Sat 24 Oct 23:24:55.435344 2020
Authorization
పండుగలు మన సంస్కృతిలో భాగం. అయితే సంస్కృతి అనేది ఎవరిది అనే ప్రశ్న తలెత్తుతుంది. అంటే సంస్కృతి కూడా ప్రజా సంస్కృతి, అధిపతుల, ఆధిపత్య వర్గాల సంస్కృతి అని రెండూ వుంటాయి. చాలా వరకు ఆధిపత్య వర్గాల సంస్కృతినే ప్రజలు తమ సంస్కృతిగా అలవాటు పడుతుంటారు. అయితే ప్రజలు, వారి జీవన గమనంలోంచి ఉత్పన్నమయ్యే సంస్కృతిలోంచి పండుగలు, ఉత్సవాలు కూడా జరుగుతుంటాయి.
అందుకే సురవరం ప్రతాపరెడ్డిగారు పండుగల గురించి చాలా విస్తారంగా వివరించారు. ప్రధానంగా వారు పండుగలను నాలుగు విధాలయినవి వుంటాయని చెబుతారు. ఒకటి రాజ్యాలనేలిన రాజులకు సంబంధించి, వారి యుద్ధాలు, వారి విజయాల నేపథ్యంలో జరుపుకునేవి. వారి జయంతులు మొదలయినవి. ఇక రెండవది ప్రకృతికి సంబంధించిన కాలాలు, ఋతువులు పురస్కరించుకుని చేసేవి. మూడోది గ్రామీణ జీవనంలో ముఖ్యంగా వ్యవసాయం, పశుపోషణ, ప్రకృతి ఆరాధన సందర్భాలు, అంటే పంట కోసం ప్రారంభ వేళ, పంట చేతికి వచ్చాక సంక్రాంతి, ఉగాది మొదలయినవి. నాలుగోది స్త్రీలకు సంబంధించినవి. ఇవి నోములు, వ్రతాలు, ఆడవారి ఆశలు, ఆకాంక్షలు, కోర్కెలు తీరాలని దీక్షబూని చేసేవి. ఇవన్నీ ఆధ్యాత్మికమైన క్రతువులతో కూడుకొని వుంటాయి.
ఇవి కూడా మన దేశంలో, తెలుగు ప్రాంతాలలోనూ వైవిధ్యంగా జరుపుకుంటారు. సంస్కృతి అనేది ఏకశిలా సదృశ్యంగా ఏమీ ఉండదు. ప్రాంతాలను బట్టి, తెగలను బట్టి, సామాజిక తరగతులను బట్టీ, శ్రామిక జీవన గతులను అనుసరించి ఈ పండుగలు జరుపుకుంటారు. ఈ వివిధ రకాలయిన సంస్కృతులలో జరుపుకునే పండుగలను సమాదరించడం, వైవిధ్యతను గౌరవించడం మన భారతీయ సంస్కృతి. వైవిధ్య పూరిత సంప్రదాయాలనన్నింటిని, ఒక తోటలో పూచిన వివిధ రంగుల పూల పరిమళాన్ని ఆస్వాదించినట్లుగానే ఇప్పటివరకూ భారత సమాజం కొనసాగింది.
కానీ నేడు ఒకే సంస్కృతిని ప్రజలందరి మీదా రుద్దాలనే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఒకే దేవుడు, ఒకే సంప్రదాయం, ఒకే పండుగ, ఒకే సంస్కృతి బోధిస్తున్నారు. ఇది వైవిధ్యతకు వ్యతిరేకమయినది. ఉదాహరణకు తమిళనాడు ప్రాంతంలో రావణాసురుణ్ణి ఆరాధిస్తారు. వాస్తవంగా రావణబ్రహ్మ అంటారు. పురాణ సహితంగా చూసినా రావణుడు జ్ఞానవంతుడు. అనేక విద్యలు తెలిసినవాడు. ఆయుర్వేద వైద్యంలో దిట్ట. వీరుడు కూడా. లంక ప్రజలకు మంచి పరిపాలన అందించాడని చెబుతారు. ఏమైన అక్కడ రావణుని కొలుస్తారు. ఇక్కడ దసరా సందర్భంగా రావణ వధ చేస్తూ ఉత్సవాలు ఈ మధ్యే పెరిగాయి. ఇది ప్రజల మధ్య సాంస్కృతిక అంతరాలను వైరుధ్యంగా మారుస్తుంది. అలాగే కేరళలో బలిచక్రవర్తిని గొప్ప దానశీలుడుగా, వీరుడుగా ఆయన స్మృతి చిహ్నంగానే 'ఓనం' పండుగ చేసుకుంటారు. ఇవి ద్రావిడ ప్రాంతంలో వున్న సాంప్రదాయాలు. ఆర్యుల ఆధిపత్య భావజాలమే వీటికి కారణమని చెబుతారు.
ఏది ఏమైనా పండుగ అనేది సంతోషంగా ఇరుగుపొరుగు కలుసుకుని, సామూహికంగా ఆనందాలు, అనుభవాలు పంచుకునే ఒక సందర్భం. పండుగల సందర్భంగా ప్రజల ఆకాంక్షలు వ్యక్తం అవుతాయి. కరోనా, వరదలు, పేదరికం మొదలైన అనేక ఇబ్బందుల మధ్య, ఇవన్నీ తొలగి నిజమైన ఆనందాలు చేరువవ్వాలని పండుగల నాడు కోరుకుందాం.