Sat 25 Jul 21:10:55.259311 2020
Authorization
బండారుపల్లి జమిందారు రాషువరాయుడుకి వేలాది ఎకరాల భూముంది. పాతిక మంది వరకు జీతగాళ్లుండేవాళ్లు. వాళ్లతో వ్యవసాయం చేయిస్తూ, పశుపోషణ, పొలాల రక్షణ చేయిస్తుండేవాడు. ఏ ఒక్క జీతగాడి వేతనం మరో జీతగాడి వేతనంతో సమానంగా ఉండేది కాదు. వాళ్లు చేస్తున్న పనిని బట్టి, నెల జీతం ఇస్తుండేవాడు.
పెద్దోడి మెట్ట మొత్తం మూడు వందల ఎకరాలు. నల్లేరు వాగు బీడు భూమిలోంచి పక్క గ్రామంవైపు పారుతుం డేది. ఆ భూమిలో ఎటు వంటి పంట వేయకుండా, తన పశువులు మేయడానికి వదిలేశాడు.
తొలకరి వర్షాలు పడగానే, దాని కాపలాకు ముగ్గురు జీత గాళ్లు కావాలని గ్రామంలో చెప్పాడు. రంగయ్య, లింగయ్య, మంగయ్యనే ముగ్గురు యువ కులు జీతం చేయడానికి ముందు కువచ్చారు. తూర్పు వైపు రంగడ్ని, పడమర వైపు మంగయ్యను, దక్షిణం వైపు లింగయ్యను కాపలాకు వెళ్లమన్నాడు. మీ పనితనం చూసి, జీతం నిర్ణయిస్తానని చెప్పాడు.
నెల రోజుల తర్వాత ఓ రోజు జమిందారు బీడు భూమినంతా తిరిగి చూసి, ఇంటికి వచ్చాడు. రంగయ్యకు మూడు వేలు, లింగయ్యకు రెండు వేలు, మంగయ్యకు వెయ్యి రూపాయలు జీతం నిర్ణయించి, సాయంత్రం వచ్చిన ముగ్గురికీ ఇవ్వమని తన గుమాస్తాతో చెప్పాడు.
ముగ్గురూ జమిందారు వద్దకొచ్చి, ఒకే రకమైన కాపలా చేశాం. కానీ మా జీతాలు ఇలా ఎక్కువ తక్కువగా నిర్ణయించడం ఎందుకో అర్థం కావడం లేదు అన్నాడు మంగయ్య.
అప్పుడు జమిందారు వాళ్ల వైపు చూసి, నిన్ను బీడు భూమిలోకి పశువుల్ని రానీయకుండా చూడమంటే నువ్వేం చేశావు. ఉదయమే వెళ్లి, చింతచెట్టు కింద నిద్రపోయావు. గ్రామంలోని పశువులు బీట్లో పడి గడ్డి మేశాయి. నేను బీట్లో తిరిగినప్పుడు పశువుల పేడ కనిపించింది. నీ కాపలాకు వెయ్యే ఎక్కువ అన్నాడు.
నేను ఒక్క పశువును కూడా రానీయలేదు. కానీ నాకు రంగయ్య కంటే తక్కువ ఎందుకిచ్చారు? అడిగాడు లింగయ్య.
ముందు రంగయ్యకు ఎక్కువ జీతం ఎందుకు ఇచ్చానంటే, తను కాపలా చేస్తున్న బీడు భూమిలో ఒక్క పశువును పడనీయ లేదు. పైగా గెట్టు చుట్టూ వందలాది పండ్ల మొక్కలు నాటాడు. అవి పశువులు తినకుండా చుట్టూ రక్షణగా కంప ఏర్పాటు చేశాడు. రోజూ వాగులోని నీళ్లు పోసి ఒక్కటి కూడా చనిపోకుండా మొక్కలను బతికించాడు. ముందు ముందు ఆ చెట్లు చక్కని ఫలాల్నిస్తాయి. నేనేం మొక్కలు వేయమని చెప్పలేదు. కానీ తన ముందు చూపుతో, భావితరాలకు పనికొచ్చేలా పండ్ల మొక్కలు పెట్టాడు. అందుకే మూడు వేలుగా జీతంగా నిర్ణయించాను అన్నాడు.
ఇక లింగయ్య కేవలం కాపలా మాత్రమే కాశాడు. పశువులు పడకుండా చూశాడు. కానీ భూమిని, పారుతున్న నీటిని ఉపయోగించి, ఉపయోగపడే పనేమైనా చేయొచ్చుననే ఆలోచన చేయలేదు. అందుకే అతనికి రెండు వేలుగా జీతం నిర్ణయించాను. చెప్పకున్నా స్వంత ఆలోచన చేసి, భావి తరాలకు ఉపయోగపడేలా మొక్కలు నాటిన రంగయ్య నా దష్టిలో ఉత్తముడు. చెప్పిన పని చెప్పినట్లు మాత్రమే చేసిన లింగయ్య మధ్యముడు. తన కర్తవ్యం నిర్వర్తించకుండా, సోమరిగా కాలం గడిపిన మంగయ్య అధముడు. వారి పనిని చూశాకే ఈ విధంగా జీతం నిర్ణయించాను అన్నాడు జమిందారు.
రాఘవ రాయుడి వివరణతో - మంగయ్య, లింగయ్యలు సిగ్గుపడ్డారు. రంగయ్యలాగే బీడు భూమి చుట్టూ మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
మీరు నాటిన మొక్కలు బ్రతికాక, వాటిని పరిశీలించి మీకు జీతం పెంచుతానని హామీ ఇచ్చాడు రాషువ రాయుడు. ముగ్గురూ సంతోషంగా జీతం తీసుకుని ఇంటికి వెళ్లారు.
- పుప్పాల కష్ణమూర్తి, 9912359345