
నిరుద్యోగుల కష్టాలకు వెండితెర రూపం
'భాషలన్నింటిలో తెలుగు చాలా మధురమైన భాష అని చిన్నప్పుడు చదువుకున్నాను. 'గ్యాంగ్' చిత్రానికి డబ్బింగ్ చెబుతున్నప్పుడు ఆ విషయం అర్థమైంది' అని అంటున్నారు హీరో సూర్య. 'సింగం' సీక్వెల్స్, '24' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సూర్య బాగా దగ్గరయ్యారు. తాజాగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తమిళంలో ఆయన నటించిన 'థానా సెంథ్ర కూట్టమ్' చిత్రం తెలుగులో 'గ్యాంగ్' పేరుతో రాబోతోంది. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో సూర్య ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
చాలా మార్పులు చేశాం..
బాలీవుడ్లో విడుదలైన 'స్పెషల్ 26' చిత్రానికి ఇది రీమేక్. అలాగని యధాతథంగా కాకుండా మాతృకను మాత్రమే తీసుకుని పూర్తిగా మార్పులు చేసి తెరకెక్కించిన చిత్రమిది. విఘ్నేష్ శివన్ తనదైన శైలిలో కథను చెప్పడానికి ప్రయత్నించాడు. 1987లో మన దేశంలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించాం. గ్రేట్ ఇండియన్ రాబరీగా పేరొందిన ఒపేరా హౌస్ దోపిడీ కేసు నేపథ్యంలో కథ సాగుతుంది. ఓ యువకుడు తన గ్యాంగ్‌తో కలిసి ఆ కేసును ఎలా ఛేదించాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. 1980లో కమల్ హాసన్ చేసిన 'సత్య', బాలచందర్ రూపొందించిన 'వరుమయిన్ నిరమ్శవప్పు' వంటి చిత్రాలు నిరుద్యోగ సమస్యను, ఉద్యోగాలు దొరక్క యువతరం పడే సంఘర్షణను కళ్లకు కట్టినట్టుగా చూపించారు. అలా నిరుద్యోగుల కష్టాలను యదార్థ కోణంలో ఆవిష్కరించిన చిత్రమిది.
ఆ రోజులు గుర్తొచ్చాయి..
'శివపుత్రుడు', 'వీడొక్కడే' అనంతరం చాలా రోజుల తర్వాత వినోద ప్రధానంగా సాగే పాత్రలో నేను కనిపిస్తాను. వినోదం, కమర్షియల్ ఎలిమెంట్స్ మేళవింపుగా సినిమా, నా పాత్ర ఉంటుంది. ఈ సినిమా చేస్తున్నప్పుడు నా కెరీర్ తొలినాళ్ళ రోజులు గుర్తొచ్చాయి. స్టడీ పూర్తవగానే ఏ వృత్తిని ఎంచుకోవాలనే సందిగ్దంలో పడ్డాను. ఓ ఎక్స్పోర్ట్ సంస్థలో ఏడువందల ఇరవై ఆరు రూపాయలకు పనిచేశాను. ఆఫీస్‌లో ప్యాకింగ్ నుంచి క్లీనింగ్ వరకు అన్ని పనులు నేనే చేసేవాడిని. బస్సుల్లోనే కాలేజ్‌కు వెళ్ళాను. సాధారణ జీవితాన్నే గడిపా. ఈ పాత్ర చేస్తున్నప్పుడు 20ఏండ్లు వెనక్కి వెళ్ళిన అనుభూతి కలిగింది. నన్ను నేను తెరపై చూసుకున్న ఫీలింగ్ కలిగింది. అప్పట్లో ఎలా ఉండేవాడినో సినిమాలోనూ అలాగే కనిపిస్తా. నేను ఎంత ఎదిగినా నా మూలాలు మాత్రం మరచిపోను.
సొంతంగా డబ్బింగ్..
ఇది పేరుకు రీమేక్ అయినా చాలా కొత్తగా ఉంటుంది. దర్శకుడు విఘ్నేష్ శివన్ తెరకెక్కించిన విధానం, నటీనటుల అభినయం వైవిధ్యంగా ఉంటుంది. విఘ్నేష్ శివన్ దర్శకుడే కాదు, మంచి డ్రమ్మర్, గీత రచయిత కూడా. ఈ సినిమాను అత్యంత సహజంగా తీర్చిదిద్దారు. సంభాషణలు, సన్నివేశాలు రియలిస్టిక్‌గా ఉంటాయి. అన్ని వర్గాలకు బాగా కనెక్ట్ అవుతాయి. అంతేకాదు ఈ చిత్రానికి తెలుగు డబ్బింగ్ కూడా నేనే చెప్పా. చిన్నప్పుడు ప్రపంచంలోనే అతి సుందరమైన భాష తెలుగు అని చదువుకున్నాను. ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పేటప్పుడు ఆ విషయం తెలుసుకున్నా. సొంతంగా తెలుగులో డబ్బింగ్ చెప్పడం మంచి అనుభూతినిచ్చింది. అందుకు శశాంక్ వెన్నెలకంటి బాగా సపోర్ట్ చేశారు. తమిళంలో ఎనిమిది రోజులు డబ్బింగ్ చెబితే, తెలుగులో కేవలం ఆరు రోజుల్లోనే పూర్తి చేశా.
ఆ ఆలోచన లేదు..
సినీ నటులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. గతంలో పలువురు నటులు రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు. ఇప్పుడు రజనీకాంత్, కమల్ హాసన్ రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. నిజంగా చెప్పాలంటే రజనీ, కమల్ భిన్న ధృవాల్లాంటి వ్యక్తులు.
చిత్ర సీమలో తమకంటూ ఓ ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్నారు. రాజకీయాల్లో రాణించాలంటే వ్యక్తిగతంగా చాలా సమయాన్ని వెచ్చించాలి. అది అంతా ఈజీ కాదు. నాకు మాత్రం అలాంటి ఆలోచన లేదు. అగరం ఫౌండేషన్ ద్వారా విద్యకు సంబంధించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. ఇది నాకు చాలా సంతృప్తినిస్తోంది.
ఇకపై కూడా ఈ కార్యక్రమాలను విస్తృతం చేస్తాను.
తదుపరి ప్రాజెక్ట్‌లు..
ప్రస్తుతం సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. ఇందులో సాయిపల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే కె.వి.ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. హరి దర్శకత్వంలో రెండేండ్లకోసారి చేస్తాను. ఆయనతో 'సింగం' సీక్వెల్స్ మాత్రం చేయను.