- (1.11.1915-5.2.1962)
ప్రజల జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకోవడానికి కేవలం వ్యక్తిగత చైతన్యమే సరిపోదు. చేయి తిరిగిన కళా నైపుణితో పాటు విస్తత ప్రజాసంబంధాలు ఆ రచయితకు ఉండితీరాలి. అప్పుడే రచనలు పాఠకాదరణ పొందుతవి. ప్రత్యక్షంగా ప్రజోద్యమాల్లో పాల్గొన్న వాళ్లంతా రచయితలు కాలేరు. రచనకు ముడిసరుకైన ప్రతిభా సంపత్తితో పాటు చారిత్రక ప్రేరణ (Historical Impulse) కావాల్సినంత సమకూరాలి. అప్పుడే ఆ రచయిత ప్రభావపూరిత రచనలు చేయగలుగుతడు. గ్రంథాల పట్ల ఆదరభావం, చదువరి కావడం ఇవే సరిపోవు. పుస్తకం జ్ఞానదాయిని అనే స్పహతో పాటు రచయితల పట్ల అపార గౌరవమర్యాదలు మనఃపేటిలో విరామం లేకుండా పరిమళిస్తుండాలి. అప్పుడే తానొక సంచార గ్రంథాలయం అవగలడు. జనం సమస్యల మీద గొంతెత్తి పిడికిలి బిగించటం మాత్రమే కాదు, త్యాగం మనిషి లోలోపల జీవ లక్షణంగా తొణికిస లాడాలి. అప్పుడే అతను నిజమైన ప్రజామేధావి (Public Intellectual) గా రాణించగలడు. ఈ మొత్తం గుణగణాలకు సారస్వత సాక్షాత్కారం వట్టికోట ఆళ్వారుస్వామి.
తెలంగాణ వైతాళికుల్లో ఆళ్వారు స్వామి ఒకరు. నిజాం ఏలుబడి అంత మొందించడానికి, దొరల దేశ్‌ముఖ్‌ల దురాగాతాల నుండి ప్రజలు విముక్తం కావడానికి వెన్నుచూపక పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుల్లో అగ్ర గణ్యుడు. తెలంగాణ భాషాసాహిత్యాల వికాసం కోసం అత్యంత నిబద్ధతో కషిసల్పిన అక్షర సేనాని. నిరంకుశ ప్రభువులను జయించడానికి ప్రజా విప్లవం మినహా మరో దారేది లేదని, భావజాల వ్యాప్తి ద్వారానే ప్రజావిప్లవం రాగలదని, భావజాల వ్యాప్తికి అధ్యయనమే బలమైన పునాది వేయగలదని, అధ్యయనశీలురే ప్రాపంచిక బోధనలు చేయగలరని ప్రగాఢంగా నమ్మి గ్రంథ ప్రచురణ పంపిణీలను పూనికతో చేపట్టిన మహనీయుడు. అఖండ భారతంలో హైదరాబాదు రాష్ట్రంలో రాచరికం కొనసాగడాన్ని నిరసించి తదనుగుణ ఇతివత్తాలనెంచుకొని ఉత్కష్ట రచనలు వెలువరించిన మహా సజనకారుడు.
పేదరికం వెక్కిరింతకు చిన్నాచితక ఉపాధి మార్గాల్లో పొట్ట పోసుకుంటూ బీదసాదల బాధలు తీరే సోషలిజాన్ని కలగన్న వాడు. గ్రామాల్లో పెత్తందార్లు గడీల ద్వారా చక్రంతిప్పడాన్ని అడ్డుకున్న మొనగాడు. నల్లగొండ జిల్లా ఆంధ్ర మహాసభ అధ్యక్షుడిగా తెలంగాణ దాస్యవిముక్తికై సభలు చేసిన వ్యూహకర్త. అహరహం చైతన్యశీలతను ప్రదర్శిస్తూ పంతొమ్మిది వందల నలబైల నాటి ప్రజారాజకీయాలను పాత్రికేయుడు గా పరిపోషించిన చింతనాపరుడు. ఎనభై ఏండ్ల క్రిందట మన తాత ముత్తాతల అమ్మమ్మ నాయనమ్మ అవ్వల నెత్తుటి జ్ఞాపకంలోని 'గలాటా' కాలంలో హైదరాబాద్ రాష్ట్ర ప్రాదేశిక పటం రాజకీయంగా సాంస్కతికంగా సామాజికంగా ఎట్లా ఉండేదో తెలుసుకోవడానికి వట్టికోట రచనలు ఇప్పటి నాల్గో తరానికి చారిత్రక ఆధారాలు.
దాశరథి సోదరుల మేనమామగా వారిరువురి రచనలకు ఆళ్వారుస్వామి అందించిన ప్రోత్సాహం అపురూపం. తత్ కతజ్ఞతగా 'అగ్నిధార' కావ్యాంకితం పొందగలిగినడు. కవులు, రచయితలు ప్రజల చరిత్రకు సంబంధించిన వీరోచిత ఘట్టాలను, స్ఫూర్తివంతమైన ఉద్యమ సన్నివేశాలను సజనకు మాతకలుగా స్వీకరించాలని రాసి చూపిన మార్గదర్శి. రచయితను మహా రచయితగా, రచనను గొప్ప గ్రంథంగా నిలబెట్టేవి సమకాలీనత, సామ్యవాద దక్పథాలేనని నిరూపించిన నిఖార్సయిన సాహిత్యవేత్త. పాత్రికేయుడుగా, గ్రంథాలయోద్యమకారుడుగా ఆళ్వారు స్వామి అన్ని తరాలకూ ఆదర్శమూర్తి. హైదరాబాదు రాష్ట్ర విమోచనోద్యమ సాంస్కతిక దళ సభ్యుడుగా ఆళ్వారు స్వామి పాత్ర సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకష్ణారావు, కాళోజీ, దాశరధిలకు సరిసమానమైనది. నలబై ఆరేండ్లే బతికిన ఆళ్వారుస్వామి దేశభక్తి ఉద్యమాచరణ విశ్వాసాలను పరిశీలిస్తే- సుప్రసిద్ధ బ్రిటిష్ పార్లమెంటేరియన్, ఐరిష్ తత్త్వవేత్త అడ్మండ్ బ్రూక్ ఇంగ్లాండ్ 1688 ప్రజోద్యమాన్ని స్మరిస్తూ చెప్పిన ''విప్లవం దాని మౌలికసూత్రాలు ప్రజలకు రాజకీయ దైవిక దఢత్వాన్ని ప్రశ్నించే శక్తితో పాటు తమకు ఇష్టమైన ప్రతి నిథులను ఎన్నుకునే హక్కును, అరాచకానికి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన దుష్టపాలకులు మూల్యం చెల్లించు కునేలా చేసే స్థితిని, స్వరాజ్యాన్ని ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కల్పిస్తాయి (రైట్స్ ఆఫ్ మేన్ అండ్ కామన్ సెన్స్-థామస్ పెయిన్)'' మాటలు గుర్తుకొస్తాయి. ప్రజాస్వామ్య భావన, దోపిడీ దురాగతాలపై తిరుగుబాటు, స్వాతంత్య్రేచ్ఛ ఆళ్వారు స్వామి రచనల్లో త్రివేణీ సంగమంలా అమరాయి.రచన కోసమే రచనలు చేసినవాడు కాదు, రాజకీయాల కోసమే రాజకీయాలు మాట్లాడినవాడు కాదు. ప్రజల దీన హీనస్థితిని కళ్లారా చూసి హదయం చలించి ప్రజల పక్షాన పెన్ను గన్ను పట్టిన వాడాయన. దొడ్డి కొమురయ్య అమరత్వం, కడివెండి సంఘటన ఆయనలో మరింత సమరశీలతను నింపినవి. అభ్యుదయ రచయితల సంఘ స్థాపనలో ఆళ్వారుస్వామి కషి విస్మరించరానిది.
గోలకొండ, మీజాన్, తెలుగు తల్లి, తెలంగాణ పత్రికలకు పని చేసిన అనుభవం ప్రజాసమస్యలను ఎట్లా ఎత్తి చూపాలో నేర్పింది.
పరిసరాలు, పరిస్థితులు వ్యక్తులను ప్రభావితం చేస్తవి. పేదరికం పోరాటం పటిమను నేర్పుతది అనడానికి వట్టికోట మనకో మంచి ఉదాహరణ. చిన్నతనంలోనే తండ్రి రామచంద్రా చార్యుల మరణం కుంగదీసినా గురువు సీతారామారావు సంరక్షణలో జ్ఞానం, శీలం రెంటినీ అలవరచుకున్నడు. తల్లి సింహాద్రమ్మ ప్రబోధం, పుట్టిన ఊరు నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం మాదారం కలాన్, పెరిగిన ఊర్లు నకిరేకల్, సూర్యాపేట, విజయవాడ, హైదరాబాదు జీవన యానం దిద్దించిన బతుకు రాత ఆళ్వారు స్వామికి తెలుగు, ఉర్దూ, హిందీ భాషలతో పాటు సాహిత్యాన్ని కొత్తపుంతలు తొక్కింది. గ్రంథ పఠనాపేక్ష పల్లెపల్లెకూ పుస్తకాల గంపను నెత్తికెత్తి'దేశోద్ధారక గ్రంథమాల' నిర్వహణ వరకూ తీసుకెళ్ళింది. హైందవ ధర్మవీరులు, నా గొడవతో పాటు ముప్పై ఐదు ప్రసిద్ధ గ్రంథాలను ముద్రించి జనబాహుళ్యానికి చేరవేయడానికి ఉద్దీపనగా మారింది. సమాజం అంటే పట్టింపు ఉన్న కారణంగా ప్రజాహితమే శ్వాస అయిన కారణాన మూడు పర్యాయాలు ఐదు సంవత్సరాల పాటు తీవ్ర నిర్బంధాన్ని ఆళ్వారుస్వామి ఎదుర్కొన్నడు. కాళోజీ తదితర ఉద్యకారులతో కలిసున్నడు. 'ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను పోలిన రాజు మాకెన్నడేని' దాశరథి పద్యాలకు నాలుక అయ్యినడు. జైలులోపల మగ్గే ఖైదీల మనోవేదనను నేరుగా తెలుసు కోవడానికి, కారాగార సంస్కరణల కోసం పోరాడేందుకు నాటి హైదరాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్, గుల్బర్గా,వరంగల్ జైలు అనుభవాలు ఉపయోగపడినవి. ఈ నేపథ్యంలో రాసిన జైలు లోపల కథలు పూర్ణ సమజ వికాసానికి వ్యక్తిలోనూ వ్యవస్థలోను రావాల్సిన మార్పులను ఉద్ఘాటిస్తవి. 'అవకాశమిస్తే' ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ గొప్ప తెలుగు కథ. స్త్రీ స్వేచ్ఛ, మహిళాభ్యుదయం ఈ కథ లక్ష్యాలు. 'పరిగె, విధిలేక, పతితుని హదయం, మెదడుకు మేత, మాకంటే మీరేం తక్కువ' కథలు సామాజ పరిణామాలకు వాస్తవ చిత్రణలు.
హౌటల్లో పనిపిల్లాడుగా జీవితాన్ని ప్రారంభించిన వట్టికోట చివరికంటా కార్మిక పక్షపాతిగానే ఉన్నడు. రిక్షా కార్మిక సంఘం, రైల్వే కార్మిక సంఘం, గుమస్తాల సంఘాలను ఏర్పరచి వాటికి వ్యవహర్తగా కూడా కొనసాగినడు. పౌరహక్కుల ఉద్యమంలో పనిచేసినడు. 'గంగు' నవల కార్మికుల శ్రామికుల విలువను తెలియజేయటం కొరకు సంకల్పించిందే. అసంపూర్తిగా మిగిలినప్పటికిని ఈ నవల ప్రపంచ కార్మికో ద్యమాన్ని, మార్క్సిస్టు ఆలోచనధారను నలుగడలా చాటుతుంది. అధికారదర్పంతో ప్రజల మధ్య వైరుధ్యాలను సష్టించడానికి మతాన్ని అప్పటి ప్రభుత్వం ఎట్లా వాడుకున్నదో కళ్లకు కడుతుంది. 'ప్రజల మనిషి' తెలంగాణ తొలి నవలగా కీర్తి గడించడమే కాకుండా భూస్వామ్య వ్యవస్థను సమూలంగా పెకలించేందుకు దిమ్మిగూడెం వేదికగా నడిచిన ఉద్యమ గ్రంథం. 1938లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఆవిర్భావానికి ముందు తెలంగాణ ప్రాంత స్థితిగతుల్లోంచి సామాజిక చైతన్యంతో మానవతావాదిగా హేతువాదిగా పరిపక్వత చెంది ఆళ్వారుస్వామి 'కంఠీరవం'గా ఈ నవలలో కనిపిస్తడు. వంశ పారంపర్యంగా వచ్చిన పట్వారీగిరిని అడ్డంపెట్టుకొని పేదల రక్తమాంసాల్ని భక్షించే రాంభూపాల్ రావు లాంటి బూర్జువా ప్రతిరూపాలను ఊరూరికి ఎరుకజేసినడు. సంఘం జెండా కిందకి పేదలను సమీకరించినడు.
ఆంధ్రమహాసభ, గ్రంథాలయోద్యమం, స్టేట్ కాంగ్రెస్ కార్యకలాపాలను దాటుకొని కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా మారిన ఆళ్వారుస్వామి తెలుగు సాహిత్యంలో ఆత్మకథాత్మక ధోరణికి మైలురాయి లాంటివాడు. నిరుపేదలు ఎదుర్కొంటున్న భూ సమస్యను గురించి, ఫ్యూడల్ వ్యవస్థలో మహిళలు, వత్తి కులాలు, సేవాకులాలు పడ్డ బాధల గురించి, ప్రమిద కింద చీకటిని పోలిన నిరుపేద ముస్లిం జీవితాల గురించి,దళితులు ఆదివాసీల వెతల గురించి రచనల్లో సందర్భోచితంగా దశ్యమానం చేసినడు. వర్గదక్పథాన్ని ప్రజాక్షేత్రంలోకి దేదీప్యమానంగా తీసుకొనిపోయినడు.'అణాగ్రంథ మాల' గ్రంథ పఠనా కార్యక్రమానికి ఓ అద్భుతమైన ప్రయోగం. గ్రంథ పఠనం గురించి తన 'What is Literature' గ్రంథంలో జీన్ పాల్ సార్త్రే ఒక మాట అంటాడు.అదేంటంటే ''Reading is induction, interpolation, extrapolation,and basis of these activities rests on the readers will,as for a long time it was believed that that of scientific induction rested on the divine will. A gentle force accompanies us and supports us from first page to the last''. సార్త్రే మహానుభావుడికి గల అభిప్రాయమే మన వట్టీకోటకూ ఉంది. కాబట్టే రాజకీయ కార్యా చరణతో సమానంగా అధ్యయనానికి మిక్కిలి ప్రాముఖ్యత నిచ్చినడు. తాను చదివినడు, ఇతరులచే చదివించినడు, చదువు రాని వాళ్లకు వయోజన పాఠశాలలు నడిపి అక్షరాలు నేర్పి గ్రంథపఠనం అభ్యాసం చేయించినడు. 'రామప్ప రభస' నాటి సమాజపు పోకడలపై సునిశిత విమర్శ.నిండైన మెండైన వ్యంగ్యం కూడా. వ్యక్తి, సమాజం, కాలం పరిణతి చెందే తీరుకు వట్టికోట సాహిత్యం ప్రబల ప్రతీక. వ్యవహారిక భాష, పలుకు బడులు సన్నివేశాలకు తగినట్టు తన వాక్యాల్లో కుదిరిపోతవి. 'జనం నుండి జనంలోకి సాహిత్యం' అనే లక్ష్య లక్షణాలతో సాగిన ఆళ్వారుస్వామి రచనా వ్యాసంగం తెలంగాణా అస్తిత్వానికి ఆత్మగౌరవానికి పొద్దటి వెలుగు వంటిది.క్విట్ ఇండియా ఉద్యమ భాగస్వామ్యం మొదలు తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం ఫలప్రదమైన దశ వరకు ఆళ్వారుస్వామి నడిపిన వామపక్ష రాజకీయాలు కొనియాడ దగినవి. 'ప్రజల మనిషి'లోని ''యస్మిన్ దేశకాలే నిమిత్త చ యోధర్మానుష్ఠేయతే స ఏవో దేశకాల నిమిత్తాంతరేష్వ ధర్మోభవతి'' శ్లోకం ఘోషించినట్టు కాలంతో పాటు రుచులు, అభిప్రాయాలు మారుతుంటాయి. తదనుగుణంగా వివేకంతో ధర్మంగా వ్యవహరించాలి. ఇదేగనక లోపిస్తే పగ, ప్రతీకారం, విద్వేషాలు, సంఘర్షణలు చెలరేగుతవనేదే తెలుగు ప్రజలకు ఆయన చెప్పి వెళ్లిన విశ్వసత్యం. చెవికెక్కించుకుందాం, అనుసరిద్దాం. వట్టికోటకు బొడ్డుకోసి పురుడు పోసిన మాదారం చెరువు మత్తడికి అటువైపు వెళ్లినపుడు సాగిలపడదాం.
- డా.బెల్లి యాదయ్య,
9848392690
ప్రజల మనిషిలో ఆళ్వారుస్వామి
రచయితలు, కవులు జైలు పాలవడం తెలంగాణలోనే ఎక్కువ. ఇక్కడి సాహిత్యకారులకు ప్రజల జీవితమే సాహిత్య వస్తువు కావడమే అందుకు కారణం. ఈ నేలమీద రాతనేర్చిన దాశరథి, కాళోజీ జైలు జీవితం గడిపారు. వట్టికోట ఆళ్వారు స్వామి తను బతికిన 47 ఏండ్లలో ఆరు సంవత్సరాలు జైల్లోనే గడిపాడు. కారణం ఆయన ప్రజల మనిషి.
చరిత్రలో ఒకో వ్యక్తి ఒకో పనివల్ల గుర్తించబడతాడు. ప్రజా రాజకీయాల వల్ల నాయకులు, మౌళిక వస్తువును సాహిత్యం లోకి తెచ్చిన రచయితలు, చర్వితచర్వణాన్ని మలుపుతిప్పిన కళాకారులు తరచూ స్మరణకొస్తారు. మరి వట్టికోట ఆళ్వారు స్వామిని మనం ఎలా చూడాలి. కాళోజీ నారాయణరావు, వట్టికోట ఆళ్వారుస్వామిని గురించి చెబుతూ 'సభలచే రాణించిన వాడు కాదు సభలను రాణింపజేసిన మనిషి వాడు చరిత్రకారుడే కాదు వాడు స్వయంగా చరిత్ర అంటాడు.
కటిక దారిద్య్రంలో పుట్టినవాడు ఏమేమి చేయాల్సి ఉంటుందో అవన్నీ చేసాడు. ఆళ్వారుస్వామి విద్యావంతుడు తన సమాజం గురించి ఎలా ఆలోచించాలో అలా ఆలోచించాడు. ప్రజా పక్షపాతి ఏమేం చేయవలసి ఉంటుందో అవన్నీ చేసాడు.
1915 నవంబరు 1న జన్మించిన ఆళ్వారుస్వామి తన పదకొండవ ఏటనే తండ్రి మరణించడంతో జీవికను వెతుక్కుంటూ దేశాలు తిరిగాడు. కంచనపల్లి సీతారామారావుకు వంటచేస్తూ నకిరేకల్లు, సూర్యాపేటల్లో అక్షరాల అన్వేషణ చేసాడు. కందిబండలో నారపరాజు రాఘవరావు అనే దేశ్ముఖ్ ఆశ్రయం కూడా సంతప్తిని మిగల్చలేదు. తప్పనిసరై విజయవాడ వెళ్ళి వెల్కమ్ హౌటల్ సర్వర్ గా పనిచేయవలసి వచ్చింది. 1933లో పద్దెనిమిదేళ్ళు నిండకుండానే హైదరాబాద్ వచ్చి గోల్కొండ పత్రికలో ప్రూఫ్ రీడర్ గా చేరడంతో ఆయన జీవితంలో తొలిమలుపు దొరికింది. యశోదమ్మతో పెళ్లి జరగడం రెండో మలుపు. ఇక అక్కడినుండి ఆయన చేయని పనిలేదు. మద్దతు ఇవ్వని ఉద్యమం లేదు. 1938లో స్టేట్ కాంగ్రెస్ ఏర్పడడంతో అందులో చేరిపోయాడు. 1938లోనే దేశోద్ధారక గ్రంథమాలను నాగేశ్వరరావు పంతులుకు నివాళిగా ప్రారంభించాడు. సురవరం 'హైందవ ధర్మవీరులు', కాళోజీ 'నా గొడవ', దాశరథి 'పునర్నవం', కె.ఎల్. నరసింహారావు 'కళా సౌదం', వానమామలై 'ఆహ్వానం', ఆదిరాజు వ్యాస సంపుటి 'తెలంగాణం', పొట్లపల్లి రామారావు 'ఆత్మవేదన' తదితర 35 గ్రంథాలను ప్రచురించాడు. 1942లో హైదరాబాద్ లో క్విట్ ఇండియా కార్యక్రమంలో పాల్గొన్నాడు. అరెస్ట్ అయ్యాడు. 1944లో భువనగిరిలో జరిగిన 11వ ఆంధ్రమహాసభకు కోశాధికారిగా పనిచేసాడు. 1946లో కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. రిక్షా కార్మిక సంఘం పెట్టాడు. 1951లో గుమస్తాల సంఘం ఏర్పాటు చేసి 'గుమస్తా' అనే పత్రికను నడిపించాడు.
మడమతిప్పని పనిచేస్తున్న ఆళ్వారును నిజాం ప్రభుత్వం అనేక రకాలుగా అణచివేతకు గురిచేసింది. అనేకసార్లు అరెస్టు చేసింది. మూడు పర్యాయాలుగా సుమారు 6 సంవత్సరాలు జైల్లో గడపవలసి వచ్చింది. అందులో భాగంగానే ఇందూరు జైలులో దాశరథిని, గుల్బర్గా జైలులో కాళోజీని కలుసుకున్నాడు. తనదైన శైలిలో ప్రజా రాజకీయాలు నడిపిన వట్టికోట ఆళ్వారు స్వామి కేవలం తెలంగాణకు పరిమితమైన వ్యక్తిగా కనిపిస్తాడు కానీ ఆయనకు గొప్ప ప్రాపంచిక దక్పథం ఉంది. 'జైలు లోపల కథలు'లో ఉరిశిక్షను చిత్రించాడు. అయితే ఆయన జీవించిన కాలంలో నిజాం రాష్ట్రంలో ఉరిశిక్ష అమలులో లేదు. అయినా ఆయన ఉరిని ఎందుకు చిత్రించాడంటే ఆయన మానవహక్కుల కోసం పోరాడినవాడు. మరణశిక్ష ఏ ప్రాంతంలో ఉన్నా ఏ రూపంలో ఉన్నా దాన్ని వ్యతిరేకించాలన్నది ఆయన దక్పథం.
ఇన్ని ఒడిదొడుకుల మధ్య నడిచిన తన జీవితపు చివరి రోజులలో రచనలమీద శ్రద్ధ పెట్టాడు ఆళ్వారు స్వామి. ఆ రచనల్లో రెండు నవలలు ఒక కథా సంపుటి, నాటికలు ఆయన జీవితంలోనే కాక తెలంగాణ రాజకీయ, సామాజిక చరిత్రకు నిలువుటద్దంలా నిలిచాయి.
ప్రజల మనిషి 1955 జనవరిలో ప్రచురించ బడిన నవల. ఇందులోని ఇతివత్తం 1935-40 ప్రాంతపు భూస్వామ్య సమాజానికి సంబంధిం చింది. గంగు 1940-45 మధ్య కాలాల కథ. కంబు కంధర చరిత్ర వెలుగులోకి రాకముందు, ప్రజల మనిషి తొలి తెలంగాణ నవల. పరిశోధనలో ఎన్ని కొత్త విషయాలు వెలుగు చూసినప్పటికీ తెలంగాణ నవలా చరిత్రలో ప్రజల మనిషి స్థానం తిరుగులేనిది. అలనాటి గ్రామీణ తెలంగాణకు అద్దం పట్టింది అది.
నిరంతరం పోరాటాలలో మమేకమైన ఆళ్వారుస్వామి మార్పులను చవిచూస్తున్న తెలంగాణ సమాజాన్ని నవలా రూపంలో చిత్రించాలని తలపోసాడు. అందులో మొదటి నవల 'ప్రజల మనిషి'. ఈ నవలలో తన అనుభవంలో ఉన్న భూమిని దొర రాంభూపాలరావు లాక్కున్నప్పుడు విద్యావంతులైన రఘునాథాచార్యులు దీనంగా స్పందిస్తాడు 'సరే, మీ చిత్తం ఇచ్చింది మీరే. తీసుకుంటున్నది మీరే. ధర్మ దష్టితో మీ నాయన గారిచ్చారు. ధర్మ నిర్వహణం కారణంగానే మీరు ఆ భూమిని తీసుకుంటున్నారు. కాలవైపరీత్యం, మంచిది. ఏదైనా పెరుమాండ్ల కపే' అంటాడు. మరొక ఘట్టంలో గిర్దావరు చెరువు చింతల హర్రాజును లోపాయికారీగా పూర్తిచేసి రాంభూపాలరావుకు కట్టబెట్టినప్పుడు ఊరంతా దొరకు ఎదురు తిరుగుతుంది. దొర అరకలు చెరువు లోతట్టులో దున్నడం
మొదలుపెట్టేసరికి జనమంతా బిలబిలమంటు అక్కడకు చేరి అరకలకు ఎదురు నిలుస్తారు. నాగళ్ళు విప్పేస్తారు. అంతటితో ఆగకుండా తహసిల్దారు దగ్గర విచారణ జరిగేదాకా పట్టుబట్టి గిర్దావరు ఉద్యోగం ఊడగొట్టిస్తారు. ఈ రెండు సంఘటనలలో ప్రజల చైతన్యస్థాయి వేర్వేరుగా ఉంటుంది. రఘునాథచార్యుల భూమిలాగానే కొమురయ్య భూమినీ రాంభూపాలరావు లాక్కున్నప్పుడు కొమురయ్య, కొమురయ్య తల్లి దొరకు ఎదురు తిరుగుతారు. కానీ దిక్కులేని స్థితిలో తప్పనిసరై మాత్రమే. చైతన్యంతో కాదు.
ప్రజల చైతన్యస్థాయిలో ఇంత మార్పు రావడానికి గల స్థితిగతుల పరిణామం ఈ నవలలో కథావస్తువు దిమ్మగూడెం నిజామాబాద్ జిల్లాలోని ఒక పల్లెటూరు. రాంభూపాలరావు ఆ గ్రామానికి దొర. ఆ ఊర్లోని ప్రతి వ్యవహారం ఆయన కనుసన్నల్లో జరగాల్సిందే. ఎన్ని ఆక్రమాలు, అన్యాయాలు అవసరమనుకుంటే అన్నీ చేయగల స్తోమత ఆయనిది. కొమురయ్య కష్టపడి సాగుచేసుకున్న వ్యవసాయ భూమిని రాంభూపాలరావు దొంగ పత్రాలు పుట్టించి కాజేస్తాడు. రఘునాథచార్యుల భూమినీ లాక్కుంటాడు. అదే ఊరిలో వెంకటాచారి దొరకు దగ్గరగా ఉండి వంతపాడుతూ ఉంటాడు. ఇంటికివచ్చి దొరతరుఫున వాదిస్తూ తల్లిమీద చేయి చేసుకోవడంతో ఆయన కొడుకు
కంఠీరవం ఎదురుతిరుగుతాడు. అలా కంఠీరవాన్ని ఇంటినుండి తండ్రి వెళ్ళగొడతాడు. నిజామాబాదులో వేదాంతా చార్యులను ఆశ్రయించిన కంఠీరవం వైద్యం నేర్చుకుంటాడు. ఇంగ్లీషు చదువు నేర్చుకుంటాడు, గ్రంథాలయోధ్యమంతో ప్రభావితమవుతాడు. దిమ్మగూడెంలో హరిజనులను అంజమన్ తల్లిగిస్లాం ముస్లీములుగా మారుస్తుందని కొమురయ్య ద్వారా తెలుస్తుంది. కంఠీరవం దిమ్మగూడెం వచ్చి మత మార్పిడికి ఎదురుతిరుగుతాడు. కంఠీరవం, కొమురయ్యలకు జైలు శిక్ష పడుతుంది. జైల్లో కంఠీరవం దక్పథం మారిపోతుంది. కులం, మతం, ఆచారాలు, కట్టుబాట్ల స్థానంలో పోరాటాల చైతన్యం వస్తుంది. జైలు నుండి విడుదలైన కంఠీరవం స్టేట్ కాంగ్రేసు కార్యక్రమాలలో పాలుపంచుకోవడం ద్వారా గ్రామానికి కొత్త గాలిని పరిచయం చేస్తాడు.
ఫోర్జరీ కేసును నమోదు చేయించి రాంభూపాలరావును జైలుకు పంపిస్తాడు ఊర్లో రాంభూపాలరావు అంటే భయం లేకుండా అవుతుంది.
దొర జైలు నుండి విడుదల అవుతాడు. హైద్రాబాద్ లో సత్యాగ్రహౌద్యమంలో పాల్గొని కంఠీరవం, చంద్రయ్య, విజయదేవ్, పరంధామయ్య తదితరులు అరెస్టు కావడం ఇందులోని కథా వస్తువు.
ఈ నవలలో కథ దిమ్మగూడెందే అయినా ఆనాటి తెలంగాణ ఊర్లన్నీ ఇలాగే ఉండేవి. ఒక రకంగా తెలంగాణ తానులోని ముక్క దిమ్మగూడెం అంటారు సహవాసి తన 'నూరేళ్ళ తెలుగు నవల' అనే పుస్తకంలో. స్టేట్ కాంగ్రేసు ఆవిర్భావకాలం నాటికి, చాలా గ్రామాలలో ఆ తర్వాత చాలా కాలం కూడా ఇదే స్థితి కొనసాగింది.
ఈ నవలా నాయకుడు కంఠీరవం పాత్రలో వట్టికోట లక్షణాలన్నీ కనిపిస్తాయి. ఆళ్వారుస్వామి చెరువు మాధారంలో జీవనాధారం లేక వలసపోతే, కంఠీరవం రాంభూపాలరావు అరాచకాల వల్ల ఊరెళ్ళిపోయాడు. ఆళ్వారుస్వామి జీవిక కోసం నకిరేకల్, సూర్యాపేట, విజయవాడ, హైదరాబాద్ తిరిగినట్లు కంఠీరవం నిజామాబాద్ లో స్థిరపడ్డాడు. ఇద్దరూ గ్రంథాల యోద్యమం వల్ల, స్టేట్ కాంగ్రేసు ఉద్యమం వల్ల ప్రభావిత మయ్యారు. ఇద్దరూ జైలుపాలయ్యారు. అలా ఆళ్వారే కంరీరవమై దిమ్మగూడెంలో సంచరించినట్లు రాసాడు రచయిత. తెలంగాణ నవలా చరిత్రలో మణిహారం 'ప్రజల మనిషి'.
- డా. ఏనుగు నరసింహారెడ్డి
8978869183