Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
తెలంగాణ సినిమాకు తొలి కథానాయకుడు టి.ఎల్‌. కాంతారావు | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • కవర్ స్టోరీ
  • ➲
  • స్టోరి

తెలంగాణ సినిమాకు తొలి కథానాయకుడు టి.ఎల్‌. కాంతారావు

Sat 21 Nov 23:11:33.268881 2020

సినిమాకు నాటకం మాతృక. తొలి రోజుల్లో నాటకం నుండి ఎందరో నటులు, రచయితలు సినిమాల్లోకి ప్రవేశించి సినీరంగానికి కొత్త వెలుగులద్దారు. ఆ క్రమంలోనే పౌరాణిక, సాంఘిక నాటకాల్లో రాణించిన ఓ తెలంగాణ కుర్రాడు అనేక అవరోధాలకు నిలబడి తన ప్రతిభతో తెలుగు సినీ పరిశ్రమలో అగ్రనటుడిగా గుర్తింపు పొందాడు. వెండితెరకు సరిపడే స్ఫురద్రూపం, అద్భుతమైన స్క్రీన్‌ప్రెజెన్స్‌, చక్కని కంఠం ఆయనను సినిమా హీరోను చేసింది. జానపద చిత్రాలకు క్రేజీ హీరో ఆయన. పౌరాణిక చిత్రాల్లో కృష్ణుడిగా, రాముడిగా, లక్షణుడిగా, శివుడిగా ఆయన ధరించిన పాత్రలు ఒక ఎత్తైతే 'నారదుడి' పాత్రలో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశాడు. అంతేకాదు హీరోగా, విలన్‌గా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా సాంఘికచిత్రాల్లో కనువిందు చేశాడు. ఆయనే టి.యల్‌. కాంతారావు. ఈ ప్రఖ్యాత నటుడు తెలుగు సినీ రంగంలో తెలంగాణ గొంతుకగా తొలి సంతకమై కనిపిస్తాడు.

తెలంగాణ మట్టి పరిమళాన్ని సినీ రంగంలో గుబాళింపజేసిన టి.ఎల్‌.కాంతారావు పూర్వపు నల్లగొండ జిల్లా కోదాడకు సమీపంలోని గుడిబండలో 16 నవంబర్‌ 1923న టి. కేశవరావు, సీతారామమ్మ దంపతులకు జన్మించాడు. కాంతారావు 3ఏళ్ళ వయస్సు ఉన్నప్పుడే తండ్రి మరణించడంతో ఆయన బాల్యం అనేక ఒడిదుడుకుల్లో సాగింది. ఖమ్మంలోని మిడిల్‌ స్కూల్‌లో వస్తానియా అంటే 8వ తరగతి వరకు చదువుకున్నాడు. విద్యార్ధి దశలోనే కాంతారావు పద్యనాటకాల పట్ల ఆకర్షితుడయ్యాడు. ఆ రోజుల్లో 'హరిశ్చంద్ర', 'గయోపాఖ్యానం' పాపులర్‌ నాటకాలు. వీటి ప్రభావంతో మిత్రులను కూడ గట్టుకుని మొదటిసారి 'సతీసక్కుబాయి' నాటకాన్ని ప్రదర్శించారు. 1938లో 'బాలమిత్ర నాట్యమండలి'ని స్థాపించి చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు వ్రాసిన 'గయోపాఖ్యానం', పానుగంటి 'మధుసేవ' వంటి నాటకాలను ప్రదర్శించి రంగస్థల నటుడిగా గుర్తింపు పొందాడు. సరిగ్గా ఆ సమయంలోనే సురభి నాటక బృందం నాటకాలను ప్రదర్శించేందుకు గుడిబండ గ్రామానికి వచ్చింది. అప్పటికే కాంతారావు ఆ గ్రామానికి మాలి పటేల్‌గా పని చేస్తున్నారు. ఆ ఊర్లో నాట కాలు ప్రదర్శించాలంటే గ్రామ పెద్దగా అనుమతి ఇవ్వాల్సింది ఆయనే కావడంతో సురభి సంస్థలో తనను చేర్చుకుని నటుడిగా అవకాశమివ్వాలని వారికి షరతు పెట్టాడు. సురభి సంస్థ మొదట ఒప్పుకోక పోయినా ఆయన ఉత్సా హాన్ని కాదనలేక 'కృష్ణ లీలలు' నాటకంలో అవకాశ మిచ్చారు. ఆవిధంగా ఆయన సురభి సంస్థతో ప్రయాణిస్తూ 'గయో పాఖ్యానం', 'మధుసేవ', 'కనక తార', 'తెలుగుతల్లి' వంటి ఎన్నో నాటకాల్లో నటుడిగా నటించి గుర్తింపు పొందాడు.
అదేసమయంలో ఆనాటి కాంగ్రేస్‌పార్టీ నాయకులతో ఆయనకు సాన్నిహిత్యం ఏర్పడింది. వారి ప్రోద్బలంతో కాంగ్రేస్‌ పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు. ఆయనపై కొందరు గిట్టని వారు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. కమ్యూనిస్టు, కాంగ్రేస్‌ వారితో కలిసి రజాకార్లకు వ్యతిరేకంగా కుట్రపన్నుతున్నాడని తప్పుడు సమాచారాన్ని పోలీసులకు చేరవేసారు. దీనితో కాంతారావును అరెస్టు చేయాలని పోలీసు అధికారులు ఉత్తర్వులు జారీ చేసారు. విషయం తెలుసుకున్న ఆయన పోలీసులకు దొరకకుండా కుటుంబంతో సహా నాటి బ్రిటీష్‌ మద్రాసు రాష్ట్ర పరిధిలోని జగ్గయ్యపేటకు మకాం మార్చాడు. అక్కడ బతుకు తెరువు కోసం ఆయన నాటకాన్ని ఆశ్రయిం చాడు. ఆదిశేషయ్య హిందిలో వ్రాసిన 'బొబ్బిలి' నాటకంలో ఒక ముఖ్యపాత్రను పోషించారు. కాంతారావు చదువంతా ఉర్దూలో సాగడంతో హిందీలో నాటకాన్ని అద్భుతంగా ప్రదర్శించేవారు. ఈ నాటకం బొబ్బిలి యుద్ధం కథతో సంబంధంలేని కల్పితగాథ. ఇందులో విజయరామరాజు కూతురు అరవింద (హీరోయిన్‌) స్త్రీ పాత్రలో కాంతారావు నటించారు. ప్రజలను చైతన్యపరిచే పాత్ర ఇది. ఈ నాటకాన్ని జగ్గయ్యపేట, గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో ప్రదర్శిస్తే ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
ఆ రోజుల్లో నాటక రంగంలో గుర్తింపు తెచ్చుకుంటున్న నటీ, నటులు సినిమాల్లోకి వెళ్ళి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేవారు. ఆ క్రమంలోనే నాటకాల్లో రాణిస్తున్న కాంతారావును ఆయన మిత్రులు సినిమారంగంలోకి వెళ్ళమని ప్రోత్సహించారు. ఇంటి పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉండడంతో 1950లో కాంతారావు మద్రాసుకు ప్రయాణం అయ్యాడు. అక్కడ ఆయన మామగారికి తెలిసిన మిత్రుడి ఇంట్లో ఆశ్రయం పొందాడు. కాంగ్రేస్‌ నాయకుడు టి. హయగ్రీవాచారి మేనల్లుడు టి. కృష్ణమాచారి (టి.కృష్ణ) తెలుగు చలనచిత్ర పితామహుడుగా పేర్కొనదగిన హెచ్‌.యం.రెడ్డి దగ్గర సహాయ దర్శకుడుగా పనిచేస్తుండేవారు. ఇది వరకే కాంతారావుకు ఆయనతో పరిచయం ఉండడంతో ప్రతిరోజు టి.కృష్ణను రోహిణి సంస్థలో కలుస్తుండేవాడు. కాంతారావు సినిమాల్లో వేశాలకు ప్రయత్నిస్తూనే మద్రాసులో టి.కృష్ణతో కలిసి నాటకాలను ప్రదర్శించేవారు. ఓసారి కాంతారావు 'మేవార్‌' అనే హిందీ నాటకంలో ముఖ్యమైన మొహబ్బత్‌ ఖాన్‌ పాత్రను పోషించారు. ఉర్దూ బాగా తెలిసిన ఆయన అద్భుతంగా నటిస్తే, సినీ రంగానికి చెందిన ఎందరో ఈ నాటకాన్ని చూసి కాంతారావు ప్రతిభను మెచ్చుకున్నారు.
మేవార్‌ నాటకం కాంతారావును సినిమ పరిశ్రమ వారికి ఒక కర్టెన్‌ రైజర్‌లా పరిచయం చేసింది. 1951లో హెచ్‌.యం.రెడ్డి దర్శకత్వంలో 'నిర్దోషి' చిత్రం ప్రారంభమ యింది. ఈ చిత్రంలో ఓ చిన్న పాత్రకు కాంతారావును మిత్రుడు టి.కృష్ణ రికమెండ్‌ చేయడంతో తొలిసారి సినీరంగానికి పరిచయం అయ్యారు. సినిమా షూటింగ్‌లో పాత్ర డైమన్షన్‌ను పూర్తిగా అర్థం చేసుకుని నటించడాన్ని గమనించిన హెచ్‌.యం.రెడ్డి పాత్రనిడివి మరింత పెంచారు. కాంతా రావులోని ఫోటో జెనిక్‌ఫేస్‌, అద్భుతమైన కంఠం హెచ్‌.యం. రెడ్డిలో కొత్త ఆలోచనకు తెరలేపింది. ఆ క్షణమే కాంతారావును తన తదుపరి చిత్రంలో హీరోగా ప్రకటించాడు. అంతేకాదు ఆయనను మరెక్కడ చిన్న పాత్రల్లో నటించవద్దని హుకూం జారీచేసాడు. చిన్నపాత్ర కోసం షూటింగ్‌కు వచ్చిన ఆయనకు హెచ్‌.యం.రెడ్డి ప్రకటన కాంతారావు జీవితంలో ఊహించని మలుపు తిప్పింది. 1952లో హెచ్‌.యం.రెడ్డి 'ప్రతిజ్ఞ' సినిమా ద్వార కాంతారావు తొలిసారి హీరోగా పరిచయం అయ్యాడు. ఇందులో సావిత్రి హీరోయిన్‌గా, రాజనాల విలన్‌గా నటించారు. ఐతే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. ఓ తెలంగాణ వాడు హీరోగా నటించడం రాజనాలకు ఇష్టం లేదు. హీరోగా తనకు అవకాశం ఇవ్వాలని దర్శకుడిపై ఒత్తిడి తెచ్చాడు. కాని కాంతారావును హీరోగా పరిచయం చేస్తానని ఇదివరకే మాట ఇచ్చాను అతనే ఈ సినిమాకు హీరో అని హెచ్‌.యం.రెడ్డి. తేల్చిచెప్పాడట. షూటింగ్‌ మొత్తం పూర్తయ్యాక రాజనాల ప్రొడక్షన్‌ డిపార్ట్‌మెంట్‌ వారిని తనవైపు తిప్పుకుని సినిమా టైటిల్స్‌లో ముందుగా ఆయన పేరును వేసుకుని హీరోగా నటించిన కాంతారావు పేరును తర్వాత వేయించాడు. దీనితో ఈ సినిమాలో హీరో రాజనాల అన్న ప్రచారం జరిగింది. కొంతకాలం తర్వాత వాస్తవం వెలుగుచూసింది. అయితే 'ప్రతిజ్ఞ' సినిమా శతదినోత్సవం పూర్తి చేసుకుని హీరోగా కాంతారావుకు మంచిపేరు తెచ్చి పెట్టింది. మొదటి సినిమా విజయవంతం అయినప్పటికీ రెండవ సినిమా అవకాశం ఆలస్యంగా తలుపు తట్టింది. 1955లో బి. విఠలాచార్య దర్శకత్వంలో 'కన్యాదానం' సినిమాలో హీరోగా నటించారు. ఇందులో హీరోయిన్‌గా షావుకారు జానకి, సి.యస్‌.ఆర్‌., వహీదారహమాన్‌లు నటించారు. ఈ సినిమా పెద్దగా సక్సెస్‌ కాలేదు. ఈ సమయంలోనే కాంతారావు మద్రాసులో 'అన్నాచెల్లెలు' నాటకాన్ని ప్రదర్శించాడు. ఈ నాటకం సినీ ప్రముఖులను విశేషంగా ఆకట్టుకుంది. నాటకం చూసిన నిర్మాత పుండరీకాక్షయ్య యన్‌.టి.రామారావు తీస్తున్న 'జయసింహ' సినిమాలో తమ్ముడి పాత్రకు సిఫార్సు చేసాడు. ఈ సినిమాలో కాంతారావు నటించిన తీరును గమనించిన యన్‌.టి.ఆర్‌. ''బ్రదర్‌ మీకు మంచి భవిష్యత్తు ఉంది'' అని ప్రోత్సహించాడట. ఈ సినిమా కాంతారావుకు మంచి పేరు తెచ్చి పెట్టింది.
అప్పటి వరకు సాంఘిక చిత్రాలకు దర్శకత్వం వహించిన బి.విఠలాచార్య జానపద చిత్రాలవైపు దృష్టి సారించాడు. 1959లో ఆయన దర్శకత్వం వహించే 'జయ విజయ' చిత్రానికి కాంతారావును హీరోగా ఎంపిక చేసుకుని నిర్మించాడు. ఈ సినిమా పెద్దహిట్‌ అయ్యింది. తర్వాత కాలంలో ఈ ఇద్దరి ద్వయం జానపద చిత్రాలకు ట్రెండ్‌సెట్టర్స్‌గా నిలిచింది. వీరిద్దరి కాంబినేషన్లో 'కనకదుర్గ పూజామహిమ' (1960), 'వరలకిë వ్రతం' (1964), 'మదన కామరాజు' (1962), 'గురువును మించిన శిష్యుడు' (1963), 'నవగ్రహ పూజామహిమ' (1964), 'తోటలో పిల్ల-కోటలో రాణి' (1964), 'విజయసింహ' (1965), 'జ్వాలాదీపం' (1965) వంటి ఎన్నో చిత్రాలు హిట్‌ చిత్రాలుగా నిలిచాయి. ఈ విజయ పరంపరలో కాంతారావు జానపద కథానాయకుడుగా, కత్తి యుద్ధవీరుడిగా ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నాడు.
1960లో యన్‌.టి.రామారావు కృష్ణుడుగా ప్రధానపాత్రలో 'దీపావళి' చిత్రాన్ని నిర్మించారు. అందులో నారదుడి పాత్రకు కాంతారావును ఎంపిక చేసారు. షూటింగ్‌ సమయంలో నారదుడి పాత్ర పోషిస్తున్న తీరును చూసిన రామారావు మంత్రముగ్దులయ్యారట. ఆ సందర్భంలో కాంతారావుతో ''నేను సినీరంగంలో ఉన్నంత కాలం శ్రీకృష్ణుడు, రాముడు వంటి పాత్రలు ధరిస్తాను. కాని నారదుడి పాత్రను వేయను. ఆ పాత్ర ఎప్పటికీ మీ కోసమే రిజర్వ్‌ అయివుంటుంది'' అని యన్‌.టి.ఆర్‌ వాగ్దానం చేశారట. ఇచ్చిన మాట ప్రకారం రామారావు నారదుడి పాత్రను ఏనాడు పోషించలేదు. 'దీపావళి' సినిమాలో నారదుడి పాత్ర కాంతారావుకు ఒక ట్రేడ్‌ మార్క్‌ను తెచ్చిపెట్టింది. కాంతారావు తనదైన శైలిలో మేనరిజాన్ని ఆపాదించి ఆ పాత్రకు ఒక గ్లామర్‌ను సృష్టించాడు. దీపావళి సినిమా తర్వాత వచ్చిన 'సీతారామ కళ్యాణం' (1961)లో యన్‌.టి.ఆర్‌.తో కలిసి నటించాడు. ఇందులో రామారావు రావణుడి పాత్రను పోషిస్తూ నారదుడి పాత్రకు కాంతారావును ఎంపిక చేశారు. ఆయనను పిలిచి ''బ్రదర్‌ ఈ చిత్రంలో అసలైన హాస్యం నారదుడి పాత్రలోనే పండుతుంది. నారద పాత్రధారణలో మీకున్న ప్రజ్ఞ మాకు తెలియంది కాదు, అందుకే మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ పాత్రని తెరపై ఆవిష్కరించడంలో మీకు సంపూర్ణ స్వాతంత్య్రం ఇస్తున్నాం. మీకు ఏ విధంగా సంభాషణలు పలకాలనిపిస్తే అలాగే పలకండి, అలాగే అభినయించండి. ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రం చూరగొనాలి!'' అని యన్‌.టి.ఆర్‌. సూచనలు చేశారట. ఆయన నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ఈ సినిమాలో నారదుడి పాత్రను చాలెంజ్‌గా తీసుకుని ప్రధానపాత్రలతో పోటీపడి కాంతారావు నటించారు. ఈ సినిమా ఆయనకు గొప్ప పేరు తెచ్చి పెట్టింది. ఈ నాటికీ 'సీతారామ కళ్యాణం' ప్రేక్షకుల హృదయాలలో చిరస్మణీయంగా నిలిచి పోయిన చిత్రం. 'దీపావళి', 'సీతారామకళ్యాణం' సినిమాలు యన్‌.టి.ఆర్‌. కాంతారావుల మద్య స్నేహబంధాన్ని ఏర్పరచింది. ఆ అనుబంధంతో వీరిద్దరి కాంబినేషన్‌లో ఎన్నో సినిమాలు వచ్చాయి. 'మెహినీరుక్మాంగద'(1962), 'సతీసావిత్రి' (1963), 'మాయామశ్చేంద్ర'లో కాంతారావు నారదుడిగా నటించారు. అంతేకాదు నారదుడి పాత్రతో పాటు రాముడు, కృష్ణుడు పాత్రల్లోనూ రాణించాడు. 'నర్తనశాల' (1963), 'బబ్రువాహన' (1964), 'పాండవ వనవాసం', 'సతీసక్కుబాయి', 'ప్రమీలార్జునీయం' (1965)లో శ్రీకృష్ణుడిగా 'పాదుకా పట్టాభిషేకం' (1966), 'వీరాంజనేయ', 'సతీ సులోచన' చిత్రాల్లో శ్రీరాముడిగా, 'శ్రీకృష్ణరాయభారం', 'వీరాభిమన్యు'లో అర్జునుడిగా, 'లవకుశ'లో లకëణుడిగా యన్‌.టి.ఆర్‌తో కలిసి నటించాడు. పౌరాణిక చిత్రాలతో పాటు జానపద, సాంఘిక చిత్రాల్లోను కాంతారావు, యన్‌.టి.ఆర్‌.ల జోడి కొనసాగింది. 'కంచుకోట, 'మర్మయోగి', 'చిక్కడు-దొరకడు', 'రక్త సంబంధం' (1961), 'ఆప్తమిత్రుడు' (1963), 'భీష్మ' (1962), 'దేశద్రోహులు' (1964), 'ఆడిబతుకు' (1965), 'పల్నాటియుద్ధం' (1966), 'ఏకవీర' (1969) వంటి చిత్రాలు విజయఢంకా మ్రోగించాయి.
ఆ రోజుల్లో ఒకవైపు యన్‌.టి.ఆర్‌. పౌరాణిక చిత్రాల్లోను, అక్కినేని నాగేశ్వరరావు విషాదనాయక చిత్రాల్లో నటించేవారు. మరోవైపు సమాంతరంగా కాంతారావు జానపద చిత్రాల కథానాయకుడుగా ప్రభంజనం సృష్టించాడు. జానపద చిత్రాల నిర్మాతలకు కాంతారావు ఏకైకహీరోగా నిలిచారు. ఈ క్రమంలో యన్‌.టి.ఆర్‌. సైతం జానపద చిత్రాలలో హీరోగా నటించక తప్పలేదు. యన్‌.టి.ఆర్‌.తో అత్యధిక సినిమాల్లో నటించిన కాంతారావు, అక్కినేని నాగేశ్వరరావుతో 'శాంతి నివాసం' (1960) 'శభాష్‌రాజు' (1961), 'రహస్యం' (1967), 'బంగారు గాజులు' (1968), 'బంగారుకలలు' (1974), 'మహాకవి క్షేత్రయ్య' (1976), 'దేవదాసు మళ్ళీ పుట్టాడు' వంటి చిత్రాల్లో నటించాడు.
సి.యస్‌.రావు. సి. విశ్వనాధం, కె.యస్‌.ఆర్‌.దాస్‌, బి.ఏ. సుబ్బారావు వంటి దర్శకులు కాంతారావు హీరోగా 'స్వర్ణగౌరి', 'నువ్వానేను' (1962), 'దేవసుందరి', 'సోమవారవ్రత మహాత్యం' (1963), 'బంగారు తిమ్మరాజు', 'తోటలో పిల్ల- కోటలో రాణి', 'మైరావణ' (1964), 'విజయసింహ', 'ప్రతిజ్ఞా పాలన', 'ఆకాశరామన్న', 'ప్రఛండభైరవి', 'పక్కలో బల్లెం' (1965) 'భూలోకంలో యమలోకం' (1966), 'అగ్గిదొర', 'దేవుని గెలిచిన మానవుడు', 'కంచుకోట రహస్యం' (1967), 'వీరపూజ', 'అగ్గిమీద గుగ్గిలం', 'దేవకన్య', 'దేవుడిచ్చిన భర్త', 'రాజయోగం', 'రణభేరి', 'రాజసింహ', 'ఉక్కుపిడుగు', 'గండర గండడు' (1969), 'మెరుపువీరుడు', 'జన్మభూమి', 'సుగుణ సుందరి కథ', 'రైతేరాజు', 'ఖడ్గవీర' (1970), 'కత్తికి కంకణం', 'అందంకోసం పందెం', 'అడవి వీరులు' (1972), 'విజయ రాముడు' (1974), వంటి చిత్రాల్లో కాంతారావు జానపద కథానాయకుడుగా ఒక వెలుగు వెలిగాడు.
కాంతారావు నటించిన జానపద చిత్రాలను తెలుగు వారు ఆదరించినట్లే తమిళ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తమిళనాట యం.జి.ఆర్‌. కటౌట్లకు సమానం కాంతారావుకు నిలువెత్తు కటౌట్లు పెట్టి నీరాజనాలు పలికారు. కాంతారావు హీరోగా తెలుగులో విజయం పొందిన 'అగ్గిదొర' (1967) సినిమాను తమిళంలో 'మాయాదామోదరం' గా డబ్‌ చేసి విడుదల చేసారు. ఈ సినిమా భారీ కలెక్షన్‌లతో వంద రోజులు ఆడింది. ఆ తర్వాత 'గురువును మించిన శిష్యుడు' చిత్రాన్ని 'వీరమనోహర'గా డబ్‌ చేసి విడుదల చేస్తే తమిళ ప్రేక్షకులు విశేషంగా ఆధరించారు. ఆయన నటించిన ఎన్నో చిత్రాలు తమిళ డిస్ట్రిబ్యూటర్లకు కనకవర్షం కురిపించింది. ఓ సందర్భంలో కాంతారావును ఆంధ్ర యం.జి.ఆర్‌.గా పేర్కొంటూ ఘనంగా సన్మానించారు.
1967లో అంజలీదేవి నిర్మించిన 'సతీ సుమతి' చిత్రంలో సుమతి భర్త పాత్రను పోషించడానికి నాటి అగ్రహీరోలు నిరాకరించారు. అది గ్లామర్‌ లేని కుష్టురోగి పాత్ర. అంజలీదేవి కోరిక మేరకు ఆ పాత్రను పోషించడానికి కాంతారావు ముందుకు వచ్చారు. ఇది తెలిసిన కొందరు కాంతారావుతో హీరోగా పాపులారిటీ ఉన్న సమయంలో ఇలాంటి పాత్రలు పోషిస్తే ఇమేజ్‌ దెబ్బతింటుందని ఆయనను వారించారు. భవిష్యత్తు ఉండదని జోస్యం చెప్పారు. కాని కాంతారావు ఈ సినిమాను ఛాలెంజ్‌గా తీసుకుని గ్లామర్‌లేని హీరో పాత్రలో నటించి చిత్ర విజయానికి దోహదపడ్డాడు. ఈ సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత కాలంలో అంజలీదేవి ఆదినారాయణలు నిర్మించిన అనేక సినిమాల్లో కాంతారావు ముఖ్యపాత్రలు పోషించారు.
తెలుగు సినిమాను ఒక ప్రాంతం వారే ఏలుతున్న కాలంలో తెలంగాణకు చెందిన యం. సత్యనారాయణరావు, పురుషోత్తమ రెడ్డిలు 1960లో 'మంజీరా ప్రొడక్షన్‌'ను స్థాపించి సినిమాలను నిర్మించాలని ముందుకు వచ్చారు. బెంగాల్‌ భాషలో వచ్చిన 'దీప్‌ జల్‌ జారు' చిత్రాన్ని తెలుగులో 'చివరకు మిగిలేది'గా తీసారు. కాంతారావు, సావిత్రి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాలో ఒక మెంటల్‌ ఆసుపత్రి నర్సుగా సావిత్రి, మానసిక రోగిగా కాంతారావు నటించారు. సినిమా విజయవంతం కాకపోవడంతో ఆర్థికంగా దెబ్బతిన్న నిర్మాతలు మరో సినిమా తీయడానికి సాహసించలేదు. కాని ఈ చిత్రం కాంతారావుకు, సావిత్రికి మంచి పేరు తెచ్చి పెట్టింది. నల్లగొండకు చెందిన డా|| ప్రభాకర్‌రెడ్డి మొదటిసారి ఈ సినిమాలో డాక్టర్‌ పాత్రలో నటించాడు.
తెలంగాణకు చెందిన మరో దర్శకుడు బి.యస్‌.నారాయణ దర్శకత్వంలో 1960లో 'మాంగళ్యం' సినిమా వచ్చింది. ఇందులో కాంతారావు, దేవిక ప్రధాన భూమికలు పోషించారు. అదేవిధంగా 1963లో బి.యస్‌. దర్శకత్వంలో వచ్చిన 'ఎదురీత' సినిమాలో, 1971లో వచ్చిన 'ఆనంద నిలయం'లో ఆయన హీరోగా నటించాడు. ఎప్పుడు ఏది, ఎలా జరుగుతుందో ఎవరికీ తెలియదు. అక్కినేని హీరోగా సంగీత, సాహిత్య ప్రాధాన్యతలతో 'మహాకవి కాళిదాసు' చిత్రాన్ని నిర్మించారు. అదే సమయంలో కాంతారావు హీరోగా తక్కువ బడ్జెట్‌తో 'సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి' చిత్రాన్ని తీసారు. ఒకేసారి ఈ రెండు చిత్రాలు ఒకేసారి విడుదల అయ్యాయి. కాని 'కాళిదాసు' సక్సెస్‌ కాలేదు. కానీ అపూర్వ చింతామణి ఘన విజయం సాధించింది. నాగేశ్వరరావు సైతం విస్మయం చెందారు. కాంతారావు జానపద చిత్రాల కథానాయకుడుగా విజయపరంపరతో నిర్మాతలకు కాసుల వర్షం కురిపించారు.
సొంత చిత్రాల నిర్మాణం
నిర్మాతగా మొదటి సినిమా 'సప్త స్వరాలు' 1969లో నిర్మించాడు. ఈ సినిమాకు పోటీగా భావనారాయణ 'లవ్‌ ఇన్‌ ఆంధ్రా' అనే సినిమాను తీసారు. 'లవ్‌ఇన్‌ ఆంధ్రా' సినిమా తెలంగాణ భాషను, యాసను, సంస్కృతిని విమర్శిస్తూ తీసిన సినిమా. ప్రత్యేక ఆంధ్ర, తెలంగాణ ఉద్యమాలు సాగుతున్న సమయంలో ఈ రెండు సినిమాలు విడుదల అయ్యాయి. నిర్మాత భావ నారాయణ తెలంగాణ వారు తీసిన సినిమా చూస్తారా, ఆంధ్రా మీద తీసిన సినిమా చూస్తారా అని ఒక ప్రాంతంవారిని రెచ్చ గొట్టారు. ఈ విద్వేషాల మధ్య కాంతారావు తీసిన 'సప్త స్వరాలు' ప్రేక్షకులు ఆదరించక పోవడంతో ఆయన మొదటి సినిమా నష్టాన్ని మిగిల్చింది. 1969లో కె.యస్‌.ఆర్‌. దాస్‌ దర్శకత్వంలో 'గండర గండడు' రెండో సినిమాగా నిర్మిస్తే ఘన విజయం సాధించింది. ఆ తర్వాత కృష్ణ హీరోగా 'ప్రేమ జీవులు' సినిమాను నిర్మించారు. మంచిచిత్రంగా పేరు వచ్చినా లాభాలను తెచ్చిపెట్టలేదు. 1974లో ఆయన నిర్మించిన 'గుండెలు తీసిన మొనగాడు' 1989లో నిర్మించిన 'స్వాతి చినుకులు' సినిమాలు నష్టాలను తెచ్చిపెట్టాయి. ఈ సినిమా నిర్మాణానికి కాంతారావు సంపాదించిన ఆస్థి హారతి కర్పూరంలా కరిగిపోయింది. సినీ రంగంలో హీరోగా సక్సెస్‌ అయిన కాంతారావు నిర్మాతగా ఫేయిల్యూర్‌ అయ్యారు.
క్యారెక్టర్‌ పాత్రల్లో కాంతారావు
ఒకవైపు హీరోగా సెకండ్‌ హీరోగా కాంతారావు నటిస్తూన్న సమయంలోనే బాలయ్య నిర్మించిన 'నేరము-శిక్ష' (1973)లో దర్శకుడు కె. విశ్వనాథ్‌ సలహామేరకు ప్రత్యేక పాత్రల్లో నటించారు. ఆ పాత్రకు మంచిపేరు రావడంతో మధుసూధన్‌ రావు తాను నిర్మించే 'బంగారు కలలు' చిత్రంలో తండ్రి పాత్ర వేయమని కోరాడు. దానికి ఈ క్యారెక్టర్‌ వెయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్న సమయంలో నాగేశ్వర్‌ రావు సలహా మేరకు పూర్తిస్థాయి క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించాడు. 1974లో హీరో కృష్ణ నటించి నిర్మించిన 'అల్లూరి సీతారామరాజు' చిత్రంలో పడాలు దొరగా నటించాడు. 1974లో విజయనిర్మల దర్శకత్వం వహించిన 'దేవదాసు' చిత్రంలో పార్వతి తండ్రిగా నటించాడు. ఈ సినిమాల్లో నటించినందుకు ఆనాటి అగ్రహీరోలు, యన్‌.టి.ఆర్‌, నాగేశ్వరరావులు కాంతారావుపట్ల కినుక వహించారు. కె.విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన 'ఓ సీతకథ' (1974)లో హీరోయిన్‌ సీత తన తండ్రి వయసున్న వృద్దుడిని పెళ్ళిచేసుకుంటుంది. ఆ వృద్దుడి పాత్రలో కాంతారావు నటించారు. ఈ సినిమా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఆయనకు మంచి పేరు వచ్చింది. బాపు దర్శకత్వంలో వచ్చిన 'ముత్యాలముగ్గు' (1975) తెలుగు నాట ఓ సంచలనం సృష్టించింది. 'లవకుశ' కథ ఆధారంగా కాలాను గుణంగా వచ్చిన మార్పులను ఇతి వృత్తంలో జోడించి సాంఘిక చిత్రం గా నిర్మించారు. అందులో హీరో తండ్రి పాత్రలో నటించిన కాంతా రావు ఈనాటికి గుర్తుండి పోతారు. అదేవిధంగా బాపు దర్శకత్వంలో వచ్చిన 'గోరంతదీపం' (1978) 'మనవూరి పాండవులు' (1978), 'వంశవృక్షం'(1980), 'రాధా కళ్యాణం' (1981) చిత్రాల్లో ముఖ్య పాత్రల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. 1973 నుండి యన్‌.టి.ఆర్‌., నాగేశ్వరరావు, కృష్ణ వంటి అగ్రహీరోలు నటించిన అనేక సినిమాల్లో క్యారెక్టర్‌ పాత్రల్లో ఓ వెలుగు వెలిగారు. ఆయన చివరగా చిరంజీవి హీరోగా వచ్చిన 'శంకర్‌దాదా జిందాబాద్‌' చిత్రంలో ప్రత్యేక పాత్రలో నటించారు.
బుల్లి తెర ప్రవేశం
'మెటా మార్ఫాసిస్‌' ఒక క్రమపద్ధతిలో జరిగితే అది హర్షణీయం. కాని కాంతారావు విషయంలో అదే 'మెటా మార్పసిస్‌' రివర్స్‌ పద్ధతిలో జరిగినట్లు కనిపిస్తుంది. కథానాయకుడు పాత్రల నుండి క్యారెక్టర్‌ పాత్రలు నటించడం ఆ తర్వాత వెండి తెర నుండి బుల్లితెర మీదకు అడుగు పెట్టడం చెప్పుకోదగింది. కాలానికి అనుగుణంగా తాను మారాడు టీ.వీ. సీరియల్స్‌లో క్యారెక్టర్‌ నటుడుగా జీవితాన్ని ప్రారంభించాడు. 'కలవారి కోడలు' సీరియల్‌లో తండ్రి పాత్రలో నటించాడు. పుట్టపర్తి సాయిబాబా పై అంజలీదేవి నిర్మించిన 'సత్యసాయిబాబ' సీరియల్‌లో సాయి బాబ తండ్రి పాత్రలో నటించాడు. స్వయంగా సత్యసాయిబాబ భక్తుడైన కాంతారావు ఈ పాత్ర తనకెంతో తృప్తి నిచ్చిందంటాడు.
'లవకుశ'లో లక్ష్మణుడి పాత్రకు జాతీయ అవార్డ్‌
కాంతారావు సినీ జీవితంలో 'లవకుశ' సినిమా ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఈ సినిమాకు దర్శకుడు సి. పుల్లయ్య, నిర్మాత శంకర్‌రెడ్డి. ప్రధాన పాత్రల్లో యన్‌.టి.ఆర్‌. అంజలీదేవిలు నటిస్తుండగా లక్ష్మణుడి పాత్రకు కాంతారావును ఎంపిక చేసారు. ఇది నచ్చని కొందరు ఆయనను తప్పించేలా ప్రయత్నించారు. ఇది తెలుసుకున్న యన్‌.టి.ఆర్‌. నిర్మాతలను పిలిచి లక్ష్మణుడి పాత్రలో కాంతారావే నటిస్తాడని కఠినంగా చెప్పాడట. 1963లో విడుదలైన 'లవకుశ' విశేష ఆదరణ పొంది తెలుగు ప్రేక్షకుల మనసును దోచుకుంది. ఈ సినిమా రామారావు, అంజలీదేవిలతో సమానం గా కాంతారావుకు గొప్పపేరు తెచ్చి పెట్టింది. లక్ష్మణుడి పాత్రకు భారత ప్రభుత్వం ఉత్తమ సహాయ నటుడిగా ఆయనకు పురస్కారాన్ని ప్రకటించింది. ఆనాటి భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధా కృష్ణన్‌ చేతుల మీదుగా జాతీయ బహు మతిని కాంతారావు అందుకున్నారు.
2000 సంవత్సరానికి నాటి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం కాంతారావు ను రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది. పి.వి.నరసింహారావు కుమారుడు పి.వి.రంగారావు ఆధ్వర్యం లో హైదరాబాద్‌ రవీంద్రభారతిలో 'నట ప్రపూర్ణ' బిరుదునిచ్చి ఘనంగా సన్మానించారు. 1966లో నూరవ చిత్రం 'పాదుకా పట్టాభిషేకం' తర్వాత ఆయనకు జన్మని చ్చిన ప్రాంతం కోదాడలో పౌరసన్మానం జరిగింది. అనేకమంది సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఇందులో పాల్గొన్నారు.
అగ్రనటుడిని గుర్తించని ప్రభుత్వాలు
ప్రతి ఏటా సినీ అవార్డ్‌లు అందించే ప్రభుత్వాలు ఆయన పట్ల నిర్లక్ష్యం వహించాయి. చాలా ఆలస్యంగా కాంతారావుకు 2000 సంవత్సరంలో ఒక్క రఘుపతి వెంకయ్య అవార్డునిచ్చి చేతులు దులుపుకుంది. నాటి పాలకులు దాదాసాహెబ్‌ ఫాల్కే, పద్మశ్రీ వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలకు అర్హుడన్న సంగతి మరిచారు. సినీరంగ ప్రస్థానంలో కాంతారావును తనకు మంచి మిత్రుడుగా భావించిన యన్‌.టి.ఆర్‌. ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన కాలంలో ఈ కుచేలున్ని (కాంతారావు) పిలిచి ఏనాడు ప్రేమను పంచలేదు.
నాటక రంగం నుండి ఎదిగి 1951లో సినీ రంగానికి పరిచయం అయిన కాంతారావు ఇంతింతై వటుడింతై... అన్న చందాన ఆయన వందలాది సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించాడు. జీవన ప్రయాణంలో ఎన్నో ఎత్తు పల్లాలను చూసాడు. రాజభోగాలతో జీవించిన ఆయనే కలిసిరాని కాలంలో సాధారణ జీవితాన్ని అనుభవించాడు. హైదరాబాదులోని నల్లకుంటలో ఒక కిరాయి ఇంట్లో గడుపుతూ తన జీవిత చివరి మజిలీని పూర్తి చేశారు. అందుకే ఆయన దేనితో అనుబంధం పెంచుకోలేదు. అతీతుడుగా కనిపిస్తాడు. ఈ సినీ దిగ్గజం 22 మార్చి, 2009న ఈ లోకాన్ని విడిచివెళ్ళారు. తెలుగు సినీ చరిత్రలో ఆయన ఒక అధ్యాయం. తెలంగాణ సినిమాకు తొలి కథానాయకుడుగా ఆయన గురించి చదవనిదే మరో పేజీ మన ముందు సాక్షాత్కరించదు. అంతేకాదు కాంతారావు 60 ఏళ్ళ సినీ ప్రస్థానంలో తెలంగాణ సినీ దునియాకు కాంతారావు మూల విరాట్టులా కనిపిస్తాడు. నన

- జె.విజయ్ కుమార్‌ జీ,
9848078109

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆ మూడు చట్టాలలో అస‌లేముంది?
సినీ సంగీత సామ్రాజ్యంలో గాన గంధర్వుడు యేసుదాస్‌
క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే
2020లో ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా !
ఎన్ని క్రిస్ట్‌మస్‌ లో..!
వెల్లువెత్తిన భారత రైతు పోరాటం
మానవ హక్కులు : వర్తమాన వాస్తవం
గాలికి రంగులద్దిన దేవి
మన బంగారు బాల్యం.. సమస్యలు.. సవాళ్ళు
మహానుభావుడు మన 'వట్టికోట'

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
08:25 AM

కొత్త కారు కొనాలనుకునే వారికి భారీ షాక్..!

08:11 AM

ఓల్డ్ అల్వాల్‌లో విద్యార్థిని అదృశ్యం

08:09 AM

రాజన్న సిరిసిల్లలో చిరుత కలకలం

08:07 AM

కన్న కూతురిపై ఏడేళ్లుగా లైంగికదాడి

07:50 AM

కూలీలపైకి దూసుకెళ్లిన ట్రక్కు: 13 మంది మృతి

07:37 AM

గుడివాడ టూటౌన్ ఎస్సై ఆత్మహత్య

07:32 AM

నేడు కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనకు సీఎం కేసీఆర్

07:04 AM

టీవీ నటిపై పైలట్ లైంగికదాడి

06:46 AM

నేడు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్

06:41 AM

భీమ‌డోలులో వింత‌వ్యా‌ధి క‌ల‌క‌లం...

08:58 PM

ఇసుక డంపును పట్టుకున్న పోలీసులు

08:43 PM

ప్రైవేటు బస్సు బోల్తా..

08:20 PM

సిరాజ్ పై కేటీఆర్ ప్రశంసల జల్లు..

08:13 PM

23 లక్షల విలువైన గుట్కా, ఖైనీ ప్యాకెట్లు పట్టివేత

08:05 PM

ఇంగ్లాండ్ తో తొలి రెండు టెస్టులకు రేపు భారత జట్టు ఎంపిక

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.