1948 సెప్టెంబర్ 17న తెలంగాణలో జరిగిన పోలీసు యాక్షన్ ''ఆఫరేషన్ పోలో'' చర్య పై వివిధ రకాల వ్యాఖ్యానలు చేస్తున్నారు. ఎవరికి తోచిన విశ్లేషన వారు చేస్తున్నారు. చరిత్రను వక్రీకరించడానికి కొన్ని రాజకీయ పార్టీలు సైతం ప్రయత్నాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 17న నైజాం తెలంగాణ భారత యూనియన్‌లో విలీనమైంది. విలీనానికి ముందు రైతులు 13 మాసాలుగా సాయుధ భూస్వాముల పైనా సాయుధ పోరాటం సాగించారు. అంతవరకు వెట్టిచాకిరీ కబంద హస్తాలలో నలిగిపోతున్న తెలంగాణ పేద రైతులు, భూస్వామ్య కౌగిలి నుండి విముక్తి పొందారు. ముస్లింలు, హిందువులు కలిసి సాగించిన ఈ సాయుధ పోరాటం ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. ఆ కీర్తిని కొన్ని రాజకీయ పార్టీలు తమ ఖాతాలో వేసుకోవడానికి దశాబ్దాల తరబడి ప్రయత్నాలు గావిస్తున్నారు. పోరాటా కాలంలో పుట్టని వారు కూడా పోరాట వారసత్వం కొరకు తపిస్తున్నారు. కొన్ని పార్టీలు విముక్తి పోరాటమని, మరి కొందరు విలీనమని, విద్రోహమని విశ్లేషి స్తున్నారు. అందుకే చరిత్ర వాస్తవాలు కొంత మేరకు మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ చరిత్రను అధ్య యనం చేసి దీనికి ఏ నినాదం ఇవ్వాలో మీరే నిర్ణయించాలి.
పూర్వ చరిత్ర :
తెలంగాణ సాయుధ పోరాటం నాటి ప్రజల ఆర్థిక సమస్యలనే కాకుండా విశాల ప్రజానీకం ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలను కూడా పరిష్కరించింది. వర్గపోరాటం ద్వారానే సమాజిక సమస్యలు పరిష్కారమవుతాయని ఈ పోరాటం గుర్తింపజేసింది. నేడున్న సమాజిక దోపిడీ అణచివేత తదితర సమస్యలను కూడా వర్గపోరాటంతో మిళితం చేసి పరిష్కారం సాధించాయి. వర్గ పోరాటం ప్రజలు ఎదుర్కొం టున్న ఆర్థిక, రాజకీయ, సామాజిక సమస్యలను పరిష్కరిస్తాయని గత చరిత్ర రుజువు చేసింది.
ఈ ప్రాంతంలో భూమి మూడు విధాలుగా ఉంది. 1) దివానీ లేక ఖాల్సా, 2) జాగీరు, 3) సర్ఫేఖాస్
1) దివానీ లేక ఖాల్సా : ఇది రైతువారీ పట్టా ఇచ్చిన ప్రాంతం మూడు కోట్ల ఎకరాలకు పైగా ఉంది.
2) జాగీరు : జాగీర్దార్లు, సంస్థానాధిపతుల ఆధీనంలో గల భూమి. ఇది 1.5 కోట్ల ఎకరాలు ఉంది. జాగీర్లలో పారుగాలు, అల్తమాజాగీర్లు, జాత్‌జాగీర్లు, తనఖా జాగీర్లు ఉండేవి.
3) సర్ఫేఖాస్ : నైజాం ప్రభుత్వ సొంత ఆస్థిగా ఉన్న ప్రాంతం. ఇది 55 లక్షల ఎకరాలు ఉంది. రైతువారీ పట్టా (దివాని) భూమిలో 40% ఉంది.
నాటి భూస్వామి ఐన విసునూరు దేశ్‌ముఖ్ రాంచంద్రా రెడ్డికి 45 వేల ఎకరాలు, సూర్యాపేట జమీందారుకు 25 వేల ఎకరాలు, కల్లూరు దేశ్‌ముఖ్‌కు లక్ష ఎకరాలు, జన్నారెడ్డి ప్రతాప రెడ్డికి 1.5 లక్షల ఎకరాలు, దేవరకొండ, మల్లాపురం, రంగారెడ్డి, చందం పెల్లి, మిరియాలగూడ చెరుకుపెల్లి నర్సింహారెడ్డి, హుజూర్ నగర్, బేతవూరు దొరలకు వేలాది ఎకరాల భూములు వారి అక్రమ స్వాధీనంలో ఉన్నాయి. వాస్తవంగా రైతులు సాగు చేసిన రైతులకు ఎలాంటి హక్కులు లేవు. ఈ భూస్వాములు భూమి శిస్తును బాగా పెంచారు. శిస్తులు చెల్లించలేక చాలా మంది తమ భూముల పట్టాలకు రాజీనామాలు పెట్టి పారిపోయారు. నైజాం సంస్థానంలో మొత్తం 1167 జాగీర్లున్నాయి. నిజాంకు యుద్ధంలో సహాయం చేయడానికి కొందరు సైన్యాన్ని తమ సొంత ఖర్చుతో పోషించేవారికి భూ ప్రాంతాలను కేటాయించారు. వీరిని 'పాయేగాండ్లు' అనేవారు. ఇవి ఎక్కువ ముస్లింలకే ఇవ్వబడ్డాయి.
మాషుదారులు :-
వీరిని దేశ్‌ముఖ్, దేశ్‌పాంజా అంటారు. వీరు పన్నులు వసూలు చేయాలి. అందులో వసూలు చేసిన దానిలో కొంత భాగాన్ని మాత్రమే ప్రభుత్వానికి చెల్లిస్తూ మిగతా భాగాన్ని వారే ఉంచుకుంటారు. మొదటి సాలార్‌జంగ్ కాలంలో ఈ పద్ధతి రద్దు చేయబడి శిస్తు వసూలు పద్ధతి ప్రవేశపెట్టబడింది.
పై భూములకు పన్ను ఉండదు. దీవాణీ ప్రాంతంలో మాత్రమే రైతుల నుండి పన్నులు వసూలు చేయాలి. జాగీరు ప్రాంతంలో జాగీరుదారుకు తోచిన విధంగా పన్నులు వసూలు చేస్తారు. ఈవిధంగా పన్నుల వసూళ్లు రైతుల పాలిట శాపంగా మారింది. నిజాం కాలానికి ముందు రైతు పండిన పంటలో కొంత భాగాన్ని చెల్లించేవారు. కానీ, తదనంతరం శిస్తును డబ్బు రూపంలో నిర్ణయించాక ఎకరాకు భూసారాన్ని బట్టి రూపాయి, రూపాయిన్నర, రెండు రూపాయలు శిస్తు నిర్ణయించారు. 1985లో ముఖ్యమంత్రి ఎన్టీరామారావు ''దేవుడిచ్చిన భూమికి శిస్తు ఏమిటి?'' అని రద్దు చేశారు. ఆయన రద్దు చేసే నాడు ఆ పన్నుకు అరకప్పు టీ కూడా రాలేదు. కానీ, నిజాం పన్ను నిర్ణయించినపుడు ఎకరం భూమిలో పండిన మొత్తం పంటను అమ్మినా శిస్తుకు డబ్బులు వచ్చేవి కావు. నాడు ఒక రూపాయికి బస్తా ధాన్యం ఇచ్చేవారు. పంటలు 1-3 బస్తాలు మాత్రమే పండేవి. కరువు పరిస్థితులు ఏర్పడితే పంట పండేది కాదు. శిస్తులు చెల్లించలేక చాలా మంది రైతులు భూములు వదిలివేసి సన్యాసులుగా, పకీర్లుగా మారి అడవుల్లోకి వెళ్లిపోయారు. వీరు సంఘటితపడి నైజాంతోనూ, ఆంగ్లేయులతోనూ 50 సంవత్సరాలు సాయుధ పోరాటాలు చేసిన చరిత్ర ఉంది.
కౌలు రైతుల పోరాటాలు :
నైజాం ప్రాంతంలో ఇజారా, బంజర్ల రూపంలో 1.40 లక్షల ఎకరాల భూమి సాగులోకి వచ్చింది. ఇది 420 గ్రామాల్లో 10 వేల మంది రైతులు సాగుచేసారు. సాగుచేసుకునే రైతులకు బదులు భూ స్వాములే వీటికి యజమానులు అయ్యారు. దానితో వారు పట్టాదారులు గాను, సాగుచేసే వారు కౌలుదారులయ్యారు. ప్రభుత్వానికి, ఇజారాదారుకు రాత పూర్వకమైన ఒప్పందం ఉండేది. ఇజారాదారు చెరువులు వేయడం, దానికి కింద మాగాణి సాగుచేయడం, అందుబాటు లో ఉన్న మేరకు మెట్ట పంటలు సాగు చేయడం, ఒక గ్రామాన్ని ఆబాదీగా నిర్మించడం చేయాలి. భూస్వాములు పట్టాదారులు కావడంతో, రైతులు కౌలుదారులయ్యారు. ఇరుపక్షాల మధ్య తగాదాలు వచ్చినప్పుడు భూములపై పట్టాలివ్వాలని రైతులు కోరారు. ఒప్పందం ప్రకారం గడువు పూర్తికాగానే సాగయిన భూమి అంతా రైతు వారి భూమిలో భాగమైపోతుంది. దానికి శిస్తు నిర్ణయిస్తారు. మునగాల, కర్లపల్లి, ఇజారా గ్రామాల్లో గల భూములను అడవుల్లో కలపడానికి చేసిన ప్రయత్నాన్ని రైతులు ఎదిరించారు. కౌలు, శిస్తు రూపాయి పావలా నుంచి, రూపాయికి రూపాయి వరకు ఉండేది. శిస్తుకు సరిపడా కౌలు నిర్ణయించబడేది. నల్లగొండ జిల్లాలోని తిరుమలగిరిలో ఇజారా దారుల (భూస్వాములు) మధ్య తగాదా కారణంగా కౌలు చేస్తున్న రైతులు ఇబ్బందులపాలయ్యారు. ఆ కాలంలో ఇజారా హక్కులేంటి? రైతు హక్కులేంటి అనేది ఒక ముఖ్యం సమస్యగా ముందుకొచ్చింది.
భూస్వామి కౌలుదారులతో చేసుకున్న రాత పూర్వకమైన ఒప్పందం ప్రకారం తనభూమిలో చెరువు వేయాలి. మాగాణి సాగుచేయాలి. అందుబాటులో ఉన్న మేరకు మెట్టసాగు చేయాలి. ఒక గ్రామాన్ని (ఆబాదు) కట్టిరచాలి. వీటన్నింటినీ కాల నిర్ణయం వరకు చేయాలి. చెరువు కింద 50-100 ఎకరాల వరకు తరి ఉండాలి. చిన్న చెరువుల కింద 5-30 ఎకరాల వరకు ఉండాలి. తరి భూమిని ఆనుకొని మెట్టభూమిని సాగు చేయాలి. గ్రామాన్ని ఏర్పాటు చేసి నివాస యోగ్యంగా తయారు చేయాలి. ఇలాంటి ఒప్పందం 20-30 సంవత్సరాలు ఉంటుంది. ఆ తరువాత భూముల రేటు ప్రకారం భూమికి శిస్తు నిర్ణయిస్తారు. ఆ గ్రామానికి మాలీపటేల్‌గిరి ఇస్తారు. అతను శిస్తు వసూలు చేస్తాడు. ఏ కారణం చేతనైనా ఇజార బంజర్లుదార్లు (భూస్వామి) నిర్ణీత గడువులో ఈ పనులు చేయనిచో సాగైన భూమంత రైతువారీ భూమిగా మారి పోతుంది. ప్రభుత్వం సర్వే సెటిల్‌మెంట్ చేసి రైతులకు పట్టాలు ఇవ్వాలి. నైజాంలోని బంబర్ ఇజారా నియమాలు తెలుసుకొని భూస్వాములు పనిచేయాలి. తుంగతుర్తి నర్సింహ్మరావుకు కర్లబెల్లి తాలూకాలో ఇజారా గ్రామంలో 3-4 వేల ఎకరాలు తీసి అడవి భూమిలో కలుపుకోవాలని వాదన జరిగింది. దానిలో రెవెన్యూ సెటిల్‌మెంట్ కాగితాలు ఉన్నందున అడవిలో కలపడం ఆగిపోయింది. నాడు నిజాం ఫర్మాణాలు పొందడం కష్టంతో కడుకున్న పని. గ్రామాల నుంచి హైదరాబాద్‌కు ప్రయాణం చేసి గ్రామం ఫర్మాన (రాజు గారి నుండి హక్కు పత్రం) అయ్యిందాక నిరీక్షించి గ్రామం చేరుకుని పని ప్రారంభించాలి. అందువల్ల ఫారెస్ట్ గ్రామాల్లో ఉజారా భూమిని పారెస్ట్ వారు కాపాడడానికి నిరంతరం ప్రయత్నాలు చేసేవారు.
తిరుమలగిరి, బొమ్మెర సమీపంన గల గ్రామం. ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు. వారిద్దరి మద్య ఇజారాహక్కు కొరకు తగాదా వచ్చింది. కేసులు పెట్టుకున్నారు. రైతులు శిస్తులు చెల్లించారు. కానీ, బంజరు పన్ను సర్కారీలో భాకీ ఉండుటచే పెద్దవాడు జనగామా తహసీల్ ఆఫీసులో దరఖాస్తు పెట్టి రైతుల పశువులన్నింటినీ జప్తు చేయించాడు. రైతులు నగదు, నాణెములను అమ్మి సర్కారి శిస్తు చెల్లించి పశువులను విడిపించుకున్నారు. ఈ విధంగా కౌలు రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. పూర్వం కౌలు రేటు శిస్తు రూపాయికి, రూపాయి పావలా ఉండేది. ఉదాహరణకు ఒక భూమిపై పది రూపాయలు శిస్తు ఉంటే పన్నెండున్నర రూపాయలు శిస్తు చెల్లించాలి. ఆవిధంగా శిస్తు చెల్లించలేని వారు పండిన పంటలో ఖర్చులు పోనూ సగం చెల్లించాలి.
1908 రెవెన్యూ చట్టాన్ని అనుసరించి 12 సంవత్సరాలు వరుసగా రైతు కబ్జా ఉంటే అతనికి భూమి హక్కు ఉంటుంది. ఇజారాదారుడే పటేల్-పట్వారీల పలుకుబడి కావడంతో రైతులు సాగుచేస్తున్నట్లు రికార్డులు లేవు. దానితో వారికి లీగల్ హక్కులేదు. కొన్ని సందర్భాల్లో కౌలుశిస్తు ధాన్యరూపంలో ఉండేది. ఖర్చులు పోను సగభాగం చెల్లించారు. తరువాత వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరగడంతో కౌలు నగదు కౌలుగా మారింది. ఈ సమస్యపై డెల్టా ప్రాంతాలకు, తెలంగాణాకు ఆ కాలంలో పోలిక లేదు.
వెట్టిచాకిరీ :
గ్రామంలోని దళితులు, వెనకబడిన తరగతులకు చెందిన వారే గాక చేతివృత్తుల వారందరూ భూస్వామి భూమిలో ఉచితంగా లేదా నామమాత్రపు కూలీపై పనిచేయాలి. భూస్వాముల భూముల్లో పంటలు వేశాకనే తమ భూముల్లో పంటలు వేసుకోవాలి. భూస్వాముల ఇళ్ళల్లో ఎలాంటి కార్యాలు జరిగినా గ్రామస్తులంతా వారికి చాకిరి చేయాలి. ఈ పనికి ఎలాంటి కూలీ ఇవ్వరు. చివరికి వారి కూతుళ్ళ వివాహాలు జరిగితే ఆమెతో పాటు గ్రామంలోని ఒకరు లేక ఇద్దరు పెండ్లికాని యువతులను దాసీలుగా పంపాలి. గీత కార్మికులు పటేల్, పట్వారీలకు ఉచితంగా మంచికల్లు పారే తాటిచెట్లు 15 వరకు ఇవ్వాలి. ఉచితంగానే కల్లుగీసి పొయ్యాలి. గొర్రెల మందల నుండి ప్రతి పండుగకు పటేల్, పట్వారీల ఇండ్లలో ఏ కార్యక్రమం జరిగినా గొర్రెలు, మేకలు ఇవ్వాలి.
చాకలి, మంగళి, కుమ్మరి, మాదిగలు గ్రామం కాపలాతో పాటు సావడిలో ఈ కులాలు వంతులవారీగా కాపలా ఉండాలి. గ్రామానికి ఎవరైనా అధికారి వస్తే అతని సామాన్లు మోసుకు రావాలి. స్నానానికి వేడినీళ్లు పెట్టి వెన్ను తోమాలి. వారు కోరిన పండ్లూ, కూరగాయలు, కోళ్లు, గుడ్లు తేవాలి. చాకలి నీళ్లు పెట్టాలి. మంగళి మద్యం తేవాలి. కుమ్మరి వంట చేయాలి. వీరితో పాటు సేత్‌సిందీలు కూడా కాపలాగా రాత్రిళ్లు సావడిలోనే పడుకోవాలి. వీరికి గానీ, వీరు తెచ్చిన సరుకులకు గానీ డబ్బులు ఇవ్వరు. గ్రామ పటేల్ పట్వారీని కూడా డబ్బు ఇవ్వకుండానే ప్రజల దగ్గరి నుండి బలవంతంగా తెస్తారు. దుకాణదారుల దగ్గర సామానులు బెదిరించి తెస్తారు. పోలీసు నుండి సబ్ ఇన్‌స్పెక్టర్ వరకు చెప్రాసీ నుండి తహసీల్దారు వరకు, ఫారెస్టు వారు, ఇతర రెవెన్యూ ఉద్యోగులు ఏ శాఖ వారు వచ్చినా ఈ తతంగం జరుగుతుంది. రాత్రిళ్లు అమ్మాయిలను కూడా తీసుకురావాలి. గ్రామంలో పటేల్, పట్వారీల ఇండ్లల్లో పనివారలందరూ డబ్బులు తీసుకోకుండా పనిచేయాలి. పెండ్లిళ్లు, పండగలకు పూర్తి పనులు వాళ్లే చేయాలి. డబ్బులు ఇవ్వకుండా చేయించుకునే ఈ పనినే 'వెట్టిచాకిరీ' అంటారు. ఈ వృత్తిదారులకు ఈనాం భూములు ఉంటాయి. అవి పంటలు పండేవి కావు. వాటికి శిస్తు ఉండదు. ఈ కాలంలో మహిళలకు కూడా రక్షణ లేదు. అఘాయిత్యాలు సర్వసాధారణం. విద్యా, వైద్య సౌకర్యాలు లేని రోజులు ఒంటినిండా బట్టలుండరాదు. భూ స్వాములు ఎదురు పడితే చెప్పులు తీయాలి. రుమాలు, పై కండువా, అంగీ తీసివేయాలి. తలవంచుకొని వెళ్లాలి. లేదా కనబడకుండా పక్కకు తప్పుకోవాలి. అతను వెళ్లాక వెళ్లాలి. మంగళి క్షవరం చేస్తే బట్టలు తీసి గొంగళి చుట్టుకోవాలి. గొంగళికి అంటరానితనం లేదు. అందరూ భూస్వాముల ముందు కిందనే కూర్చోవాలి. వారు వెళ్లే వరకూ ఉండాలి. అన్నం పెట్టినపుడు తినాలి. తిన్న తర్వాత ఆ ప్రాంతాన్ని పేడతో అలకాలి. భూస్వాములు అంటరానితనం పాటిస్తారు. దళితులే కాక మంగళి, చాకలి, ముదిరాజు లాంటివారు కూడా ఇంటి బయటనే ఉండాలి.
పండ్లు, చేపలు, నెయ్యి, తేనె, కోళ్లు వారు కోరినప్పుడు ఉచితంగా ఇవ్వాలి. నిరాకరిస్తే గ్రామ సేత్‌సింధీలు వచ్చి బలవంతంగా పట్టుకెళ్తారు. పన్నులు విపరీతంగా వేసేవారు. నాగటికి రూ.10, ఇంటిపన్ను, పశువులు ఒకచోట మంద పెట్టినందుకు పన్ను రూ.1.50లు, నెగడి వేసుకున్నందుకు (అడవిలో మంట) 50పైసలు, ఎడ్లను ప్రభుత్వ పచ్చిక బయళ్ళలో మేపినందుకు ఎద్దుకు 75పైసలు నిర్భందగా వసూళ్ళు సాగాయి. గ్రామాలలో వడ్డీ దోపిడి విపరీతంగా ఉంది. రూ.100 అప్పిస్తే వడ్డీ కింద ఒక పంటకాలంలో మరో రూ.100 అదనంగా వసూలు చేశారు. వడ్డీల కింద ఆస్థులు పోగొట్టుకున్నవారు అనేక మంది గ్రామాలు విడిచి వెళ్ళి పోయారు. గ్రామంలోని ప్రజలకు, చివరికి వారి పిల్లలపై కూడా ఎలాంటి హక్కులు లేవు. ఎవరైనా పనిచేయడానికి వ్యతిరేకిస్తే వారిని క్రూర చిత్రహింసలకు గురి చేయడమేగాక చివరికి ప్రాణాలు తీసేవారు. ఐనా వారిపై ఎలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకునేది కాదు. వెట్టిచాకిరీతో ప్రజలలో తీవ్ర అసంతృప్తి, కోపాగ్ని రగిలింది. వెట్టి నుండి బయట పడడానికి గ్రామాల నుండి కుటుంబాలతో సహా పారిపోయిన ఘటనలున్నాయి. జమీందార్లకు సొంత సైన్యాలున్నాయి (గూండాలు). వీరికి తోడు ఔరంగాబాద్ నుండి వచ్చిన కాశీంరజ్వీ నాయకత్వాన రజాకార్ల దళం(వాలంటీర్ల దళం) కూడా భూస్వాములకు అనుకూలంగా ప్రజలపై క్రూర నిర్బంధం సాగించింది. ఇవి రెండూ గూండా గుంపులకు తోడు నైజాం పోలీసులు కూడా వారికే వత్తాసుగా ఉన్నారు. భూస్వాముల అరాచకాలకు ఎదురు చెప్పే ధైర్యం ఎక్కడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తమ సమస్యలపై ప్రజలు, రైతులు ఐక్యంగా పెద్దపెద్ద ఉద్యమాలు చేశారు.
దేశ్‌ముఖ్‌ల దౌర్జన్యాలు, వెట్టిచాకిరీ, ''నీ బాంచన్ కాల్మోక్త దొర'' అంటూ పేదలు బతుకుతున్న రోజులు. ప్రతి రైతు నైజాం ప్రభుత్వానికి పండిన పంటలో ''లెవీగల్లా''గా సగభాగం నిర్భంధంగా ఇవ్వాల్సి వచ్చేది. లెవీగా తీసుకున్న ధాన్యానికి తక్కువ ధర చెల్లించేవారు. ఆ ధర కూడా ధాన్యం కొనుగోలు చేయగానే ఇవ్వకుండా నెలల తరబడి తహసీల్ చుట్టూ తిరగవలసి వచ్చేది. భూస్వాములు కరువు రోజుల్లో పేదలకు తిండి కొరకు ధాన్యాన్ని అప్పుగా ఇచ్చేవారు. ఈ అప్పుగా ఇచ్చిన ధాన్యానికి వడ్డీగా ఇచ్చిన దాంట్లో సగం చెల్లించాలి. దీనిని ''దేడ్‌నాగు'' అంటారు. నాగులకు ధాన్యం తెచ్చుకున్నవారు చెల్లించని తీరుకు వారి భూములను భూస్వాములు కాజేసే వారు. అనేక మంది తమకున్న కొద్దిపాటి భూములను, ఆస్తులను నాగుల కింద భూస్వాముల పరం చేశారు. 1917లో రష్యాలో కమ్యూనిస్టు విప్లవం జయప్రదమైంది. ఈ విప్లవం భూమిని జాతీయం ద్వారా భూ సమస్యను పరిష్కరించింది. దేశంలోని పేదలందరికి భూమిపై స్వాదీనపు హక్కులు ఏర్పాడ్డాయి. అందరికీ భూములు ఇవ్వడంతో పాటు సహాకార సంఘాల ద్వారా వ్యవసాయ క్షేత్రాలు ఏర్పాటు చేశారు. భూస్వామ్య దోపిడి నశించింది. ప్రజలలో చైతన్యం పెరిగింది. ఈ చైతన్యం భారతదేశంలో వ్యాపించకుండా నైజాం నవాబు, నాటి అంగ్లేయా ప్రభుత్వం తీవ్ర ప్రయత్నం చేసింది అయినప్పటికీ కమ్యూనిస్టు పార్టీని మొదట ముస్లింలు ఏర్పాటు చేశారు. నిజాం ప్రభుత్వం ఆ పార్టీపై నిషేధం విధించింది. అయినప్పటికీ సంఘం పేరుతో ప్రజలలోకి విస్తృతంగా వెళ్ళింది. తెలంగాణా సాయుధ పోరాటానికి రష్యా విప్లవం వెన్నుదన్నుగా పనిచేసింది.
1936 ఏప్రిల్‌లో అఖిలభారత కిసాన్‌సభ ఏర్పడింది. భూస్వామ్య విధానం రద్దు కావాలనే ప్రధాన నినాదంతో పాటు ఆంగ్లేయులు భారత దేశం నుండి వెళ్ళిపోవాలన్న లక్ష్యాన్ని ప్రకటించారు. మాడపాటి హనుమంతరావు, బూర్గుల రామకృష్ణారావు, కొండా వెంకటరంగారెడ్డిల ఆధ్వర్యంలో 1922 ఫిబ్రవరి 14 ఆంధ్రజన సంఘం ఏర్పడింది. 1930 నాటికి ఇదొక రాజకీయ శక్తిగా రూపొందింది. అప్పటికే ఆంధ్ర ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ ప్రభావంతో, హైదరాబాద్‌లో ముగ్దుం మోహియోద్దీన్ నాయకత్వాన ''కామ్రేడ్స్ అసోషియేషన్'' 13.12.1939న ఏర్పడింది. ఇందులో సయ్యద్ అలంకుంద్‌మీరి, రాజ్‌బహుదూర్‌గౌర్, ముర్తుజాహైదర్, సయ్యద్ ఇబ్రహీంలతో కలిసి ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఏర్పాటుకు బూర్గుల రామకృష్ణారావు అభినందనలు తెలిపారు. ముగ్దుం మోహియోద్దీన్ రైల్వే కార్మికులలో పని చేశారు.
అప్పటికే తెలుగు భాష ప్రచారం పేరుతో గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు. వాటికి ఎన్నికలు, మహాసభలు, జరిపారు. గ్రంథాలయ ఉద్యమం బాగా బలపడింది. భాష పేర జరిగే ఈ మహాసభలలో నిజాం ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తీర్మాణాలు చేశారు. ఆ సందర్భంగానే ఏర్పడిన ఆంధ్ర మహాసభలో సంఘ సభ్యులు పెద్ద ఎత్తున చేరారు. నైజాం ఈ సంస్థపై నిషేదం ప్రకటించడంతో అనేక మంది అభ్యుదయ వాదులు ఆంధ్ర జనసంఘంలో చేరారు. అతివాదుల ప్రభావం పెరగడంతో వ్యవస్థాపకులు సంఘం విడిచి వెళ్ళారు. ఆ తర్వాత సంఘం పేరుతో రైతాంగ సమస్యలు తీసుకొని ఉద్యమాలు జరిగాయి. ఆ విధంగా కమ్యూనిస్టు పార్టీ నైజాం ప్రాంతంలో ''సంఘం'' పేరుతో కార్యకలాపాలు కొనసాగింది. ఆ తరువాత ఏర్పడిన కమ్యూనిస్టు పార్టీలో దేవులపల్లి వెంకటేశ్వరావు, సర్వదేవబట్ల, రామనాథం, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల లక్ష్మీనరసింహ్మారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, చంద్రగుప్త చౌదరి, హబిబోద్ధిన్, రంగసాని గోపాల్‌రెడ్డి, విడి దేశ్‌పాండే (హౌరంగబాద్)తో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది.
1944లో ఆంధ్రమహాసభ భువనగిరిలో జరిగింది. కడవెండి గ్రామం నుండి నల్లా నర్సింహ్ములు, దొడ్డి మల్లయ్య, ఎర్రంరెడ్డి మోహన్‌రెడ్డి, పిట్టల నర్సయ్యలు సంఘంలో చేరారు. 1944 అక్టోబర్ 3 గ్రామంలో దావూత్ రెడ్డి ఇంట్లో సమావేశ మయ్యారు. దీనికి నాయకులు ఆరుట్ల రాంచెంద్రారెడ్డి వచ్చారు. కమిటీ అద్యక్షుడుగా దావూద్‌రడ్డి, కార్యదర్శిగా నల్లా నర్సింహులు, సభ్యులుగా యర్రంరెడ్డి మోహన్‌రెడ్డి, దొడ్డి మల్లయ్య, మాచర్ల కొండయ్య, మచ్చ రామయ్యలు తలా అణా (ఆరుపైసలు) చెల్లించి సంఘం సభ్యులుగా చేరారు. అప్పటికే వారం వారం ప్రజాశక్తి వారపత్రిక వస్తున్నది. విస్నూరు దొర ఉద్యమాన్ని అణచివేయాలని నాయకుల్ని అరెస్టు చేయించాడు. సీతారాంపురంలో ఆయన తల్లి జానమ్మ వద్ద ఉన్న 80 పుట్ల వడ్లను జప్తు చేశారు. దీనితో అసహనానికి గురైన తల్లీ, కొడుకులు ఉద్యమాన్ని దెబ్బతీయాలని కక్షపెంచుకున్నారు. ఈ సంధర్బంగానే చాకలి ఐలమ్మ ఆస్థిని కాజేయడానికి పధకం వేశారు.
వర్గపోరాటం ప్రారంభ దశ :
విసునూరు రాంచంద్రారెడ్డి దేశ్‌ముఖ్ తల్లి జానమ్మ సీతారాంపురం గ్రామంలో ఉంది. ఈమె ఆకృత్యాలు వర్ణించ నలవికానివి. పసిపిల్లల తల్లులు పొలాల్లోకి కూలీకి వెళితే వారిని మధ్యాహ్నం పాలివ్వడం కొరకు ఇంటికి వెళ్ళాలంటే ఆ తల్లి చనుబాలు పితికి చూపాల్సి వచ్చేది. ఉదయం నుండి సాయంత్రం వరకు పని చేసినా కూలీ రోజుకు 4పైసలు మాత్రమే ఇచ్చేవారు.
నేటి వరంగల్ జిల్లాలోని విసునూరు గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో గల పాలకుర్తిలో చిట్టేటి (చాకలి) ఐలమ్మ తన కుటుంబంతో నివసిస్తూ ఉంది. ఆమె పొలాన్ని కాజేయడానికి విసునూరు దేశ్‌ముఖ్ రాం చంద్రారెడ్డి గూండాలు ప్రయత్నించారు. ఇది గమనించి భీంరెడ్డి నర్సింహారెడ్డి, చకిలం యాదగిరి, సల్లా ప్రతాపరెడ్డి, కె.రాంచంద్రారెడ్డి, గంగుల సాయిరెడ్డి, మనోహర్‌రావుల నాయకత్వాన 30మంది వాలంటీర్లు పొలాన్ని కోసి ఐలమ్మ ఇంటికి చేర్చారు. దీనిని అవమానంగా భావించిన దేశ్‌ముఖ్ ధాన్యాన్ని తీసుకు రావడానికి తన గూండాలను పంపాడు. వారిని కమ్యూని స్టులు తిప్పికొట్టారు. భూస్వామ్య చరిత్రలోనే ఇది వీరోచితంగా జరిగిన తిరుగుబాటు. ఈ వార్త చుట్టుపక్కల గ్రామాలకు తెలిసి పెద్దఎత్తున ప్రజలు దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా ఊరేగింపులు చేశారు. విసునూరుకు దగ్గరలోనే ఉన్న సీతారాంపురం, కడివెండి గ్రామాల నుండి 200 మంది ఊరేగింపుగా బయలుదేరారు. 1946 జూలై 4న జరిగిన ఊరేగింపుపై తుపాకులతో కాల్పులు జరిపి దొడ్డికొమురయ్యను చంపారు. అతని అన్న దొడ్డి మల్లయ్య ఆ ప్రాంతానికి నాయకుడు. అతనికి మోకాలిపైన తుపాకి గాయమైంది. ఈ కాల్పులతో ఆగ్రహించిన ప్రజలు గడిపై దాడిచేసి నిప్పుపెట్టారు. దేశ్‌ముఖ్ రాంచంద్రా రెడ్డి కొడుకు బాపురెడ్డి హైదరాబాదు పారిపోతుండగా జనగామ రైల్వేస్టేషన్‌లో చంపివేశారు. ప్రజల ప్రతిఘటన 300-400 గ్రామాలకు వ్యాపించింది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలలో ప్రదర్శనలు జరిగాయి. కమ్యూనిస్టు పార్టీ పత్రిక విస్తృత ప్రచారం చేసింది. పోలీసులు 156 కేసులు నమోదు చేశారు. జనగామ, సూర్యాపేట, దేవరుప్పల, హుజూర్‌నగర్ లలో మిలట్రీ దాడులు కొనసాగాయి. జిల్లాను మిలట్రీ పరం చేశారు. వారాలు, నెలల తరబడి ఈ దాడులు సాగాయి. రాజాకార్లు, పోలీసులు ఇండ్లు లూటీలు చేశారు. వీరి దౌర్జన్యాలను తిప్పి కొట్టడానికి రైతులు, ప్రజలు తీవ్రంగా ప్రతిఘటించారు. 11.09.1946వ తేదీన సాయుధ పోరాటానికి పిలుపు ఇవ్వబడింది. వర్గపోరాటం ప్రారంభమైంది. అన్ని కులాల వారు, మతాల వారు సంఘం నాయకత్వాన ఏకమై పోరాడారు. తమ మధ్యనున్న కుల వివక్షతలు, మత వివక్షతలు పక్కనబెట్టారు. పోరాటంలో అంటరానితనం మహిళలు, పురుషులూ అన్న బేధభావం లేదు. అన్ని వర్గాల నుంచీ బాలురూ, బాలికలు పాల్గొన్నారు. దానితో గెరిల్లా దళాలు ఏర్పడ్డాయి. సంఘం నాయకత్వాన గ్రామాలలో కమిటీలు, శాఖలు ఏర్పడ్డాయి. ఎక్కడికక్కడ తిరుగుబాట్లు ప్రారంభమయినాయి. దీంతో దేశ్‌ముఖ్‌లు, భూస్వాములు పట్టణాలకు పారిపోయినారు. కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లా పోరాటానికి కీలక కేంద్రంగా తయారైంది. కరీంనగర్‌లోని భూస్వాములంతా ప్రాణ భయంతో హైదరాబాదు బాట పట్టారు. భూస్వాముల భూములను పేదలు ఆక్రమించారు.
క్రమంగా ఈ సాయుధ పోరాటం నల్లగొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలకు వ్యాపించింది. రజాకార్లు, నిజాం సైన్యం ఉద్యమాన్ని అణచ డానికి పెద్దఎత్తున దాడులు సాగించింది. గెరిల్లా పోరాటాలు ప్రారంభ మయినాయి. ప్రజలు గెరిల్లా దళాల్లో సభ్యులుగా చేరారు. గెరిల్లాపోరాట ఎత్తుగడలు పోరాటం చేస్తూనే నేర్చుకున్నారు. ఉద్యమాన్ని అణచడానికి అనేక గ్రామాల్లో క్యాంపులు పెట్టారు.
1947లో దేశానికి స్వాతంత్రం వచ్చాక హైదరాబాద్ నిజాంగా మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలన సాగుతున్నది. ఇక్కడ తెలంగాణ సాయుధపోరాటం ఉచ్చ దశలో ఉంది. జమీందార్లంతా హైదరాబాద్ బాట పట్టారు. పేదలు వారి భూములను ఆక్రమించుకున్నారు. ఆ విధంగా గ్రామ రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నారు. 10లక్షల ఎకరాల భూమిపై ఖబ్జా పెట్టారు. 3వేల గ్రామాలలో గ్రామరాజ్యాలు ఏర్పడ్డాయి. దాదాపుగా 15వేల మంది సాయుధ పోరాట నాయకులను నైజాంసైన్యం, రజాకార్లు, భూస్వాముల గూండాలు కలిసి హత్య చేశారు. అయినప్పటికీ ఉద్యమం కొనసాగుతూనే ఉంది. సాయుధ పోరాటాన్ని అనచటం నైజాంకు సాధ్యం కాదని భావించిన నాటి కేంద్ర నెహ్రూ ప్రభుత్వం ఆపరేషన్‌పోలో పేరుతో సౌన్యాన్ని దించే ప్రయత్నం చేసింది. రజాకార్లు ఖాసీం రజ్వీ నాయకత్వాన చేయని హింసాఖాండ లేదు. నిజాం ఐక్యరాజ్య సమితి కలుగచేసుకోవాలంటూ కోరారు. ఆవిధంగా ఉద్యమాన్ని అణచాలని చూశారు.
ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ ఆర్థిక, భౌతిక సహయం పెద్ద ఎత్తున చేసింది. 1934లో పుచ్చలపల్లి సుందరయ్య, మద్దురి చంద్రశేఖర్‌రావు, చండ్ర రాజేశ్వరరావు నాయకత్వన ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ స్థాపించారు. తెలంగాణ సాయుధ పోరాటానికి వ్యక్తులుగా కొంత మంది నాయకులు పత్యేక్షంగా పాల్గొని ప్రాణాలర్పించారు. సుందరయ్యగారు ప్రత్యక్షంగా పోరాట ప్రాంతం రెండు సార్లు తిరిగి ఉద్యమకారులకు సూచనలిచ్చారు. బాంబేలో ఉన్న కేంద్ర కమిటీతో సంప్రదిం పులు జరిపి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ ఉద్యమానికి జీవం పోశారు. ఒక విధంగా ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చిన సహాయం తెలంగాణ ఉద్యమ విజయ సాధనకు తోడ్పడింది.
కేంద్రం సైన్యాల రాక : భారతదేశంలో నైజాం విలీనం
1948 సెప్టెంబర్ 13న సికింద్రాబాద్-షోలాపూర్ మార్గంలోని నల్లదుర్గం కోటను లక్ష్యంగా పెట్టుకొని భారత బలగాలు వచ్చాయి. తెల్లవారు జామున హవల్దార్ బచ్చీందర్ సింగ్ రెండు వాహనాల్లో రావటం చూశారు. అక్కడ కొంత కాల్పులు జరిగాయి. తెల్లవారేసరికి తుల్జాపూర్ కోట స్వాధీన మైంది. విజయవాడ నుండి బయల్దేరిన సైన్యం కర్నల్ అమ్రిక్ సింగ్ నాయకత్వాన కోదాడను పట్టుకున్నాయి. సెప్టెంబర్ 14 నుండి 16 వరకు సైన్యాలు పెద్దఎత్తున నైజాంలో ప్రవేశించడంతో సెప్టెంబర్ 17 తెల్లవారు జామున బీదర్‌కు చేరాయి. సెప్టెంబర్ 18 సాయంత్రం 4గం.లకు జనరల్ జే.యన్.చౌదరి నాయకత్వాన సికింద్రాబాద్‌లో అడుగు పెట్టాయి. హైదరాబాద్ సైన్యాదిపతి మేజర్ జనరల్ ఎల్.ఎడ్రూస్ లొంగిపోయాడు. చౌదరి మిలటరీ గవర్నర్‌గా పదవి స్వీకరించాడు. 19న ఖాసీం రజ్వీ అరెస్ట్ అయ్యాడు. నవంబర్ 24న జనరల్ చౌదరి హైదరాబాద్ సంస్థాన అధికార భాధ్యలను సివిలియన్ గవర్నర్‌కు అందజేశాడు. ఈ పోరులో భారత సైన్యం తరుపున 66 మంది మరణించగా, 97 మంది గాయపడ్డారు. హైదరాబాద్ సైన్యంలో 490 మంది మరణించారు, 122 మంది గాయపడ్డారు.
భారత ప్రభుత్వం నైజాం రాజు సేవలో :
సెప్టెంబర్ 17న నైజాం ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేసిన తరువాత ఇక్కడి నుండి సైన్యాలను ఉపసంహరించాలి. కానీ సైన్యాలు వచ్చిన లక్ష్యం కమ్యూనిస్టులను అణిచివేయడం కొరకు మాత్రమే. నైజాం తన సైన్యాలతోనూ, జమీందార్ల గుండ గ్రూపుల తోనూ, ఖాసీం రజ్వీ నేతృత్వాన ఏర్పడిన 30 వేల మంది రజాకార్లతోనూ కమ్యూనిస్టులను అణిచివేయడానకి సాధ్యం కాకపోవడాన్ని గుర్తించిన కేంద్రం, కమ్యూనిస్టులు ఎదగకుండా అణిచి వేయడానికి సైన్యాన్ని ఇక్కడే ఉంచారు. భారతదేశంలో విలీనమైన 17వ తేదీన భారత ప్రభుత్వం ''నైజాంను రాజ్ ప్రముఖ్''గా నిర్ణయించారు. (ఇతను 1951 ఎన్నికల వరకు కొనసాగాడు. 1949 డిసెంబర్ 1న వెల్లోడిని ముఖ్యమంత్రిగా నియమించారు. 1953 ఎన్నికల అనంతరం బూర్గుల రామకృష్ణారావు మొదటి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాడు.) యూనియన్ సైన్యాలు వచ్చి నైజాంను భారత దేశంలో విలీనం చేసిన తరువాత పార్టీ ఒక చర్చ సాగింది. భారత ప్రభుత్వం జమీందారుల భూములు పంపిణీ చేస్తుందని పోరాటం విరమించడం గురించి ఆలోచించాలన్న ప్రతిపాదన వచ్చింది. పోరాటంలో సాధించిన భూములపై హక్కులు ఏర్పడే వరకు పోరాటం కొనసాగించలని మేజార్టీ వర్గం అభిప్రాయ పడింది. రెండు అభిప్రాయాలున్న కలిసి పోరాటం సాగించారు.
యునియన్ సైనికులు కమ్యూనిస్టుల జాడ చెప్పమని 2000పైగా గ్రామాల్లో 3 లక్షల మందిని చిత్రహింసలకు గురి చేశారు. సుమారు 50 వేల మందిని అరెస్టు చేశారు. 5వేల మందికి పైగా సంవత్సరాల తరబడి జైళ్ళలో నిర్బంధించ బడ్డారు. మహిళలపై అత్యాచారాలు, మానభంగాలు రజాకార్లు, నైజం సైనికులు కలిసి కొనసాగించారు. గర్భిణీ స్త్రీలను, బాలికలను ప్రసవించిన వారిని కూడా వదలలేదు. అనేక మంది స్త్రీలను వివస్త్రలను గావించారు. జనగామ తాలూకా బైరాన్ పల్లిలో వరుసగా నిలబెట్టి 80 మంది రైతులను కాల్చి చంపారు. పరకాలలో 100కుపైగా మందిని కాల్చి చంపారు. ఇంత నిర్బంధం సాగించినా ప్రజలు తమంతట తామే నాయకత్వం వహించి భూస్వాములకు చెందిన 10 లక్షల ఎకరాలను ఆక్రమించి సాగుచేసుకున్నారు. 3వేల గ్రామాలలో గ్రామ రాజ్యాలు ఏర్పాటు చేశారు. ప్రజాపాలన అమలులోకి తెచ్చుకున్నారు. 1500 మంది నాయకులను నైజాం ప్రభుత్వం కాల్చివేయగా, 2500 మంది నాయకులను భారత సైన్యాలు కాల్చివేశాయి.
కాన్స్‌ట్రేషన్ క్యాంపులు (చిత్రవద కేంద్రాలు) :
నైజాం సైన్యాలు, రజాకార్లు, భూస్వామ్య గూండాలు, భారత సైన్యాలు కలిసి చేసిన ఆకృత్యాలు అంతా ఇంతా కాదు. ప్రతి నాలుగైదు మైళ్లకు ఒకటి చొప్పున మిలటరీ క్యాంపులు ఏర్పాటు చేశారు. రోజుకు 23 సార్లు సైనికులు దరిదాపుల గ్రామాలపై దాడులు చేసి ప్రజలందర్ని ఒకచోట మంద వేసి పాచవికంగా కొట్టారు. కమ్యూనిస్టులను వెతకడం కోసం అడవులు, తోపులు, చెరువులలో వెతికారు. కాళ్లకు తాళ్లు కట్టి తల కిందికి వేలాడదీసి గిలకలపై పైకీ కిందికి లాగారు. మనుషులను గోనె సంచులలో పెట్టి సైనికులు నూతిలో అటు నుండి ఇటు, ఇటునుండి అటు లాగారు. మహిళలపై హత్యాచారాలు, మానభంగాలు పెద్దఎత్తున జరిపారు. సూర్యాపేటలో మూడు రోజుల క్రితం ప్రసవించిన మహిళను చెరిచారు. భువనగిరిలో 10 సంవత్సరాల బాలికను సైతం వదిలి పెట్టలేదు. స్త్రీలను వివిస్త్రులగావించి, తొడలకు తొండలను కట్టి గాయాలకు కారం రాసారు. ఇంత జరిగినా పోరాటాలు ఏమాత్రం వెనుక్కు తగ్గలేదు. భూ సమస్య అత్యంత కీలక సమస్యగా తీసుకున్నారు. గ్రామాలలో నిర్బంధ శిబిరాలు ఏర్పాటు చేసిన, గ్రామ దహనాలు కొనసాగిన శత్రువులను మభ్యపెట్టడంలోనే ఉద్యమాలు కొనసాగాయి. సైన్యానికి ప్రజలను కాల్చి చంపడం అనేది సరదాగా మారింది. ప్రైవేట్ వడ్డీ, వెట్టి చాకిరీ, అడవి భూములపై పన్నులు తదితర నిర్బంధ వసూళ్ళు జరిగాయి.
1949 అక్టోబర్ చివరి నాటికి 50 మందికి కమ్యూనిస్టు యోధులకు ట్రిబ్యునల్ ఉరిశిక్ష విధించింది. వీరందరూ తమ తరుపున న్యాయవాదులను పెట్టుకోలేదు. మీ ఇష్టం వచ్చిన శిక్షలు వేసుకోండని న్యాయస్థానంలో చెప్పారు. ఆ తరువాత వీరిని జట్లు జట్లుగా నల్లగొండ, హైదరాబాద్ జైళ్లకు పంపించ బడ్డారు. డిల్లీ వెంకులు (14), యర్రబోతు రాంరెడ్డి (15), పన్నాల రాంరెడ్డి (20), నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి (20) నల్లా నర్సింహులు (22) లు ఉరిశిక్ష పడిన వారిలో ఉన్నారు. దీనిపై ''టైం పత్రికలో'' వ్యాసం వచ్చింది. ప్రపంచ వ్యాపితంగా ఆందోళన సాగింది. హైకోర్టుకు అప్పీలు చేసుకునే అవకాశం కల్పించకుండానే వారిని ఉరి తీయాలని సైనిక ప్రభుత్వం పథకం పన్నింది. ఉరిశిక్షల రద్దును డిమాండ్ చేస్తూ జకోస్లోవేకియా రాజధాని ప్రేగ్ నగరంలో 10వేల మందితో పెద్ద ప్రదర్శన జరిగింది. రాంరెడ్డి ఫోటోను పెద్దగా చిత్రించి ముందు జీపుపై పెట్టి ఊరేగించారు. తరువాత హైకోర్టుకు అప్పీలు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. హైకోర్టులో ఉరిశిక్ష కొట్టివేయబడింది.
1951 ఎన్నికలు నిర్వహించే వరకు నైజాంనే హైదరాబాద్ సంస్థానానికి రాజ్‌ప్రముఖ్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. 1948 సెప్టెంబరు నుండి కమ్యూనిస్టులను అణిచివేసే బాధ్యతను కేంద్ర బలగాలు తీసుకున్నాయి. 1946 జూలై నుండి 1948 సెప్టెంబరు వరకు 1500 మంది కార్యకర్తలు, నాయకులు నైజాం సైనికుల, రజాకార్ల కాల్పులకు ఘాతుకాలకు బలయ్యారు. 1948 సెప్టెంబర్ తర్వాత వచ్చిన కేంద్ర సైన్యాలు భూ సమస్యను పరిష్కరించకపోగా భూస్వాములకు, దేశ్‌ముఖ్ లకు అనుకూలంగా పేదలను భూముల నుండి బేధఖలు కార్యక్రమాన్ని కొనసాగించాయి. ఈ పరిస్థితులలో పోరాటాన్ని కొనసాగించాలని కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించింది. భూ స్వాముల నుండి స్వాధీనం చేసుకున్న భూములను రక్షించు కోవడానికి సాయుధపోరాటం అనివార్యమైంది. నైజాం పోలీసుల కన్నా కేంద్ర పోలీసు బలగాలు అత్యంత క్రూరంగా ప్రజలపై నిర్బంధకాండ కొనసాగించాయి. తెల్లవారగట్ల గ్రామాలను ముట్టడించి గ్రామ ప్రజలందరినీ ఒక చోట చేర్చి, వారిని దిగంబరులుగా మార్చి లాఠీలతో, తుపాకులతో హింసించారు. మహిళలు, బాలికలు, ముసలివారు అన్న తేడా చూడకుండా హింస కొనసాగింది.
కాన్సెంటేషన్ క్యాంపులలో పెట్టి చర్మాలు ఊడేవరకు హింసినప్పటికీ, ఆసనాలలో కారం పెట్టినప్పటికీ ఉద్యమ రహస్యాలను బయటపెట్టలేదు. ఉద్యమాన్ని అణచాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు కేంద్ర ప్రభుత్వం భూ సంస్కరణల చట్టం ద్వారా పేదల స్వాధీనంలో ఉన్న భూములను వారికే హక్కు కల్పిస్తామని, రక్షిత కౌలుదారీ చట్టం 38(ఇ), ప్రకటించింది. ఈ చట్ట ప్రకటనతో తెలంగాణా సాయుధ పోరాటం 1951 అక్టోబర్ 20న ముగిస్తున్నట్లు కమ్యూనిస్టు పార్టీ ప్రకటించింది. మొత్తం గాను ఈ ఉద్యమంలో 1946 జూన్ నుండి 4000 మంది పోరాట యోధులు, రైతులు ప్రాణాలర్పించారు. ప్రపంచ చరిత్రలోనే ఈ పోరాటం గుర్తింపు పొందింది. 38(ఇ) చట్ట ప్రకారం ఇప్పటికీ కొన్ని భూములు రైతులకు పట్టాలు కావాల్సినయే ఉన్నవి. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు జరపలేదు. ఈ చట్టాన్ని సుప్రీంకోర్టులో కూడా సవాలు చేసే హక్కు లేదు.
నైజాం ప్రాంతంలో క్రీ.శ.1800 సంవత్సరం నుండి 1951 వరకు సాగిన రైతాంగ పోరాటాలు చైతన్య పూరితంగా, మిలిటెంట్‌గా జరిగాయి. ఈ ఉద్యమాలలో లక్షలాది మంది ప్రాణాలర్పించారు. ఫ్యూడల్ లక్షణాలు కలిగిన తెలంగాణాలో స్వాతంత్య్రం వచ్చి 72 సంవత్సరాలు గడిచినప్పటికీ నేటికీ ఫ్యూడల్ లక్షణాలు ఇంకా ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టలేదు. ఈ ప్రాంత అభివృద్ధికి ఫ్యూడల్ లక్షణాలు ఆటకంగా ఉన్నాయి.
పోరాట కాలంలో సామాజిక దోపిడీకానీ, సామాజిక వివక్షతగానీ ఎవరూ పాటించలేదు. ఉమ్మడి శత్రువైన భూ స్వాములు, జమీందారులు నైజాం పాలకులపై కలిసికట్టుగా పోరాటాలు నిర్వహించారు. ఈ పోరాట అనుభవాలను పరిశీలిస్తే వర్గపోరాట కాలంలో వివక్షతలు ఉండవనేది బోదపడింది. పోరాటం అనంతరం కూడా అదే కలయిక కులాల మధ్య, వర్గాల మధ్య కొనసాగింది. కానీ ప్యూడల్ పాలకులు నేటికీ కొనసాగడంతో అస్తిత్వ ఉద్యమాల ద్వారా తిరిగి వివక్షతలను, అంటరానితనాన్ని పెంచి పోషిస్తున్నారు. వారి ఆర్థిక దోపిడీకి దీనిని వినియోగిస్తున్నారు. సాయుధ పోరాట కాలం అనుభవాలు గమనిస్తే కుల మతాల విచక్షణ లేకుండా కలిసికట్టు బోజనాలు, కులాంతర, మతాంతర వివాహాలు పెద్దఎత్తున జరిగాయి. సాయుధ పోరాటానికి ముందు జరిగిన బేతవోలు, నల్లగొండ, పరిటాల జాగీరు, కొలను పాక జాగీరు, మునగాల రైతాంగం,అమ్మపాలెం, మునుగోలు రైతుల పోరాటాల్లో కూడా ఈ సామాజిక వివక్షతలు, దోపిడీ కనబడవు. జమీందారులకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున కదిలి కలిసికట్టు పోరాటాలు చేశారు. ఏ కులానికి ఆ కులం, ఏ మతానికి ఆ మతం పోరాటాలు సాగిస్తే వర్గ పోరాటాల ద్వారా వచ్చిన ఫలితం దక్కేది కాదు. నేడు కూడా అన్ని కుల, మత, లింగ శక్తులు ఏకమై పోరాడితే తప్ప వర్గ శత్రువును ఓడించలేము. వర్గశత్రువు ఓటమే మన సమస్యలకు పరిష్కారం చూపుతుంది.
ఈ పోరాటం హిందూ - ముస్లిం - ఇతర మతాల వారు, అన్ని పిడిత వర్గాల వారు కలిసి సాగిచిన పోరాటం సాయుధ పోరాటం వలన భారత ప్రభుత్వం అనివార్యంగా నైజాంను భారతదేశంలో విలీనం చేశారు. మరోవైపు భూస్వాముల కబంధ హస్తాలనుండి, వెట్టి చాకిరీ నుండి ప్రజలు విముక్తి పొందారు. అయినా నేటికి తెలంగాణ ప్రలు తాము కోరుకున్న స్వేచ్ఛ కొరకు, ప్రజాస్వామ్యం కొరకు, విమోచన కొరకు, తగు పోరాటాలు సాగిస్తూనే ఉన్నారు.
నాటి నుండి నేటికి వర్గపోరాటాలలో వందలమంది ప్రాణ త్యాగాలు చేశారు. పోరాటం ముగిసిన తరువాత అంతకు ముందు జమీందారులుగా ఉన్న కుటుంబాలు షెర్వాణీలు, రూమీ టోపీలు వదిలివేసి ఖద్దరు లాల్చీలు, గాంధీ టోఫీతో గ్రామాలలో ప్రత్యేక్ష్యమై ప్రభుత్వ యంత్రాంగం సహకారంతో తిరిగి తమ భూములను స్వాధీనం చేసుకున్నారు. కమ్యూనిస్టులు బలంగా ఉన్న చోటనే పేదలకు దక్కాయి. తమ అవసరాల కోరకు రాష్ట్రంలో, దేశంలో కొత్తగా పుట్టుకొచ్చిన అన్ని రాజకీయ పార్టీలోకి ప్రవేశాలు కల్పించుకున్నారు. దేశంలో, రాష్ట్రంలో నిరుద్యోగం, దారిద్య్రం బాగ పెంచి నూతన పెట్టుబడి దారి భూస్వాములుగా రూపాంతరం చెందారు. ప్రజల శ్రమ దోపిడిని కొనసాగిస్తున్నారు. నేడు అన్ని రంగాలలో బతకలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రస్తుత దుస్థితికి పాలకులే కారణం. అన్ని వనరులున్నప్పటికీ ఆ వనరులన్నిటిని అక్రమం గా కాజేస్తూ నిర్బంధం ప్రయోగించి ప్రజా ఉద్యమాలను అణిచి వేస్తున్నారు. బహిరంగంగా అవినీతి విశృంకల నాట్యం చేస్తున్నది. పాలకవర్గం రాజ్యాంగ యంత్రంలో మమేకమై తమ దోపిడీని యథేచ్చగా కొనసాగిస్తున్నారు. ఈ ప్రస్తుత పరిస్థితిని అధ్యయనం చేసి పీడితులందరిని ఏకం చేసి తమ సమస్యల పరిష్కారానికి పోరాడే విధంగా తయారు చేయాల్సిన బాధ్యత ఈ తరంపై ఉంది. బబ
- సారంపల్లి మల్లారెడ్డి
అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు