Sat 17 Oct 23:31:01.600725 2020
Authorization
''గుమ్మడిపూలు పూయగ బతుకు, తంగెడి పసిడి చిందగ బతుకు, గునుగు తురాయి కులుకగ బతుకు, కట్ల నీలిమలు చిమ్మగ బతుకు, బతుకమ్మా! బతుకు, అమ్మను మరువని సంతానము కని బతుకమ్మ! బతుకు, చెలిమి వెన్నెలలు కాసేదాకా బతుకమ్మా! బతుకు!'' అని ఆడపిల్ల గూర్చి పాడుకున్నాడు కాళోజీ ఈ తెలంగాణ నేలపైన. పాడుకుని, కోరుకుని దశాబ్ధాలు గడిచిపోయినవి. ఆడపిల్లలు బతకలేకపోతున్నరు. మరింత దుర్మార్గంగా చంపబడుతున్నరు. ఎందుకిలా? ఎన్ని చట్టాలొచ్చినా శిక్షలెంత కఠినమైనా అఘాయిత్యం ఆగటం లేదు. అమ్మాయిల వేటాడుతోనే ఉంది.
అనాదిగా ఆడవాళ్ళ బతుకు ఎవరో ఒకరి మీద ఆధార పడటంగానే వుంటున్నది. ప్రకృతిలో సగభాగమైన, సమ భాగమైన ఆడవారి పట్ల ఎందుకీ అసమానతా, వివక్షాపూరిత చూపు. జన్మనిచ్చే తల్లి ఆడది. అనురాగాన్ని పంచే చెల్లి ఆడది. నీ గమనంలో గమ్యంలో నీతోనే ఉంటూ ప్రేమను పంచే భార్య ఆడది. కానీ నీవిచ్చేది హీనస్థానం. నీ చూపులో బానిస విధానం. ఇది ఘోరం,నేరం. ఎక్కువ తక్కువల సమాజంలో ఉచ్ఛనీచ విధానంలో స్త్రీ మగవాడు కట్టిపెట్టుకున్న ఆస్తిలా మారింది. తరాలు మారినా, ప్రజాస్వామిక భావ పరిణామాలు సంభవించినా, ప్రపంచం నాగరిక ఆలోచనను అలంకరించుకున్నా స్త్రీ ఆట బొమ్మగానే అన్యాయాలకు గురవుతూనే వుంది. దోపిడీ కాబడుతూనే ఉంది.
సామాజికంగా, ఆర్థికంగా ఎంతో పురోగతి సాధించిన నేటి పరిస్థితులలో ఈ రకమైన భూస్వామిక భావజాలం, బానిస కాలపు రాక్షసత్వం ఎందుకు పెచ్చరిల్లుతోంది. మనం సాధించిన ప్రగతి అంతా, శాస్త్ర సాంకేతికత విజ్ఞానమంతా వస్తూత్పత్తి, సరుకుల ఉత్పత్తి పెంచడంలో, సౌకర్యాలను, విలాసాలను పొందడానికి ఉపయోగించుకున్నాం గానీ మానవ విలువలను పెంచుకోలేక పోయాం. వస్తువులు, సరుకులు పొందడంలో సరతోషాన్ని , ఆనందాన్ని, సుఖాన్ని పొందగలమనే భ్రమలో మునిగిపోయాం. కానీ మనిషితో మనిషి సంబంధాన్ని మానవీయంగా మలచుకోవడమే నిజమైన ఆనందమని గ్రహించలేకపోయాం. వస్తు అనుభోగంలో సౌకర్యం మాత్రమే కలుగుతుంది. ఒక మనిషితో మనిషికి ఉన్న సత్సంబంధంలోనే ఆనందం నిండుతుంది. ప్రాకృతిక అవసరాలు వేరు. మానసిక అనుబంధాలు వేరు. మనమింకా ఆదిమ ప్రాకృతిక మానసిక దశను దాటలేకపోతున్నాము. అందుకు భిన్నంగా మరింత తిరోగమన సంబంధాలను తిరగతోడుతూనే వున్నాము. సరుకుల మార్కెట్ సృష్టిస్తున్న వింత వ్యామోహపు మాయలో స్త్రీ పురుష సంబంధాలు మార్కెట్ సంబంధాలుగా, మోసం, దగా, దౌర్జన్యాల పరంపరగానే కొనసాగుతున్నది.
ఈ రకమైన సంబంధాల నుండి, బాధల నుండి ఆడపిల్లలను రక్షించుకోవటానికి, ఆడవారిని ఆత్మీయంగా ఆదరించాలని, బతకనీయాలని, సమానత సాధించాలని కోరుకునే గొంతుకలు పాడుకునే పండుగే బతుకమ్మ పండుగ. ఈ పాటల్లో బాధ, ఆవేదనతో పాటుగా పోరాడే చైతన్యమూ ఇమిడి వుంది. తెలంగాణలో ఆడపిల్లలను బతకనీయాలని కోరుకునే అందమయిన పూల పండుగ బతుకమ్మ. ఈ పండుగ సందర్భాన నేడు ఆడపిల్లలు ఎదుర్కొంటున్న వివక్షతను, అమానుషత్వాన్ని ఎదిరించే సంఘటిత చైతన్యాన్ని పొందేందుకు ఉపయోగించాలి. ఆడవాళ్ళను వంట ఇంటికి, మగవారికి కేవలం సేవ చేసే బానిసలా చూసే మనువాద సంస్కృతిని దునుమాడేందుకు, తరిమి కొట్టేందుకు వినియోగించాలి.
ప్రతిఘటించిన చోట ప్రాణాలను బలి ఇవ్వక తప్పటం లేదు. ఖమ్మంలో నర్సమ్మను బతికించుకోలేపోయాము. హత్రాస్‌లో భారతిని బతికించుకోలేక పోయాము. వీళ్ళిద్దరే కాదు గంట గంటకూ ఆడపిల్లలపై అత్యాచారం నిత్యాచారంగా మారిపోతోంది. ఇది ఒకరిద్దరి వ్యక్తుల దుర్మార్గం మాత్రమే కాదు. ఇలాంటి దుష్ట వ్యవస్థకు ప్రాణం పోసి పెంచుతున్న పాలకుల భావాలది. తరతరాలుగా వస్తున్న వేళ్ళూనుకొన్న భావాల ప్రతిఫలనం ఇది. వ్యవస్థ దుష్టత్వానికి కాసిన విష ఫలాలివి. అందుకే ఈ దుష్టత్వాలు అంతమొందించే వరకు బతుకమ్మ పాటల్ని పోరుగీతాలు గా పాడుకుంటూనే యుద్ధం చెయ్యాలి.