బుధవారం మరోసారి హుస్నాబాద్ ఆర్డీవో జయచంద్రారెడ్డిని కలిసి తన పరిహారం గురించి అడిగింది. అయినా ఆయన సరైన సమాధానం చెప్పకుండా బయటకు వెళ్లిపోయాడని శారద విలేకరుల ఎదుట గోడు వెల్లబోసుకుంది. ఈవిషయమై ఆర్డీవో స్పందించాల్సి ఉంది.
భూమి గుంజుకొని పైసలియ్యరా..
గౌరవెల్లి ప్రాజెక్టులో నాకున్న భూమి మొత్తం పోయింది. అందులో సగం భూమికే పైసలిచ్చిండ్రు. అవి అప్పులు కట్టేందుకే సరిపోయినై. మిగిలిన భూమి పైసలు ఏమాయెనని తహశీల్ ఆఫీసు చుట్టు తిరుగుతున్న. ఏఒక్క సారు నా పైసల గురించి సమాధానం చెప్తలేరు. నా భర్త సచ్చిపోయిండు. ఇద్దరు ఆడపిల్లలను ఎట్ల సాదాలె. పెద్ద బిడ్డకు అప్పు చేసి పెండ్లి చేసిన. చేతిల పైసలు లెవ్వు. నా భూమి పైసలు ఎవరన్న తీసుకున్నరా. అధికార్లు ఎందుకు సమాధానం చెప్తలేరని ఆర్డీవోను అడిగిన. ఆయన రికార్డులు చూసి, వేరేటోళ్లు పైసలు తీసుకున్నరని సెప్పి, వాళ్లకు నోటీసులు పంపిండు. మూన్నెళ్లు గడిసినా ఏంజెప్పుతలేరని ఇయ్యాల మళ్లీ వచ్చిన. ఆర్డీవో ఏంబట్టించుకోకుండ బయటికి బోయిండు. గింతన్నాలంజేత్తండ్రు. సచ్చిపోవాలనిపిత్తంది.
– శారద, బాధితురాలు
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 22 Jan,2021 12:52PM