'నమస్తే రాములు మామ' మంచంలో కూర్చున్న రాములు ను చూసి పలకరించిండు అశోక్. నమస్తే అల్లుడా ఇదే రాకటనా? రా ఇటు కూసో అని మంచంల అసుంట జరిగిండు. అశోక్ మంచంలో కూర్చున్నడు. అమ్మ, మా బిడ్డ అంత బాగున్నరా? అని మంచి చెడ్డ అర్సుకున్నడు రాములు. బాగానే ఉన్నం కానీ చిన్న పంచాయతీ పుట్టింది. అని మరుగు మందు ముచ్చటంతా చెప్పిండు అశోక్.
'ఎల్లూ... ఈ కుక్క పాడువడ ఎప్పుడు ఇంట్లనే పంతది. మొండిమొదలారింది నా గండాన బడ్డది.. ఎల్లూ..' అంటూ కట్టె తీసుకొని పందిట్ల పడుకున్న కుక్కను ఎల్లగొడుతుంది సాలమ్మ.
'ఇగో ఏదన్న ఉంటే నన్ను అను కుక్క మీద పిల్లి మీద పెట్టి తిడితే ఊకోను. మాటలు సక్కిరంగ రానియ్యి. నేను నోరు తెరిస్తే నీ ఇజ్జత్ ఏమీ మిల్గదు అనుకుంటున్నవేమో...' అప్పుడే ఇంటి నుంచి బయటకు వచ్చిన కోడలు అరుణ శరానికొచ్చింది.
'ఏందే లెస మాట్లాడుతున్నవ్. నువ్వు జేవట్టి కుక్కను గూడ ఎల్లగొట్టొద్దా? అయినా కుక్కనంటే నీకెందుకే యావ?' ఎదురుదాడికి దిగింది సాలమ్మ.
'పొద్దునట్టే ఏందే లొల్లి? ఒక్కనాడన్న నిమ్మలంగుండరు... ఈ వూల్లె మీరే ఉండ్రా అత్తకోడళ్లు ఇంకెవలన్న ఉండ్రా? లేవంగనె ఏందమ్మ ఈ రాంసంగము?' అనుకుంట ఒచ్చింది పక్కింటి ముత్తమ్మ.
'సూడు ముత్తక్క... కుక్క పాడువడ పందిరి గుంజ కాడ మొత్తం పొక్కిలి జేసింది. ఊకి ఊకి రెక్కలన్ని పాడై పోతున్నై. నేను కుక్కని ఎల్లగొడుతుంటే దీనికి నోరు గబ్బు లేశి నా ఎంటబడ్డది.'
'ఏందే పిల్లా అత్తన్నంక ఓ మాటంటది గింత ఓపిక లేకుంటెట్టనే?', అరుణ దిక్కు చూసుకుంట అన్నది ముత్తమ్మ.
'అనే మాటంటే ఒవలైన పడతరు. అడ్డగోలిగ అంటె ఎందుకు పడ్తరు? నేను మొండి మొదలారిందాన్నంట. అయ్యాల చేసుకునేనాడు తెల్వదా?'
'ఓ... భారిగ బండ్ల మీద తోలుకొచ్చినవని నిన్ను ఇష్టపడి చేసుకున్నమే...'
'భారిగ బండ్ల మీద తెచ్చే దాన్నే చేసుకోక పోయినవ్... నా తానికెందుకొచ్చినవ్?' మాటకు మాట జవాబు ఇస్తుంది అరుణ.
'పొద్దునట్టే ఏందే మీ లొల్లి? అమ్మా దాని జోలికెందుకు బోయినవే? నీ పని ఏందో నువ్వు చేసుకో. తన పనేందో తను జేసుకుంటది. జర సప్పుడు ఆపుండ్రి. బజారున పోయేటోళ్లంత మనదిక్కే చూస్తున్నరు.' అసహనంతో అన్నడు సాలమ్మ కొడుకు అశోక్.
'నన్నే అనురా. నీ పెండ్లము ఏమన్నా దాన్ని ఎనుకేసుకొనిరా. నేను దాని జోలికి పోయింది నువ్వు చూసినవా? నేనుంటెనే ఈ ఇంట్ల అందరికి శీదర. నాకు ఇంత ఇసం ఏసి సంపుండ్రి పీడపోతది.' అన్నది సాలమ్మ.
'నువ్వెందుకు సస్తవే. ఈ ఇంట్ల పరాయిదాన్ని నేనేగా. నన్ను మింగి నీళ్లు దాగుతరు. నన్ను నెగలనియ్యవు. కొసెల్లనియ్యవు గని...' ఏడుస్తుంది అరుణ.
'మీరెందుకు సావల్నే? ఒవలికి జెప్పబోయినా కష్టమే ఉంది. మీ ఇద్దరి నడుమ నలిగి నేను చస్తున్న. నేనే ఎక్కడన్న ఎగబడి పోత. మీకు దండం పెడత జర ఊకోరి' కోపంతో అన్నడు అశోక్.
'ఏ ఊకో పిలగ. నువ్వట్లనే తొందర పడతవ్. తల్లిని పెళ్ళాన్ని సముదాయించాలె గనీ ఎగబడిపోత అంటవు?' ముత్తమ్మ అన్నది.
'ఏం చేయ పెద్దమ్మ. ఒకనాడా ఒక పొద్దా పెళ్లైన ఏడాది నుంచి ఇదే రసరస. నాకు పెళ్లి చేసుకున్న సుఖం లేకుండ పోయింది. ఎంతకనీ ఏగను?'
'ఈమె నిన్న కూడా పంచాయతీ పెట్టుకుంది. నేను మా నాయనకు ఫోన్ చేసిన. ఇయాల వస్తుండు. నేను వెళ్లిపోత.' ఏడ్సుకుంట అన్నది అరుణ.
'ఈల్ల నాయన వస్తే నాలుగు రోజులు తోలియ్యి. జర నిమ్మల పడ్డంక మల్ల తీసుకొచ్చుకో' సలహా చెప్పి వెళ్ళిపోయింది ముత్తమ్మ.
అరుణ తండ్రి శంకరయ్య వచ్చిండు. బిడ్డను తోలియ్యమని అడిగిండు. సాలమ్మ ముఖం మాడ్చుకుని ఊ.. అనలేదు ఆ.. అనలేదు. అల్లుడు అశోక్ తీసుకు పొమ్మని చెప్పిండు. బట్టలు సర్దుకొని తండ్రితో బయలు దేరింది అరుణ. ఇంటికి పొంగనే తల్లి మీద పడి అరుణ ఒకటే ఏడుపు. అత్త పొందనిస్తలేదని, కన్న కష్టాలు పెడుతుందని తన గోస అంత చెప్పింది. 'ఏడవకు బిడ్డ! ఈ తాప నల్గుట్ల బెట్టి ఆమె సంగతేందో అడిగినంకనే తోల్తగని. ఏదో పిలగాని మొకం జూసి ఇంతకాలం ఆగినం గని ఇగ రానీరు. ఎట్టెట్ట ఒస్తదో సూస్త.' అని బిడ్డను సముదాయించింది తల్లి.
'సైదక్కా ఏడికో పోతవు? ఇంటికాయన్న మల్లి సూస్తలేవుగా' బజార్ల బోతున్న సైదమ్మను పిలిచింది పందిట్ల కుసున్న సాలమ్మ.
'కంట్రోల్ బియ్యం ఇస్తుండ్రేమో సూద్దాం అని పోతున్న చెల్లె...'
'రేపటి నించి ఇస్తరాట. రాత్రి డప్పు సాటిచ్చెగా... కుసుందువు రారాదు..'
'పోవాలె సెల్లే మీ బావ రేకల్ బారంగ పోయి అరక గట్టిండు. ఇగ ఒచ్చే యాళ్లయింది.' అనుకుంట వచ్చి కుసున్నది సైదమ్మ.
'ఇంట్ల ఒవలు లేరేంది? కోడలు పిల్ల గూడ కనవడ్తలేదు?' సైదమ్మ అడిగింది.
'దానికి సాగొచ్చినట్టు ఊళ్లె ఎవ్వలికి రాదు. నిన్న ఆళ్ళ అయ్య రాంగనే ఎగేసుకొని పొయ్యింది. ఈడ ఉన్నంతకాలం దానికి నోటికొచ్చిన మాటలు అంటది. నన్ను గడ్డిపోస కంటే అల్కగ తీసిపారేస్తది. ఎవ్వల్నంటే ఏం సక్కదనం గని నా రాత బాగలేదక్కా..' కళ్ళ నీళ్లు తీసింది ముత్తమ్మ.
'అవునంటగా రోజూ లొల్లయితుందని మొన్న కల్వ బోయిన కాడ ఎవలో అనంగ ఇన్న. పిలగాడన్న సెప్తలేడా? '
'అమ్మో ఆడా ! పెండ్లం మాట గిరి దాటడు. దాన్ని ఒక్కమాటంటె ఊకోడు. ఒక్క కొడుకని పావిరంగ సాదిన. పెండ్లి గాక ముందు అమ్మంటె పడి సచ్చేది. ఇప్పుడు నేను ఇసమై పోయిన' సాలమ్మ తన ఎతనంత జెప్పింది.
'అట్టనా పోరనికేమన్న నాకిచ్చిందా ఏందీ? పెండ్లి గాక ముందు ఎద్దోలె ఉండె. నిన్నియ్యాల ఎండక పోతుండుగా... ఏన్నన్న సూపియ్యరాదు?'
'నిజమే అక్క ఈ మందుల మారిది నా కొడుకుకు ఏం పెట్టిందో ఏమో. పోరడు ఒట్టి కట్టె లెక్క ఎండి పోతున్నడు. ఎక్కడ బోను? ఏడ సూపియ్యను? మొగ దిక్కు లేనిదాన్నైతి.' అని ముక్కు చీది కళ్ళనీళ్ళు తూడ్సుకుంది సాలమ్మ.
'ఊకో సెల్లే ఏడవకు. మొన్న మా సుట్టపోళ్ల పోరనికి గూడ గిట్టనే అయితే ఎన్నారం కాడ ఒకాయన కక్కపోపిచ్చిండే. ఇప్పుడు ఆ పిల్లగాడు బండెద్దోలె అయ్యిండు.' అని గుసగుసగా చెప్పింది సైదమ్మ.
'అట్టనా అక్కా. రేపు పోదాం నువ్వు కూడ రారాదు. ఏం తీసుకుంటడక్క?'
'నాకేడ తీర్తది చెల్లె? నువ్వు పోయిరా. ఐదు వేలు తీసుకుంటడు గని మేటి మంత్రగాడు. చూస్తున్నంగనే పోరడు మునుపటి లెక్క అయితడు.'
'ఈ తటుమానోడు... మా అశోక్ గాడు వస్తడో రాడో... ఎట్టజేతునమ్మా'
'కక్కపోపిస్తమని సెప్తె ఒస్తాడే? మన ఇంట్ల మంచిగుంటలేదు కదా ఓసారి సూపిద్దాం' అని తీస్కపోవాలె.
ఇంతలనే బయటికి పోయిన అశోక్ ఇంటికి ఒస్తుండు. తనని సూడంగనే ముచ్చట బందువెట్టిన్రు.
'సైదమ్మ పెద్దమ్మ నిమ్మలంగా ఉందిగా' సైదమ్మను పలకరించిండు అశోక్.
'ఏం నిమ్మలం బిడ్డా. బాయి కాడికి పోవాలె. ఈడంగ బోతుంటే అమ్మ మందలిస్తే ఈడ గూలవడ్డ. ఏంది అశోకు మొత్తం దరువు శెడుతున్నవ్... ఏమన్న పరేషాన్ పెట్టుకున్నవా?' ఆరా తీసింది సైదమ్మ.
'ఏం లేదు పెద్దమ్మ. మా అమ్మ, మీ కోడలు ఈల్ల పరేషాన్ తప్ప నాకు ఇంక ఏ పరేషాన్ లేదు. ఒక్క రోజన్నా పంచాయతీ లేకుండా నిమ్మలం లేదు' అన్నడు అశోక్.
'నరదిష్టి ఉంటే కూడ ఇంట్ల నిమ్మలం ఉండదు బిడ్డ. ఇప్పుడే అమ్మకు చెప్పిన. ఎన్నారం కాడ మంచి పళ్ళు గల్ల భూతవైద్యుడు ఉన్నడు. ఒంట్ల పుట్టిన రోగానికి నాటు మందు కూడ ఇస్తడు. ఒకసారి నా మాట ఇని అమ్మ నువ్వు పోయిరారి. ఆదివారం బేస్తారం చూస్తడు. పైసల్ పోయినా పానం నిమ్మలమయితది బిడ్డ. మా సుట్టపోళ్ళకు బాగ చేసిండు.' సైదమ్మ చెప్పింది.
ఎవలి నోటిమాట ఎసొంటిదో ఓపాలి ఇది గూడ సూద్దామనుకున్నాడు అశోక్. 'అట్టనా పెద్దమ్మ... అయితే ఓసారి పోయి వస్తా' అన్నడు.
'మంచిది బిడ్డ... ఇక నేను పోతున్న పెదనాయన ఒచ్చే యాళ్లయింది' అనుకుంట సైదమ్మ వెళ్ళిపోయింది.
ఆరోజు బేస్తవారం... ఎన్నారం కాడ సిద్దయ్య ఇంటి ముందల ఎక్కడెక్కడి నుంచో వచ్చిన జనం. డాక్టర్ కాడ రాపిచ్చుకున్నట్టే పేర్లు రాపిచ్చుకుంటున్రు. రాగి రేకులు, జీడిగింజలు, తాయత్తులు, నిమ్మకాయలు, కొబ్బరి కాయలు, పసుపు, కుంకుమ, నల్ల దారం, నల్ల కోళ్ళు, అమ్మేటాయన బజార్ల బస్తా పరిచి అవన్నీ పెట్టుకుని కూసుండు. లోపల సిద్దయ్య కొంతమందికి మంత్రించి రాశి కడుతున్నడు. పసుపు బండారి ఇచ్చి ఈపుల సర్షి పంపుతుండు. ఇంకొంతమందికి నాటు మందులు ఇస్తుండు. మరి కొంతమందిని కావలసిన దినుసులు కొనుక్కొని రాత్రికి ఏట్లోకి వస్తే బాగ చేస్తా అని చెబుతున్నడు. కొంతమందికి ఇంట్లనే కక్కబోస్తుండు. ఓ మోస్తరు మల్టీ స్పెషాలిటీ దావఖాన లెక్క అన్ని రకాల వైద్యం అక్కడ నడుస్తుంది. అశోకు, సాలమ్మ తమ వంతు కోసం అక్కడనే నిలవడ్డరు. ఆల్లు ఈళ్ళు అనుకునే మాటలు వింటుంటే హైదరాబాదు, వరంగల్, ఖమ్మం ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వైద్యానికి వస్తున్నట్లు అర్థమైంది. పైసల్ బాగనే తీసుకున్నా బాగ అయితది అనే నమ్మకం వాళ్లలో ఉంది అనిపించింది. అశోక్ గూడ మొదట అంతగ నమ్మకపోయినా అక్కడి జనాన్ని చూసినంక ఆళ్ళ మాటలు ఇన్నంక బలంగనే నమ్మిండు.
ఇంతలనే తలుపు దగ్గర ఉన్న సిద్దయ్య అనుచరుడు ఒకడు సీరియల్ ప్రకారం పేర్లు చదువుకుంట 'అశోక్' అని పిలిచిండు కోర్టు కాడ గుమస్త లెక్క. అశోక్ సాలమ్మ లోపలికి పోయిండ్రు. సిద్దయ్య ఎదురుగా అశోక్‌ను కూసోబెట్టిండ్రు. అశోక్ కుడి చెయ్యి ముందుకు చాపి కూసున్నడు. సాలమ్మ రెండు చేతుల తోటి పబ్బతి పట్టింది. మీ ఇంట్ల సక్కిడి లేక నా దగ్గరికి వచ్చినవు కద బిడ్డ... నీ ప్రాణం కూడ మంచిగుంటలేదు కదరా... అన్నడు సిద్దయ్య. సహజంగనే తన వద్దకు వచ్చేవారు ఈ రెండు కారణాల చేత ఎక్కువగా వస్తుంటరు. అందుకే ఎవరికైన ముందు అట్ల చెప్పి తనవైపు తిప్పుకుంటడు సిద్దయ్య.
'నిజమే సామి! పెళ్లయిన కానించి ఇంట్ల నిమ్మలం లేదు. మనిషి కూడ ఒట్టి చాపోలె ఎండి పోతున్నడు. నీ దయ నువ్వే చూడాలె...' ఆత్రం పట్టలేక సాలమ్మ మొత్తం చెప్పేసింది.
'అవును బిడ్డ నేను అదే చెప్పబోతున్న. పిల్లగానికి ఏదో నాకిచ్చింది గద. వీని కడుపుల ఉన్న మరుగు మందు ఈన్ని ఇట్ల నలింపు జేస్తున్నది. అది కక్కబోపిస్తేనే నీ కొడుకు నీకు దక్కుతడు.' అన్నడు సిద్ధయ్య.
'నాకు ఎవలు పెట్టిండ్రు? నేను ఎక్కడ పోలేదు.' అయోమయంతో అన్నడు అశోక్.
'మాంసముల కలిపి పెట్టిన్రురా... నువ్వే సూస్తవ్ గద' అన్నడు సిద్దయ్య
'నువ్వు పెండ్లయినంక నెలెల్లకతోలిగ అత్తగారింటికి పోయినప్పుడు మీ మామ యాట కూర తెచ్చిండంటివి గద. మందులమారోళ్ళు నా కొడుకును మలుపు కుందామని అప్పుడే పెట్టినట్టుండ్రు నువ్వే గానలేదు బిడ్డా... నా మాట ఇను సామి చెప్పినట్టు చేద్దాం.' అని సాలమ్మ 'అయ్యా నువ్వు చెప్పినట్టు ఇంటం' అని సిద్దయ్య తోటి అన్నది. ఐదు వేల రూపాయలు ఖర్చు అయితదన్నడు సిద్దయ్య. ఎంటనే షెక్కుడు సంచిల నుంచి పైసలు దీసి ఇచ్చింది. సిద్దయ్య అశోకు నోట్ల ఆకు పసరు పోసిండు. పసరు మింగంగనే కడుపుల ఒకటే తిప్పుడు. పేగులు ఒడి దిప్పినట్టు ఒకటే నొప్పి. తల్లడిల్లిపోయిండు అశోక్. కాసేపటికి వాంతి వస్తున్నట్టు అనిపించి సిద్దయ్యతో చెప్పిండు. వెంటనే సిద్దయ్య తన మనిషిని పిలిచి ఇంటి వెనక ఖాళీ స్థలంలోకి తీసుకుపొమ్మన్నడు. ఇంటి వెనక పెరడుకు దిడ్డి దర్వాజ కూడా ఉన్నది. అతను ఒక ఖాళీ కుండపెంక చూపించి అందులో కక్కమని చెప్పిండు. అశోక్ మొత్తం వాంతి చేసుకున్నడు. జరసేపైన తర్వాత ఏర్పడుతది. లోపలికి పోదాం పా అని ఆ మనిషి అశోక్ ను లోపలికి తీసుకొచ్చిండు. అరగంట గడిచింది సిద్దయ్య అశోక్‌ను సాలమ్మనూ వెళ్లిచూడమని చెప్పిండు. వాళ్ళు వెళ్లి ఇంతకు ముందు వాంతి చేసిన పెంకలో కట్టెపుల్లతో గెలికి చూసిన్రు. పచ్చి మాంసం ముక్కలు నాలుగైదు కనిపించినయి. అశోక్ ఆశ్చర్య పోయిండు. లోపలికి రాంగనే సిద్దయ్య 'చూసిన్రా? ఏమన్నా ఉందా?' అని అడిగిండు.
'నిజమే సామీ మీరు అన్నట్టే తునకల్ల పెట్టిండ్రు.' అన్నది సాలమ్మ.
'ఇగ నీ కొడుకుకు ఏమి కాదు. ఈగ వాలకుంట నా జిమ్మెదారి. దర్వాజకు ఈ నిమ్మకాయ కట్టున్రి' అని ఒక అద్దు, ఇంత బండారి ఇచ్చిండు. ఇంటి బాట పట్టిన్రు అశోక్, సాలమ్మ.
అరుణ తల్లిగారింటికి వచ్చి వారంరోజులు దాటింది. కనీసం అశోక్ ఫోన్ కూడా చేస్తలేడు. ఎందుకో అని అరుణ అశోక్‌కు ఫోన్ చేసింది. అశోక్ పెడసరంగ మాట్లాడిండు. నువ్వటే నేనిటే అన్నడు. అరుణ ఏడ్చుకుంటూ వాళ్ళ నాన్నకు ఫోను ఇచ్చింది. శంకరయ్య మాట్లాడిండు. నలుగురు చెప్పినట్లు ఇందాం. నాకు మాత్రం నీ బిడ్డ వద్దు అని కరాఖండిగా చెప్పిండు అశోక్. అంత అల్కగ అనుకుంటున్నవా. వచ్చే నెల ఐదో తారీఖు నాడు నలుగురు పెద్ద మనుషులు తీసుకొని నేను వస్త. నువ్వు ఎవరిని తెచ్చుకుంటవో తెచ్చుకో. నా బిడ్డ చేసిన తప్పేందో బయటపెట్టినంకనే మాట్లాడుతా అని శంకరయ్య ఫోన్ పెట్టేసిండు.
తన పక్షాన కూడా మాట్లాడడానికి పెద్ద మనుషులు ఉండాలి కాబట్టి అశోక్ పెద్ద మనుషుల కోసం కాలు గాలిన పిల్లి లెక్క తిరుగుతుండు. కక్కిరేణి కాడ తనకు మామ వరసయ్యే రాములు పంచాయితీలు బాగా చెబుతాడని ప్రసిద్ధి. ఒక రోజు పొద్దున లేసి కక్కిరేణికి పోయిండు. ఎన్నారం, కక్కిరేణి పొలిమేర కలిసే ఉంటయి.
'నమస్తే రాములు మామ' మంచంలో కూర్చున్న రాములును చూసి పలకరించిండు అశోక్. నమస్తే అల్లుడా ఇదే రాకటనా? రా ఇటు కూసో అని మంచంల అసుంట జరిగిండు. అశోక్ మంచంలో కూర్చున్నడు. అమ్మ, మా బిడ్డ అంత
బాగున్నరా? అని మంచి చెడ్డ అర్సుకున్నడు రాములు. బాగానే ఉన్నం కానీ చిన్న పంచాయతీ పుట్టింది. అని మరుగుమందు ముచ్చటంతా చెప్పిండు అశోక్.
'దెశిత్.... ఆ సిద్దిగాడా నీకు కక్కబోసింది? ఆడు పెద్ద లఫంగి. పెద్ద మోసగాడు. బట్టేబాజ్ గాడు. ఇంత దగ్గర వున్న నాకు చెప్పొద్దా? వాని గురించి తెల్వక దూరం దూరం ఊర్ల నుంచి వస్తరు. తెలిసినోళ్ళు ఎవ్వలు వాని కాడికి పోరు. నువ్వు కుండ పెంకల వాంతి చేసుకున్న తర్వాత ఇంట్లకి రాంగనే దిడ్డి దర్వాజ కానించి ఆని మనుసులు పోయి అండ్ల మునగ బంక కలిపి వస్తరు. దానికి కావలసిన మునగ బంక మా బాయికాడ నుంచే రోజు తీసుకపోతడు. కావాలంటే చూపిస్త పా...' అని రాములు అశోక్‌ను తీసుకొని బాయి కాడికి పోయిండు.
బాయి గడ్డ పొంటి ఉన్న మునగ చెట్టుకు మస్తు కాట్లు పెట్టి ఉన్నయి. ఆ మునగ బంక చేతితో పట్టుకొని చూసిండు అశోక్. అచ్చం మాంసం ముద్ద లెక్కనే ఉంది. నిన్న తాను వాంతిలో చూసింది కూడా ఇట్లనే ఉంది. మోసం అర్థమైంది అశోక్‌కు. వెంటనే 'మామా! పంచాయతీ వద్దు ఏమి వద్దు నా అరుణను నేను తీసుకొచ్చుకుంట.' అనుకుంటూ ఇంటి దారి పట్టిండు అశోక్.
- సాగర్ల సత్తయ్య,
7989117415