Sun 13 Dec 00:58:56.568672 2020
Authorization
పోరాటం అనే పదాన్ని మనం తరచూ వింటుంటాం. అంటాం కూడా. పోరాటం ఒక చర్యాపదం. అంటే యుద్ధం చేయటం. ఎవరిమీద యుద్ధం. శత్రువు మీద కావచ్చు శత్రుత్వం మీద కావచ్చు. శుత్రవైతే మనకు ఎదురుగా నిలుస్తాడు. మన పక్కనే మిత్రుల్లానే వుండే వారిపై కూడా అప్పుడప్పుడు పోరాటం చేయాల్సి వస్తుంది. అంతేకాదు, మన మీద మనమే ఒకోసారి పోరాటం చేస్తాం. అంటే ఘర్షణ పడుతున్న ఆలోచనలపైన. పోరాటం చేస్తున్నామంటే చైతన్యవంతంగా వున్నామని అర్థం. సజీవంగా వున్నామనీ భావించాలి. పోరాటమంటే ఘర్షణలో వుండటం.ఇది అనివార్యమయినది.
ఓ పాత సినిమాలో చలం పాడతాడిలా ''జీవితమంటే అంతులేని ఒక పోరాటం, పాపను కడుపున మోసే తల్లికి పది మాసాలు పోరాటం, పుట్టిన పాపకు నడిచే వరకు తప్పటడుగులే పోరాటం. కుటుంబ భారం మోసే తండ్రికి సంసారం ఒక పోరాటం, విద్యార్థులకు పరీక్షలొస్తే చిత్రమైనదా పోరాటం'' అవును ప్రతిస్థాయిలోను పోరాటం సాగుతూనే వుంటది. అంతరాల సమాజంలో అనునిత్యం బతుకు పోరాటం చేయవలసిందే.
మానవుడు ఈ ప్రకృతిపై చేసిన పోరాటంలోంచే నాగరికతను సంతరించుకున్నాడు. భాషా సంస్కృతులను, శాస్త్రసాంకేతికాలను, సకల సౌకర్యాలను ఏర్పాటు చేసుకోగలిగాడు. పోరాటం చేయకుండా ఏదీ సాధించలేము. పోరాటమే మనిషి ఉనికిని ఉన్నతీకరిస్తుంది. సంస్కరిస్తుంది. సజీవంగా నిలుపుతుంది. వర్తమాన సమాజంలో కూడా వ్యక్తిగతంగా బలహీనులైనప్పటికీ సమూహాలుగా మారి, జత కట్టి పోరాటం చేసి తాము కోరుకున్నది సాధించుకొంటున్నారు. మనం జియోగ్రఫీ ఛానల్‌ను ఒకసారి పరిశీలిస్తే అందులో గుంపుకట్టిన గేదెలు సింహాన్ని తరుముతాయి. ఒంటరిగా వున్నవి వాటి చేతిలో చిక్కి ప్రాణాలొదులుతాయి. అంటే ఐకమత్యంతో బలాన్ని పెంచుకుని యుద్ధంలో విజయాలు సాధించుకోవచ్చనేది ప్రకృతి జీవనంలోంచి నేర్చుకున్న పాఠం.
యుద్ధం చేయాల్సింది శత్రువు మీదే కాదు. మనలోని అనేక అవలక్షణాలపైన, అసంబద్ధ ఆలోచనలపైన, అహేతుకతలపైన ఎప్పటికప్పుడు యుద్ధం చేస్తూనే వుండాలి. ముందుగా వాటిని గమనించాలి. దేన్ని వొదిలించుకోవాలో గుర్తించాలి. ఇదంతా ఒక క్రమంలో జరిగే పని. నిరంతర అప్రమత్తతో కూడిన పోరు మనలని మనం మనుషులుగా నిలబెట్టేందుకు దోహదం చేస్తుంది.
పోరాటమంటే బలప్రయోగమని సాధారణంగా భావిస్తుంటాము. భౌతికదాడి అని అనుకుంటాము. పోరాటం చర్చలలో, సంవాదంలో, అభిప్రాయాల ప్రకటనల్లోనూ ఉంటుంది. ఆచరణలోనూ ప్రతిఫలించే పోరాటమూ వుంటుంది. సాంస్కృతిక సంప్రదాయ వ్యక్తీకరణలోనూ వుంటుంది. కళా సాహిత్య దృక్పథాలలోనూ ఆలోచనలు పోరాటం చేస్తూనే వుంటాయి.
ఈ రోజున రైతులు తమ జీవిత భవితవ్యం ప్రమాదంలో పడేసే చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని వీటిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండÊ చేస్తూ నడి వీధిలోకి వచ్చి పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటం చేయబట్టే కనీసం చర్చిద్దామని పిలవగలిగారు. పోరాటం వల్లనే సమస్య రైతులకు మాత్రమేకాదు సమస్త ప్రజలకు సంబంధించినదని తెలిసింది. చట్టాల వల్ల వెంటనే కర్షకులు నష్టపోతారనే విషయం అందరికీ అర్థమయ్యింది. కాబట్టి పోరాటం అనేది వాస్తవ పరిస్థితులను, న్యాయాన్యాయాలను తెలిపేదిగాకూడా వుంటుంది. అసత్యంపై సత్యం తప్పక విజయం సాధిస్తుంది. తాత్కాలికంగా అసత్యం గెలవొచ్చు గాక అంతిమ విజయం సత్యానిదే. పోరాటం మాత్రం నిత్యం.
అందుకనే ఆ సినిమా పాటలో ''న్యాయానికి అన్యాయానికి అనుక్షణం ఒక పోరాటం, మంచి చెడులకు, నిజానిజాలకు యుగయుగాలుగా పోరాటం, హృదయంలేని మనుషుల మధ్య కలసి బతకటం పోరాటం'' అంటాడు. అవును హృదయం లేని సమాజంలో, ఆశను, కలల్ని పండించలేని సంఘంలో కలలతో, ఆశలతో హృదయంతో బతకటం కోసం నిరంతరం పోరాటం చేస్తూనే వుండాలి. ఆత్మాభిమానాన్ని, ఆశయాన్ని చంపుకుని బతకటం కన్నా పోరాటం చేస్తూ జీవితాన్ని త్యాగం చేయటమే ఉత్తమమైనదని భగత్సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్ లాంటి సమర యోధులు మనకు స్ఫూర్తినింపారు. చిరస్మరణీయులై నిలిచారు. అందుకే పోరాటం అనేది ఆశయాన్ని, సజీవత్వాన్ని అంటిపెట్టుకున్న ఆచరణ ప్రతిరూపం.