నవతెలంగాణ కంటేశ్వర్
తెలుగు భాషలోని తేనెవంటి తీయదనం తెలంగాణ పదాల సంపదతోనే సాధ్యమైందని తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడు ఘనపురం దేవేందర్ అన్నారు. బుధవారం నాడు తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన 'తెలంగాణ సాహిత్యం నాడు-నేడు' జాతీయ సదస్సులో ఆయన గౌరవ అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రాచీన సాహిత్యంలో పాల్కురికి సోమనాథుడు మొదలైన వారు తెలంగాణ భాషామధురిమలు పంచితే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కప్పివేయబడినా నివురు గప్పిన నిప్పులా ఉనికిని బ్రహ్మాండంగా చాటుకుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత తెలంగాణ వ్యాప్తంగా సాహిత్య సదస్సులు, కవి సమ్మేళనాలు, సాహిత్య ఉపన్యాసాలు, పుస్తక ఆవిష్కరణలు విస్తృతంగా జరుగుతున్నాయన్నారు. ఈ క్రమంలో తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ జాతీయ సదస్సులో శాసనమండలి సభ్యులు గోరేటి వెంకన్న, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్, సదస్సు సంచాలకులు డాక్టర్ గంటా జలంధర్ , సెంట్రల్ యూనివర్సిటీ ఆచార్యులు డాక్టర్ పిల్లలమర్రి రాములు, తెలంగాణ విశ్వవిద్యాలయ ఆచార్యులు డాక్టర్ గుమ్మన్నగారి బాల శ్రీనివాసమూర్తి, డాక్టర్ రాజేంద్ర సింగ్, డాక్టర్ సిద్దా జగన్మోహన్, డాక్టర్ ఉడయవర్లు, డాక్టర్ దేవకీదేవి, డాక్టర్ నిదానకవి నీరజ , సుదర్శన్ , తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న ఘనపురం దేవేందర్ ను సత్కరించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Mar,2021 08:31PM