Sat 12 Sep 20:37:25.898817 2015
Authorization
అనగనగా ఒక అడివిలో ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టులో చాలా పిట్టలు, పక్షులు గూళ్ళు కట్టుకుని సంతోషంగా వుండేవి. ఆ చెట్టు వాటికి గాలి, చలి, ఎండ తగలకుండా కాపాడేది.
ఒక రోజు ఆకాశమంతా మబ్బు పట్టి హోరున వర్షం కురిసింది. అడివంతా తడిసిపోయింది. పెద్ద చెట్టు పక్కనే ఆడుకుంటున్న కొన్ని కోతులు వానలో తడిచి గడగడ వణుకుతున్నాయి. వాటిని చూసిన పక్షులు నవ్వుతూ వాటితో వెటకారంగా 'మేం ఇంత చిన్నగా ఉన్నా మా ముక్కులతో గడ్డి, చితుకులు సమకూర్చుకుని గూళ్ళు కట్టుకుంటాం. మీకు రెండు కాళ్ళు, చేతులున్నా మీరు ఇళ్ళు కట్టుకోలేదు. ఇల్లు లేకపోవడంతో ఇలా ఎండకి ఎండి, వానకి తడిచి, చలికి గజగజ వణుకుతున్నారు' అని ఎగతాళి చేశాయి.
పక్షులు అలా ఎందుకన్నాయో ఆలోచించలేని మూర్ఖులు ఆ కోతులు. అందుకే వాటికి చాలా కోపమొచ్చింది. అవి గబగబా చెట్టునెక్కి ఆ పక్షుల గూళ్ళను ధ్వంసం చేశాయి. ఆకులను కొమ్మలను విరిచేసి చెల్లాచెదురు చేశాయి. గూళ్ళల్లోని గుడ్లు పగిలిపోయాయి. పక్షుల పిల్లలు భయంతో ఏడుపు మొదలుపెట్టాయి. అంతా నాశనం చేసి కోతులు వెళ్ళిపోయాయి.
ఆకారం లేని చెట్టును, చెల్లాచెదురైన గూళ్ళను, పగిలిపోయిన గుడ్లను చూసి 'అయ్యో, కొరివితో తల గోక్కున్నట్లు... ఈ మూర్ఖపు కోతుల విషయంలో అనసవరంగా తల దూర్చామే. ఇంకెప్పుడూ మనకు సంబంధం లేని విషయాల్లో మాట్లాడకూడదు. అలా మాట్లాడితే ఇంతే నష్టపోవాల్సి వస్తుంది' అనుకున్నాయి పక్షులు.