Sun 10 Jan 01:33:52.863276 2021
Authorization
భోగి పండుగకు మూడు రోజుల ముందుగా అపార్ట్మెంట్లో అందరినీ సమావేశ పరిచారు రాఘవ రావు మాస్టారు . డెభై సంవత్సరాల రాఘవరావు గారిని ఆ అపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరూ ఎంతో గౌరవిస్తారు. 'మాస్టారు' అనిఎంతో ప్రేమగా పిలుస్తారు. ఆయన తెలుగు ఉపాద్యాయుడిగా పదవి విరమణ చేశారు.
''పిల్లలతో పాటు పెద్దలకు కూడా నా విన్నపము ఏమంటే ఈ సారి మూడు రోజుల పండుగకు మీకు కొన్ని సూత్రాలు తెలియజేయడానికే ఈ సమావేశం''
''చెప్పండి తాతయ్యా!'' అన్నాడు ఐదవ తరగతి చదువుతున్న కార్తీక్.
''ఈసారి గాలిపటాలను ఎగురవేయడానికి చైనా మాంజాను వాడరాదని దానిని నిషేదించారు మన కాలనీ సెక్రెటరీ గారు... ఎంత నిఘా పెట్టిన కొన్ని షాపుల్లో పాత చైనా మాంజాలను దొంగ చాటుగా అమ్ముతున్నారు.
''తాతయ్యా! మాంజాను ఎలా చేస్తారు? అన్నాడు హరి.
''మాంజాను ఎలా తయారు చేస్తారంటే గాజు సీసాలను పగుల గొట్టి ఆ ముక్కలను మెత్తని పొడిగా చేసి ఆ పొడిలో కలబంద గుజ్జును కలుపుతారు... ఆ మిశ్రమాన్ని అన్నం ముద్దలో కావలసిన రంగు పొడిని జత చేసి మెత్తగా కలిపి... కాళీ ప్రదేశంలో కొద్ది దూరంగా కర్రలు పాతి గాని లేదా దూరంగా ఉన్న చెట్లకు గాని తెల్లటి దారాన్ని చుట్టి ఆ అన్నం ముద్దను అరచేతిలో పెట్టుకొని ఆ దారానికి బాగా రాస్తారు'' అని చెప్పారు మాస్టారు.
''అంటే అది కూడా ప్రమాదమే కదా తాతయ్య'' అన్నాడు కార్తీక్.
''అవును గాలిపటానికి ఈ మాంజాను ఎందుకు వాడతారు అంటే ఇంకొకరు ఎగురవేసిన గాలిపటాన్ని కాట్ చేయడానికి అంటే తెంపడానికి.. అవతల అతను కూడా మాంజాను వాడతాడు... మంజా తరువాత తెల్లదారం ఉంటుంది. ఈ రెండిటినీ చెరకాకు చూడతారు కొందరు కాళీ డబ్బాకు కూడా చుట్టుకుంటారు. అప్పుడు పెద్ద పెద్ద మైదానాలు వుండేవి... ఇప్పుడంతా అపార్ట్మెంట్లమయం అయ్యింది... దీని వల్ల కూడా పక్షులకే కాక మనుషులకు కూడా ప్రమాదమే పోయినసారి గాలి పటం తెగిపోయాక మాంజా కిందపడి పోయి ఒకతని మేడ మీద వాలింది ఒక అబ్బాయి దారాన్ని లాగుతుండగా అతని మెడ బాగా తెగి రక్తస్రావం అయ్యింది ఆసుపత్రిలో అతనికి కుట్లుపడ్డాయి.
''ఇప్పుడు ఏంచేద్దాము మాస్టారు'' అన్నాడు హరి.
''పిల్లలు, పెద్దలు సరదాగా ఆడుకోవాలి కాబట్టి అందరూ గాలి పటానికి కేవలం తెల్ల దారాన్ని కట్టి ఎగురవేయాలని నా సూచన పెద్దలు ఎగురవేయని పక్షంలో పిల్లలతో పాటు పెద్దలు వెంట వుంటే వారిని కనిపెట్టుకొని ఉండవచ్చు.
''మంచి విషయాలు చెప్పారు మీరు చెప్పిందే ఆచరిస్తాము మాస్టారు'' అన్నారు అందరూ.
''చాలా సంతోషం'' అన్నారు మాస్టారు.
కార్తీక్ కాలనీలో తనకు తెలిసిన మిత్రులందరికీ ఈ సారి మనం మాంజా వాడకుండా తెల్ల దారంతోనే గాలిపటాలను ఎగుర వేద్దాము అని చెప్పాడు అందరూ దానికి సమ్మతిని తెలిపారు.
అపార్ట్మెంట్లోను కార్తీక్ తోపాటు అతని మిత్రులు కూడా పండుగ మూడు రోజులు గాలిపటాలను తెల్లదారంతోనే ఎగురవేశారు.
మూడు రోజుల పండుగ తరువాత మళ్లీ రాఘవరావు గారు అందరినీ సమావేశ పరచారు.
''మన పిల్లలతో పాటు పెద్దలు కూడా మంజాను వాడకుండా తెల్ల దారంతోనే గాలిపటాలను ఎగురవేయడం ఎంతో సంతోషకరమయిన విషయం అందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు'' అన్నారు మాస్టారు.
''మన కార్తీక్ మన వాళ్లకే కాదు అతని మిత్రులకు కూడా తెల్ల దారన్నే వాడేలా ప్రచారం చేశాడు అంతే కాదు వారు కూడా అలాగే ఆచరించారు కూడా'' అన్నాడు హరి.
''అవును నాకు కూడా ఈ విషయాలు తెలిశాయి... మనవడు చేసిన మంచి పనికి ఈ తాతయ్య ఇస్తున్న చిరు కానుక'' అని కార్తీక్‌కు నూట పదహార్లు బహుమతిగా ఇచ్చారు. అందరూ చప్పట్లు కొట్టారు మిగతా పిల్లలకు అందరికీ బాల్ పెన్‌ను ఇచ్చారు.
''తాతయ్యా! ధన్యవాదాలు'' అన్నాడు కార్తీక్.
''కార్తీక్ మీ మిత్రులందరికీ కూడా బాల్ పెన్ ఇవ్వు అని ఒక బాక్స్ ఇచ్చారు'' మాస్టారు.
''అలాగే తాతగారు''
''ఈ సారి గాలిపటాల వల్ల మన చుట్టుపక్కల పక్షులకు ఇతరులకు ఏ మాత్రం గాయాలు కాలేదు. ఇది ఎంతో సంతోష కరమయిన విషయం'' అన్నారు మాస్టారు.
ప్రతిసారి ఇదే విధంగా గాలిపటాలను ఎగురవేద్దాము అని అందరూ తీర్మానం చేశారు.
- యు.విజయశేఖర రెడ్డి,
9959736475