2020 అక్టోబర్ 17 నాటికి భారత కమ్యూనిస్టు ఉద్యమానికి వందేళ్ళు నిండుతాయి. శత వార్షిక ఉత్సవాలను కమ్యూనిస్టు ఉద్యమం జరుపుకుంటున్నది. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదుల అణచివేతకు, నిర్బంధానికి అడుగడుగున కమ్యూనిస్టు ఉద్యమం గురైంది. అయినప్పటికీ బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా జరిగిన జాతీయోద్యమంలో సంపూర్ణ స్వాతంత్య్రం కోసం మొట్ట మొదటిగా పిలుపు యిచ్చింది కమ్యూనిస్టులే. 1917లో కామ్రేడ్ లెనిన్ నాయకత్వాన నాడు రష్యాలో జయప్రదమైన అక్టోబర్ సోషలిస్టు విప్లవం ప్రపంచ మానవాళిపై గొప్ప ప్రభావాన్ని కలిగించింది. అన్ని రకాల దోపిడీలను మానవజాతి చరిత్రలో ప్రథమంగా నిర్మూలించిన విప్లవం అది. వేల సంవత్సరాలుగా దోపిడీ శక్తుల అణచివేతకు పీడనకు గురైన కార్మికులు, శ్రమజీవులు, పీడితులను అధికారంలోకి తీసుకొచ్చిన విప్లవం అది. ఒక మనిషిని మరో మనిషి ఒక జాతిని మరో జాతి దోపిడీ చేసే పద్ధతిని తుద ముట్టించి సమసమాజం సోషలిస్టు వ్యవస్థను నిర్మించిన విప్లవం అది.
ఈ విప్లవ ప్రభావం సహజంగానే ప్రపంచంతో పాటు మన దేశంపై కూడా పడింది. ఈ విప్లవ ప్రభావంతో సామ్రాజ్య వాదుల దోపిడీ నుండి అనేక దేశాలు బయటపడ్డాయి. స్వాతంత్య్రం పొందాయి. వలసలు విముక్తి అయ్యాయి. మన దేశంలో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా జాతీయోద్యమం ముమ్మరంగా జరుగుతున్న రోజులవి. ఈ విప్లవ ప్రభావానికి గురైన కొంత మంది దేశభక్తులైన యువకులు, విప్లవ కారులు తీవ్ర నిర్బంధాల మధ్య రహస్య మార్గంలో సోవియట్ చేరుకున్నారు. సోవియట్ సోషలిస్టు వ్యవస్థను పరిశీలించారు. ఆ విప్లవానికి నాయకత్వం వహించిన లెనిన్‌ను కలుసుకున్నారు. వివిధ సమస్యలపై ఆయనతో చర్చించారు. మార్క్సిజం, లెనినిజం సిద్ధాంతాన్ని అధ్యయనం చేశారు. వారికి కమ్యూనిస్టు పార్టీ, దాని సిద్ధాంతం మార్క్సిజం, లెనినిజం పట్ల విశ్వాసం ఏర్పడింది.అలా వెళ్ళిన ప్రవాస భారతీయులు ఎం.ఎన్.రారు, ఎవలిన్‌రారు, అబనీ ముఖర్జీ, మహ్మద్ అలీ, రోజా ఫిటింగో, మహ్మద్ షరీఫ్ సిద్ధిఖీ, ఎం.పి.బి.టి.ఆచార్య. ఈ ఏడుగురుతో నాటి సోవియట్‌లోని తాష్కెంట్ పట్టణంలో 1920 అక్టోబర్ 17న భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. మహ్మద్ షరీఫ్ ఈ కమిటీకి కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఇందులో ఎవిలిన్ రారు మహిళ, ఈమె అమెరికన్ కమ్యూనిస్టు ఎం.ఎన్.రారు భార్య. రోజాఫిటింగో కూడా మహిళ, ఈమె రష్యన్ కమ్యూనిస్టు, అబనీ ముఖర్జీ భార్య.
భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపకులను ఈ విధంగా చెప్పవచ్చు. దేశభక్తులైన పంజాబ్ గదర్‌పార్టీ వీరులు. లాలా హరిదయాళ్, రతన్‌సింగ్, భాయి సంతోష్ సింగ్, సోహాన్‌సింగ్ భాఖ్నా, తేజ్ సింగ్ తదితరులు. ఖిలాఫత్ ఉద్యమం ద్వారా కమ్యూనిస్టులుగా మారిన ముజాహీరు (ముస్లింలు) మహ్మద్ షరీఫ్ సిద్ధిఖీ, షౌకత్ ఉస్మానీ, మహ్మద్ అలీ, గులాం హుస్సేన్ తదితరులు. ఆనాడు విదేశాలకు వెళ్ళిన విప్లవకారులు ఎం.ఎన్.రారు, అబనీ ముఖర్జీ, ఎం.పి.బి.టి.ఆచార్య తదితరులు. జాతీయ విప్లవ వీరులు భగత్‌సింగ్, సహచరులు శివవర్మ, విజరుకుమార్ సిన్హా, కిషోరిలాల్, జయదేవ్‌కపూర్, కుందన్‌లాల్ హరికిషన్‌సింగ్ సూర్జిత్ తదితరులు. చిట్టగాంగ్ జైల్లో నిర్బంధించబడిన బెంగాల్ ఉగ్రవాదులు గణేష్ ఘోష్, సుబోధ్‌రారు, హరేకృష్ణ కోనార్, సతీష్ పకైనీ, సుధాంశుద్వా గుప్తా, అంబికా చక్రవర్తి, కల్పనాదత్ (మహిళ)(ఈమె 7 సంవత్సరాలు చిట్టగ్యాంగ్ జైల్లో నిర్బంధించబడి వున్నది), కమల్ చటర్జీ (మహిళ)(ఆమె 6 సంవత్సరాలు చిట్‌గాంగ్ జైల్లో నిర్బంధించబడి వున్నది) తదితరులు.
ఆనాడు ప్రముఖ కార్మిక నాయకులు ముజఫర్ అహ్మద్, ఎస్.ఎ.డాంగే, బి.టి.రణధివే, జ్యోతిబసు తదితరులు జాతీయోద్యమంలోని వామపక్ష వాదులు. పుచ్చలపల్లి సుందరయ్య, ఈ.ఎం.ఎస్.నంబూద్రిపాద్, ఎ.కె.గోపాలన్, కృష్ణ పిళ్ళై తదితరులు.
బ్రిటిష్ ప్రభుత్వ నిర్బంధం
బ్రిటిష్ ప్రభుత్వం అక్టోబర్ విప్లవ ప్రభావం, దాని భావజాలం మార్క్సిజం, లెనినిజం భారత దేశంలోకి రాకుండా నిరోధించడానికి తీవ్ర ప్రయత్నాలు చేసింది. అయినప్పటికీ విల్లవకారుల రాకను, విప్లవ భావాలను నిరోధించలేక పోయింది. ప్రారంభంలో కమ్యూనిస్టులపై అనేక కుట్ర కేసులను బనాయించింది. జైళ్ళకు పంపింది.
1922-24 మధ్య పెషావర్ కుట్ర కేసులో 14 మందిని 1924-29 మధ్య కాన్పూరు కుట్ర కేసులో 18 మందిని 1929-33 మధ్య మీరట్ కుట్ర కేసులో 32 మందిని బంధించి జైళ్ళకు పంపింది. ఇవిగాక 1930వ దశకంలో మద్రాస్ కుట్రకేసు లాహౌర్ కుట్ర కేసులను సైతం కమ్యూనిస్టులపై బనాయించింది. పేర్కొనవలసిన విషయమేమిటంటే తాష్కెంట్‌లో 1920లో ఆవిర్భవించిన కమ్యూనిస్టు పార్టీ, 1942 అక్టోబర్ క్విట్ ఇండియా ఉద్యమం వరకు 22 సంవత్సరాల పాటు దేశంలో నిషేధంలోనే పెరిగింది. జాతీయోద్యమంలో కమ్యూనిస్టులు సంఘటితం కాకుండా వారిపై ప్రత్యేకంగా నిఘా వేసి, అణచివేయాలని నాటి బ్రిటిష్ ప్రభుత్వ హౌం శాఖ రహస్యంగా సర్క్యూలర్‌ను అధికార్లకు పంపింది.
ఇంతటి నిర్బంధంలోనూ, జాతీయోద్యమంలో సంపూర్ణ స్వాతంత్య్రం కోసం పిలుపునిచ్చింది కమ్యూనిస్టులే.
కమ్యూనిస్టులను బ్రిటిష్ ప్రభుత్వం వేటాడుతూ, నిర్బంధిస్తూన్నప్పటికీ జాతీయోద్యమంలో అన్ని కాంగ్రెస్ మహాసభలలో సంపూర్ణ స్వాతంత్య్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానాలు ప్రవేశ పెడ్తూ వచ్చారు. ఆనాడు కాంగ్రెస్ నాయకత్వం బ్రిటిష్ వారి నుండి సంపూర్ణ స్వాతంత్య్రం కాక, కేవలం హౌంరూల్, అధినివేశ ప్రతిపత్తిని మాత్రమే కోరుతూ వచ్చారు. జాతీయ మహాసభలలో కమ్యూనిస్టు పార్టీ ఒక సంవత్సర కాలంలోనే 1921లో అహ్మదాబాద్ కాంగ్రెస్ మహాసభలో సంపూర్ణ స్వాతంత్య్రాన్ని డిమాండ్ చేస్తూ, తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఎం.ఎన్.రారు, అబనీ ముఖర్జీలు ఇందుకోసం ప్రత్యేకంగా కృషి చేశారు. గాంధీ వ్యతిరేకించారు. తిరిగి మరల ఒక సంవత్సరం అనంతరం 1922లో 'గయ' కాంగ్రెస్ మహాసభలో ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు సింగారవేలు చెట్టియార్ సంపూర్ణ స్వాతంత్య్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానాన్ని ప్రవేశపెడ్తూ ప్రసంగించారు. తిరిగి మరల కాంగ్రెస్ గాంధీ నాయకత్వంలో ఈ తీర్మానాన్ని వ్యతిరేకించింది.
8 సంవత్సరాల అనంతరం 1929లో 'లాహౌర్'లో జరిగిన జాతీయ కాంగ్రెస్ మహాసభలో మౌలానా హస్రత్ మెహానీ సహకారంతో స్వామీ కుమారనంత సంపూర్ణ స్వాతంత్య్రాన్ని డిమాండ్ చేస్తూ, తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. వీరు ఇద్దరు సోషలిస్టు భావాలు కలిగిన వారు. ప్రతినిధుల తీవ్రమైన ఒత్తిడితో గాంధీ తన వైఖరిని మార్చుకున్నారు. 'హౌంరూల్' నుండి కాంగ్రెస్ తన వైఖరిని 'స్వరాజ్'గా డిమాండ్ చేస్తూ మార్చుకున్నది. క్రమంగా అది స్వాతంత్య్రం డిమాండ్‌గా మారింది. భారత కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో ఇదొక ఉజ్జృల ఘట్టం. లాహౌర్ మహాసభ అనంతరం హస్రత్ మెహానీ కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడిగా మారిపోయారు.
కమ్యూనిస్టులు కాంగ్రెస్ వేదికలపైన మాత్రమే కాదు, రహస్యంగా సంపూర్ణ స్వాతంత్య్రాన్ని డిమాండ్ చేస్తూ, కార్మికుల ఉద్యమాలకు నాయకత్వం వహించారు. బొంబాయిలోఈ డిమాండ్‌పై 1928లో లక్షన్నర మంది కార్మికులు ఆరు నెలల పాటు సమ్మె చేశారు. 2 కోట్ల 10 లక్షల పనిదినాలు ఈ సమ్మె వల్ల నష్టం జరిగింది. ఈ సమ్మెకు సంఘీభావంగా మద్రాస్‌లో రైల్వే కార్మికులు సమ్మె చేశారు. 1929లో కూడా ఇదే డిమాండ్‌పై కోర్టులలో విచారణ జరుగుతున్న సందర్భంలో సైతం కమ్యూనిస్టులు అత్యంత ధైర్య సాహసాలతో కోర్టు వేదికలపై కూడా మాట్లాడారు. మీరట్ కుట్ర కేసు విచారణ సందర్భంగా ముద్దాయిలైన ముజఫర్ అహ్మద్, ఎస్.ఏ.డాంగే, షౌకత్ ఉస్మానీ, ఎస్.వి.ఘాటే తదితరులు కోర్టు హాల్‌లో సంపూర్ణ స్వాతంత్య్రాన్ని డిమాండ్ చేస్తూ మాట్లాడారు. బ్రిటిష్ వారి నుండి స్వాతంత్య్రాన్ని సాధించడమే మా ఏకైక లక్ష్యమని డిమాండ్ చేశారు. కోర్టు హాల్‌లో కమ్యూనిస్టులు చేసిన ప్రసంగం దేశ ప్రజలలో స్ఫూర్తిని, పోరాట చైతన్యాన్ని కలిగించింది.
మరొక అంశమేమిటంటే, బ్రిటిస్ ప్రభుత్వం కమ్యూనిస్టులను నిర్బంధిస్తూ, కుట్ర కేసులు మోపుతుంటే, జాతీయోద్యమ నాయకులైన గాంధీ గానీ, నెహ్రూ కానీ, పటేల్ గానీ ఏ నాడు బ్రిటిష్ ప్రభుత్వ వైఖరిని ఖండించలేదు. ఇది వారి వర్గ స్వభావం.
దేశంలో అణచివేతల మధ్య మార్క్సిస్టు భావాల ప్రచారం
1922లోనే మార్క్సిస్టు భావాల విస్తృతి కోసం దేశంలో అయిదు అధ్యయన గ్రూపులు ఏర్పడ్డాయి. బెనారస్‌లో షౌకత్ ఉస్మానీ లాహౌర్‌లో గులాం హుస్సేన్ కలకత్తాలో ముజఫర్ అహ్మద్ బొంబాయిలో ఎస్.ఏ.కాంగే మద్రాస్‌లో సింగారవేలు చెట్టియార్ నాయకత్వంలో ఏర్పడిన ఈ గ్రూపులు సంపూర్ణ స్వాతంత్య్ర ఆవశ్యకతను వివరిస్తూ మార్క్సిస్టు భావాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాయి. ఇంక్విలాబ్, గణవాణి, సోషలిస్టు, లేబర్ కిసాన్ గజేత్ పత్రికలను రహస్యంగా ఈ గ్రూపులు నడిపాయి. ప్రజలకు దేశభక్తిని, పోరాట చైతన్యాన్ని పత్రికలు కల్పించాయి.
సంఘటితం కావడానికి కమ్యూనిస్టుల ప్రయత్నాలు
దేశ వ్యాపితంగా ఒక సమైక్య పార్టీగా సంఘటితం కావడానికి విడివిడిగా వున్న ఈ గ్రూపులు ప్రయత్నం చేశాయి. అణచివేతల నిర్బంధాలతో ఇబ్బందులు పడ్డారు. తీవ్రమవుతున్న దాడులు, మరో వైపు భారత జాతీయ కాంగ్రెస్ గాంధీ నాయకత్వంలో బ్రిటిష్ వాళ్ళతో అనుసరిస్తున్న రాజీ పాత్ర వల్ల మరో వేదిక ఏర్పరచి పోరాడాలని 1928లో కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ 6వ మహాసభ సలహా యిచ్చింది. ఈ సలహా మేరకు వర్కర్స్ అండ్ పేజెంట్స్ పార్టీని (డబ్ల్యూపిపి) స్థాపించాలని కమ్యూనిస్టులు భావించారు. వర్కర్స్ పేజెంట్స్ పార్టీ (డబ్ల్యూపిపి) మహాసభ జరుగుతుండగానే, బ్రిటిష్ ప్రభుత్వం మహాసభపై దాడి చేసింది. మహాసభను నిషేధించి పాల్గొన్న నాయకులు అందర్నీ మీరట్ కుట్ర కేసులో ఇరికించింది. అయినప్పటికీ బొంబాయి, కలకత్తా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్‌లలో ఈ మహాసభశాఖలు ఏర్పడి కార్మికులు, కర్షకులు, మధ్య తరగతి ప్రజల్లోకి ఉద్యమ వ్యాప్తికి కృషి చేశాయి. 1920 తాష్కెంట్‌లో స్థాపన జరిగి 1925లో కాన్పూర్‌లో సత్యభక్తి ఆధ్వర్యంలో ఒకసారి సమావేశమైనప్పటికీ దేశ వ్యాపితంగా సంఘటిత రూపంలోకి కమ్యూనిస్టులు రాలేకపోయారు. ఈ ఇబ్బందుల మధ్య కూడా 1930లో కమ్యూనిస్టు పార్టీ తన కార్యాచరణ ముసాయిదాను ప్రకటించింది. దేశంలో బ్యాంకులు, పరిశ్రమలు, రైల్వేలు, సముద్ర నదీ రావాణాలను తేయాకు తోటలను జాతీయం చేయాలి. బ్రిటిష్ అధికార్లకు క్రిష్టియన్ చర్చీలకు చెందిన ఆస్తులను భూములను ఎలాంటి పరిహారం లేకుండా స్వాధీనం చేసుకోని ప్రజలకు పంచాలి. స్వదేశీ సంస్థానాలను రద్దు చేయాలి. సంస్థానాధిపతుల భూములను ప్రజలకు పంపిణీ చేయాలి. కార్మికులకు 8 గంటల పనిని డిమాండ్ చేస్తూ సమాజంలోని అస్పృశ్యతనుకుల వివక్షతను ఈ ముసాయిదా ఖండించింది. ముసాయిదా సంపూర్ణ స్వాతంత్య్రాన్ని డిమాండ్ చేసింది. 1933 కలకత్తా మహాసభతోనే భారత కమ్యూనిస్టు పార్టీ పూర్తి స్థాయిలో ఉనికిలోకి వచ్చింది.
మీరట్ కుట్ర కేసు ఖైదీలు విడుదల అయిన వెంటనే కలకత్తాలో అయిదు రోజుల పాటు. నాలుగు ప్రదేశాలలో మహాసభ జరుపుకున్నారు. అప్పటికీ కమ్యూనిస్టుల సభ్యత్వం రెండు వందలు. ఈ మహాసభలో డాక్టర్ అధికారి కార్యదర్శిగా కేంద్ర కమిటీ ఎన్నికైంది. ఒక సంఘటిత రూపం కమ్యూనిస్టు ఉద్యమం తీసుకున్నది. కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిందని ప్రకటన చేసింది. మహాసభ జరిగిన వెంటనే బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీని నిషేధిస్తూ ప్రకటన చేసింది.
జాతీయోద్యమంలో భాగంగా సామాజిక సమస్యలపై కమ్యూనిస్టుల కృషి
మహారాష్ట్ర, కేరళ, ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాలలో దళితుల సమస్యలపై అగ్ర కుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఈ కాలంలో కమ్యూనిస్టులు తీవ్రంగా పోరాడారు.
కేరళలో కామ్రేడ్స్ ఎ.కె.గోపాలన్, ఈఎంఎస్ నంబూద్రిపాద్, పి.కృష్ణ పిళ్ళై, టి.ఇ.బాలన్, కె.ఎ.కేరళీయన్ నాయకత్వంలో దళితులను సమీకరించి పోరాడారు. గురువాయూర్, త్రివాన్‌కూర్, వైకోమ్, కండోత్ ప్రాంతాలలో దేవాలయాలలోకి ప్రవేశం, అంటరానితనంకు వ్యతిరేకంగా తాగునీటి సరస్సులు, శ్మశానాల కోసం పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయి. పదిహేను వేల మందికి పైగా దళితులు ఉద్యమంలో పాల్గొన్నారు. కామ్రేడ్స్ ఎ.కె.గోపాలన్ తదితరులపై అగ్రకుల దురహంకారులు భౌతికంగా దాడి చేసి తప్పుడు కేసులు బనాయించారు.
మహారాష్ట్ర మహర్‌లో చౌదర్ చెర్వు నుండి దళితులు నీళ్ళు తోడుకునే ఉద్యమం, మనుస్మృతి దహనం చేసిన ఉద్యమం వేల సంఖ్యలో దళితులను కదిలించింది. అంబేద్కర్ నాయకత్వం వహించిన ఈ ఉద్యమంలో కమ్యూనిస్టు నాయకుడు కామ్రేడ్ మోర్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.
నాసిక్‌లో కలారం మందిరంలోకి దళితుల ప్రవేశం బొంబాయిలో కొంకణ్ రైతులు ఖోటో పన్ను విధింపునకు అగ్రకుల ఆధిపత్యంకు బొంబాయిలో 10 వేల మందితో రైతులు అసెంబ్లీ వద్దకు ప్రదర్శన జరిపారు. ఈ ప్రదర్శనకు అంబేద్కర్, ప్రముఖ కిసాన్ సభ నాయకుడు శ్యాంరావు పరువేకర్ తదితరులు నాయకత్వం వహించారు. బొంబాయిలో దళిత కార్మికుల పట్ల యాజమాన్యం వివక్షతకు వ్యతిరేకంగా గిర్నికామ్‌గార్ యూనియన్ కమ్యూనిస్టుల నాయకత్వంలో పోరాడింది. వివక్షత రద్దైంది.
ఆంధ్రలో సుందరయ్య వ్యవసాయ కార్మిక సంఘాన్ని 1934లో దేశంలో మొట్టమొదట ఏర్పరిచారు. కూలీరేట్లు, అస్ప్రశ్యత, సహపంక్తి భోజనాలు, దళితులు పబ్లిక్ బావుల నుండి నీళ్ళు తోడుకోవడం, దళితులకు రాత్రిబడులు, ప్రాథమిక హెల్త్ సెంటర్స్ ఏర్పాటు, సహకార దుకాణాలు తదితర సమస్యలను తీసుకొని, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వారి సంక్షేమానికి కృషి చేశారు.
తమిళనాడులో పెరియార్ నాయకత్వంలో జరిగిన దళితుల ఆత్మ గౌరవ ఉద్యమంలో కమ్యూనిస్టు నాయకులు జీవానందన్, బి.శ్రీనివాసరావు గార్లు చురుకుగా పాల్గొన్నారు. దళిత వ్యవసాయ కార్మికుల కోసం తంజావూరులో శ్రీనివాసరావు వ్యవసాయ కార్మిక సంఘాన్ని స్థాపించి వారి సమస్యలపై కృషి చేశాడు. ఈ ఉద్యమాలన్నీ ఆ రోజులలో కమ్యూనిస్టుల పట్ల దళితుల ఆదరాభిమానాలను చూరగొన్నాయి. కమ్యూనిస్టులను ''మాల మాదిగ పార్టీలోళ్ళు'' అని భూస్వామ్య శక్తులు వ్యంగ్యంగా కామెంట్ చేసేవారు.
1936-39లలో దేశంలో ఉవ్వెత్తున జరిగిన కమ్యూనిస్టుల ప్రజాపోరాటాలు
1935 నాటికి ప్రపంచ పరిస్థితులు మారిపోయాయి. రెండవ ప్రపంచ యుద్ధ ప్రారంభకాలం. హిట్లర్ నాయకత్వాన ఫాశిస్టు మూకలు 1939లో పోలెండ్‌పై దాడి చేశాయి. దీనికి ప్రతిగా వెంటనే బ్రిటన్, ఫ్రాన్సులు జర్మనీపై దాడి చేశాయి. శాంతి స్థాపనకై యుద్ధ వ్యతిరేక శక్తులన్నింటినీ సమీకరించాలని భారత్‌తో సహా వలస దేశాల్లో విశాల ప్రాతిపదికపై సామ్రాజ్యవాద, ఫాశిస్టు వ్యతిరేక ఐక్య సంఘటనలను నిర్మించాలని కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ 7వ మహాసభ కమ్యూనిస్టులకు పిలుపునిచ్చింది. బ్రిటిస్ కమ్యూనిస్టు పార్టీ నాయకులు పామీదత్‌బెన్ బ్రాడ్లీలు ఈ పిలుపును భారతదేశ నిర్ధిష్ట పరిస్థితులకు, ఐక్య సంఘటన నిర్మించడానికి అవసరమైన విధానాన్ని సూచించుతూ భారత కమ్యూనిస్టులకు ఒక సిద్ధాంత పత్రాన్ని పంపించారు. దీన్నే ''దత్-బ్రాడ్డీ థీసెస్'' అని పిలవడం జరిగింది. ఈ థీసిస్‌ను అనుసరించి మన దేశంలో సామ్రాజ్యవాద వ్యతిరేక ఫాశిస్టు వ్యతిరేక ఐక్య సంఘటనలల్ని అభివృద్ధి చేసేందుకు కమ్యూనిస్టులంతా ప్రజలను సమీకరించాలని కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించింది. ఈ నిర్ణయం మేరకు కమ్యూనిస్టు కాంగ్రెస్‌లో చేరి ప్రజల సమస్యపై పెద్ద ఎత్తున పోరాడారు. 1936-37లో దేశ వ్యాపితంగా 397 కార్మికుల సమ్మెలు జరిగాయి. 6 లక్షల మంది జనరల్ సమ్మె చేశారు. కాన్పూర్‌లో 40 వేల మంది జౌళి కార్మికులు సమ్మె చేశారు. 38లోకూడా విస్తృతంగా కార్మికుల కోసం సమ్మెలు జరిగాయి. సంపూర్ణ స్వాతంత్య్రాన్ని డిమాండ్ చేస్తూ ఈ సమ్మెలన్నీ కాంగ్రెస్ మద్దతుతో కమ్యూనిస్టులు చేసిన పోరాటాలు.
ఆంధ్రలో ఆనాటి కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా వున్న సుందరయ్యగారి నాయకత్వంలో రైతాంగ సమస్యలపై ఇచ్చాపురం నుండి మద్రాసు వరకు చారిత్రాత్మకమైన రైతు రక్షణ యాత్ర జరిగింది. ప్రభుత్వాల దృష్టికి ఈ యాత్ర రైతాంగ సమస్యలను తీసుకొచ్చింది. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం కాళీపట్నం కృష్ణా జిల్లా చల్లపల్లి, మునగాల జమిందారీ వ్యతిరేక పోరాటాలన్నీ కాంగ్రెస్‌లో వున్న కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగాయి.
ఈ పోరాటాల క్రమంలోనే కాంగ్రెస్‌లోని వామపక్ష వాదులతో 1936లో అఖిల భారత కిసాన్ సభ (ఏఐకెఎస్), అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ (ఏఐఎస్‌ఎఫ్), అభ్యుదయ రచయిత సంఘాలు దేశ వ్యాపితంగా ఏర్పడ్డాయి. ఆనాడు ఏఐసీసీ కి 20 మంది కమ్యూనిస్టులు ఎన్నుకోబడ్డారు. ఈ క్రమంలోనే కేరళ రాష్ట్ర కాంగ్రెస్ కమిటి కార్యదర్శిగా వున్న కృష్ణ పిళ్ళై, ఈఎంఎస్ నంబూద్రిపాద్, ఎకె.గోపాలన్, ఆంధ్రలో పి.సుందరయ్య, తమిళనాడులో పి.రామమూర్తి తదితరులు కమ్యూనిస్టు పార్టీలోకి వచ్చారు. కేరళలో కాధుణ కృష్ణ పిళ్ళైతోపాటు ఆ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మొత్తం కమ్యూనిస్టు పార్టీ వైపుగా మారింది. తమిళనాడులో జీవానందన్, బి.శ్రీనివాసరావు తదితరులు కమ్యూనిస్టులుగా మారిపోయారు.
జాతీయోద్యంలో వంటరి పాటు
1941 జూన్ 22న హిట్లర్ సోవియట్ పై దాడి చేశాడు. వెంటనే కొమింటర్న్ హిట్లర్ ఫాసిజానికి వ్యతిరేకంగా ప్రజా యుద్ధ నినాదాన్ని యిచ్చింది. సోవియట్‌ను ఆక్రమించి కాకసన్ పర్వతాల ద్వారా భారత దేశం లోకి ప్రవేశించాలనేది హిట్లర్ పథకం. రెండో వైపున జపాన్ ఫాశిస్టులు ఆసియా దేశాలైన ఫిలిప్పిన్స్ ఇండోనేషియా మలయా, బర్మాలను అప్పటికే ఆక్రమించి ఈశాన్య భారతదేశంలోకి చొరబడ్డారు. 1942 ఏప్రిల్ 6న కాకినాడ విశాఖ పట్నాలపై జపాన్ బాంబులు వేసింది. బంగాళాఖాతంలోకి జపాన్ యుద్ధ నౌకలు తిరగడం ప్రారంభించాయి. మన దేశంపై జపాన్ మూకలు ఏ క్షణంలోనైనా పెద్దఎత్తున దాడి చేయవచ్చునని భయపడుతున్న రోజులవి. యుద్ధ స్వభావంలో మార్పు వచ్చింది. ఎంతో కాలంగా సోవియట్ యూనియన్ ప్రయత్నించుతూ వచ్చిన ఫాశిస్టు వ్యతిరేక ఫ్రంట్ అంతర్జాతీయ స్థాయిలో ఏర్పడేందుకు మార్గం సుగమమైంది. అంతర్జాతీయంగా ఫాశిజానికి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి మద్దతు ఇస్తూనే భారత ప్రజలకు ప్రాతినిధ్యం వహించే జాతీయ ప్రభుత్వాన్ని నెలకొల్పేందుకు బ్రిటిష్ ప్రభుత్వంపై కమ్యూనిస్టు పార్టీ వత్తిడి తీసుకొని రావలసిన అవసరం వున్నది కానీ కమ్యూనిస్టులు ఈ పని చేయలేదు. యుద్ధ ప్రయత్నాలకు విఘాతం కలిగించుతాయని, ఫాశిస్టు శక్తులకు సహాయ పడతాయనే ఉద్దేశంతో నాడు దేశంలో జరుగుతున్న క్విట్ ఇండియా ఉద్యమాన్ని పార్టీ వ్యతిరేకించింది. పార్టీ తీసుకున్న ఈ వైఖరి సహజంగానే జాతీయోద్యమం నుండి కమ్యూనిస్టులను వంటరి పాలు చేసింది. బ్రిటిష్ ప్రభుత్వం అప్పటివరకు కమ్యూనిస్టు పార్టీపై వున్న నిషేధాన్ని తొలిసారి ఎత్తివేసింది. మొట్టమొదటిసారిగా కమ్యూనిస్టు పార్టీకి బహిరంగంగా, స్వేచ్చగా పని చేసే వాతావరణం కల్పించబడింది. మరో వైపు బ్రిటిష్ ప్రభుత్వం కాంగ్రెసÊ పార్టీని నిషేధించింది. గాంధీ ఇతర కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి జైళ్ళకు పంపింది. ఈ సందర్భంగా మన గమనంలో వుండాల్సిన అంశమేమిటంటే, కాంగ్రెస్ నాయకులను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేయడాన్ని కమ్యూనిస్టు పార్టీ ఖండించింది. అరెస్ట్ చేసిన నాయకులను విడుదల చేయాలని కమ్యూనిస్టులు ఉద్యమించారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనిస్టులను కుట్ర కేసుల పేరుతో నిర్బంధించి అరెస్ట్‌లు చేస్తున్నప్పుడు నాడు జాతీయోద్యమంలో గాంధీ, నెహ్రూ, పటేల్ ఏ ఒక్కరూ బ్రిటిష్ ప్రభుత్వ వైఖరిని కనీసం ఖండించలేదు. కమ్యూనిస్టుల విడుదల కోసం డిమాండ్ చేయలేదు. జాతీయోద్యమంలో కాంగ్రెస్‌కు, కమ్యూనిస్టులకు నాడు కనపడిన తేడా యిది.
ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీ క్విట్ ఇండియా ఉద్యమం పట్ల అనుసరించిన వైఖరిని నిజాయితీగా ఆత్మ విమర్శ చేసుకున్నది. 1948లో కమ్యూనిస్టు పార్టీ తన ఆత్మ విమర్శను అచ్చు వేసి దేశమంతటా పంచింది. ఇది కమ్యూనిస్టుల నిజాయితి.
స్వేచ్ఛా వాతావరణంలో జరిగిన బొంబాయి ప్రథమ మహాసభ
దీర్ఘకాలం నిషేధంలో కొనసాగిన కమ్యూనిస్టులు 1943లో మొదటి సారి స్వేచ్ఛా వాతావరణంలో బొంబాయిలో పార్టీ ప్రథమ మహాసభను జరుపుకున్నారు. 16వేల పార్టీ సభ్యత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ 139 మంది ప్రతినిధులతో ఈ మహాసభ అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలలో జరిగింది. స్వాతంత్య్ర ఉద్యమంలో కాకలుదీరిన కమ్యూనిస్టు యోధులతో మహాసభ జరిగింది.
ప్రతినిధులలో 70 శాతం మంది బ్రిటిష్ ప్రభుత్వం కారాగారవాసాన్ని అనుభవించిన వారే. అందరి నిర్బంధకాలం కలిపితే 411 సంవత్సరాలు. బ్రిటిష్ ప్రభుత్వం ఆనాడు ఆండమాన్ జైళ్ళకు పంపిన ఖైదీలలో 70 శాతం మంది కమ్యూనిస్టులే. మహాసభ ప్రతినిధులలో గదర్‌పార్టీ నుండి కమ్యూనిస్టుగా మారిన బాబాసోహాన్‌సింగ్ బాఖ్నా జైలు జీవితం 27 సంవత్సరాలు. ఆయన ప్రతినిధులలో అందరికన్నా పెద్దవాడు. వయస్సు 80 సంవత్సరాలు. మహాసభలో ఆయన చేసిన ప్రసంగం ప్రతినిధులలో స్ఫూర్తిని నింపింది. కమ్యూనిస్టులు చేసిన త్యాగాల గనిలో బొంబాయి మహాసభ ఒక మైలురాయిగా నిలిచిపోయింది.
వంటరి పాటు నుండి ముందంజ
1940వ దశకంలో దేశంలో కమ్యూనిస్టుల నాయకత్వంలో చారిత్రాత్మకమైన పోరాటాలు జరిగాయి. ఇందులో విశ్వవిఖ్యాతి గాంచిన తెలంగాణ సాయుధ పోరాటం 1946 నుండి 51 వరకు ఐదేండ్ల పాటు జరిగింది. భుమి, భుక్తి, వెట్టిచాకిరి రద్దు, సామాజిక న్యాయం కోసం నైజాం రాచరిక వ్యవస్థకు దేశ్‌ముఖ్‌లు, దొరలు, భూస్వాములు రజాకార్లు, నెహ్రూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ పోరాటం జరిగింది. నిజాం రాచరిక వ్యవస్థ కూలిపోయింది. ఇండియన్ యూనియన్‌లో నైజాం సంస్థానం 1948 సెప్టెంబర్ 17న విలీనమై స్వాతంత్య్రాన్ని పొందింది. 3వేల గ్రామాలలో దొరలు, భూస్వాముల పెత్తనం అంతమైంది. 10 లక్షల ఎకరాల భూమి గ్రామ పేదలు కమ్యూనిస్టు పార్టీ, ఆంధ్ర మహాసభ నాయకత్వం పంచుకున్నారు. వెట్టిచాకిరి రద్దైంది. 2వేల మంది తెలంగాణా రైతు కూలీ బిడ్డలు 200 సాయుధ దళాలలో చేరిపోరాడారు. 4వేల మంది కమ్యూనిస్టు కార్యకర్తలు పోరాటంలో ప్రాణాలు కోల్పోయారు. 50వేల మంది తెలంగాణా రైతు కూలీ బిడ్డలు నైజాం, రజాకార్లపోలీస్ క్యాంపులలో చిత్ర హింసలకు గురయ్యారు. ''నీ కాల్మొక్కుత దొరా'' అన్న తెలంగాణ రైతు కూలి, ఆ దొరలకు వ్యతిరేకంగా తుపాకి చేతబట్టి పోరాడాడు. కమ్యూనిస్టుల ఔన్నత్యాన్ని ఈ పోరాటం ప్రపంచస్థాయికి తీసుకెళ్ళింది.
1946లో కేరళలో తిరువాన్కూరు రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా వున్న ప్రావాయిలర్ పోరాటం మహౌదృతంగా జరిగి, తిరువాన్కూరు రాచరిక వ్యవస్థ కూలిపోయింది. కయ్యూర్ అమరవీరుల చరిత్రలో నిలిచిపోయారు. బెంగాల్‌లో 'తేభాగా ఉద్యమం' 1938 నుండి 49 వరకు 13 జిల్లాలలో 12 సంవత్సరాల పాటు ఉధృతంగా జరిగింది. త్రిపురలో అగర్తల రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా, ఆదివాసుల సమస్యలపై కామ్రేడ్ దశరధ్ దేవ్ బర్మా నాయకత్వంలో పోరాటాలు జరిగాయి. ఆదివాసుల సమస్యలు పరిష్కారం కావడంతో పాటు, అగర్తలా రాచరిక వ్యవస్థ కూలిపోయింది. మహారాష్ట్రలో కామ్రేడ్ గోదావరి పరులేకర్ నాయకత్వంలో 1945 నుండి 47 వరకు 2 సంవత్సరాల పాటు ఆదివాసుల భూమి, భుక్తి, వెట్టిచాకిరి రద్దు కోసం సామాజిక న్యాయం కోసం పోరాడారు. పంజాబ్‌లో రైతులపై పెంచిన శిస్తు వ్యతిరేక పోరాటాలు (యాంటి బెటర్‌మెంట్ పోరాటాలు) ఉధృతంగా జరిగాయి. అస్సాంలో 'సుర్మాలోయ' రైతాంగ పోరాటాలు 1936 నుండి 48 వరకు 12 సంవత్సరాల పాటు జరిగింది. అనేక హక్కులు రైతాంగం సాధించుకన్నది. ప్రస్తుతం ఈ ప్రాంతం బంగ్లాదేశ్‌లో వుంది. ఇందులో ప్రత్యేకమైనది బొంబాయి రాయల్ ఇండియన్ నావి తిరుగుబాటు. ఆర్‌ఐఎన్ తిరుగుబాటు అంటారు. 1946లో జరిగింది. మంచి ఆహారం, పై అధికార్ల వేధింపులు, అరెస్ట్ చేసిన రాజకీయ ఖైదీలను, సైనికులను విడుదల చేయాలని, క్విట్ ఇండియా, సంపూర్ణ స్వాతంత్య్రాన్ని డిమాండ్ చేస్తూ నావికులు పోరాడారు. బొంబాయి, కలకత్తా, కరాచీ, మద్రాసు, సూరత్ ఓడ రేవులలోని నావికులు ఒక చేత్తో జాతీయ పతాకం, మరో చేత్తో ఎర్ర జెండాలు పట్టుకొని బ్రహ్మాండమైన సమ్మె చేశారు. బొంబాయి ప్రజలు ఈ సమ్మెకు సంఘీభావంగా వీధులలోకి వచ్చారు. రెచ్చిపోయిన బ్రిటిష్ ప్రభుత్వం ప్రజలపై బొంబాయిలో కాల్పులు జరిపింది. 400 మంది చనిపోయారు. ఈ సమ్మెకు కాంగ్రెస్ నాయకత్వం సంఘీభావం చెప్పలేదు. పోలీసుల కాల్పులను సైతం ఖండించలేదు. పైగా నావికులు అనాలోచితంగా సమ్మె చేశారని పటేల్ ప్రకటించారు. బారికేడ్స్‌ను తొలగించమని గాంధీ బొంబాయి ప్రజలను ఆదేశించాడు. అహింసా వాదులమని చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు బొంబాయి పార్టీ కేంద్రం ఆఫీస్‌పై దాడి చేశారు. ఈ దాడి ఆరు గంటల పాటు జరిగింది. పార్టీ క్యాడర్ ప్రతిఘటించి ఆఫీస్‌ను కాపాడుకున్నారు. 6లక్షల విలువైన పార్టీ ఆస్తికి నష్టం జరిగింది. 60 మందికి పైగా పార్టీ నాయకులు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. కాంగ్రెస్ వారి అహింసాయుత బండారం ఇది. కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన ఈ పోరాటాలు వారి ప్రతిష్టను ప్రజల్లో పెంచాయి. జాతీయోద్యమంలో వంటరి పాలైన వారు పార్టీ పునాదిని విస్తృతి పరుచుకొని ముందంజలోకి వచ్చారు.
1947 ఆగస్టు 15 దేశ స్వాతంత్య్రం
1947 ఆగస్టు 15న బ్రిటిస్ వారి నుండి రాజకాయాధికారం దేశానికి బదిలీ చేయబడ స్వాతంత్య్రం వచ్చింది. స్వాతంత్య్ర సాధనలో జాతీయోద్యమానికి నాయకత్వం వహించిన కాంగ్రెస్ ప్రధాన కారణమని గాంధీ గారి అహింసాయుత సత్యాగ్రహమే కారణమని నేటి కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటారు. కానీ కమ్యూనిస్టు ఉద్యమం కూడా కారణం.
1945 నాటికి అంతర్జాతీయంగా, జాతీయంగా అనేక మార్పులు సంభవించాయి. రెండవ ప్రపంచ యుద్ధం అంతమైంది. హిట్లర్ ఫాశిజానికి ఘోరీ కట్టబడింది. సోవియట్ యూనియన్ ఎర్రజెండాయే దీనికి ప్రధాన కారణం. నాడు ఒక్కటిగా ఉన్న సోషలిస్టు సోవియట్‌కు మరికొన్ని తూర్పు యూరప్ దేశాలు ఫాశిజం నుండి విముక్తి పొంది సోషలిస్టు దేశాలుగా అవతరించాయి. దీని ప్రభావం అంతర్జాతీయంగా అనేక వెనుకబడిన దేశాల స్వాతంత్య్రం సాధనకు ప్రేరణగా నిలిచింది. ఆ ప్రేరణ మన దేశ జాతీయోద్యమం పైన కూడా గణనీయంగా పడింది. దేశంలో జరుగున్న పోరాటాలకు మరింత వూపు నిచ్చింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో షరతులతోనైనా, తను రాజకీయ అధికారాన్ని బ్రిటిష్ వారు వదులుకోక తప్పలేదు. దేశంలో జరుగుతున్న పోరాటాలలో కమ్యూనిస్టుల ప్రాబల్యం రోజురోజుకు పెరుగుతున్నది. తమ చేతులలో నుండి జాతీయోద్యమ నాయకత్వం చేజారిపోతుందనే ఆందోళన గాంధీకి, కాంగ్రెస్ నాయకులకు కలిగింది. ఏదో ఒక రకంగా రాజకీయాధికారాన్ని చేజిక్కించుకోవాలని వీరు భావించారు. జాతీయ అంతర్జాతీయ పరిస్థితుల వత్తిడితో 1947 ఆగస్టు 15న జాతీయ నాయకులకు బ్రిటిష్ వారి నుండి అధికారం బదిలీ చేయబడింది. ఇది గమనించలేక కేవలం గాంధీ గారి అహింసాయుత సత్యాగ్రహాల ద్వారానే మనకు స్వాతంత్య్రం సిద్ధించలేదనేది మన గమనంలో వుండాలి. అందుకు కమ్యూనిస్టు ఉద్యమం కూడా ప్రధాన కారణం. మరొక విషయమేమిటంటే జాతీయోద్యమం నాటి కాంగ్రెస్ అంటే, ఈ కాంగ్రెస్ కాదు. అందులో కాంగ్రెస్, కమ్యూనిస్టులు, సోషలిస్టులు దేశభక్తులైన అనేక మందితో కూడిన విశాలమైన సామ్రాజ్యవాద వ్యతిరేక సంస్థగా ఆనాడు అది వున్నది. స్వాతంత్య్రం అనంతరం గాంధీ గారు మాట్లాడుతూ అన్నాడు. కాంగ్రెస్ లక్ష్యం నెరవేరింది. స్వాతంత్య్రం సిద్ధించింది. ఇక దేశానికి కాంగ్రెస్ అవసరం లేదు. దాన్ని రద్దు చేయాలన్నాడు. అయినా అది రద్దు కాలేదు. ఇప్పటికీ కొనసాగుతూనే వున్నది. పోతూ, పోతూ బ్రిటిష్ వారు దేశాన్ని ఇండియా, పాకిస్తాన్‌గా మత పరంగా చీల్చి, విభజించి వెళ్లారు. శాశ్వత కొట్లాటలు రగిలించిపోయారు. ఆ సందర్భంగా పెద్ద ఎత్తున మత కలహాలు, మారణ కాండ జరిగింది. వేల మంది ప్రజలు వూచకోతకు గురయ్యారు. మత సామరస్యం కోసం ప్రజల మధ్య ఐక్యతను సాధించడానికి నాడు కృషి చేసింది కూడా కమ్యూనిస్టులే.
1952 మొదటి సాధారణ ఎన్నికలలో కమ్యూనిస్టుల విజయాలు
స్వాతంత్య్రం అనంతరం 1952లో స్వతంత్ర భారతావనికి మొదటిసారి సాధారణ ఎన్నికలు పార్లమెంట్‌కు జరిగాయి. 40,50వ దశకంలో మహత్తరమైన వర్గపోరాటాలు నిర్వహించిన వెనువెంటనే కమ్యూనిస్టు పార్టీ ఈ ఎన్నికలలో పోటి చేసి చారిత్రాత్మకమైన విజయాలు నమోదు చేసింది. కమ్యూనిస్టు నాయకుడు సుందరయ్య మొదటి ప్రతిపక్ష నాయకుడుగా పార్లమెంటుకు ఎన్నుకోబడ్డారు. కామ్రేడ్ ఎ.కె.గోపాలన్ లోక్‌సభలోనూ, సుందరయ్య రాజ్యసభలోనూ పార్టీ నాయకులుగా వ్యవహరించారు. పార్లమెంటరీ రంగంలో ఆ ఇద్దరు నాయకులు ఆదర్శవంతంగా నిలిచారు. 1952లో తెలంగాణా, ఆంధ్ర రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కూడా మంచి విజయాలు సాధించారు. కమ్యూనిస్టుపార్టీ పై నిషేధం వున్నందున పీడీఎఫ్ (ప్రోగ్రెసివ్ డెమోక్రసీ ఫ్రంట్) పేరుతో తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీ పోటీ చేసింది. 48 అసెంబ్లీ స్థానాలను అది బలపరిచిన వర్కర్స్ పీజెంట్స్ పార్టీ, షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ పార్టీ, సోషలిస్టు పార్టీలకు కలిపి 20 స్థానాలు వచ్చాయి. మొత్తం 60 స్థానాలను కమ్యూనిస్టులుగానీ, బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. ఆరు పార్లమెంటు స్థానాలను గెలుచుకున్నారు. నల్లగొండ పార్లమెంట్ స్థానం నుండి కమ్యూనిస్టు అభ్యర్థి రావి నారాయణరెడ్డి జవహర్‌లాల్ నెహ్రూ కన్నా అత్యధిక మెజారిటీతో గెలుపొందాడు.
ఆంధ్ర ప్రాంతలో జరిగిన ఎన్నికలలో కమ్యూనిస్టులు 48 అసెంబ్లీ స్థానాలను 12 పార్లమెంట్ స్థానాలను గెలుపొందారు.
1957 కేరళ అసెంబ్లీ ఎన్నికలలో మొట్టమొదటిగా కమ్యూనిస్టు ప్రభుత్వం కామ్రేడ్ ఈఎంఎస్.నంబూద్రిపాద్ ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చింది. దేశంలోనే మొదటిసారిగా భూ సంస్కరణల చట్టాన్ని అమలులోకి తెచ్చి గ్రామీణ పేదలకు భూ పంపిణీ చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి కామ్రేడ్ ఈఎంఎస్.నంబూద్రిపాద్. ఇది సహించలేని కేంద్రంలోని నెహ్రూ ప్రభుత్వం రెండేళ్ళ తర్వాత 1959లో కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని పడగొట్టింది. ఈ చర్యతో నెహ్రూ గారి సోషలిస్టు స్వభావం బహిర్గతమైంది.
కమ్యూనిస్టు ఉద్యమం భారత సమాజానికి చేసిన సేవ-సాధించిన విజయాలు
- 1947 ఆగస్టు 15న దేశ స్వాతంత్య్ర సాధనలో కమ్యూనిస్టు ఉద్యమం గొప్ప ప్రభావాన్ని కలిగించింది.
- జాతీయోద్యమంలో బ్రిటిష్ ప్రభుత్వం నిర్బంధాన్ని ఎదుర్కొంటూ సంపూర్ణ స్వాతంత్య్రం కోసం మొట్టమొదటిగా పిలుపునిచ్చింది కమ్యూనిస్టులే.
- నైజాం, తిరువాన్కూరు, అగర్తల రాచరిక ఫ్యూడల్ వ్యవస్థలను కూలదోసి ఇండియన్ యూనియన్‌లో విలీనం చేసిన వారు కమ్యూనిస్టులు. ఆ సంస్థానాల ప్రజలకు స్వాతంత్య్రం రావడంతో కమ్యూనిస్టుల పాత్ర మరువలేనిది.
ద భూమి పేదలకు పంపిణీ చేయడం, దేశంలో భూ సంస్కరణల చట్టాలు, కౌల్దారీ చట్టాలు, ఆదివాసుల షెడ్యూల్డ్ ఏరియా భూ చట్టాలు సాధనలో కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన పోరాటాలే కారణం.
- 1949లో ఆంధ్రలో జమిందారీ విధానం రద్దైంది. ఈ భూములపై రైతాంగానికి హక్కులు కల్పించడంతో ఆనాడు కాంగ్రెస్‌లో వున్న కమ్యూనిస్టులు చేసిన పోరాటాలే కీలకం. ఇచ్చాపురం నుండి మద్రాసు వరకు జరిగిన రైతు రక్షణ యాత్ర కీలకమైంది.
- దేశంలో రాష్ట్రాల విభజన ఏర్పాటుకు 'భాషను' ప్రాతిపదికగా చేసుకోవాలని వీరతెలంగాణా సాయుధ పోరాటం అనుభవం చెప్పింది. నాడు విశాలాంధ్రలో 'ప్రజారాజ్యం' అనే నినాదాన్ని ఇచ్చింది కమ్యూనిస్టులే.
- 1953లో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు జరిగిన ఉద్యమంలో ముందుండి పోరాడిన వారు కమ్యూనిస్టులు.
- నందికొండ (నాగార్జునాసాగర్), విశాఖ ఉక్కు ఫాక్టరీ సాధన ఉద్యమంలో కమ్యూనిస్టులు ముందున్నారు.
- దేశ సమైక్యత, సమగ్రత ప్రజాస్వామ్యం, లౌకికతత్వం పరిరక్షణలో వామపక్షాలు కమ్యూనిస్టులు ముందున్నారు.
- వ్యవసాయ కార్మికులు, దళితులు, ఆదివాసులు, రైతులు, కార్మికులు, మహిళలు సాధించుకున్న నేటి హక్కులలో కమ్యూనిస్టు ఉద్యమం పాత్ర మరువలేనిది.
గ్రామీణ ఉపాధి హామీ పథకం సాధించడంలో, గిరి.న అటవీ హక్కుల చట్టం తేవటంలో మహిళల గృహ హింస వ్యతిరేక చట్టం రావటంలో, ప్రభుత్వ రంగ పరిరక్షణలో కమ్యూనిస్టులు ప్రధాన భూమిక పోషించారు. దళితుల వివక్షతలపై ఆదివాసీల హక్కులపై, భావా స్వేచ్ఛా హక్కులపై, మత, కుల దురహంకారాలపై నిత్యం పోరాడుతున్నది కమ్యూనిస్టులే. కానీ అసలు స్వాతంత్య్ర పోరాటంతో ఏ సంబంధం లేని, వ్యతిరేకించిన సంఫ్‌ు పరివార్ శక్తులు నేడు నేడు దేశభక్తిని గురించి అబద్ధాలను చెప్తూ పబ్బం గడుపుకుంటున్నారు.
60వ దశకంలో మితవాద, అతివాద పెడధోరణులు, 90వ దశకంలో సోవియట్ సోషలిస్టు క్యాంపు దెబ్బతిన్నప్పటికీ కమ్యూనిస్టు ఉద్యమం భారత్‌లో నిలదొక్కుకుంది. అంతేకాక పరిమిత అధికారాలతోనైనా బెంగాల్, కేరళ, త్రిపుర, వామపక్ష ప్రభుత్వాలు ప్రజలకు ప్రత్యామ్నాయ విధానాలను చూపాయి. కమ్యూనిస్టులు, పాలకుల నిరంకుశ, ప్రజా వ్యతిరేక మతోన్మాద విధానాలను ఎదుర్కొంటూ ప్రజల ప్రయోజనాల కోసం పోరాడుతూ ముందుకు పోతున్నాయి. దేశ సమైక్యత, సమగ్రత, ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, సోషలిజం కోసం ధృడంగా నిలబడి పార్టీ కార్యకర్తలు తమ ప్రాణాలను బలిదానం చేశారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ, మార్క్సిజం, లెనినిజం సిద్ధాంత ఆయుధంతో వందేళ్ళ ప్రస్థానం కొనసాగింది. ఈ ప్రస్థానం భారత ప్రజల ఆకాంక్ష సోషలిజం-కమ్యూనిజం దారిలో సాగిపోతూనే వుంటుంది.
ప్రత్యామ్నాయం కమ్యూనిజం-సోషలిజమే
కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావం నేడు తగ్గింది. ఇది తాత్కాలికమే. కరోనా మహమ్మారీ విజృంభిస్తున్న నేడు ప్రజలను పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్థ కాపాడలేదని నిరూపణ అయింది. సోషలిస్టు ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాపాడగలదని కమ్యూనిస్టు దేశాలైన క్యూబా, వియత్నాం, చైనా, ఉత్తర కొరియాల అనుభవం రుజువు చేస్తున్నది. మన దేశంలో కేరళలోని వామపక్ష ప్రభుత్వం అనుభవం కూడా కనపడుతున్నది. సోషలిజమే మానవాళికి ప్రత్యామ్నాయం. నేడు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మతోన్మాద విధానాలకు, కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్ని సమీకరించడమే కమ్యూనిస్టు ఉద్యమం ముందున్న ప్రధాన కర్తవ్యం. కమ్యూనిస్టు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వేలాది మంది అమర వీరుల స్ఫూర్తితోనే మరింత పట్టుదలతో కమ్యూనిజం ఆశయాల కోసం పోరాడుదాం.
- పి.సోమయ్య, 9490098043
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు