Sun 17 Jan 01:02:03.156138 2021
Authorization
ఆడవాళ్ళు, పిల్లలు, వృద్ధులు రైతులు చేస్తున్న నిరసన దీక్షల్లో పాల్గొనరాదని సాక్షాత్తు మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచించారు. ఎందుకంటే మిగతావాళ్ళకంటే వాళ్ళు బలహీనులని, కష్టాలను, సవాళ్ళను ఎదుర్కోలేరని అందులోని భావన. సమాజంలో ప్రతి ఒక్కరికీ నిరసన తెలిపే హక్కు వుంటుంది. మన రాజ్యాంగం ప్రకారమూ ఆడామగా తేడా లేకుండా అందరూ సమానమనే భావననే తెలుపుతుంది. ఆడవాళ్ళు అబలలనే అభిప్రాయంలోంచి ఈ సూచన వచ్చిందని, ఇది మహిళల సమాన హక్కుల పట్ల వివక్షా పూరిత ఆలోచన అని చర్చ జరుగుతోంది.
రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ వీధుల్లో గత రెండు నెలలుగా జరుగుతున్న ఆందోళనలలో మహిళా రైతులూ పాల్గొంటున్నారు. రైతనగానే పురుషుణ్ణి ఊహించుకుంటాము. కానీ సమ పాళ్ళలో వ్యవసాయ రంగంలో మహిళలూ పని చేస్తూన్నారు. ఇండ్లళ్ళో ఉండే మహిళలు కూడా ఉద్యమానికి వెన్నుదన్నుగా వుంటూ, వారి జీవితాలకే ముప్పు తెచ్చే చట్టాలను వెనక్కి తీసుకునే వరకు పోరాడాల్సిందేనని మద్దతునూ సంపూర్ణంగా తెలుపుతున్నారు. కొందరు ప్రత్యక్షంగానే పాల్గొంటున్నారు.
అయితే అన్ని సవాళ్ళను తట్టుకొని పోరాడగల శక్తిసామర్థ్యాలు మహిళలకు లేవా! లేవనే భావనే న్యాయమూర్తి పిలుపులో కనపడుతోంది. ఏదో దయతో కరుణతో అన్నట్టుగా ఆ మాటలు వున్నప్పటికీ సారాంశంగా మహిళలు బలహీనులనే స్థిర అభిప్రాయం వెల్లడయింది. ఇది అంత పెద్ద స్థానంలో వున్న వ్యక్తికి ఉండాల్సిన అభిప్రాయం కాదు. సామాజిక పరిణామ చరిత్ర తెలియని వారి అభిప్రాయంగానే దాన్ని చూడాల్సి వస్తుంది. ఎందుకంటే మాతృస్వామిక వ్యవస్థలో స్త్రీయే సమాజ గమనానికి కీలకమైన వ్యక్తిగా ముందుండి కృషి చేసింది. ఆహారపు పంటల ఉత్పత్తికి ఆధ్యురాలూ మహిళనే. ఇక చరిత్రను గమనిస్తే వీరోచిత పోరాటాల చేసిన ధీర వనితలు ఎందరో మన ముందు నిలుస్తారు. రాజ్యాలు ఏలిన వాళ్ళూ మంత్రులుగా, సైన్యాధికారులుగా, శ్రామికులుగా, శాస్త్రవేత్తలుగా, కళాకారులుగా, పండితులుగా ఎందరినో ఉదహరించవచ్చు. ఇప్పటికీ ప్రతి ఇంటిలో నిత్య పోరాటశీలురుగా, శ్రమైక ధీరులుగా ఆడవాళ్ళు వున్నారు.
ఎంతో మంది వీరులకు, ధీరులను తీర్చిదిద్దిన వాళ్ళు కూడా మహిళలే అనే విషయం మనం గుర్తు చేసుకోవాలి. మన స్వాతంత్య్ర పోరాటంలోనూ మహిళలు ఎంతో మంది పాల్గొని ప్రాణాలర్పించారు. అందుకు ఉదాహరణే ఝాన్సీలక్ష్మీబాయి, కెప్టెన్ లక్ష్మీ సెహగల్, సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్‌ఫౌజ్‌లో సైన్యాధికారిగా పని చేసిన చరిత్ర మనకళ్ళ ముందుంది. ఎన్ని సవాళ్ళనో ఎదిరించి ధైర్యంగా, సాహసంతో ఈ దేశంలో మొట్టమొదట ఆడపిల్లలకు చదువు నేర్పిన ఉపాధ్యాయురాలు సావిత్రిబాయిఫూలేను మొన్ననే గుర్తు చేసుకున్నాము. వీరనారి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని పోరాడిన చాకలి ఐలమ్మ మన నేల చరిత. ఇలా ఎందరినైనా వివరిస్తూ పోవచ్చు.
స్త్రీకి పురిటినొప్పే ఓ పెద్ద పోరాటం. సమస్త మానవాళికి ప్రాణం పోస్తున్న బలవంతురాలు స్రీ. నిత్య ఆచరణ శీలి, శ్రామిక జీవి. అందుకనే వాస్తవిక జ్ఞానము, సామర్థ్యము, అవగాహన, ధైర్యము మహిళల సొంతం. అలాంటి వారిని తరతరాలుగా వంట ఇంటికి పరిమితం చేసి, పిల్లలు కనే యంత్రంలా మార్చి, బానిసలా చూస్తున్న సమాజంలోని ఆధిపత్య భావజాలాన్ని జీర్ణించుకున్న వ్యక్తులే స్త్రీని అబల అని భావిస్తారు. ఈ ఆలోచనలు మతతత్వం గల వారికి మరీ అధికం. బహిరంగంగానే, ఆడవాళ్ళు ఇంటి పనులకే పరిమితం కావాలని, పిల్లలను పెంచటమే వారి బాధ్యత అని సంఘ్ పరివార్ నాయకులు చెబుతున్నారు. ఇదంతా తిరోగమన భావాల పరంపర. సమాజంలోని సగం మందిని తమ గుప్పిటలో ఆధిపత్యంలో ఉంచుకోవాలనే పురుషాధిక్య అహంకారం తప్ప వేరుకాదు.
ఆధునిక సమాజంలో అందరూ సమానమనే ఆలోచనతో ముందుకు పోవాలి తప్ప, ఇలాంటి వెనుకబాటు భావాలు పనికిరానివి. వీటిని తిప్పి కొట్టాల్సిన అవసరం కూడా వుంది. మతతత్వ శక్తులు పెరుగుతున్న తరుణంలో ఈ రకమైన బేధాలను, అసమానతలు పెరుగుతాయి. అందుకనే మత మూఢత్వంపై నిరంతరం పోరాటం చేస్తూనే ఉండాలి.