
వినాయక చవితి కానుక..!
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గత నెలలో టీజర్‌తో తన అభిమానులను ఖుషి చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు వినాయక చవితికి మరో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తొలిసారి నటిస్తున్న 'అరవింద సమేత' (వీర రాఘవ) చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే టీజర్ భారీ అంచనాలను పెంచింది. ఇక ట్రైలర్ కూడా అదే రేంజ్లో ఉంటుందని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం విదితమే. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. త్వరలో ఆడియోకు సంబంధించిన వివరాలు వెల్లడించనున్నట్టు తమన్ తెలిపారు. 'ఆదివారం భావోద్వేగపు రోజు. తారక్ అన్న ఓ పాట చిత్రీకరణలో పాల్గొన్నారు. సెట్లో డాన్స్ చేస్తూ మళ్ళీ ఎనర్జిటిక్‌గా మారిపోవడం ఆనందంగా ఉంది. మీరు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నా అన్నా. లాట్స్ ఆఫ్ లవ్. ఈ వారంలో ఆడియో అప్ డేట్స్ ఇస్తాం' అని తమన్ ట్విట్టర్లో పేర్కొన్నారు.