Sun 10 Jan 00:15:43.964929 2021
Authorization
ఏది ఎలా వున్నా యిరుగుపొరుగు బాగుండాలంటారు పెద్దలు. అంత ప్రాముఖ్యత గల అంశం అది. ఇంట్లో వున్న కుటుంబ సభ్యుల తర్వాత యిరుగుపొరుగు సంబంధమే ముఖ్యమైనదిగా వుంటుంది. యిరుగు అంటే మన ఇంటి పక్కన వున్న వాళ్ళు అని. పొరుగు అంటే పక్కింటి పక్కన వున్న వాళ్ళు. ఇది మన ఇంటి యిరుగు పొరుగే కాదు, దేశపు యిరుగుపొరుగు సంబంధాలు కూడా చాలా ముఖ్యమైనవే. ఇంటి బైటికి వస్తే యిరుగు పొరుగునే చూస్తాము. కలుస్తాము. పలకరిస్తాము. లోకరీతిని మాట్లాడుతాము. దేశాల మధ్య సరిహద్దులున్నా సంబంధాలు బాగుంటే పరస్పరాభివృద్ధికి దోహదపడుతుంది. లేదంటే యుద్ధాలకు, సంక్షోభాలకు దారి తీస్తుంది. యిరుగు పొరుగుతో వైరం, శత్రుత్వముంటే నిత్యం మానసిక క్షోభ కొనసాగుతుంది. అందుకే యిరుగు పొరుగు మంచి వాళ్ళవడం ఒక అదృష్టమంటారు. మనం కూడా అలా వున్నపుడే అది సాధ్యం.
ఒకప్పుడు పల్లెల్లోనైతే యిరుగుపొరుగుతో కుటుంబ సంబంధాలలాగానే కొనసాగేవి. అత్తా, మామ, అక్కా, బావ, అన్నా, వదినా వరుసలతోనే పలకరించుకొనే వాళ్ళు. గబుక్కున ఇంట్లో ఏది నిండుకున్నా పక్కింటికి ఉరికేవాళ్ళు. ఏ ఆపద వచ్చినా అవసరమొచ్చినా యిరుగుపొరుగు సొంతింటి వాళ్ళలానే స్పందించేవారు. పక్కింటి వాళ్ళు మనం ముగిసే వరకూ మన పక్కనే జీవించే వాళ్ళు కదా! పూర్వం పల్లెను తలచుకుంటే ఒక కుటుంబంలాగానే కనపడేది. ఒక్కోసారి యిరుగు పొరుగు వారే ప్రాణ మిత్రులుగా బంధు జనం కంటే దగ్గరయి ఒకరి బాధల్ని ఒకరు పంచుకునేవారు. ఆనందాన్ని అందుకునే వారు.
ఇప్పుడలా లేదు. పట్టణ, నగర ప్రభావాలు పల్లెల మీదా పడ్డాయి. నగరాలలోనైతే పక్కన ఎవరు వుంటున్నారో, వాళ్ళేమీ చేస్తున్నారో కూడా తెలియని, తెలుసుకోలేని పరిస్థితులు వచ్చాయి. కనీస పలకరింపులూ ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడాలు లేకుండా పోయాయి. కేవలం అవసరాల నిమిత్తమే నెలకొనే సంబంధాలను మనం చూస్తున్నాము. కానీ, మనుషుల మధ్య నిజమైన సంబంధాలలోంచే మానవీయత విరాజిల్లుతుంది. సహాయ సహకారాలు మానవ జీవనంలోని మహౌన్నత విలువలు ఈ రకమైన జీవనమే సమాజం తరతరాలుగా మనకందించింది. అవి నేడు విచ్ఛిన్నమవుతున్నాయి. పెట్టుబడి, వ్యాపారం, లాభాలు ఆధారంగా గల సంస్కృతి సమాజంలో పెరిగి, వాటి ప్రాతిపదికగానే సంబంధాలు కొనసాగటంతో యిరుగుపొరుగు సంబంధాల్లోనూ అది ప్రతిబింబిస్తున్నది. ఇవన్నీ డబ్బు సంబంధాలుగానే వుంటున్నాయి. డబ్బు సంబంధాలలో ఎవరినీ నమ్మనితనం ఏర్పడుతుంది. నమ్మకం, విశ్వాసం లేనితనం పెరిగింది. ఇందుకు మనుషుల కన్నా డబ్బును నమ్ముకోవడమే కారణం. అందుకే మనిషిప్పుడు ఒంటరి జీవి.
ఇప్పుడు అంతస్తులు, ఆస్తులు ఆధారరగా గేటెడ్ కమ్యూనిటీ సమూహాలు యిరుగుపొరుగులుగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇందులోనూ కులమూ, మతమూ వచ్చి చేరుతున్నది. మనుషుల్ని వారి ఆలోచనల్ని అరల్లోకి మార్చే సంస్కృతి పెరుగుతోంది. ఈ యిరుగు పొరుగు సంతోషాల్ని అందివ్వదు. బాధల్ని పంచుకోదు. కనీసం వేదనలను వినే సంప్రదాయమూ అడుగంటి పోతుంది.
కానీ సమాజంలో మంచి మానవ సంబంధాలు నెలకొల్పాలని కోరుకునే వారైనా యిరుగుపొరుగుతో సత్సంబంధాలను కలిగి వుండాలి. మంచి చెడ్డలను విచారించాలి. కష్టసుఖాలను తెలుసుకోవాలి. ఎవరేమి చేస్తున్నారో, ఏమి ఆలోచిస్తున్నారో పరిశీలించాలి. చర్చించాలి. మనం చొరవ చేస్తే ఎలాంటి వారైనా మారవచ్చు. మంచి స్నేహితులుగా కొనసాగవచ్చు. యిరుగు పొరుగుతో వున్న స్నేహం పెద్ద బలాన్నిస్తుంది. ధైర్యాన్నిస్తుంది. సహృదయత, సౌహార్థత సామాజిక జీవన లక్షణం. ఇచ్చిపుచ్చుకోవడంలోనే ఆనందం వుంటుంది. ఆదుకోవడంలో సంతృప్తి కలుగుతుంది. మన మాట, ప్రవర్తన, మానవీయ స్పందన ఎదుటివారిని కూడా మార్చుతుంది. యిరుగుపొరుగుతో స్నేహంగా మంచి సంబంధాలను కొనసాగించడం వల్ల ఒక నూతన వాతావరణం నెలకొంటుంది. అది యిరువురికీ బలాన్ని పెంచుతుంది. కుల, మత, ఆస్తి అంతస్తుల బేధాలను లెక్కించకుండా ఒక మానవీయ సహచర్యానికి మార్గం వేసే ప్రయత్నం యిరుగుపొరుగు నుండే ప్రారంభించడం అవసరం.