అగ్రరాజ్యం అమెరికా అభాసు పాలు !!
ఏ యుద్దం ఎందుకు జరిగెనో ?
ఏరాజ్యం ఎన్నాళ్లుందో ?
తారీఖులు, దస్తావేజులు
ఇవికావోరు చరిత్ర కర్దం..... అన్నాడు మహాకవి శ్రీశ్రీ.
ఈ వెలుగులోనే 2020 చరిత్రను కూడా చూడాలి. ఏ రోజున ఏమి జరిగింది అన్నది ముఖ్యమే అయినప్పటికీ వాటి పర్యవసానాలూ, పరిణామాలూ ముఖ్యం. అందువలన వివిధ ఖండాలలో, ఖండాంతర పరిణామాలలో కొన్ని ధోరణుల ముఖ్యాంశాల గురించి మాత్రమే ఇక్కడ ప్రస్తావించటం జరుగుతున్నది.
2020 సంవత్సరంలో ప్రపంచాన్ని కనీవినీ ఎరుగని విధంగా ఊపివేసిన కరోనా వైరస్ (కోవిడ్-19) 2021లో కూడా స్వభావం మార్చుకొని అతలాకుతలం చేసే సూచనలు వెలువడ్డాయి. గతంలో కూడా మహమ్మారులు తలెత్తినా ఇంతగా ప్రభావితం అయిన ఉదంతం లేదనే చెప్పాలి. ఇది రాసిన సమయానికి 220 దేశాలలో ఏడు కోట్ల 91లక్షల 32వేల 157 మందికి వైరస్ సోకింది. వారిలో 17,39,149 మంది మరణించారు. అమెరికా అగ్రస్థానంలో, మన దేశం ద్వితీయ స్థానాల్లో ఉన్నాయి. వైరస్ తొలుత బయటపడిన చైనా కేసుల సంఖ్యలో 80వ స్థానంలో, ఇరుగుపొరుగు దేశాలైన బంగ్లాదేశ్ 27, పాకిస్థాన్ 29, నేపాల్ 40, శ్రీలంక 95వ స్థానంలో ఉన్నాయి. కోవిడ్-19 ఇంకా ప్రపంచంలో వ్యాపిస్తుండగానే బ్రిటన్‌లో అది కొత్త రూపంతో ''సారస్- కోవిడ్-2'' గా వ్యాపిస్తోందని డిసెంబరులో వెల్లడైంది. దాని ప్రభావం ఎలాంటిదో ఇంకా తెలియదు గానీ వేగంగా వ్యాపిస్తుందనే వార్తలు జనాన్ని మరింత భయానికి గురి చేస్తున్నాయి. అనేక దేశాలు అప్రమత్తమై బ్రిటన్‌తో రాకపోకలను నిలిపివేశాయి. అక్కడ తిరిగి లాక్‌డౌన్ ప్రకటించారు. దక్షిణాఫ్రికాలో మరో కొత్తరకం కరోనా బయట పడినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ రెండు దేశాలూ, అక్కడికి వెళ్లి ఇతర దేశాల మీదుగా ప్రయాణించి వచ్చిన వారు ఎక్కడున్నారని వెతికి పట్టుకొని పరీక్షలు చేసేందుకు ప్రభుత్వాలు పూనుకున్నాయి.
మెకెన్సీ సంస్థ డిసెంబరులో విడుదల చేసిన సర్వే ప్రకారం తమ ఆర్థిక వ్యవస్థల గురించి ఐరోపా, ఉత్తర అమెరికా, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల కంపెనీల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేకించి ఐరోపా వారు నిరుద్యోగం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే నెలల్లో పరిస్థితి మెరుగుపడనుందనే ఆశాభావం వెలిబుచ్చిన వారు 68శాతం మంది ఉన్నారు. మరో 24శాతం మంది తిరోగమనంలో ఉండనుందని చెప్పారు. పెద్ద దేశాలలో ఒక్క చైనా తప్ప మిగిలిన దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ తిరోగమనంలోనే ఉన్నాయి.
కరోనా కారణంగా విద్యా సంస్థల మూత కారణంగా 89 శాతం మంది విద్యార్ధినీ విద్యార్థులు ప్రభావితం అయ్యారు. వారి సంఖ్య 152 కోట్లు కాగా విద్యార్థినులు 74.3 కోట్ల మంది ఉన్నారు. ఉపాధి, శిక్షణ కోల్పోయిన వారు 26.7 కోట్ల మంది కాగా వారిలో మూడింట రెండు వంతుల మంది మహిళలు. సెప్టెంబరు నాటికి వంద కోట్ల ఏడు లక్షల మంది విద్యార్థులు స్కూళ్లకు దూరంగా ఉన్నారు. అప్పటికి 72 దేశాల్లో స్కూళ్లు తెరిచారు.
మహమ్మారి కారణంగా దారిద్య్రంలో కూరుకుపోవటంలో అసలు ఆహార లభ్యతే సమస్యగా మారింది. అక్టోబరులో ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం 69 కోట్ల మంది పోషకాహారలేమితో ఉండగా డిసెంబరు నాటికి మరో 13.2 కోట్ల మంది పెరుగుతారని అంచనా.
ఆరోగ్య కేంద్రాలలో మౌలిక సౌకర్యమైన నీటి కొరత కారణంగా 180కోట్ల మందికి ముప్పు తలెత్తిందని డిసెంబరులో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ప్రతి నాలుగు ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలో ఒకదానిలో నీటి సౌకర్యం, ప్రతి మూడింటిలో ఒకదానిలో చేతులు శుభ్రం చేసుకొనేందుకు, పదింటిలో ఒకదానిలో పారిశుధ్య సౌకర్యం, మూడింటిలో ఒకదానిలో వ్యర్థాలను సురక్షితంగా వేరు చేసే సౌకర్యాలు లేవని కరోనా సమయంలో వెల్లడైంది. అయితే కరోనా వ్యాప్తి సమయంలో కొంత మెరుగుపడినప్పటికీ ఈ పరిస్థితిని విస్మరించలేమని యూనిసెఫ్ పేర్కొన్నది. ఇవన్నీ సగటు లెక్కలు, పేద, వర్ధమాన దేశాలలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ సౌకర్యాల కల్పనకు ప్రతి ఏటా తలకు 0.20 డాలర్లు(15 రూపాయలు) ఖర్చు చేస్తే సరిపోతుందని, ఒక డాలరు ఖర్చు చేస్తే ఒకటిన్నర డాలర్ల ప్రతిఫలం ఉంటుందని పేర్కొన్నారు. ఇతర రంగాలను కూడా కరోనా ప్రభావితం చేసినప్పటికీ స్థలాభావం రీత్యా ఈ మూడు అంశాలను క్లుప్తంగా ఇవ్వటమైంది.
ప్రపంచాన్ని ప్రభావితం చేసిన
అమెరికా ఎన్నికలు !
2020లో జరిగిన అమెరికా అధ్యక్ష, పార్లమెంట్ ఎన్నికలు కూడా ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి. గత వంద సంవత్సరాల చరిత్రలో గరిష్ట స్థాయిలో ఓటర్లు పాల్గొనటం ఒకటైతే తాను ఓడిపోతే ప్రత్యర్థి విజయాన్ని అంగీకరించేది లేదని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ముందే చేసిన ప్రకటన, ఎన్నికల ఫలితాల తరువాత వ్యవహరించిన తీరు యావత్ ప్రపంచాన్ని విస్మయానికి, ఆందోళనకు గురి చేసింది. నవంబరు మూడవ తేదీన జరిగిన అధ్యక్ష, పార్లమెంట్ ఎన్నికలలో డెమోక్రటిక్ పార్టీ విజయం సాధించింది. (సెనెట్ ఎన్నికలు ఒక రాష్ట్రంలో పూర్తి కాలేదు) డెమోక్రటిక్ పార్టీ నేత జోబైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రజాప్రతినిధుల సభలో డెమోక్రటిక్ పార్టీ మెజారిటీ స్థానాలను సంపాదించింది. ఎలక్ట్రరల్ కాలేజీలో డెమోక్రటిక్ పార్టీ 306, రిపబ్లికన్ పార్టీ 232 స్ధానాలు తెచ్చుకుంది. ఓట్ల రీత్యా చూస్తే రెండు పార్టీలకు 51.3, 46.9 శాతాల చొప్పున వచ్చాయి. ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం తగనిపని. కానీ మన ప్రధాని నరేంద్రమోడీ అమెరికా వెళ్లి మరీ డోనాల్డ్ ట్రంప్‌కు మద్దతు ఇవ్వాలని ప్రచారం చేశారు. వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు. మెజారిటీ ప్రవాస భారతీయులు బైడెన్‌కు ఓటు చేశారు. హిందూత్వంను తలకు ఎక్కించుకున్న వారు ట్రంప్‌కు మద్దతు పలికారు.
డిసెంబరు 14న ఎలక్ట్రరల్ కాలేజీలో లాంఛనంగా ఓటింగ్ పూర్తయింది. లెక్కింపు జనవరి ఆరున జరుగుతుంది, ఇరవయ్యవ తేదీన కొత్త అధ్యక్ష, ఉపాధ్యక్షులు బాధ్యతలు స్వీకరిస్తారు. ఇప్పటికీ ట్రంప్ తన ఓటమిని అంగీకరించలేదు. ఎలక్ట్రరల్ కాలేజీ ఎన్నిక తరువాత కూడా మద్దతుదారులతో ప్రదర్శనలు చేయించి ఎన్నికల రద్దుకు డిమాండ్ చేయించాడు. ఇప్పటికే పదవిలో ఓడిపోయిన అధ్యక్షుల జాబితాలో చేరాడు, ఎన్నికల ఫలితాన్ని గుర్తించని వ్యక్తిగా చరిత్రకెక్కాడు. మర్యాద పూర్వకంగా అధికారాన్ని అప్పగిస్తారా మెడపట్టి గెంటి వేయించుకున్నట్లుగా వైట్‌హౌస్ వదలి పెడతారా అన్నది చూడాల్సి ఉంది.
గాల్వన్ లోయ ఉదంతం
- ప్రపంచ పర్యవసానాలు !
2020లో అనేక దేశాలలో అంతర్యుద్ధాలు కొనసాగాయి, పశ్చిమాసియాలో పరిమిత స్థాయిలో దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగాయి. అవన్నీ ఎక్కువ భాగం గతం కొనసాగింపే. ప్రపంచాన్ని ఆకర్షించిన ఉదంతం భారత్-చైనాల మధ్య లడఖ్ సరిహద్దులోని గాల్వన్‌లోయ ఉదంతం. ఎవరు ఎవరి మీద ముందుగా దాడి చేశారు అన్నది ఇప్పటికీ తేలని అంశమే. అది వివాదాస్పద ప్రాంతం కనుక మాదంటే మాదని రెండు దేశాలూ చెబుతున్నాయి. ప్రత్యర్థులే తమ మీద ముందు దాడి చేశాయని ఇరు దేశాలూ చెప్పాయి. ఆ ఉదంతంలో చైనా సైనికుల చేతిలో మన సైనికులు 20మంది మరణించటంతో పాటు అనేక మంది గాయపడ్డారు. చైనా వద్ద మన వారెవరూ బందీలుగా లేరని ప్రకటించిన తరువాత మాకు దొరికిన భారత సైనికులు పది మంది వీరే అంటూ చైనా మనకు అప్పగించిన అంశం తెలిసిందే. ఈ ఉదంతంలో చైనా సైనికులు 43మంది మరణించారని, కొందరు బందీలుగా దొరికారని మన అధికారులు చెప్పారు. అది ఇంతవరకు నిర్ధారణ కాలేదు. చైనా వైపు మరణాలు ఇప్పటికీ రహస్యమే. మనం పట్టుకున్నట్లు చెప్పిన బందీలను అప్పగించిన వార్తలు లేవు. ఈ ఉదంతాన్ని ఆసరా చేసుకొని చైనాను దెబ్బతీసేందుకు మేం సాయం చేస్తామంటూ అమెరికా ముందుకు వచ్చింది. జపాన్, ఆస్ట్రేలియా, మన దేశం కలసి చతుష్టయం పేరుతో సైనిక కూటమి దిశగా ప్రయత్నాలు ప్రారంభించాయి.
ఆసియాలో ఆర్‌సిఇపి ముందడుగు !
ఎనిమిది సంవత్సరాల సంప్రదింపుల అనంతరం ఆసియా - పసిఫిక్ ప్రాంతంలోని పదిహేను దేశాలు ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ఒప్పందం (ఆర్‌సిఇపి)పై నవంబరు 15వ తేదీన సంతకాలు చేశాయి. ఇదొక చారిత్రక పరిణామంగా భావిస్తున్నారు. రెండు సంవత్సరాల వ్యవధిలో ఆయా దేశాల చట్ట సభలు ఆమోదం తెలిపిన తరువాత ఇది అమల్లోకి వస్తుంది. ప్రపంచంలో దాదాపు సగం జనాభా, మూడోవంతు జిడిపి ఉన్న దేశాలు కుదుర్చుకున్న ఈ ఒప్పందానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. తొలి నుంచి ఈ ఒప్పంద చర్చలలో ఉన్న భారత్ తాను వైదొలుగుతున్నట్లు గతేడాది నవంబరులో ప్రకటించిన విషయం తెలిసిందే. చైనాకు వ్యతిరేకంగా అమెరికా నాయకత్వంలో మన దేశంతో సహా అవతరిస్తున్న చతుష్టయ కూటమిలో ఉన్న జపాన్, ఆస్ట్రేలియా దీనిలో భాగస్వాములు. దక్షిణ కొరియాతో సహా రాజకీయ అంశాలలో అవి అమెరికాకు మద్దతు ఇస్తూనే ఆర్థిక రంగంలో చైనాతో సంబంధాలతో మరింత ముందుకు పోవాలనే నిర్ణయించా యంటే ఆర్థికాంశాలే ప్రధాన చోదకశక్తిగా ఉన్నాయన్నది స్పష్టం.
ప్రపంచ అగ్రరాజ్యమైన అమెరికా తాను లేని ఈ అతిపెద్ద ఒప్పందం కుదరకుండా చేయాల్సినదంతా చేసింది, అయినా ఒప్పందం కుదరటం అగ్రరాజ్యానికి తగిలిన పెద్ద ఎదురుదెబ్బ. ఆర్‌సిఇపిలోని 15దేశాలలో ప్రపంచంలోని 47.7శాతం మంది జనాభా, మూడోవంతు జిడిపి ఉంది. ప్రపంచ వాణిజ్యంలో 29.1, పెట్టుబడులలో 32.5శాతం వాటాను ఈ దేశాలు కలిగి ఉన్నాయి. ఇక దేశాల వారీగా చూస్తే కలిగే ప్రయోజనాలు కొన్ని ఇలా ఉన్నాయి. జిడిపి పెరుగుదల పసిఫిక్ ప్రాంతంలో 2.1, ప్రపంచంలో 1.4, చైనాకు 0.55, దక్షిణ కొరియాకు 0.41 నుంచి 0.62, జపాన్‌కు 0.1శాతం చొప్పున పెరుగుదల ఉంటుందని అంచనా. చైనా వ్యవసాయ ఉత్పత్తులపై జపాన్ 56 శాతం, దక్షిణ కొరియా ఉత్పత్తులపై 49, ఇతర దేశాల ఉత్పత్తులపై 61 శాతం పన్నులు తగ్గుతాయి.
ఐరోపా యూనియన్ నుంచి
బయటకు వచ్చిన బ్రిటన్ !
ఐరోపా యూనియన్ నుంచి విడిపోవాలన్న బ్రిటన్ ఒప్పందాన్ని జనవరి 29న యూనియన్ పార్లమెంట్ 621 అనుకూలం, 49 ఓట్ల వ్యతిరేకం 13 ఓట్ల గైర్హాజరుతో అంగీకరించింది. ఐరోపా యూనియన్ నుంచి ఒక దేశం వెళ్లిపోవటం లేదా మరొక దేశం చేరటంలో పెద్ద విశేషమేమీ లేదు. కారణాలు ముఖ్యం. నిజానికి దాని ప్రారంభం నుంచీ బ్రిటన్ ఎడముఖం పెడముఖంగానే ఉంది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ ప్రధానిగా పనిచేసిన విన్‌స్టన్ చర్చిల్ 1946లో ఐక్య ఐరోపా రాజ్యం ఏర్పాడాలని పిలుపు ఇచ్చాడు. అయితే ప్రస్తుత ఐరోపా యూనియన్ తొలి రూపాల్లో ఒకటైన ఐరోపా ఆర్థిక యూనియన్ ప్రారంభంలో అది భాగస్వామి కాదు, తరువాత చేరింది. అయితే ఐరోపా యూనియన్‌లో కొనసాగినందున తమకు కలిగిన లబ్ది ఏమీ లేదని, బయట ఉండి ఎక్కువ లాభం పొందాలన్న లక్ష్యంతోనే అది వైదొలిగింది. ఒకనాడు రవి అస్తమించని విశాల సామ్రాజ్యం కలిగిన బ్రిటన్ ఇప్పుడు అమెరికాకు తోకగా వ్యవహరిస్తున్న స్థితిలో ఉంది. ఐరోపా యూనియన్ బలపడటం అమెరికాకు సుతరామూ ఇష్టం లేదు, అలాగని దాని పురోగమనాన్ని అది నిరోధించలేదు. శల్యసారధిగా బ్రిటన్‌ను ప్రయోగించిందనే అభిప్రాయం కూడా ఉంది. నాటో కూటమితో ఐరోపాకు భద్రత కల్పిస్తామని అమెరికా వాటన్నింటినీ ఒక దగ్గరకు చేర్చింది. అయితే ఇంతవరకు ఎలాంటి ముప్పు ఎవరి నుంచీ లేదు. అయినా ఈ ఏడాది జూలై ఐరోపా భద్రతా వ్యూహం పేరుతో ఐదు సంవత్సరాల రోడ్‌మ్యాప్‌ను ఐరోపా యూనియన్ ముందుకు తెచ్చింది. ఎవరి భద్రతకు వారే ఎక్కువ ఖర్చు భరించాలని డోనాల్డ్ ట్రంప్ చెప్పిన విషయం తెలిసిందే.
లాటిన్ అమెరికాలో అమెరికాకు చావు దెబ్బ !
ఈ ఏడాది లాటిన్ అమెరికాలో జరిగిన ముఖ్య పరిణామాల్లో బొలీవియా, వెనెజులా ఎన్నికలు. బొలీవియాలో 2019లో జరిగిన ఎన్నికలలో విజయం సాధించిన ఇవోమొరేల్స్ మీద కుట్ర జరిపి ఆ ప్రభుత్వాన్ని రద్దు చేశారు. తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇవోమొరేల్స్ ప్రవాసం వెళ్లాల్సి వచ్చింది. తరువాత అనేక సార్లు వాయిదా వేసి చివరకు అక్టోబరు 18న జరిగిన ఎన్నికలలో ఇవోమొరేల్స్ నాయకత్వంలోని మాస్ పార్టీ నేత లూయిస్ ఆర్సీ 55 శాతం ఓట్లతో విజయం సాధించారు. అంతకు ముందు జరిగిన ఎన్నికల్లో కంటే ఎక్కువ ఓట్లు పొందారు. పార్లమెంట్ ఉభయ సభల్లో మాస్‌పార్టీ మెజారిటీ సాధించింది. ప్రవాసంలో ఉన్న మొరేల్స్ తిరిగివచ్చారు. వెనెజులా పార్లమెంట్ ఎన్నికలను ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకొనే పార్టీ బహిష్కరించింది. ఈ ఎన్నికలలో నికొలస్ మదురో నాయకత్వంలోని వామపక్ష సోషలిస్టు పార్టీ ఘనవిజయం సాధించింది. పోలింగ్ తక్కువగా జరిగిందనే సాకుతో ఆ ఎన్నికలను గుర్తించేందుకు అమెరికా, ఐరోపా ధనిక దేశాలు తిరస్కరించాయి. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే రెండు దేశాల్లోనూ అమెరికా కుట్రలను జనం ఓటు ఆయుధంతో తిప్పికొట్టారు. అమెరికా బలపరచిన పార్టీలో ఓటర్లకు ముఖం చూపేందుకు జంకాయంటే అవెంతగా జనం నుంచి దూరం అయ్యాయో వెల్లడి అయింది. అనేక దేశాల్లో వామపక్ష శక్తులకు ఎదురుదెబ్బలు తగిలిన నేపధ్యంలో బొలీవియా, వెనెజులా ఎన్నికలు అభ్యుదయ, పురోగామి శక్తులకు ఉత్సాహాన్ని ఇచ్చాయి.
ఆఫ్రికాలో ప్రజాస్వామ్యం ఖూనీ !
ఉత్తర ఆఫ్రికాలోని సహరావీ పౌరుల స్వాతంత్య్రాన్ని హరించి పశ్చిమ సహారాలోని విలువైన సహజ సంపదలను కాజేసేందుకు అమెరికా సామ్రాజ్యవాదులు పన్నిన కుట్రలో మొరాకో ఒక సాధనంగా మారింది. పశ్చిమ సహారాలో ఆక్రమించుకున్న ప్రాంతంపై మొరాకోదే హక్కు అని తాము గుర్తించాలంటే ఇజ్రాయెల్‌తో మొరాకో సంబంధాలు నెలకొల్పుకోవాలని అమెరికా షరతు విధించింది. ఆ మేరకు అమెరికా గుర్తింపు, ఇజ్రాయెల్‌తో ఒప్పందం కుదిరింది. పశ్చిమ సహారాలోని పౌరుల ప్రజాభిప్రాయం మేరకు సమస్యను పరిష్కరించాలన్న ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని అమెరికా తుంగలో తొక్కింది. ఆ ప్రాంతంలో ఏర్పడిన సహరావీ అరబ్ రిపబ్లిక్‌ను ఆఫ్రికన్ యూనియన్ గుర్తించింది. పోలసారియో ఫ్రంట్ నాయకత్వాన మొరాకో ఆక్రమణ నుంచి విముక్తి ఉద్యమం నడుస్తోంది. ఆఫ్రికాలో అమెరికా జోక్యానికి, అరబ్ దేశాల పాలకవర్గాల అవకాశవాదానికి ఇది మచ్చుతునక. పాలస్తీనియన్ల హక్కులను ఫణంగా పెట్టి ఇప్పటికే సౌదీ అరేబియా, బహరెయిన్, సూడాన్ దేశాలు ఇజ్రాయెల్‌తో చేతులు కలిపాయి.
ఉత్తర అమెరికాలో దెబ్బలాట-ముద్దులాట !
ఉత్తర అమెరికా ఖండంగా పిలిచే ప్రాంతంలో అమెరికా అని సాధారణంగా పిలిచే అమెరికా సంయుక్త రాష్ట్రాలతో పాటు మెక్సికో, కెనడా దేశాలున్నాయి. ఈ మూడు దేశాల మధ్య మిత్ర వైరుధ్యాలు ఉన్నప్పటికీ సర్దుబాట్లు చేసుకుంటున్నాయి. దానిలో భాగంగానే ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (నాఫ్టా) గతంలో కుదిరనప్పటికీ అది అమలు కాలేదు. అయితే దాని స్థానంలో నాఫ్టా 2.0గా పిలిచే యునైటెడ్ స్టేట్స్-మెక్సికో -కెనడా ఒప్పందం (ఉస్‌మకా) పేరుతో చేసుకున్న కొత్త ఒప్పందం జూలై ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది. అయినా మూడు దేశాల మధ్య వివాదాలు పరిష్కారం కాలేదు. తాను చెప్పినట్లు వినాలన్న అమెరికా పెద్దన్న వైఖరే దీనికి కారణం. వలస కార్మికులు, దిగుమతులపై అమెరికా-మెక్సికో సంబంధాలలో విబేధాలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రడార్ వెనెజులా నేతలతో ఉన్న సంబంధాలను అమెరికా అంగీకరించటం లేదు. దుష్ట దేశాధినేతల్లో ఒకడిగా భావిస్తున్నది. తాజాగా ఎన్నికైన అధ్యక్షుడు జోబైడెన్‌కు అభినందనలు చెప్పేందుకు చాలా రోజుల పాటు లోపెజ్ ఒబ్రడార్ ముందుకు రాలేదంటే వారి సంబంధాలను అర్థం చేసుకోవచ్చు. కెనడా పరిస్థితి కూడా ఇదే. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి రానున్న సమయంలోనే కెనడా దిగుమతులపై సుంకం విధించనున్నారనే వార్తలు వచ్చాయి. నిజంగానే ట్రంప్ సర్కార్ అంతపనీ చేసింది.
ప్రపంచాన్ని కుదిపివేసిన కరోనా 2021లో కూడా ప్రభావితం చూపనుంది. ఆర్థికంగా అనేక దేశాలు వచ్చే ఏడాది కూడా తిరోగమనంలోనే ఉంటాయన్న వార్తలు వచ్చాయి. కరోనా పూర్వపు స్థితికి చేరుకోవటం పెద్ద సవాలుగా వచ్చే ఏడాది ఉంటుంది. దక్షిణ చైనా సముద్రంలో అమెరికా సృష్టించిన ఉద్రిక్తతలను అమెరికా నూతన అధ్యక్షుడు జోబైడెన్ సడలిస్తారా, మరింతగా ఆజ్యం పోస్తారా అన్నది చూడాల్సి ఉంది. అనేక ప్రాంతాలలో ఇప్పటికే రగిల్చిన ఉద్రిక్తతలను సామ్రాజ్య వాదులు కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.
- ఎం కోటేశ్వరరావు, 8331013288
Sun 27 Dec 07:13:53.147073 2020