.jpg)
అబ్బురపరచే హైదరాబాద్ నేపథ్య సినిమా..
మనో ఆర్య, మహి వర్మ ప్రధాన పాత్రధారులుగా మనోహర్ చిమ్మని దర్శకత్వంలో పి.సి.క్రియేషన్స్ పతాకంపై ప్రదీప్ చంద్ర నిర్మిస్తున్న చిత్రం 'నమస్తే హైదరాబాద్'. ఈ చిత్ర లోగో లాంచ్ శుక్రవారం హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. ముఖ్యఅతిథి వరంగల్ ఎంపీ దయాకర్ లోగోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ''నమస్తే హైదరాబాద్' అంటే మన సంప్రదాయం, మన ఊరి అందాలు, మన బిర్యానీ గుర్తుకు వస్తుంది. టైటిల్ ఆకట్టుకునేలా ఉంది. సినిమా కూడా బాగుంటుందనుకుంటున్నా. కమర్షియల్ అంశాలతో వినోదాత్మకంగా వస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి' అని అన్నారు. 'ఎంపీ దయాకర్ మంచి విజన్ ఉన్న కళాకారుడు. తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకర్త. హైదరాబాద్ అంటే ఓ అద్భుతం, ఒక ఫాంటసీ, ఒక అమ్మ ఒడి. హైదరాబాద్‌లో అడుగుపెట్టిన వారిని ఖచ్చితంగా గమ్యానికి చేరుస్తుంది. ఇలాంటి హైదరాబాద్ పట్టణంలోని యువతీయువకుల జీవితాలు ఎలా ఉంటాయనే కథాంశంతో సినిమా తీయడం అభినందనీయం. అందరికీ అభినందనలు' అని ఎన్.శంకర్ తెలిపారు. దర్శకుడు మనోహర్ చిమ్మని చెబుతూ, 'హైదరాబాద్ నేపథ్యంలో రియలిస్టిక్‌గా రూపొందుతున్న పూర్తి స్థాయి పక్కా కమర్షియల్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రమిది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తాం. కొత్త వారితో రూపొందిస్తున్నాం. లేటెస్ట్ డిజిటల్ టెక్నాలజీతో సినిమాను షూట్ చేస్తున్నాం. మే చివరి వారంలో షూటింగ్ ప్రారంభించి, జులై, ఆగస్టులో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి సెప్టెంబర్‌లో విడుదల చేస్తాం' అని అన్నారు.