
విశ్రమించిన సినీ కార్మికుడు
దాసరి నారాయణరావు..తెలుగు సినిమా చరిత్రలో ఆయనదొక సువర్ణాధ్యాయం. బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానం నేటి తరానికి స్ఫూర్తిదాయకం. పరిశ్రమ బాగోగుల కోసం
అహర్నిశలు శ్రమించిన అలుపెరగని సినీ కార్మికుడు. అపురూప చిత్రాలతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన దర్శకశిఖరం జీవిత ప్రయాణం గురించి..
అత్యధిక సినిమాలు తీసి గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సొంతం చేసుకున్న దాసరి నారాయణరావు 1947లో మే 4న పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో అతి సామాన్యమైన కుటుంబంలో జన్మించారు. దాసరి తండ్రి సాయిరాజు, వాళ్ళ పెద్ద నాన్న కలిసి పొగాకు వ్యాపారం చేసేవారు. ఓసారి దీపావళి పండుగ రోజున పొగాకు గోదాము తగలపడిపోవడంతో దాసరి కుటుంబం ఆర్థికంగా దెబ్బతింది. ఆ సమయంలో వాళ్ళకున్న పొలాలు కూడా అమ్మేయాల్సి వచ్చింది. దాసరిని మాత్రమే బడికి పంపించిన వాళ్ల నాన్న.. పొగాకు వ్యాపారం దెబ్బతినడంతో మధ్యలోనే ఆయన చదువు మాన్పించేశారు. ఆరో తరగతిలో ఉండగానే దాసరిని వడ్రంగి దుకాణంలో పనికి పెట్టారు. నెలకు రూపాయి జీతంతో దాసరి కొంత కాలం పని చేశారు. ఆ తర్వాత ఓ మాస్టారు సహాయంతో మళ్ళీ చదువు కొనసాగించారు. అలా డిగ్రీ వరకు పూర్తి చేశారు. ఈ తరుణంలోనే నాటకాలవైపు ఆకర్షితుడయ్యారు. చిన్న చిన్న నాటకాల్లో నటించి నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. అనతి కాలంలోనే ప్రతిభగల రంగస్థల నటుడిగా, నాటక రచయితగా పేరు సంపాదించారు. అప్పుడే సినిమాల్లోకి వెళ్ళాలనే ఆలోచనకు బీజం పడింది. చెన్నై వెళ్ళి సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.
''ప్రతి వాడూ ఒక నాటకం వేసేయడం, ఒక కప్పు తెచ్చుకోవడం, కప్పొచ్చిన వెంటనే మద్రాసు సెంట్రల్ రైల్వే స్టేషన్లో దిగిపోవడం, వేషం వేసేయాలనుకోవడం.. అసలెప్పుడైనా ముఖం అద్దంలో చూసుకున్నావా నువ్వు?'' అంటూ కృష్ణ అనే మేకప్ మెన్ దాసరిని అన్నమాటలు ఇవి. సినిమా పరిశ్రమలో తొలిరోజు తనకెదురైన ఈసడింపును దాసరి ఎన్నో సందర్భాల్లో గుర్తు చేసుకున్నారు.
కుటుంబ అనుబంధాలే కథా వస్తువుగా ఎన్నో అపురూప చిత్రాలను రూపొందించి మెప్పించిన దాసరి సినిమాల్లో ఒక సాధారణ వ్యక్తిగా అడుగుపెట్టారు. 1973లో 'తాత - మనవడు' చిత్రంతో దర్శకుడిగా మారారు. అంతకంటే ముందు ఆయన దాదాపు 48 సినిమాలకు రచయితగా పనిచేశారు. చిన్నప్పుడు దాసరి చదువుకోవడానికి చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. ఒక పూట తింటే మరో పూట తినలేని వాతావరణంలో పెరిగారు. కష్టసుఖాలను, మనిషి సాధకబాధలను చిన్నప్పుడే స్వయంగా చూశారు. వాటి ఇతివృత్తంతో పుట్టిందే 'తాత-మనవడు' చిత్ర కథ. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఈ కథ రాసుకున్నారు. దోనెపూడి బ్రహ్మయ్య అనే నిర్మాతకి ఈ చిత్ర కథ చెప్పారు. అప్పటికే ఎస్వీరంగారావుతో 'బందిపోటు బ్రహ్మన్న' సినిమా తీసి విజయం సాధించారు. దాసరి చెప్పిన ఈ కథ నచ్చినప్పటికీ తను యాక్షన్ సినిమా చేయాలని దీన్ని పక్కన పెట్టారు. ఆ టైమ్‌లో కె.రాఘవ సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఆయనకు ఈ కథ నచ్చడంతో ఎస్వీఆర్ ప్రధాన పాత్రధారిగా ఈ చిత్రం పట్టాలెక్కింది. అలా దాసరి దర్శకులయ్యారు.
'తాత-మనవడు' చిత్రం భారీ విజయం సాధించడంతో వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. ఆ తర్వాత చేసిన 12 సినిమాలు వరుసగా విజయం సాధించాయి. దీంతో దాసరి దర్శకత్వంలో పనిచేయడానికి దాదాపు 36 మంది నిర్మాతలు వెయిట్ చేశారంటే ఆయనకున్న క్రేజ్, ప్రతిభ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే దాసరి తీసిన 'ముద్దబంతి పువ్వు' చిత్రం పరాజయం చెందడంతో సీన్ రివర్స్ అయ్యింది. అప్పటి వరకు పది మందికిపైగా ఆయన వెంట ఉన్న నిర్మాతలు ఈ చిత్ర పరాజయంతో అందరూ దూరమయ్యారు. ఆయనతో సినిమా తీద్దామనుకుని అడ్వాన్స్‌లు ఇచ్చిన నిర్మాతలు కూడా తిరిగి అడ్వాన్సు తీసుకున్నారు. దీంతో తొలిసారి దాసరికి విజయానికి, పరాజయానికి ఉన్న వ్యత్యాసం ఏంటో అర్థమైంది.
'తూర్పు పడమర' చిత్రంతో మళ్ళీ పుంజుకున్న దాసరి ఆ తర్వాత 'సంసారం సాగరం', 'బంట్రోతు భార్య', 'ఎవరికి వారే యమునా తీరే', 'రాధమ్మ పెళ్ళి', 'తిరుపతి', 'స్వర్గం నరకం', 'గోరింటాకు', 'ప్రేమాభిషేకం', 'బలిపీఠం' వంటి భిన్న చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రేక్షకుల మెప్పు పొందారు. ఆ తర్వాత మారుతున్న శైలికి అనుగుణంగా ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు సంచలనం సృష్టించాయంటే అతిశయోక్తి కాదు. 'బొబ్బలిపులి', 'సర్దార్ పాపారాయుడు', 'ప్రేమ్‌నగర్', 'తాండ్ర పాపారాయుడు'... 'ఒసేరు రాములమ్మ', 'అభిమన్యుడు', 'కంటే కూతుర్నే కను', 'సూరిగాడు', 'ఒరేరు రిక్షా', 'సమ్మక్క సారక్క' ఇలా చెప్పుకుంటూ పోతే రికార్డుల్ని తిరగరాసిన సినిమాలు కోకొల్లలు. ఆయన చివరగా తీసిన చిత్రం 'ఎర్రబస్సు' ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. 1976 నుంచి 93 వరకు ఏడాదికి మూడు షిఫ్ట్‌ల్లో పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి. దర్శకుడు అనే విభాగాన్ని అగ్ర స్థానంలో నిలబెట్టిన ఘనత దాసరిదే. దర్శకుడిగా పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో ఆయన పేరిట దాదాపు 18వేల అభిమాన సంఘాలున్నాయంటే దాసరికున్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
ప్రజలను ప్రభావితం చేసే ఎన్నో అపురూప చిత్రాలను తెరకెక్కించిన దర్శకరత్న ఎన్టీఆర్‌తో రూపొందించిన చిత్రాలతో ఓ చరిత్ర సృష్టించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావడంలో 'బొబ్బిలిపులి', 'సర్దార్ పాపారాయుడు' వంటి తదితర సినిమాలు కీలక పాత్ర పోషించా యనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా సమాజంలోని సమస్యలను ఎత్తిచూపే రీతిలో సినిమాలను రూపొందించారు.
యాభై ఏండ్ల సినీ జీవితంతో 151 చిత్రాలకు దర్శకత్వం వహించారు. సుమారు 53 చిత్రాలకు నిర్మాతగా, దాదాపు 250కి పైగా చిత్రాల్లో నటుడిగా, గీత రచయితగా, సంగీత దర్శకుడిగా, గాయకుడిగా, కళాదర్శకుడిగా, ఎడిటర్‌గా.. ఇలా సినిమాకి సంబంధించి ముఖ్యమైన అన్ని క్రాప్ట్ల్లో తనదైన ముద్రని వేసుకుని శభాష్ అనిపించుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన 'మేఘసందేశం' తెలుగునాటే కాదు కేన్స్, మాస్కో వంటి ఫిల్మ్ ఫెస్టివల్స్‌ల్లో ప్రదర్శితమై ప్రపంచవ్యాప్తంగా తెలుగువాళ్ళ సత్తాని చాటింది. ఎస్వీఆర్, ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణంరాజు, చిరంజీవి నుంచి నేటి తరం హీరోలు మంచు విష్ణు వరకు దాదాపు అందరితోనూ పనిచేశారు. ఆయన సినిమాల్లో హీరోయిజం కంటే పాత్రలే కనిపిస్తాయి.
కొత్తనీరును ఇండ్రస్టీకి తీసుకురావడంలో ఆయన ఎప్పుడూ ముందే ఉంటారు. మోహన్‌బాబుని నటుడిగా, ఆర్.నారాయణ మూర్తి, రవిరాజా పినిశెట్టి, ముత్యాల సుబ్బయ్య, కోడిరామకృష్ణ తదితరులను దర్శకులుగా పరిచయం చేశారు. జయసుధ, జయప్రద, మాధవి, శ్రీదేవి, సుజాత, స్వప్న, సిల్క్‌స్మిత, రజనీ, సుభశ్రీ, అలేఖ్య, అన్నపూర్ణ, ఫటాఫట్ జయలక్ష్మి వంటి వారిని కథానాయికలుగా వెండితెరకు పరిచయం చేసి తిరుగులేని నాయికలుగా తీర్చిదిద్దారు. వీరితోపాటు ఇంకా ఎంతో మంది నటీనటులకు, సాంకేతిక నిపుణులకు 'సినిమా' జీవితాన్ని అందించిన ఘనత ఆయనకే సొంతం. దాసరి నటుడిగా విభిన్న పాత్రలు పోషించి మెప్పించారు. తాతగా, మామగా, తండ్రిగా, కార్మికుడిగా, విప్లవ నాయకుడిగా పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేయడం ఆయన ప్రత్యేకత. సహజ నటనతో పాత్రను రక్తికట్టించడంలో ఆయనకు ఆయనే సాటి.
ఉత్తమ చిత్రంగా నిలిచిన 'మేఘసందేశం' చిత్రానికి గాను జాతీయ అవార్డునందుకున్నారు. ఈ చిత్రం మ్యూజిక్, నేపథ్యగాయకుడు, నేపథ్య గాయని విభాగాల్లో కూడా జాతీయ అవార్డులను అందుకుంది.
అలాగే 'కంటే కూతుర్నే కను' చిత్రానికిగానూ ప్రత్యేక విభాగంలో జాతీయ అవార్డును దక్కించుకున్నారు. 2009లో ఎన్టీఆర్ జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'మేస్త్రీ', 'మామగారు', 'కంటే కూతుర్నే కను', 'బంగారు కుటుంబం', 'మేఘసందేశం', 'స్వర్గం నరకం', 'సంసారం సాగరం', 'తాత-మనవడు', 'ప్రేమాభిషేకం' చిత్రాలను నంది పురస్కారాలు వరించాయి. ఫిల్మ్ ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ పురస్కారంతోపాటు మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకున్నారు. అత్యధిక సినిమాలకు దర్శకత్వం (ప్రస్తుతం 151) వహించిన దర్శకుడిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించారు. సినిమాల్లోనే కాదు బుల్లితెరపై కూడా రాణించారు. ఆయన నిర్మిస్తూ రూపొందించిన 'అభిషేకం' సీరియల్ 2500కిపైగా ఎపిసోడ్లను పూర్తి చేసుకుని అత్యధిక ఎపిసోడ్లను పూర్తి చేసుకున్న సీరియల్‌గా గిన్నిస్ రికార్డుకు చేరువలో ఉంది. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ రాణించారు. కాంగ్రెస్ తరపున ఎంపిగా రాజ్యసభకు ఎన్నికై బొగ్గు గనుల శాఖామంత్రిగా పనిచేశారు. తెలుగు సినిమా బాగు కోసం అనునిత్యం తపించే దాసరి చిన్న సినిమాలకు అండగా నిలిచారు.
సరిలేరు నీకెవ్వరూ..
'సినిమా' రికార్డుల్ని తిరగరాయడమంటే ఏంటో నేర్పించిన దర్శకుడిగా, సినిమా కథల పదునేమిటో చూపించిన రచయితగా, ఇలాంటి సినిమాలే తీయాలని నిరూపించిన అభిరుచి గల నిర్మాతగా, నటనతో ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న నటుడుగా, సినిమా పరిశ్రమ బాగు కోసం అహర్నిశలు శ్రమించిన అలుపెరగని సినీ కార్మికుడిగా నూతన తరానికి మార్గదర్శిగా నిలిచి నింగికేగిన దర్శకరత్నకు సినీ, రాజకీయ ప్రముఖులు తెలిపిన సంతాపానికి అక్షర రూపం..
సినీరంగంలో ఎంతో మందిని ప్రోత్సహించి వారి ఎదుగుదలకు కారణమైన ఆదర్శప్రాయుడు దాసరి. తెలుగు చిత్ర పరిశ్రమను హైదరాబాద్‌కు తీసుకురావడంలో దాసరి చేసిన కృషి ఎప్పటికీ గుర్తుంటుంది.
ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి
- సీఎం కేసీఆర్
తనకంటూ ఓ విశిష్ణతను, ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి దాసరి. తెలుగు సినీ పరిశ్రమకు ఎనలేని సేవలందించారు. ఎన్టీఆర్‌తో చాలా సినిమాలు తీశారు. ఆయన మరణం చాలా బాధాకరం. దాసరి, భార్య పద్మ తనను ఓ కుటుంబ సభ్యుడిలా చూసేవారు. రాజకీయంగానూ ఆయన రాణించారు. కేంద్రమంత్రిగా సేవలందించారు
- ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
దాసరి మరణం చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు
- కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు
జాతీయ స్థాయిలో తెలుగు సినిమా కీర్తిని వ్యాపింపచేసిన దర్శకరత్న దాసరి మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. సినిమా వారికి ఎలాంటి కష్టం కలిగినా ముందుండే పెద్దదిక్కు దాసరి ఇక లేరనే వార్త తట్టుకోలేకపోతున్నాను - ఎంపీ, నిర్మాత టి.సుబ్బరామిరెడ్డి
నా అత్యంత ఆప్తుడు మిత్రుడు దాసరి ఇండియాలోనే గొప్ప దర్శకుడు.
మంచి మనిషి - రజనీకాంత్
దివంగత బాలచందర్ కూడా దాసరిని ఆరాధించేవారు. నేను దాసరితో, సంజీవ్ కుమార్‌తో గడిపిన రోజులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటా
- కమల్ హాసన్
ప్రస్తుతం నేను చైనాలో ఉన్నా. ఇంతలో ఇలాంటి చేదు వార్తను వినాల్సి వచ్చింది. ఆయన మరణం యావత్తు చిత్ర పరిశ్రమకు తీరనిలోటు. దర్శక నిర్మాతగా సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవ అనిర్వచనీయం. ఇప్పటివరకూ సినిమాకు పెద్ద దిక్కులా ఉన్న ఆయన ఇప్పుడు మన మధ్య లేకపోవడం బాధాకరం. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయన సేవను ఎప్పుడూ స్మరించుకుంటూనే ఉంటా - చిరంజీవి
ఒక చరిత్ర ముగిసింది. భారత సినీ చరిత్రలో దాసరి కొత్త అధ్యాయం సృష్టించారు. నాకు నటుడిగా జీవితాన్నిచ్చిన దర్శకుడు దాసరి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నా - మోహన్‌బాబు
తెలుగు సినిమా గమనానికి సరికొత్త దారి చూపిన దాసరి మరణానికి చింతిస్తున్నాను -నందమూరి బాలకృష్ణ
దాసరి నారాయణరావు మృతికి సంతాప సూచికగా నేటి నుంచి 3 రోజుల పాటు మా చిత్ర షూటింగ్ కార్యక్రమాలు నిలిపి వేస్తున్నాం. ఆయన కుటుంబానికి మా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం.
- పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత సూర్యదేవర రాధాక్రిష్ణ.
దాసరి మరణవార్త తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆయన మరణం ఏర్పర్చిన లోటు ఎప్పటికీ తీరదు - మహేష్‌బాబు
తెలుగు చిత్ర కళామ్మతల్లి కన్న ఒక దిగ్గజం ఇక లేదు.
మరువదు ఈ పరిశ్రమ మీ సేవలను - ఎన్టీఆర్
పరిశ్రమకు అమావాస్య లాంటి రోజు. దాసరి లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం - పరుచూరి వెంకటేశ్వరరావు
చిత్ర పరిశ్రమకు మార్గదర్శకంగా ఉన్న పెద్ద దిక్కుని కోల్పోయాం
- శివాజీ రాజా (మా అధ్యక్షుడు)
క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అన్నట్టుగా దాసరికి ముందు, దాసరి తర్వాత అని చెప్పుకోవాల్సిందే. అంత గొప్ప స్థానానికి దాసరి నారాయణరావు ఎదిగారు. కుల, మత, లింగ, బడుగు, బలహీన వర్గాలు అనే తేడా లేకుండా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించి సినిమా రంగంలో జీవితాన్నిచ్చిన గొప్ప వ్యక్తి దాసరి. సినిమా రంగంలో ఆయనొక అంబేద్కర్లాంటివారు
- ఆర్.నారాయణమూర్తి
రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని, గద్దర్, విజయశాంతి, వందేమాతరం శ్రీనివాస్, రామ్‌గోపాల్ వర్మ, పూరీ జగన్నాథ్, వి.వి.వినాయక్, హరీష్ శంకర్, బ్రహ్మానందం, అశ్వనీదత్, సుకుమార్, రఘు కుంచె, రకుల్ ప్రీత్ సింగ్, నాని, వరుణ్ తేజ్, సునీల్, రాధిక, మురళిమోహన్, రాజశేఖర్, జీవిత తదితరులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
దానకర్ణుడు..
దాసరి భోళా శంకరుడే కాదు మంచి దానగుణమున్న వ్యక్తి. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలోనూ ఆయన ఎప్పుడూ ముందే ఉన్నారు. పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ప్రవేశపెట్టి ఆంధ్రా, ఉస్మానియా, వెంకటేశ్వర, చెన్నై, కేరళ యూనివర్సిటీలకు భూరి విరాళాలు అందజేశారు. తాను పుట్టిన ఊరైనా పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో తన పేరుతో 1980లో దాసరి నారాయణరావు మహిళా కళాశాలను స్థాపించారు. భార్య దాసరి పద్మ పేరుతో చెన్నైలో పద్మ విద్యాలయ స్థాపించారు. 1975లో కాకినాడ పోలీస్ సంక్షేమ నిధికి విరాళాలు సేకరించి, తను కొంత చేర్చి రూ.4.50 లక్షలు అందజేశారు. 1998లో సైక్లోన్ రిలీఫ్ ఫండ్ కోసం దక్షిణ, ఉత్తర భారత సినీ నటులతో క్రికెట్ మ్యాచ్ నిర్వహించి మూడు కోట్ల రూపాయలు సేకరించి విరాళంగా అందజేశారు. 1999లో స్ట్రీట్ ర్యాలీలు, వినోద కార్యక్రమాలు నిర్వహించి కార్గిల్ యుద్ధవీరుల నిధికి పెద్ద మొత్తాన్ని అందజేశారు. 1982లో వైజాగ్‌లో పోలీస్ స్టేషన్ నిర్మాణ నిధుల కోసం ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి దిగ్గజ కళాకారులను రప్పించి 'దాసరి స్ట్రీట్ నైట్' నిర్వహించి తద్వారా వచ్చిన సొమ్మును విరాళంగా ఇచ్చారు. 1985లో తుఫాను బాధితుల సహాయర్థం రూ.30లక్షలు, 1986లోనూ రూ.35లక్షలు విరాళంగా సేకరించి కరువు నివారణ నిధికి ఇచ్చారు. ఈ రెండు సందర్భాల్లోనూ ఎన్టీఆర్ ఆయనతో కలిసే ఉన్నారు. 1990లో స్టార్ నైట్ నిర్వహించి తద్వారా సేకరించిన కోటి రూపాయలను ప్రభుత్వానికి అందజేశారు. ఇలా ఆయన చేసిన గుప్తదానాల లెక్కలు మిక్కిలిగా ఉన్నాయి. ఆర్థిక సహాయం కోరుతూ వచ్చిన వాళ్ళను దాసరి నిరాశపరిచిన సందర్భాలు ఏనాడూ లేవు.
చివరి అవార్డు..
'ఆరోగ్యం బాగోలేక నోరు విప్పి నాలుగు మాసాలైంది. ఇలా మాట్లాడే సందర్భాన్ని ఊహించలేదు. నా జీవితంలో ఎన్నో రకాల అవార్డులు చూశాను. నా పుట్టిన రోజు సందర్భంగా అల్లు రామలింగయ్య పేరుతో స్థాపించిన జాతీయ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన, నేను ఒకే ఊరు నుంచి ఒకేసారి వచ్చాం. నేను దర్శకత్వం వహించిన దాదాపు వంద చిత్రాల్లో ఆయన నటించారు. ఆయన పాత్ర లేకుండా నేను కథలు తయారు చేసేవాడిని కాదు. ఏ ఆర్టిస్టుకైనా, దర్శకుడికైనా ఆల్టర్నేట్ ఉంటారు. కానీ ప్రత్యామ్నాయం లేని ఒకే ఒక్క నటుడు అల్లు రామలింగయ్య'
- దాసరి నారాయణరావు (4-05-2017)