Sat 15 Aug 17:53:28.45502 2020
Authorization
రంగనాధపురంలో భీమయ్య అనే కళాసీ ఉండేవాడు. భీమయ్య పెద్దగా చదువుకోక పోయినా జానపద గేయాలు, పల్లె సుద్దులు చక్కగా పాడుతుండేవాడు,భీమయ్యకు క్రాంతి అనే మనవడు ఉండేవాడు. క్రాంతి ఉన్నత చదువులు చదువు తుండేవాడు. క్రాంతికి తాతయ్యతో సహవాసం వల్ల జానపద గేయాలు రాయడం, వాటికి బాణీలు కట్టి పాడటం, పాటలకు తగ్గట్టుగా ఆడటమంటే ఇష్టం ఏర్పడింది.
క్రాంతి నాన్నమ్మ అంటే భీమయ్య భార్య హద్రోగంతో బాధ పడుతుండేది. ఆమె గుండె ఆపరేషన్‌కి మూడు లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. పూటబత్తెం పుల్లలెలుగు బతుక్కుల్లో ఉన్న భీమయ్య కుటుంబం అంత డబ్బు సమకూర్చలేక పెద్దామె గుండెజబ్బు బాధలు చూడలేక నిత్యం దిగులు పడుతుండేవారు.
క్రాంతి తన మిత్రులతో కలిసి క్రాంతి జానపద జన నాట్యమండలి పేరుతో ఒక సాంస్కతిక కళా సంస్థగా ఏర్పడ్డారు. నాన్నమ్మ గుండె ఆపరేషన్ కోసం డబ్బులు కూడగట్టే లక్ష్యంతో కళా ప్రదర్శనలు ఇస్తుండేది ఆ కళా బందం.
కుర్రకారుని చైతన్యపరిచే క్రాంతి మిత్ర మండలి జానపద బాణీలు గురించి తెలిసి, మహా నగరంలోని ఒక పెద్ద వైద్య కళాశాల అధిపతి రంగయ్యనాయుడు తన కొడుకు పెళ్లి వేడుకలో క్రాంతి మిత్ర బందం కళా రూపాల ప్రదర్శన ఏర్పాటు చేశాడు.
క్రాంతి జానపద బాణీలకు ముగ్ధుడై...క్రాంతి గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాడు రంగయ్య నాయుడు. క్రాంతి నాన్నమ్మ గుండె ఆపరేషన్ గురించి డబ్బు సంపాదనకై క్రాంతి కళా ప్రదర్శనలు చేస్తున్నాడని తెలిసి, క్రాంతి నాన్నమ్మకు గుండె ఆపరేషన్ తాను ఉచితంగా చేయిస్తానని మాట ఇచ్చి, క్రాంతి భుజం తట్టి నువ్వు ఈ జన నాట్య మండలిని కార్మికలోక చైతన్యం దిశలో నడుపు, అంతకన్నా ముందు మీ మిత్రబందం మీ చదువులు పూర్తి చెయ్యండి అని సలహా ఇచ్చాడు రంగయ్య నాయుడు.
అనుకున్నట్లే... క్రాంతి నాన్నమ్మ గుండె ఆపరేషన్ జరిగింది. ఆమె ఆరోగ్యం కుదుటపడింది. క్రాంతి ఉన్నత చదువులు పూర్తి అయ్యాయి 'భీమయ్య క్రాంతి జానపద జన నాట్యమండలి' పేరుతో ఆ కళా బందం బహుళ ప్రాచుర్యం పొందింది. అయితే లాభాపేక్షతో కాదు, దేశంలో వున్న హద్రోగుల సంక్షేమం నిమిత్తం ఆ సంస్థ కార్యక్రమాలు విజయవంతంగా నడిచాయి.
- మీగడ వీరభద్రస్వామి, 7893434721