Sun 11 Oct 16:29:34.886877 2020
Authorization
పూర్వం గోపయ్య అనే బాటసారి తన ఊరి నుండి మరొక ఊరికి పని నిమిత్తం వెళ్లే క్రమంలో రామాపురం ఊరి వద్దకు రాగానే రాత్రి అయ్యింది. ఈ రాత్రికి ఈ ఊరిలో బస చేసి మరునాడు నడక ప్రారంభించి తన గమ్యం చేరాలన్నది బాటసారి ఆలోచన. ఆ ఊరిలో ఎవరు సహాయం చేస్తారోనని గ్రామస్తులను అడిగితే అందరు ధర్మయ్య పేరు చెప్పారు.
ధర్మయ్య అడిగిన వారికి కాదనకుండా సహాయం చేసే గొప్ప వ్యక్తి. ముఖ్యంగా బాటసారులకి రాత్రి పూట బస ఏర్పాటు చేసి, భోజనాలు పెట్టి, మరుసటిరోజుకి సరిపడే విధంగా భోజనం మూట గట్టి పంపించేవారు ధర్మయ్య దంపతులు. దీనికి ఎటువంటి వరహాలు (డబ్బు) తీసుకునేవారు కాదు. ఎంత రాత్రివేళ వచ్చినా విసుగు చెందక బాటసారులకు ఆశ్రయమిచ్చి, అన్నం వండి పెట్టేవారు. వారి సేవానిరతిని అందరు ప్రశంసించే వారు.
ధర్మయ్య ఇల్లు వివరాలు తెలుసుకుని బాటసారి ధర్మయ్య ఇంటికి వచ్చాడు. ధర్మయ్య దంపతులు అతడికి అతిథి మర్యాదలు చేసి భోజనాలు వడ్డించారు. అనంతరం దంపతులు లోపలి గదిలో నిద్రించగా, ఇంట్లో నిద్రించిన ఆ బాటసారి ఇంటికున్న వాసాలు, దూలాలు, తలుపులు, కిటికీలు, మొగురాలు లెక్కించడం మొదలుపెట్టాడు.
తెల్లవారింది. బాటసారి నిద్రలేచే సరికి భోజనం మూటకట్టి అతనికి ఇచ్చాడు ధర్మయ్య. బాటసారులు ఎవరైనా ఉదయం చల్లని వాతావరణంలో నడక సాగించి, మధ్యాహ్నవేళ చెట్ల కింద కొద్దిసేపు సేద తీరి తిరిగి పొద్దుపోయే వరకు నడక కొనసాగించడం ఆనవాయితీ. కానీ ఈ బాటసారి ఇల్లును వదిలి వెళ్లడం లేదు. ఎంతకు వెళ్లకపోయేసరికి ధర్మయ్య కారణం అడిగాడు. ఆ బాటసారి ఈ ఇల్లు తనదే అని వాదించాడు. ధర్మయ్య ఆశ్చర్యపోయాడు. ధర్మయ్యకు మద్దతుగా ఇరుగు-పొరుగు వారు మాట్లాడారు. బాటసారి ఇల్లు తనదేనని పట్టుపట్టాడు. విషయం న్యాయాధికారి వద్దకు వెళ్ళింది. ఇంటి ఆనవాళ్లు చెప్పుమన్నాడు అధికారి. ధర్మయ్య ఇంటి సరిహద్దులు, తలుపులు, కిటికీలు, మొగురాల సంఖ్యను మాత్రమే చెప్పగలిగాడు. బాటసారి మాత్రం వాటితో పాటు తిన్నింటి వాసాలు, దూలాలు లెక్కించి చెప్పాడు. ధర్మయ్యతో పాటు ఊరందరు అతని మోస బుద్ధిని గ్రహించలేక పోయారు. న్యాయాధికారి ఇంటికి వచ్చి లెక్కిస్తే బాటసారి లెక్కలు సరిపోయాయి. ధర్మయ్య వాసాలు, దూలాలు లెక్క చెప్పలేకపోయాడు. సాక్ష్యాలు నమ్మే న్యాయాధికారి బాటసారిదే ఇల్లు అని తీర్పు చెప్పారు.
అన్నము పెట్టె వానికి ద్రోహం చేయడం, ఆపదలో సహాయం చేసిన వానికి కీడు తల పెట్టడం, మంచివారిని మోసం చేయడం నీచుల లక్షణాలు. నీచుల చెడు బుద్ది తెలియక ధర్మాత్ములు వారికి సహాయం చేస్తూనే ఉంటారు. ధర్మయ్యకు జరిగిన అన్యాయంను ఊరివారందరు న్యాయాధికారికి వివరించారు.
ధర్మయ్య సేవా భావం, మంచి గుణం తెలుసుకున్న న్యాయాధికారి బాటసారిని రాజభటులకు అప్పగించాడు. రాజ భటులను చూడగానే బాటసారి నిజం చెప్పి, నేరాన్ని అంగీకరించాడు. బాటసారికి శిక్ష విధించి, ధర్మయ్యకు అతని ఇల్లు ఇప్పించాడు న్యాయాధికారి.
''ధర్మాన్ని నువ్వు రక్షిస్తే, ఆ ధర్మమే నిన్ను రక్షించింది'' అని ఊరి జనం ధర్మయ్యతో అన్నారు.
- దుర్గం భైతి, 9959007914