Sat 07 Nov 23:05:51.096694 2020
Authorization
'ఆకలికి అన్నం, రోగానికి మందు' ఇదొక నానుడి మనిషి ప్రకృతి నియమం ప్రకారం బ్రతకాలంటే, అతనికి కావాలసిన ఆహారం అందాల్సిందే. శరీరానికి అవసరమైన ఏరకమైన పోషకాలు తక్కువైనా మనిషి బండి నడకలో ఎన్నోమార్పులొస్తాయి. అది ప్రకృతి సహజం. ప్రకృతిలోంచి వచ్చిన మానవజాతి తనకంటూ మరో ప్రపంచాన్ని సృషించేసుకుంది. అదే సమాజం. అంటే కేవలం ప్రాణిగా మాత్రమేకాక మానవునిగా ఒక జీవావరణాన్ని, జీవన గమనాన్ని ఏర్పరుచుకుంది. అందులో అనేక బేధాలుండవచ్చు. ఒక అత్యున్నత ఆలోచన గల జీవనగమనాన్నీ ఏర్పరచుకొన్నది. కొన్ని నియమాలను, సంప్రదాయాలను నిర్థేశించుకున్నది.
వైరస్‌లు, బాక్టీరియాలు, కాలుష్యాలు మనిషి జీవనాన్ని ప్రాణాన్ని అనేక ఇబ్బందుల, బాధల పాలు చేస్తుంది ఈ ఇబ్బందులు పెట్టే అనేక వాటికి విరుగుళ్ళు కనిపెట్టే దాన్ని 'మందు' అన్నారు. అంటే నివారిణీ అని అర్థం. మనిషికి హానీ చేసే క్రిములు, వాతావరణం వున్నట్లుగానే సమాజ గమనాన్ని అస్తవ్యస్తంగా చేసే, ఇబ్బందులకు గురిచేసే క్రిముల్లాంటి వ్యక్తులు, ఆలోచనలు, విధానాలు వుంటాయి. వాటిని కూడా నిర్మూలించడమెలాగో మనిషి ఆలోచించి కొత్త మార్గాలను కనిపెడుతూనూ వున్నాడు. ఇవి రెండూ కూడా చాలా ముఖ్యమైనవి. ఒకటి ఇంకొకదానిపై ప్రభావం చూపుతుంది. మనిషి ఆరోగ్యం, సామాజిక గమనం మీదా మనిషి ఆరగ్యోం మీదా చాలా స్పష్టంగా ప్రభావాన్ని కలిగిస్తాయి. ఫ్రాయిడ్ లాంటి వాడైతే ప్రపంచ యుద్ధాలకు మనిషి మానసిక స్థితి కారణమన్నాడు. అయితే ఈ మానసిక పరిస్థితులు కూడా సమాజ పరిసరాల ప్రభావాల చేతనే నిర్మితమవుతాయి.
ఇప్పటి వరకు ప్రపంచమంతా అంగీకరించిన సామాజిక నియమ మేమంటే సమాజం, సమాజంలోని మనుషులు ప్రజాస్వామ్యబద్ధంగా వుండాలని, జీవించాలని, అదే ఆధునిక నాగరిక జీవన విధానమని భావిస్తున్నాము. అది కుటుంబంలోనైనా, సంఘంలోనైనా నలుగురు మనుషుల మధ్యయినా ఇది అవసరమని అనుకుంటున్నాము. అయితే మనం నియమాలనతిక్రమించిన ఫలితంగా ప్రకృతిలో పర్యా వరణంలో విపరీత తేడాలొచ్చి మన ప్రాణాలకు ముప్పు వాటిల్లుతున్నట్లుగానే, ప్రజాస్వామ్య గమనానికి కులం, మతం, ధనం వర్గం ప్రాంతం, దౌర్జన్యం, అవినీతి అనే సామాజిక అతిక్రమణల వల్ల నేతిబీరకాయలో నేయిచందంలా మారటమేకాక ప్రజాస్వామిక జీవనానికి పెనుప్రమాదం ఏర్పడుతున్నది. అశేష ప్రజల అభిప్రాయాలకు, ప్రయోజనాలకు విలువలేకుండా పోతున్నది. అంటే ప్రజల ప్రాణానికి కూడా భరోసాగా నిలబడలేని సమాజ గమనం ఇపుడు మన ముందున్నది. ఇది అసలైన విషాదం. దీనికి మందును కనిపెట్టడం అత్యంత అవశ్యకం. ఈ మందు మన ఆలోచనలోనే ఉంది. మనం అనుసరించే విధానంలోనే ఉంది.