Sat 31 Oct 23:54:28.569834 2020
Authorization
ఆ గౌతముడు సంసార జీవితంపై విరక్తి చెంది రాజ్యాన్ని, భార్యని, ఆప్పుడే పుట్టిన కొడుకు ముఖమయిన చూడకుండా విడచి సన్యాసాన్ని స్వీకరించాడు.
యశోధర ఎన్ని అవమానాల పాలయ్యిందో, ఎన్ని కష్టాల పాలయ్యిందో, ఏ కాలమయినా పురుషుడి అండలేని స్త్రీకి తప్పవు పాట్లు. నా ఆలోచనలు ఎప్పుడు యశోధర చుట్టే, నా సానుభూతి ఎపుడూ ఆమె కోసమే.
ఒక స్త్రీ అలా ఇల్లు వదలిపోలేదు, బాధ్యతలు ఎప్పుడూ స్త్రీని వెళ్లనివ్వవు. కుటుంబం, సంఘం ఆమెకు ఆ అవకాశం ఇవ్వదు. ఎన్నో ఆంక్షలు, కట్టుబాట్లు ఆమెకు స్వేచ్ఛ లేకుండా బందీని చేసాయి.
ఆ రోజు ఆమెను కలిసేవరకూ నా అభిప్రాయాలు మార్చుకోవలసి వస్తుందని నాకు ఏనాడూ అనిపించలేదు. గౌతమి అన్న పేరు ఆమెకు సరిగ్గా సరిపోతుంది.
ఎటుచూసినా తెలుగువారే, తెలుగుభాష వినబడడం అద్భుతమే, పొరుగు రాష్ట్రం కూడా కాదు, మైకుల్లో కూడా తెలుగులోనే అనౌన్సుమెంట్స జరుగుతున్నాయి.
అస్సాంలోని బ్రహ్మపుత్ర పుష్కరాలకు వెళ్లకుంటే ఆమెను కలిసే అవకాశం నాకు ఉండేది కాదేమో, గౌతముడి లాగే ఆమెకూ ఒకనాడు ఈ బంధాల మీద విరక్తి కలిగిందిట.
తెల్లగా, సన్నగా అయిదుగుల ఎత్తుతో ఉన్న ఆమె ముఖంలోని చిరునవ్వె నన్ను ఆకర్షించింది.
చిన్నగా పాలకరింపుగా నవ్విందామె. పరిచయం అయ్యాక మాటల్లో ఏం వుంటుది మీ ఆడవాళ్ళు ఎక్కడయినా కబుర్లు చెప్పేసుకుంటారు అంటూ కామెంట్స వినబడ్డాయి. అయినా మా కబురులు వాళ్ళూ వింటున్నారు.
బ్రహ్మపుత్ర స్నానం, పితకార్యాలు అయ్యాక, శక్తి పీఠాల్లో ఒకటయిన కామాఖ్యా అమ్మ దర్శనం పూర్తి చేసుకొని భోజనాలకు డైనింగ్ హాల్‌లోకి చేరాము. అంతదూరం వెళ్ళినా తెలుగు భోజనం పెడతానని మాటిచ్చాడు మా ట్రావెల్స్ అతను. అందుకే ఆలస్యం అయినా అందరూ ఓపికగా ఎదురు చూస్తున్నారు.
ఏ వూరు, పిల్లలు చదువులు అంటూ మాటలు మొదలయ్యాయి. ఆమె మాటల మధ్యలో తాను సన్యాసం తీసుకున్నట్లు చెబితె ఆశ్చర్యపోయాను.
అప్పుడు పరిశీలనగా చూసాను కాషాయ రంగు బట్టలు కట్టుకుని, మెడలో రుద్రాక్షలు వేసుకున్నది.
రాముడి మీద భక్తితో పది సంవత్సరాలు తపస్సు చేసుకున్నట్లు, ఆ రాముడే తనకు కర్తవ్యాన్ని బోధిస్తుం టాడని అలా చేతిలో చిల్లిగవ్వలేని ఆమె రాముని మీద భక్తి నమ్మకాలతోనే రాముని ఆజ్ఞ ప్రకారం నిధులు సేకరించి ఊరవతల స్ధలాన్ని కొని ఆలయం నిర్మించగలిగింది. ఆమె సంకల్పానికి, దైవ బలంతోడయింది.
ఆమెకు ఊహ తెలియని పన్నెండేళ్ళ వయస్సులోనే వివాహం జరిగింది. ఆ తరువాత నలుగురు పిల్లలు, సంసార జీవితంపై విరక్తితో ఎంత ప్రయత్నించినా 30 ఏళ్ళ వయసు వరకూ ఆమె సన్యాసాన్ని స్వీకరించలేక పొయింది.
రోజంతా రాముని ధ్యానం. గత 40 సంవత్సరాలుగా ఆమె రామదాసిగానే జీవి స్తోంది. నిత్యం రాముని ధ్యానిస్తూ, ఆరాధిస్తూ దైవ చింతనలోనే ఆమె జీవితాన్ని గడిపింది. ఆలయం పక్కనే కొన్ని గదులు నిర్మించి మరి కొందరు అనాధ వద్ధ స్త్రీలను చేరదీసి పోషిస్తోంది. ఆమె మరో థెరిసాగా నా కళ్ళకి కనిపించింది. చేతులెత్తి నమస్కరించాను ఆమె భక్తికి, శరణాగతికి, పరోపకానికి, త్యాగానికి నిలువెత్తు నిదర్శనంలా కనిపించింది.
సంపాదన ఎంత ఉన్నా ఇంకా అత్యాశకు పోతూ ఇతరులను, దేశాన్ని మోసం చేస్తూ కోట్లు కూడబెట్టే రాక్షసుల వంటి స్వార్ధపరులతో నిండిపోయిన లోకంలో ఈ కలి యుగంలో, ఆమెను ఒక దేవత అంటే అతిశయొక్తి కాదు.. సంఘం శరణం గచ్చామి అని గౌతముడు బోధించాడు.
ఈమె సంఘానికే రక్షణగా నిలిచింది.
- వై.చంద్రకళ,
8008915928