Sat 21 Nov 23:23:27.764256 2020
Authorization
ఓ మహా కుటుంబానికి
ఆకాశమంత ఆసరా ఇచ్చింది
భూదేవంత భరోసా ఇచ్చింది..
ఆ ఇల్లు నాలుగు గదులు చావడి
పెత్తనం చేసే పెద్ద హాలు సందడి..
ఇంటి ముందు గూర్ఖాలా
కావలి కాసే విశాలమైన వాకిలి,
ఇంటి వెనుక బుర్కా వేసుకున్నట్టు
బావి పట్టిన మడి నీళ్ల దోసిలి..
మహా ద్వారము ఆకారం లేనే కాదు
ఆదరణలోనూ సమమే అన్నట్టు
చూసీ చూడంగానే వాటేసుకుంటుంది..
గూటిలోని తాతల కాలము నాటి
గువ్వపిట్ట సైజు మర్ఫీ తీతువుపిట్ట
ఏ గదిలో వున్నా చెవి పక్కన చేరి
ఓ పాటేసుకునేది..
పేద గుమ్మం నా దగుల్బాజీ దర్పంపై
ఓ మొట్టికాయ మొట్టేస్తుంది..
ఆ వాకిట్లోకి ఎప్పుడు అడుగు పెట్టినా
జీవనదిలోకి జారుకున్న పిల్ల చేపలా అయిపోతా..
ఆనందాల ఆనవాళ్ళు వెతుక్కుంటూ
ఆ ఇంటి ఒడిలోకి వాలిపోతా..
ఎన్నెన్ని లేత పాదాలో
ఆ ఇంటినే బంతిలా ఆడుకున్నాయి..
ఎన్ని నూనూగు మీసాలో
అక్కడే మోహన రాగాన్ని పాడుకున్నాయి..
ఇంటి భారాన్నంతా మోసిన దూలానికి
ఊయల మోయడం ఒక లెక్కా !
అక్కడే ఎన్ని ఊయలలూగాయో..
చూరును అంటి పెట్టుకున్న పిట్టలు
ఎన్ని జోల పాటలు పాడాయో..
ఏకాంతంలో మగ్గిన మానులాంటి ఇంటికి
హటాత్తుగా వచ్చిన వసంతానికి
తిరునాళ్ల జాతర హడావుడి..
గుమ్మాలన్నీ గుమిగూడి గుస గుసలు చేసే సందడి..
ఇంటి నరాలన్నీ నర్తిస్తూ పాడే
షహనాయి రాగాల కచేరి..
దర్జాగా ఠీవిగా ఇంటి ముందు
తిష్ట వేసి కూర్చున్నట్టు అరుగు
ఆలమందకు పాక అండలా
రాత్రికి మాకది బూరుగు దూది పరుపు..
ఇంటికి వయస్సుడిగిందని అన్నారుట
మనసున్న ఇంటికి వయసుతో పనేంటి?
మహా వట వక్షంనేల రాలినట్టుగా
వందేళ్ల ఇల్లు రాకాసి కోరలకు
ఇసుక రేణువుల్లా రాలిపోయింది..
నిన్నటి దాకా కోమా లో ఉందనుకున్న ఇల్లు
నేడు జామాయిలు దొడ్డి అయ్యింది..
ఇల్లు లేని ఆ జాగా చూస్తుంటే
ప్రజలు లేని దేశం తీరులా వుంది..
- రెబ్బారం రాంబాబు