Sun 11 Oct 16:08:12.453543 2020
Authorization
అలవాట్లు రెండు రకాలు. మంచి అలవాట్లు, దురలవాట్లు. మంచి, ప్రయోజనకరమైన అలవాట్ల గురించి చర్చ ఏమీ ఉండదు. దురలవాట్లు మీదనే దృష్టి పెట్లాల్సి వుంది. వ్యక్తిగతమైన అలవాట్లు కూడా సమాజం నుండి వచ్చేవే. కాఫీ, టీలు తాగటం, సిగరెట్, చుట్ట, మందు, వ్యభిచారం మొదలైనవన్నీ వ్యక్తిగతమైన అలవాట్లని అనుకుంటాం. కానీ ఇవి అన్నీ ఆదిమ సమాజం నుండీ లేవు. మధ్యలో వచ్చి అలవాటయినవే. ఒకప్పటి దురలవాట్లు, ఇప్పుడు సాధారణ, గొప్ప అలవాట్లుగా మారుతున్నాయి. ఏవి ప్రమాదకరమైన అలవాట్లుగా మారనున్నాయో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతో వుంది.
ఇప్పుడు అయితే కరోనాకు అలవాటు పడుతున్నాం. కరోనా మరణాలు రోజూ వినటానికీ అలవాటు పడ్డాము. ఇదో విషాదపు అనివార్య అలవాటు పడటం. భారతీయులకు ఏ పరిస్థితులకయినా కొంత కాలానికి అలవాటు పడిపోయే లక్షణం వుంది. రెండు వందల యేండ్లు ఆంగ్లేయుల పాలనకూ అలవాటుపడి బతికేశాం. ఎవరో కొందరు ఇది బానిసత్వమని చైనత్య పరిస్తే తప్ప మేల్కోలేకపోయాం. అందుకనే ప్రపంచంలో ఎక్కువ కాలం భరించే సమాజంగా మన దేశం వుంది.
కొందరికి అబద్దాలాడటం అలవాటు. అయిన దానికి కాని దానికి అబద్ధాలు ఆడుతూనే వుంటారు. అయితే అబద్ధాలను నిజమనుకుని నమ్మే అలవాటూ మనకుంది. కొందరు స్వార్థపర శక్తులు కావాలని ప్రజలను తప్పుదోవ పట్టించటానికి అబద్ధాలను ప్రచారం చేస్తారు. మొన్న మనీషా హత్యోదంతాన్నే తీసుకోండి.
అమ్మాయి అత్యాచారానికే గురికాలేదన్నారు. తల్లిదండ్రుల అనుమతితోనే దహనం చేశామన్నారు. న్యాయం కావాలంటే అంతర్జాతీయ కుట్ర జరుగుతోందని అబద్ధాల మీద అబద్ధాలు ప్రచారంలో పెట్టారు. ఇవి అమానవీయమైనవి. వీటి పట్ల జాగ్రత్త పడవలసి వుంది.
ఇప్పుడు జరుగుతున్న ప్రతి విషయాన్ని మత పరంగా, కుల పరంగా, ప్రాంతాల పరంగా చూడటం కూడా అలవాటవుతోంది. కానీ ముందుగా మనుషులంగా చూస్తున్నామా లేదా అనేది ముఖ్యమైన విషయం. కళ్ళముందే జరుగుతున్న దారుణాలను, అఘాయిత్యాలను చూస్తూ స్తబ్ధంగా ఉండటమూ అలవాటయిపోతోంది. దౌర్జన్యాలు, దుర్మార్గాలు, రాక్షసత్వాలు, బీభత్సాలు కూడా అలవాటుగా మారిపోతున్నాయి. ఆత్మహత్యల వార్తలూ అలవాటయి పోయాయి. ధరలు పెరగటం, పన్నులు పెరగటం, లంచం ఇవ్వటం, అవినీతికి పాల్పడటం, స్త్రీలను, దళితులను హీనంగా చూడటమూ సమాజంలో చాలా మందికి అలవాటుగా మారింది. ఇవన్నీ సమాజాన్ని పట్టి పీడిస్తున్న రుగ్మతలు. అంతేకాదు, కొందరు కావాలని పెంచి పోషిస్తున్న దుష్ట విలువలు.
అలవాట్లు కూడా సంస్కృతిలో భాగం. దుష్ట సంస్కృతి విపరీతంగా విస్తరిస్తున్న తరుణంలో అందులో పడి కొట్టుకుపోకుండా అన్యాయాలను, అక్రమాలను ఎదిరించి తిరిగబడే అలవాటును పెంపొందించుకోవాలి. అమానవీయ, అనైతిక విధానాలను కూడా సాధారణఅలవాటుగా మార్చేవారి కుట్రలను జాగ్రత్తగా గమనించి ధైర్యంగా పోరాటం చేసే అలవాటును అలవరుచుకోవలసి వుంది.