Sat 26 Sep 23:19:59.886474 2020
Authorization
రైతేరాజు అన్నారు ఒకప్పుడు. జైజవాన్ జైకిసాన్ నినాదమిచ్చారు మరొకప్పుడు. ఈ దేశానికి వెన్నెముక రైతే అన్నారు అందరు. ఎవరెన్ని చెప్పినా రైతు మాత్రం రోజురోజుకూ కడగండ్ల పాలవుతూనే వున్నాడు. ఆయన బతుకు పచ్చగా మారింది లేదు. పైగా అవమానాల్ని భరరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడు. ఇప్పుడు రైతు ఆత్మహత్య చేసుకున్నాడంటే, ఎవరూ పెద్దగా పట్టించుకోవడమూ లేదు. సాక్షాత్తు మన ప్రజాస్వామ్య పార్లమెంటులోనే ఏలికలు వారి వివరాలేమీ మా దగ్గర లేవని స్పష్టంగానే చెప్పింది. అంటే రైతులకు, వ్యవసాయ రంగానికి మనమిచ్చే ప్రాధాన్యత అర్థమవుతుంది.
''వాని రెక్కల కష్టంబు లేనినాడు
సస్యరమ పండి పులకించ సంశయించు
వాడు ప్రపంచమునకు భోజనము పెట్టు
వాడికి భుక్తి లేదు'' అని బాధపడ్డాడు జాషువ.
దేశం మొత్తం ఈ రోజు రైతు గురించి కొద్దిగానైనా చర్చించటానికి కారణం, పార్లమెంటులో మొన్న ప్రభుత్వం వ్యవసాయ చట్టాల్ని కొత్తగా తీసుకువచ్చి పాస్ చేసింది. దీని గురించి రైతుల నుండి రైతు సంఘాల నుండి మేధావుల వరకు ఇది రైతు బతుకులను మరింత దిగజార్చుతుందని, కార్పొరేట్ శక్తులకు మేలు కలిగించేదని ఆందోళన చెందుతున్నారు. రైతు తన పంటను ఎక్కడైనా అమ్ముకోవడానికి స్వేచ్ఛ నిచ్చామని ఇది మేలు చేస్తుందని ప్రభుత్వం చెబుతున్నది. అమ్ముకోవడానికి యిచ్చే స్వేచ్ఛలోనే కొనేవాడికీ స్వేచ్ఛను ధారాదత్తం చేశారు. ఎప్పుడైనా, ఎక్కడైనా రైతులు, సామాన్య రైతులు రాష్ట్రాలు దాటి పోయి పంటను అమ్ముకోవడం కానీ, స్టోరేజ్‌లో నిల్వ ఉంచుకోగలిగిన స్థోమతను కలిగి వున్నారా? ఇది వ్యవసాయంపై ప్రవేటు, కార్పొరేటు శక్తులకు పూర్తి ఆధిపత్యాన్ని అప్పగించే చర్య. తాను పండించిన పంటకు తానే ధర నిర్ణయించే శక్తి లేని రైతు, లాభాలకు ఎక్కడైనా ఎలా అమ్ముకుంటాడు! నిత్య జీవితావసరాలను, రైతు పండించే ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, పప్పుధాన్యాలను విలాస వస్తువులుగా ప్రకటించడం వలన పెట్టుబడిదారులు వారి ఇష్టం వచ్చినట్లు నిల్వలు దాచి ధరలు పెంచడానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. ఎవరి కోసం ఈ చట్టాలు?
మనది వ్యవసాయ ప్రధాన దేశం. వ్యవసాయం, దాని సంబంధిత ఉత్పత్తులతో అధిక ఆదాయాలను పొందే దేశం. అరవై శాతం ప్రజలు ఆధాపడ్డ దేశం. రైతు, వ్యవసాయం మొదలైన విషయాలంటే మన నాగరీకులకు, ముఖ్యంగా విద్యాధికులకు చులకన భావం. ఎందుకంటే వ్యవసాయంపై ఆధారపడ్డ వాళ్ళంతా మట్టి మనుషులు. నేలను, మట్టిని నమ్ముతున్న వాళ్ళు. రైతు చితికిపోతే, రైతు వ్యతిరేక చట్టాలొస్తే మనకేమవుతుందని కొందరనుకుంటారు. కానీ రైతు పండించే పంట మూలంగానే ఎంతటి ధనవంతుడికైనా చేతిలోకి ముద్ద చేరుతుంది. అందరం ఆ అన్నమే తిని బతుకుతాం. ఆ అన్నానికి ప్రమాదం ఏర్పడిందంటే, ప్రవేటుపరం అయిందంటే సమస్త దేశ ప్రజల జీవితాల మీదా ప్రభావం చూపుతుంది. ఒక్క రైతుకే బాధ కాదు. కోట్లాది సామాన్య ప్రజలకు ఆహార సమస్య తలెత్తుతుంది. ఆ రకంగా ఆలోచన చేయకపోతే ప్రమాదం, ముందు రైతును ఢీ కొట్టి ఆ తర్వాత అందరి పైకి విరుచుక పడుతుంది.
కరోనా కష్టకాలంలో కూడా ఈ దేశ ఆదాయాన్ని పెంచి ఆహార కొరత లేకుండా ఆదుకున్న రైతుపై ఇలాంటి దాడి జరగడం దుర్మార్గం. కనీసం ఈ చట్టాలపై చర్చించాలన్న ప్రజాస్వామిక హక్కును కూడా కాలదన్ని అధికార గర్వాన్ని ప్రదర్శించి కార్పోరేట్ల సేవకు పూనుకోవడం దారుణం. దీన్ని అందరూ అవగాహన చేసుకుని ప్రజా ఉద్యమానికి మద్దతునివ్వడమే ఇక మనం చేయగలిగింది. రైతుకు అండగా వుండి రాజ్యపు చర్యను ఖండించాలి. ''పొలాలన్నీ / హలాల దున్నీ / ఇలాతలంలో హేమం పిండగ / జగానికంతా సౌఖ్యం నిండగ / విరామ మెరుగక పరిశ్రమించే కర్షక వీరుని కాయం నిండా / కాలువ కట్టే ఘర్మ జలానికి, ఘర్మ జలానికి ఖరీదు కట్టే ఫరాబు లేడోరు'' అని నినదించాలి.