Sat 02 Jan 22:57:58.361365 2021
Authorization
చాలా రకాల జంతువులు ముందుగా తాము తిన్న ఆహారాన్ని తిరిగి నెమరు వేసుకుని తింటాయి. దీంతో మొదట తిన్న ఆహారం మరింత నమలటం వల్ల తేలికగా జీర్ణమవుతుంది. సంపూర్ణమైన రుచీ తెలుస్తుంది. మన పెంపుడు పశువులను గమనిస్తే ఈ నెమరు వేయటం పరిశీలించవచ్చు. నెమరు అనే పదానికి ఉన్న అర్థం వాస్తవంగా ఇది.
సాహిత్య పరంగా నెమరు వేసుకోవడం అనే మాటను జ్ఞాపకాలలోకి వెళ్ళటంగా, జ్ఞప్తికి తెచ్చుకోవటంగా చెప్పుకుంటాము. తిరిగి గుర్తు చేసుకోవడమనే భావాన్ని పొందుతాం. పశువులకు ఆ అవకాశం లేదు. ఒక్క మనుషులు మాత్రమే చేసే పని. మనం తిన్న ఆహారాన్ని తిరిగి పంటి కిందకు తెచ్చుకోలేము కాని, మనం చేసిన పనుల్ని, చెప్పిన మాటల్ని, జరిగిన సంఘటనల్ని తిరిగి జ్ఞాపకాల్లోకి తెచ్చుకుని తరచి తరచి పరిశీలించుకుని వాటిల్లోని సారాన్ని రుచి పట్టగలం. దాన్నే మనం అనుభవ గుణపాఠం అంటాము.
కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన మనం, గత సంవత్సరపు జ్ఞాపకాల్ని ఒకసారి నెమరవేసుకుని, కొత్త జ్ఞాన తృష్ణతో, కొత్త చూపుతో ముందుకు పోవాల్సి వున్నది. మనం చేసిన పనుల్లో మంచివేంటి, మంచిగ లేనివేంటో నెమరు వేతలో రుచి చూడాలి. మాట్లాడిన, రాసిన విషయాలలోని మంచి చెడ్డలను పునరావలోకనం చేయాలి. అనుకుని చేయలేక మిగిలిపోయిన వాటినీ గుర్తు చేసుకోవాలి. గత సంవత్సరంలో మన మనసుల్లో పేరుకుపోయిన, అంటుకుని తొలిగిపోలేని మరకలను, మురికిని గుర్తించి శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇది చిన్న విషయం కాదు. చాలా పెద్ద పని. కొత్తగా ఫ్రెష్‌గా మారటానికి ఇదే మంచి మార్గం.
ఇది నా అంతర్గత విషయమని, నా మనస్తత్వానికి మాత్రమే చెందిన విషయమని, నాకెందుకు ఇలా జరిగిందని చాలా మంది అనుకుంటుంటారు. మనం, మనకు సంబంధం లేకుండానే ఒక సమూహంలో జన్మిస్తాము. మొదట కుటుంబం, తరువాత సమాజం, అనేక సంస్థలు, వ్యవస్తలు తీర్చిన మనిషిగానే మనం ఉంటాం. మన వ్యక్తిగతమైన బలాలు, బలహీనతలు కూడా సమాజం నుండి వచ్చినవే. మానసికమైన ప్రతి అంశమూ మనకి ఆవాల వున్న భౌతిక వాస్తవికతల ప్రభావంతోనే నిర్మించబడిందని మరువ కూడదు. మనలాగే చాలా మంది అలా వుంటారనేది కూడా గమనంలో వుంచుకోవాలి.
కాబట్టి పని చేస్తున్న, ఆచరణలో వున్న వారే పొరపాట్లు తప్పులు చేస్తారు. చలనంలో లేనివారు, ఏమీ చేయలేరు అనే సత్యాన్ని గుర్తుంచుకుని, మనం చేసిన పనుల ఫలితాలను సమీక్షించుకోవాలి. మనకు కలిగిన కష్టాలు, వేదనలు, బాధలు, ఆటంకాలు, సవాళ్ళు అన్నీ మన కర్మ అని అనుకోవడం శాస్త్రీయ ఆలోచన కాదు. ప్రతి దానికీ కారణం వుంటుంది. కారకులూ వుంటారు. వాటిని స్పష్టంగా తెలుసుకుని ఎలా వ్యవహరించాలో, ఎలా ముందుకు పోవాలో ఆలోచించుకోవడానికి ఈ నెమరు వేసుకోవడం ఉపయోగపడుతుంది. అందుకోసమే సంవత్సరారంభాన్ని ఒక హద్దుగా, మెట్టుగా భావించాలి. ఒక్కోసారి మనం చేసిన పనులు మనకే ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. సంతోషాన్నిస్తాయి. మన సామర్థ్యాన్ని మనకు చూపిస్తాయి. బలహీనత ఏమిటో వివరిస్తాయి. నెమరు వేసుకోవడమంటే కేవలం జ్ఞాపకాల్లో పడి పలవరించడం, కలవరించడం కాదు. నెమరు వేతల్లోంచి పొందిన ఎరుకతో మరింత ఉన్నతంగా ముందుకు పోవడం.