Sat 08 Aug 22:44:33.504224 2020
Authorization
పౌర్ణిమ రోజున గుట్ట మీద అన్న సంతర్పణ జరుగుతోంది. పెద్దవాళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే ఊర్లోని పిల్లలంతా ఎద్దుల బండిలో బయలుదేరారు. మిట్ట పల్లాలతో, కంప చెట్లు మట్టి దిబ్బలు పెద్ద పెద్ద రాళ్లతో దారి అంతా అస్తవ్యస్తంగా ఉంది. బండి నడిపే వ్యక్తి చాకచక్యంగా బండిని నడుపుతున్నాడు.
ఒక ఎత్తైన ప్రదేశంలోని మలుపు వద్ద చక్రం విరగడంతో బండి అటూ ఇటూ ఊగింది. బండి పక్కకి ఒరిగితే లోతైన ప్రదేశంలో పడే ప్రమాదం ఉందని బండి నడిపే వ్యక్తి గుర్తించాడు. ఎద్దులను చర్నాకోలుతో అదిలిస్తూ పగ్గాలతో లాగుతూ ఎలాగైనా ప్రమాదం నుంచి పిల్లలను రక్షించాలని శతవిధాల ప్రయత్నించాడు.
ప్రమాదాన్ని గుర్తించిన గ్రామస్తులు గట్టిగా అరిచారు. బండిలోని పిల్లలంతా భయంతో వణికారు. ఎగిరి దుముకుదా మనుకున్నారు కానీ ధైర్యం చాలలేదు. ఇంతలో బండి నడిపే వ్యక్తి ఎలాగోలా కష్టపడి బండిని ఒక చెట్టు కింద నిలిపాడు. అందరూ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. ఇంత జరుగుతున్నా బండిలోని ఒక ఆరేళ్ళ పాప ఏ మాత్రం తొణకలేదు బెణకలేదు. తనతో పాటు తీసుకొచ్చిన ఆడ బొమ్మకు జడ వేస్తూ ఉంది.
మిగిలిన పిల్లలందరూ ఆ పాప వద్దకు వచ్చి 'ఇంత జరుగుతున్నా ఎలా దైర్యంగా ఉండ గలిగినావు, నీకు భయం కలగలేదా' అని అడిగారు.
'బండి నడిపేది మా నాన్న కదా, నాన్న నన్ను ఎలాగైనా రక్షిస్తాడు అనే నమ్మకంతో దైర్యంగా ఉన్నాను' అని బదులిచ్చింది. ఆశ్చర్యపోవడం పిల్లల వంతు అయ్యింది. ఈ సష్టిలో తండ్రి అంటే కూతురుకి ఒక గట్టి నమ్మకం, భరోసా కదా అని గ్రామస్తులు అనుకున్నారు. కూతురు కోసం తండ్రి ఎన్ని కష్ట నష్టాలైనా భరిస్తాడని, ఆ ప్రేమ ముందర కొండంత కష్టాలు దూది పింజలవుతాయని చెప్పుకున్నారు.
సంతర్పణ జరిగాక పిల్లలు ఆనందంగా కేరింతలు కొడుతూ కంటికి కనురెప్ప నాన్న, కంటికి కనిపించని కవచమే నాన్న అంటూ బండి నడిపే వ్యక్తికి బెల్లం పొంగలి తినిపించారు.
- ఆర్.సి. కష్ణస్వామి రాజు, 9393662821