Sun 01 Nov 01:45:51.805311 2020
Authorization
కడసారి..
చూపుకు నోచుకోని కన్నోళ్ళు
భార్యాబిడ్డలకు..
తప్పని ఆకస్మిక కన్నీళ్ళు !
జీవనోపాధి..
కొరకరాని కొయ్యైపోయింది
పైసలు..
సంపాయించుడు పెద్దవేట !
వేటంటే..
పానాలు తీసుడనుకుంటం
కనిక్కడ
మానాలు పనంగ వెట్టాలె !
ఉన్న ఊళ్ళే..
సేయడానికేమో పనులుండవు
అవసరాలకు
సేసిన అప్పులస్సలు తీరవు
జీవితం ఇజ్జత్ కా సవాల్ !
బత్కుడే..
చివరాఖరి సమస్యైనప్పుడు
సేతినిండ పనిదొరుకుద్దంటే
ఎన్కముందు సూడకుండ
ఎండమావులకైనా..
సద్దిగిన్నెతో ఎగేసుకుని ఉరుకుడే !
మమకారం ఎన్కకు లాగుతది
అనురాగం ముందుకు తోత్తది
గీడ దినాం పూట గడువన్నంటే
' దినార్ 'కోసం గాడ
సెమట సుక్కలు గక్కుడే ఉంటది!
ఇంట్ల ఆపతులు కళ్ళల్లో
సుడులై తిరిగే సప్తసముద్రాలు
కరువులు..
ఎదలో రగిలే అగ్నిపర్వతాలు!
చిట్టచివరి వీక్షణానికి
వేచి చూసి చూసి
విసిగి వేసారిన వీధితలుపులు
సగం కాలిన దేహపు తలపులు !
'పైలం బిడ్డా'! అని
వీడ్కోలు చెప్పిన తల్లిదండ్రులు..
గుండెల్లో నింపుకొని
గుడ్లనిండా నీళ్ళు తెచ్చుకొని
మామీద రంధి పెట్టుకోవద్దన్న
నయనశిశిరాలు ఆలి పిల్లలు !
ఇంటికి మూలవాసమే
బతుకు బండికి ఇంధనమై
భరోసా గీతం పాడాలి
కన్నోళ్ళను,కట్టుకున్నోళ్ళను
కంటికి రెప్పలా కాపాడుకోవాలి !
కార్పోరేట్ల సెన్సెక్స్ బుల్లకేమో గానీ
అన్నీ గతి తప్పిన
దిగువ,మధ్య తరగతి స్టాక్ భల్లూకాలు !
దాతివట్టి సూత్తెగాని తెల్వది
నాడి కొట్టుకుంటలేదన్న సంగతి !!
బంధాలు..
మధువులూరు మధుర తేనెపట్లు
దూరంగున్నా..
జ్ఞాపకాల పుప్పొడి రాల్చు చోట్లు !
అనురాగాలు..
బంతిపూలదండ లోపలి దారంలెక్క
కంటికి కనపడకున్నా
నరుల్ని జన్మజన్మలకు కలిపి కుట్టే
అనుబంధ గంధపు చెక్కలు !
బొడ్డుపేగు పొద్దుపొడుపు కోసం
ఎరుపు పూల కండ్లతో
ఏళ్ళకు ఏళ్ళుగా ఎదురు సూత్తున్న
సగం రెక్కలు తెగిన పక్షులు
అరుగులపై ఊరి వద్ధ దేహాలు !
- అశోక్ అవారి
9000576581