పందొమ్మిదవ శతాబ్ది చివరి దశకం ప్రపంచ చరిత్రను మహత్కరమైన మలుపు తిప్పింది. త దశకంలోనే చలన చిత్ర కళ పుట్టి మొత్తం ప్రపంచానికే మరో ప్రపంచాన్ని చూపింది. మనుషుల భావోద్వేగాలకు, ఆలోచనలకు, భావ వ్యక్తీకరణకు, నటన సంగీత గానాలకు కదిలే దృశ్య రూపం సినిమా వలన చేకూరింది. ప్రపంచ మానవాళికి సరికొత్త వినోదం అందుబాటులోకి వచ్చింది. అది మొదట గడచిన ఇరవై ఏండ్లుగా ప్రపంచమంతా సినిమా వెనుక పరుగు పెడుతూనే ఉంది.
భారత దేశంలో ఈ కాలంలోనే సాంస్కృతిక పునరుజ్జీవన యుగం మొదలైంది. భారతీయ సంస్కృతి కొత్త మొగ్గలు తొడిగి అభ్యుదయ, ఆధునిక మార్గాలలో కాలు మోపి వికాసం వైపు అడుగులు పడినవి కూడా అంతకుకొద్దికాలం మునుపే. దీనికి తోడు ఆంగ్ల, భాషా సాహిత్యాల ప్రభావం భారతీయ సమాజంపై బలమైన ముద్రవేయడం మొదలైంది. తత్ఫలితంగా భారతదేశం సాంస్కృతిక, సాహిత్య రంగాల స్వరూపమే మెల్లమెల్లగా మారసాగింది. ఈ దేశంలో నాటి బ్రిటిష్ ఇండియాలోకి చలన చిత్ర కళ ప్రవేశించింది.
1913 'రాజా హరిశ్చంద్ర'తో దాదా ఫాల్కే వేసిన తొలి అడుగు భారతదేశ వ్యాప్తంగా ఎందరినో సినిమా రంగం వైపు మళ్లించింది. బెంగాల్‌లో హీరాలాల్ సేన్, ధీరన్ గంగూలీ మహారాష్ట్రలో బాబూరావ్ పేయింటర్, చందూలాల్‌షా, వి శాంతారాం, అర్డ్‌షీర్ ఇరానీ, మద్రాసులో ఆర్.నటరాజ మొదిలియార్, రాజకణ్ణు విన్సెంట్, వెంకయ్య, బెంగుళూరులో గుబ్బివీరణ్ణి వంటి వారు సినిమా రంగంలోకి వచ్చారు. మూకీ సినిమాలు తీశారు. ఈ పరిణామాలు జరుగుతున్న కాలంలో మన హైదరాబాదు స్టేట్ పూర్తి స్వతంత్ర రాజ్యంగా ఉన్నది. తనదంటూ సొంత అస్తిత్వంతో ఉనికిని చాటుకుంటూ ఉన్నది. ఇక్కడి రాజధాని హైదరాబాదు నగరం సాంస్కృతిక కళా రంగాలకు కేంద్రంగా భాసిల్లుతున్నది.
ఈ నేపథ్యంలో 1896-97ల్లో హైదరాబాదుకు సినిమాను పరిచయం చేసిన వాడు స్టీవెన్‌పన్ అనే ఆంగ్లేయుడు. కాగా 1922లో బెంగాలీ వాడు ధీరేన్ గంగూలీ వచ్చి 'హరగౌరీ' 'స్టెప్ మదర్', 'యయాతీ' వంటి ఆరు మూకీలు 1922-24 మధ్య కాలంలో తీసి వెళ్లారు. అంతకుముందే జె.ఎఫ్.మదన్ 1908లో హైదరాబాఉకు ముంచెత్తిన మూసీ వరదలను చిత్రించి ఉన్నారు. ఈ పరిణామాలన్నీ హైదరాబాదులోని కళాభిమానులను సినిమా వైపు మళ్లించే ప్రయత్నం చేసినది. ఆ ప్రయత్నం తొలుత ప్రభావం చూపింది భారతకోకిలగా పేరొందిన సరోజినీ నాయుడు కుటుంబంపైన.సరోజినీ చెల్లెండ్లు మృణాళినీదేవి, సునాళినీ దేవి ఇద్దరూ హైదరాబాదు నుండి సినిమా రంగంలోకి ప్రవేశించిన మొదటి వ్యక్తులు.
ఆంగ్లసాహిత్య ప్రభావం, షేక్స్‌స్సియర్ నాటకాలు వారిని సినిమా వైపు మళ్లించినవి. 1925లో ప్రభాత సినిమా దర్శక నిర్మాత నటుడు అయిన హిమాంశురారు తీసిన 'ది లైట్ ఆఫ్ ఆసియా'లో ముఖ్య భూమికలను పోషించి మృణాళిని, సునాళినీలు తొలిసారిగా వెండితెరపై కనిపించారు. సునాళినీదేవి-మృణాళినీదేవిల తరువాత మూకీ కాలం బొంబాయి వెళ్లిన హైదరాబాదీ నటి 'రాంప్యారీ'. పాత నగరంలోని నాగులచింతకు చెందిన 'రాంప్యారీ' 1927లో బొంబాయి వెళ్లి చందూలాల్‌షా తీసిన 'గుణసుందరి' (1927)లో ఒక ప్రధానపాత్రను పోషించి మూకీల తరంలో సినిమాలకు పరిచయమయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో హైదరాబాదు నుండి బొంబాయి వెళ్లి వెండితెరపై మూకీల కాలంలోనే ఒక వెలుగు వెలిగిన మనవాడు, మన తెలంగాణ వాడు, పక్కా హైదరాబాదీ అయిన మన కథానాయకుడు ''పైడి జయరాజ్''
పైడి జైరాజ్ జీవితం హిందీ సినిమా రంగ చరిత్రతో బాటు సమాంతరంగా సాగింది. అది కూడా ఒక సినిమా కథలాగా, సంఘర్షణలతో కూడి, ఎత్తుపల్లాలను అధిగమించి విజయ శిఖరాగ్రానికి చేరకున్న సాహస గాథలాగ. ఏడు దశాబ్దాల పాటు మూకీల కాలం నుండి టాకీల శకం వరకు సుదీర్ఘంగా సాగిన పైడిజైరాజ్ జీవితం భారతీయ సినిమా చరిత్రకే ఒక సాక్షీభూతంగా నిలుస్తుంది. విభిన్న తరహా చిత్రాలతో, విభిన్న తరహా పాత్రలతో నాలుగు తరాల తారలతో కలిసి సినిమా అభిమానులను అలరించిన మహానటుడు పైడి జైరాజ్. ఒక రకంగా చెప్పాలంటే తొలి తరం భారతీయ చలన చిత్ర పితామహులలో ఒకటి మన పైడిజైరాజ్. ఇప్పటివరకు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో 73 ఏండ్ల పాటు ట్రాజెడీ కింగ్ దిలీప్ కుమార్ ను చెప్పుకోవాలి.
అలనాటి హైదరాబాద్ స్టేట్‌లోని కరీంనగర్‌లో 1909 సెప్టెంబర్ 28న జన్మించిన పైడిజైరాజ్ పూర్తిపేరు 'పైడిపాటి జైరాజులు నాయుడు'. తండ్రి పైడిపాటి అచ్యుత నాయుడు. నాటి నిజాం ప్రభుత్వంలో ప్రజా పనుల శాఖలో ఉన్నతాధికారిగా పనిచేసేవారు. తల్లి తాయారమ్మ. స్వయాన సరోజినీ నాయుడుకు ఆడపడుచు. గోవిందరాజులు నాయుడుకు చెల్లెలు. ముగ్గురు అన్నదమ్ములలో పైడిపాటి సుందర్‌రాజ్ నాయుడు, పైడి పాటి దీనదయాళ్ నాయుడు తరువాత కడపటి వాడు మన కథానాయకుడు 'పైడిజైరాజ్ నాయుడు'. మిత్రుల 'ఆరడుగుల ఆజానుబాహుడివి బొంబాయి వెళ్లి సినిమాలలో ప్రయత్నించవచ్చు కదా!' అనే ప్రోత్సాహం ఆయనను బొంబాయి వైపు మళ్లించింది.
సినిమాల్లో నటించడానికి తాను బొంబాయి వెళ్దామనుకుంటున్నానని ఇంట్లో చెప్పే సరికి ఒక్కసారిగా అంతా ఏకకంఠంతో సినిమాల్లోకి వెళ్లడానికి వీల్లేదని వ్యతిరేకించారు. తండ్రి, పెద్దన్నలకైతే కోపమే వచ్చింది. ముందుగా ఉన్నత చదువులు పూర్తి చేయమని సలహా ఇచ్చారు. కానీ జైరాజ్ ఏం చేయాలో అన్న విషయంపై తన నిర్ణయం తాను తీసుకుని వున్నాడు. సినిమాలో తన భవిష్యత్తు వెదుక్కోవాలని బొంబాయికి బయలుదేరాడు. ఇది జరిగింది 1928లో.
చంద్రికా ఫిలింస్ 'జగ్ మగాతీ జవానీ' (స్పార్క్‌లింగ్ యూత్ 1929)లో నటించడంతో జైరాజ్ సినీ జీవితం మొదలైంది. ఆ వెంటనే వచ్చిన యంగ్ ఇండియా పిక్చర్స్ వారి ''రసీలి రాణి'' (1930) జైరాజ్ నటించిన రెండో మూకీ కాగా, హీరోగా నటించిన తొలి చిత్రం. ఈ చిత్రంలో మాధురి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా అయిదు వారాలు ఆడటం అప్పటి మూకీల కాలంలో ఒక సంచలనం. ఇదో పెద్ద విజయంగా భావించే వారా రోజుల్లో. ఇదే బానరు 'ఫైట్ అన్ టు డెత్' (1930) చిత్రాల్లో హీరోగా నటించారాయన. ఆ తరువాత 1931లో శారదా ఫిలిం కంపెనీలో నెలకు 100 రూపాయల జీతంతో చేరారు. ఈ కంపెనీలో మొదటిసారిగా 'పెరల్' (మహాసాగర్‌ను మోతీ)లో నటించారు. హీరోయిన్ జేబున్నీసా. ఆ తరువాత వీరిద్దరి సినిమాలు హిట్ పేగా పాపులరైనవి. ఈ క్రమంలో జైరాజ్ 'క్వీన్ ఆఫ్ ఫెయిరీస్', 'ది ఎనిమి', 'తుఫానీ తరుణి', 'షి' (1931), మై హీరో (1932) మూకీ చిత్రాల్లో నటించారు.
1931 లో 'ఆలంఆరా'తో దేశంలో టాకీల శకం మొదలైంది. టాకీ చిత్రాల్లో ఎవరి పాటలు వారే పాడుకోవాలి. మరి జైరాజ్‌కు పాడటం రాదు గనుక తాను ప్రసిద్ధ హిందుస్తానీ సంగీత విద్వాంసుడు ప్రొ||దీదర్ వద్ద శిష్యరికం చేసి హిందుస్తానీ సంగీతం నేర్చుకున్నారు. ఆ తరువాత జైరాజ్ నటించిన తొలి టాకీ 'షికారి' (1932). లండన్‌కు చెందిన ఈస్టర్న్ ఫిలిం కంపెనీ ఈ సినిమాను హిందీ, ఇంగ్లీషు భాషలో తయారు చేశారు. ఆ తరువాత మయాజాల్ ఔరత్ కా దిల్, పతిత పావన్, జహర్-ఎ-ఇష్క్ (1933), దర్ద్-ఎ-దిల్, షేర్-ఎ-పరిస్తాన్, వాసవదత్త (1934), షేర్ దిల్ ఔరత్ (1935), బేరోజ్‌గార్, గరీబ్ పరివార్ (1936) వంటి హిట్ చిత్రాల్లో నటించిన జైరాజ్ అతికొద్ది కాలంలోనే పృధ్వీజ్‌కపూర్, శాంతారాం, సోహ్రాబ్ మోడీ వంటి అగ్రశ్రేణి తారల స్థాయికి చేరుకున్నారు. పై చిత్రాల్లో పతిత పావన్ (మరో పేరు అహల్యా ఉద్దార్) పౌరాణికంలో దుర్గా ఖోటే సరసన నటించిన జైరాజ్ ఆ కాలంలో అగ్రశ్రేణి హీరోయిన్లు, దేవికారాణితో 'హమారీ బాత్', నర్గీస్‌తో అంజుమన్, దరోగాజి, రూమీ,సాగర్ చిత్రాల్లో, సురయా తో అమర్ కహానీ, రాజ్‌పూత్, రేషమ్, లీలా చిట్నిస్‌తో చార్ ఆంఖే, ఛోటీ సీ దునియా, నూర్జహాన్‌తో హమ్‌జోలి నిమ్మితో రాజ్‌ముకుట్, గీతాబాలీతో గరీబీ చిత్రంలో ఇంకా నిగార్ సుల్తానా, మెహతాబ్, ఖుర్షీద్, నిరూపారారు వంటి వారితో కలిసి నటించారు.
జైరాజ్ నటించిన చిత్రాల్లో నాలుగైదు తప్ప అన్నీ యాక్షన్, సోషల్ చిత్రాలే. అజంతా ఫిలిం కంపెనీ వారికి చేసిన నాలుగు సినిమాల్లో చెప్పుకోదగింది. 'మిల్ మజ్దూర్' (1933), ప్రసిద్ధ హిందీ రచయిత ప్రేమ్‌చంద్ కథ ఆధారంగా తీసిన ఈ చిత్రంలో జైరాజ్ హీరోగా, బిష్ణో హీరోయిన్‌గా నటించింది. 1936లో కరాచిలో తయారైన బేరోజ్‌గార్, తరువాత 'గాంబ్లర్' చిత్రాల్లో హీరోగా నటించారు. 1938లో ఆర్.ఎస్.చౌధురి తీసిన 'రైఫిల్ గర్ల్'(1938)లో విలన్‌గా నటించి మెప్పించడం జైరాజ్ నటనా ప్రావీణ్యానికి నిదర్శనం. ఇది సంవత్సరం వచ్చిన 'బాబి' ఏకంగా 80 వారాలు ఆడింది. దీంతో జైరాజ్ హిందీ చిత్ర రంగంలో స్టార్ హౌదాకు చేరుకున్నారు. ఆయన జీతం నెలకు రూ.600కు పెరిగింది. ప్రకాశ్ పిక్చర్స్‌లో 'బిజ్లీ' (1939) హిట్ తరువాత వారే దర్శకత్వం వహించే అవకాశం కల్పించి 'మాలా'(1941) సినిమా తీయించారు. ఆ తరువాత ప్రతిమ (1945), సాగర్ (1951), రాజ్‌ఘర్, మొహల్ చిత్రాలను డైరెక్ట్ చేశారాయన. 'సాగర్' సినిమా తీసి నష్టపోయిన ఆయన మళ్లీ నిర్మాతగా మారలేదు.
1947లో బాంబే టాకీస్ కంపెనీ నుంచి పిలుపురావడంతో దేవికారాణి హీరోయిన్‌గా 'హమారీ బాత్'లో నటించారు. దేవికారాణి చివరి చిత్రం ఇదే. జరురాజ్ సినీ జీవితంలో 1946 నుండి వరుసగా ఎనిమిదేళ్ల పాటు చారిత్రక చిత్రాలలో కీలక భూమికలు పోషించి పాపులరైనారు. 1946 రంజిత్ మూవీటోన్ వారి 'రాజ్‌పుటానీ'లో శక్తిసింగ్‌గా, 'షాజహాన్' (1947)లో సైగల్ హీరో కాగా సంగత్రా షివాజి పాత్ర పోషించి తన అభిమాన హీరో సైగల్‌తో నటించిన ఆ తరం హీరోగా నిలిచిపోయారు. ఆ తరువాత 'అమర్‌సింగ్ రాథోడ్', 'వీర్‌దుర్గాదాస్', 'రాణాప్రతాప్', 'పృథ్వీరాజ్ చౌహాన్', 'టిప్పుసుల్తాన్', 'రజియా సుల్తాన్', 'అల్హా ఉదల్', 'రాణా హమీర్' వంటి చారిత్రక సినిమాల్లో జైరాజ్ హీరోగా నటించారు. 'షషీద్ భగత్‌సింగ్'లో చంద్రశేఖర్ ఆజాద్ పాతన్రు అప్పటి ప్రేక్షకులకు మరుపురాదు.
1966 నుండి హీరో పాత్రలు మాని కారెక్టర్ పాత్రలకు మారిన జైరాజ్ 'బహరోంకె సప్నే' (1967), నీల్ కమల్ (1968), బేటీ 'తుమ్హారీ జైసీ' (1969), 'జీవన్ మృత్యు' (1970), ఛోటీ బహు' (1971), 'బాజీగర్', 'షెహజాద' (1972), 'చాలాకూ', 'ఆలం ఆరా' (1973), 'చోర్ చోర్' (1974), 'కాలాపానీ', 'సలాఖే, షోలే' (1975), 'బైరాగ్, ఫాస్లా (1976), వీరూ ఉస్తార్ (1977), ముఖద్దర్ కా సికిందర్ (1978), 'హీరామోతీ', 'ఇంకార్' (1979), జ్యోతి బనే జ్వాలా, షాన్ (1980), 'ఖూన్ భరీ మాంగ్' (1988), 'అజూబా' (1991), 'బేతాజ్ బాద్షా', 'దోఫంటూష్' (1994) వంటి వాటితో కలిసి మొత్తం 200 పైగా చిత్రాల్లో నటించారాయన.
జైరాజ్ మొత్తం 70 ఏండ్ల పాటు సినీ రంగంలో కొనసాగిన నటుల్లో మొదటివారు. ఆ తరువాతనే లతా మంగేష్కర్, మన హైదరాబాదీ నే అయిన చంద్రశేఖర్ (హీరో) లు అంత సుదీర్ఘ కాలం పరిశ్రమలో ఉన్నారు. ఇదొక అరుదైన రికార్డు. ఇవిగాక 'హతీంతాయి' (1947) పెద్ద హిట్ చిత్రంలో మన జైరాజ్ హీరో. షకీలా హీరోయిన్. హైదరాబాదులో ఈ సినిమా విడుదలైనపుడు నాటి నిజాం నవాబు ప్రత్యేక ప్రదర్శన వేయించుకున్నారు. ఆసందర్భంలో ఈ సినిమాలో జైరాజ్‌పై చిత్రీకరించి 'పర్వర్ దిగార్ ఆలం' పాటను పదిసార్లు స్క్రీనింగ్ చేయించుకున్నారు. మల్టీసార్టర్ చార్ దిల్ చార్ రాహే (1959)లో రాజ్‌కపూర్, అజిత్, షమీకపూర్‌లతో కలిసి నటించిన జైరాజ్ ఇండోరష్యన్ చిత్రం 'పర్‌దేశి' (1947)లో, రష్యాలో తీసిన 'మున్నా'లో నటించారు. కాగా ఆయన హీరోగా నటించిన చివరిచిత్రం 'ఖూనీ కౌన్ ముజ్రిం కౌన్' (1965). ఇంకా గుజరాతిలో జోగిదాస్ రెహమాన్ బహురూపి, ఖెమ్రోలోడన్, మరాఠిలో ఛోటా జవాన్, ఫకిరా చిత్రాల్లో నటించారు. రెండు అంతర్జాతీయ చిత్రాల్లో నటించిన ఖ్యాతిని కూడా దక్కించుకున్న జైరాజ్ 'మాయా' ట్వెంటీయత్ సెంచరీ ఫ్యాక్స్ వారి 'నైన్ అవర్స్ టు రామా' చిత్రాల్లో నటించారు. ఆయన సినీ రంగ సేవలకు 1980లో భారత ప్రభుత్వం అత్యున్నత దాదాఫాల్కే అవార్డుతో సన్మానించింది. 1986లో హైదరాబాదులో 100 ఏళ్ల సినిమా ఉత్సవం సందర్భంగా చంద్రశేఖర్‌తో బాటు జైరాజ్‌ను ఘనంగా సన్మానించారు. 1939లోనే పంజాబీ అయిన సావిత్రిని పెళ్లిచేసుకున్నారు. దిలీప్ రాజ్, జరు తిలక్, జయశ్రీ, దీప, గీత ఆయన సంతానం. చివరి రోజుల్లో కుటుంబ స్పర్దల వల్ల వ్యాకులత పడిన ఆయన 2000 ఆగస్టు 11న మరణించారు.
ఈ నెల 28న జైరాజ్ 110వ జయంతి. ఈ సందర్భంగా వారి సముచిత రీతిలో గౌరవించుకోవాలి. గడిచిన కాలంలో సమైఖ్య రాష్ట్రంలో ఆయనను తెలుగువాడిగా కూడా గుర్తించలేదు. దాదాఫాల్కే అవార్డు అందుకున్నా తెలుగు వారి జాబితాలో చేర్చడం మాట దేవుడెరుగు. ఇపుడు తెలంగాణ స్వంత రాష్ట్రంగా ఏర్పడి ఆరేళ్లు గడిచినవి. గతంలో సినీ అవార్డుల కమిటీ వేసి జైరాజ్ పేరుతో అవార్డు ఇవ్వాలనే నివేదికలు తెప్పించుకున్నారు. వాటిని వెంటనే అమలు చేయాలి. హైదరాబాదు నగరంలో జైరాజ్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. ప్రభుత్వమే ప్రతి యేటా జైరాజ్ జయంతుత్సవాలను నిర్వహించాలి. అదే వారికి ప్రత్యేక తెలంగాణ అర్పించే నిజమైన నివాళి కాగలదు.
పైడి జై రాజ్ నటించిన మూకీలు
1. స్పార్క్‌లింగ్ యూత్ (జమగాతీ జవానీ) చంద్రికా ఫిలింస్ కంపెనీ (1929-30)
2. ట్రంప్ ఆఫ్ లవ్ (రశీలీ రాణి) యంగ్ ఇండియా పిక్చర్స్ (1930)
3. ఫైట్ అన్ టు డెత్ (ఖాందానా ఖేల్) యంగ్ ఇండియా పిక్చర్స్ (1931)
4. భవానీ నోభోగ్ యంగ్ ఇండియా పిక్చర్స్ (1931) 5. కష్ణకుమారి
(ఫ్లవర్ ఆఫ్ రాజస్తాన్) యంగ్ ఇండియా పిక్చర్స్ (1931)
6. పెరల్ (మహాసాగర్ ను మోతీ) శారదా ఫిలిం కంపెనీ (1931)
7. ఆల్ ఫర్ లవ్ (దీవానా) శారడా ఫిలిం కంపెనీ (1931)
8. ది ఎనిమి (దుష్మన్) శారదా ఫిలిం కంపెనీ (1931)
9. క్వీన్ ఆఫ్ ఫెయిరీస్ (హుస్న్ పరి) శారదా ఫిలిం కంపెనీ (1931)
10. షి (బహదూర్ చేటి) శారదా ఫిలిం కంపెనీ (1931)
11. మైహీరో (మాతభూమి) యంగ్ ఇండియా పిక్చర్స్ 1932
- హెచ్.రమేష్‌బాబు,
7780736386