Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఆ మూడు చట్టాలలో అస‌లేముంది? | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • కవర్ స్టోరీ
  • ➲
  • స్టోరి

ఆ మూడు చట్టాలలో అస‌లేముంది?

Sun 17 Jan 01:17:59.649117 2021

ఈరోజు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న ప్రధాన చర్చ రైతుల నిరసనలు, ఆ నిరసనలకు కేంద్రబిందువులైన మూడు నూతన వ్యవసాయ చట్టాలు. అందులో మొదటి చట్టం మార్కెట్‌లో విక్రయించే నిత్యావసర దాన్యాలు, వ్యవసాయ ఉత్పాదనల నిలువల మీద ప్రభుత్వ ఆంక్షలను ఎత్తివేస్తూ, ప్రభుత్వాల అజమాయిషీని పరిమితం చేస్తూ నిత్యావసర వస్తువుల చట్టానికి తెచ్చిన సవరణ, ఇక రెండవది, ప్రధానమైనది వ్యవసాయ ఉత్పత్తుల మీద ప్రాథమిక దశలోనే రైతులతో ఒప్పందాలను చేసుకునే అవకాశం వివిధ సంస్థలకు, వ్యాపారులకు కల్పిస్తూ చేసిన నూతన ''రైతుల (సాధికారత, రక్షణ) ధరల హామీ ఒప్పందాలు, వ్యవసాయ సేవల చట్టం - 2020''. మూడో ప్రధానమైన చట్టం, రైతులకు వ్యాపారులకు దేశవ్యాప్తంగా ఎక్కడైనా స్వేచ్ఛగా వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం, వాణిజ్యం చేసుకోవడానికి వీలుకల్పిస్తూ చేసిన ''వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్య వ్యాపారాల (అభివృద్ధి, సులభతర) చట్టం - 2020''.
కరోనా తగ్గుముఖం పట్టిన ఈ తరుణంలో భారత రాజకీయాలు ఈ మూడు చట్టాలు, వాటి ప్రభావాల చుట్టూతనే తిరుగుతున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ఉద్దేశించి ప్రభుత్వం తెచ్చిన గొప్ప చట్టాలు ఇవి అని ప్రభుత్వవర్గాలు ఒకవైపు, కాదు రైతుల జీవితాలను కార్పోరేట్‌ కభంద హస్తాలలోకి తీసుకెళ్ళే రాక్షసచట్టాలు ఇవి అని విపక్షాలు మరోవైపు ఎవరికీ వారు సమర్థించుకుంటున్నా, ఈ నూతన చట్టాలకు సంభందించిన వాస్తవ సమాచారం ఇంకా సామాన్యులలోకి పూర్తిస్థాయిలో వెళ్ళలేదనే చెప్పాలి. చట్టాల వాస్తవ స్వరూపాన్ని ముందుగా పరిశీలించగలిగినప్పుడే వాటి సాధ్యాసాధ్యాల మీద, ప్రభావాలమీద విస్తత చర్చకు ఆస్కారముంటుంది.
24 జూన్‌, 2020 నాడు భారత పార్లమెంటు ఆమోదించిన ''రైతుల(సాధికారత మరియు రక్షణ) ధరల హామీ ఒప్పందాలు మరియు వ్యవసాయ సేవల చట్టం'', 2020 చూడటానికి 4 చాప్టర్‌లు 25 విభాగాలతో (సెక్షన్లతో) కూడుకున్న చిన్న చట్టంలా అగుపిస్తున్నా, దీని ప్రభావం రాబోయే కాలంలో దేశ ఆర్థిక రంగం మీద, వ్యవసాయరంగం మీద ముఖ్యంగా ఆహార ధాన్యాల ధరల మీద ప్రభావవంతంగా ఉండబోతున్నది అనేది అక్షరసత్యం. ఇంతకూ ఆ చట్టంలో ఏమున్నది అనేది సామాన్యుల మెదళ్లను తొలుస్తున్న ప్రధాన ప్రశ్న.
మొదటి చాప్టరు (1,2) చట్టం ప్రాథమిక స్వభావాన్ని వివరిస్తున్నది. 2 వ చాప్టర్‌ (3-12) వ్యవసాయ ఒప్పందాలను వివరిస్తున్నది. 3వ చాప్టర్‌ (13-15) వివాదాల పరిష్కార మార్గాలను నిర్దేశిస్తున్నది. చివరిది అయిన 4వ చాప్టర్‌ (16-25) ఇతర అంశాలను చర్చిస్తున్నది.
సెక్షన్‌ 1 ప్రకారం ఈ చట్టం గత జూన్‌, 2020 నుండి అమలులోకి వచ్చింది.
సెక్షన్‌ 2 వివిధ వ్యవసాయ ఒప్పందాలు, రైతు, వ్యక్తి, కంపనీ, వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ సేవలు, మార్కెట్‌ కమిటీలు, ఎలక్ట్రానిక్‌ వ్యాపారం, లావాదేవీల వేదిక, సంస్థ, అత్యవసర పరిస్థితి, వాణిజ్య, వ్యాపార ఒప్పందాలు, సహకార సంఘం, భాగస్వామ్య సంస్థ తదితర పదాలకు నిర్వచనాలను వివరిస్తున్నది.
సెక్షన్‌ 3 ప్రకారం రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి రాతపూర్వక ఒప్పందాలు చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఇట్టి ఒప్పందాల కాలవ్యవధి ఒక పంట కాలం మొదలు 5 సంవత్సరాల వరకు ఉండవచ్చు. ఒకవేళ పంట కాలం 5 సంవత్సరాలు మించి ఉంటే రైతులు ఒప్పంద కాలాన్ని ఎంత వరకైనా నిర్ణయించుకోవచ్చు.
సెక్షన్‌ 4 వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత, ప్రామాణాల గురించి వివరిస్తున్నది. దీని ప్రకారం వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత, వినియోగించే పురుగు మందులు, ఎరువులు, రకాలు, ఉపయోగించవలసిన నూతన వ్యవసాయ పద్ధతులు, శ్రామికులు తదితర విషయాలను గురించి ముందుగానే రాత పూర్వకంగా ఒప్పందంలో పొందుపరుచుకోవచ్చు. అదేవిదంగా రైతు నుండి వ్యవసాయ ఉత్పత్తులను వ్యాపారులు అందుకునే సమయంలో వాటి నాణ్యత, రకం, వినియోగించిన మందులు, ఎరువుల మోతాదు, ఉపయోగించిన వ్యవసాయ విధానం తదితరాల మీద మూడోవ్యక్తి (థర్డ్‌ పార్టీ) ద్వారా పరిశీలించి సర్టిఫికేట్‌ పొందాలి అనే నిబంధన కూడా వ్యవసాయ ఉత్పత్తి ఒప్పందంలో చేర్చవచ్చు.
సెక్షన్‌ 5 వ్యవసాయ ఉత్పత్తుల ధరలను ఎలా నిర్ణయించాలో వివరిస్తుంది. ఉత్పత్తుల ధరలను ముందుగానే నిర్ణయించి ఒప్పందంలో రాసుకోవచ్చు, ఒకవేళ ధరలను మార్కెట్‌ ధరలకనుగుణంగా నిర్ణయించాలని భావిస్తే, అట్టి ఒప్పందంలో రైతుకు చెల్లించాల్సిన కనీస మద్దతు ధరను ముందుగానే తప్పనిసరిగా పేర్కొనాలి, అదేవిధంగా కనీస మద్దతు ధర మీద రైతుకు ఇంకా ఎంతమేర బోనస్‌ లేదా ప్రీమియంను అదనంగా చేల్లిస్తామనే విషయాన్ని ప్రభుత్వ మార్కెట్‌ కమిటీలు లేదా ఎలక్ట్రానిక్‌ వ్యాపార, లావాదేవీల వేదిక లేదా మార్కెట్లో ఉన్న తగిన ప్రామాణిక ధరలను అనుసరించి ముందుగానే నిర్ణయించాలి, ఆ విషయం స్పష్టంగా ఒప్పందంలో పేర్కొనాలి.
సెక్షన్‌ 6 వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం లేదా కొనుగోళ్లను గురించి వివరిస్తున్నది. వ్యాపారులు రైతుల ముంగిళ్లలోనే వ్యవసాయ ఉత్పత్తులను, ఒప్పుకున్న సమయం లోనే సేకరిం చాలి, అక్కడే నాణ్యత తదితర ప్రమాణాలు (ఒప్పందంలో వ్రాసుకున్న విధంగా) సరిచూసుకోవాలి, తరువాత ప్రశించడానికి వీలులేదు. ఒకవేళ వ్యవసాయ ఒప్పందం విత్తనోత్పత్తికి సంబంధించినదైతే సరుకు తీసుకున్న వెంటనే 2/3 వంతు ధరను రైతుకు చెల్లించాలి. మిగతా సొమ్ము సర్టిఫికేట్‌ పొందిన తరువాత (30 రోజులలోపు) చెల్లించాలి. మిగతా ఉత్పత్తులకు సంబందించిన సొమ్మును సరుకు పొందిన వెంటనే రైతుకు చెల్లించాల్సి ఉంటుంది. రైతులకు చెల్లింపులు ఏ రూపంలో చేయాలి అనే విధివిధానాలను ఆయా రాష్ట్ర ్టప్రభుత్వాలు రూపొందించాలి.
సెక్షన్‌ 7 ప్రకారం వ్యవసాయ ఉత్పత్తుల ఒప్పందంలోని ఉత్పత్తుల మీద రాష్ట్ర ప్రభుత్వాలకు ఎటువంటి నియంత్రణ ఉండదు. అదేవిదంగా అత్యవసర వస్తువుల చట్టం 1955 కింద విధించిన నిబంధనలు కూడా వీటికి వర్తించవు.
సెక్షన్‌ 8 ప్రకారం ఏ వ్యాపారి లేదా సంస్థ ఈ ఈ ఒప్పందాన్ని ఆధారం చేసుకుని రైతుల భూములను కొనుగోలు చేయడం, తాకట్టు పెట్టుకోవడం, లీజుకు తీసుకోవడం లేదా శాశ్వత కట్టడాలు అందులో నిర్మించడం నిషేధం.
సెక్షన్‌ 9 ప్రకారం ఒప్పందంలోని ఉత్పత్తుల మీద ప్రమాద బీమా చేయవచ్చు. ఒప్పందం ఆధారంగా రైతు, వ్యాపారి లేదా ఇద్దరూ కూడా వివిధ సంస్థల నుండి రుణాలు పొందవచ్చు.
సెక్షన్‌ 10 ప్రకారం రైతులు, వ్యాపారులతో పాటుగా ఇతర వ్యక్తులు లేదా సంస్థ/ సంఘం కూడా వ్యవసాయ ఉత్పత్తి ఒప్పందంలో సభ్యులు కావచ్చు.
సెక్షన్‌ 11 ప్రకారం రైతులు, వ్యాపారులు పరస్పర అంగీకారంతో ఒప్పందంలో మార్పులు ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు.
సెక్షన్‌ 12 రైతులు, వ్యాపారులు ఒప్పందాలు చేసుకోవడానికి అనుగుణంగా ఎలక్ట్రానిక్‌ వేదికలను తయారు చేసి, అందుకు విధివిధానాలను రూపొందించాల్సిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తున్నది.
సెక్షన్‌ 13 ప్రకారం ప్రతి ఒప్పందంలో తప్పనిసరిగా వివాదాల పరిష్కారానికి రైతులు, వ్యాపారుల ప్రతినిధులతో కూడిన పెద్దమనుషుల కమిటీ (కన్సిలియేషణ్‌)ని ఏర్పాటు చేసుకోవాలి. అన్ని రకాల వివాదాలు ముందుగా ఈ కమిటీ ముందుకు వెళతాయి.
సెక్షన్‌ 14 ప్రకారం ఒకవేళ ఒప్పందంలో పెద్దమనుషుల (మధ్యవర్తుల) కమిటీ ఉండనట్లయితే, 30 రోజుల తరువాత కూడా వారి వివాదం పరిష్కారం కాకపొతే సదరు రైతు లేదా వ్యాపారి స్థానిక ఉప ప్రాంతీయ పాలనాధికారి (ఆర్‌.డీ.ఓ) దగ్గర పిర్యాదు చేయవచ్చు. సదరు అధికారి వెంటనే మధ్య వర్తులను/ కన్సిలియేటర్‌ కమిటీని నియమించవచ్చు లేదా తానే తీర్పు ఇవ్వవచ్చు. ఒకవేళ తీర్పు వ్యాపారికి వ్యతిరేకంగా ఉంటే జరిమానా ఒకటిన్నర రెట్లకు మించి ఉండవచ్చు, ఒకవేళ తీర్పు రైతుకు వ్యతిరేకంగా ఉంటే జరిమానా వాస్తవ ఖర్చులను మించి ఉండరాదు. అట్టి నష్టపరిహారం రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం వసూలు చేసుకోవలసి ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా తీర్పు నచ్చకపొతే సంబంధిత కలెక్టరు వద్ద అప్పీలు చేసుకోవాలి. సదరు అప్పీలు 30 రోజులలో పరిష్కరించబడాలి.
సెక్షన్‌ 15 ను అనుసరించి రైతుకు వ్యతిరేకంగా తీర్పు వచ్చినప్పటికీ సదరు రైతు భూమిని స్వాధీనం చేసుకోవడానికి మాత్రం వీలులేదు.
సెక్షన్‌ 16 ప్రకారం కేంద్రప్రభుత్వం ఈ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడానికి ఎప్పటికప్పుడు సరైన సూచనలు చేయాల్సి ఉంటుంది.
సెక్షన్‌ 17 ప్రకారం ఈ మొత్తం ప్రక్రియలో ఉన్నటువంటి కలెక్టరు, ఆర్‌.డీ.ఓ, రిజిస్టారు తదితర అధికారులు పబ్లిక్‌ సర్వెంట్లుగా పరిగణించబడుతారు.
సెక్షన్‌ 18 ప్రకారం సదరు అధికారుల మీద వారి ఉత్తర్వులను శంకిస్తూ ఎటువంటి సివిల్‌ దావాలు, క్రిమినల్‌ కేసులు వేయడానికి వీలులేదు.
సెక్షన్‌ 19 ప్రకారం ఈ మొత్తం ప్రక్రియలో సివిల్‌ కోర్టులకు ఎటువంటి అధికారం ఉండదు, వారు ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయరాదు.
సెక్షన్‌ 20 ప్రకారం ఇంతవరకూ ఉన్న వ్యవసాయ సంబందిత చట్టాలన్నీ కొత్తచట్టం ఫరిదిలోకి వస్తాయి.
సెక్షన్‌ 21 ప్రకారం ఈ చట్టం స్టాక్‌ ఎక్స్చేంజి కార్పోరేషన్‌ లకు వర్తించదు.
సెక్షన్‌ 22 ప్రకారం చట్ట ఉద్దేశాన్ని అమలుచేయడానికి అవసరమైన మార్పులను కేంద్రప్రభుత్వం ఎప్పటికప్పుడు పార్లమెంటు అనుమతితో చేపట్టవచ్చు.
సెక్షన్‌ 23 ప్రకారం ఈ చట్టాన్ని అమలుచేయడానికి అవసరమైన ప్రక్రియలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధిత శాసనసభల అనుమతితో చేపట్టవచ్చు.
సెక్షన్‌ 24 ప్రకారం భవిష్యత్తులో ఎదురయ్యే అన్ని ఇబ్బందులను తొలగించే అధికారం కేంద్రప్రభుత్వానికి ఉంటుంది.
సెక్షన్‌ 25 గతంలో కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ప్రత్యేక ఆర్డినెన్స్‌ను ఈ చట్టం ద్వారా రద్దు చేసింది.
ఇక రెండవ చట్టం: ''వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్య వ్యాపారాల (అభివద్ధి, సులభతర) చట్టం - 2020'' గురించి పరిశీలిస్తే, ఇది 5 చాప్టర్లు, 20 సెక్షన్‌లతో కూడుకున్న చిన్న చట్టం, అయితేనేం దీని ప్రభావం దేశంలోని స్వేచ్ఛా వాణిజ్యాన్ని రెక్కల గుర్రం లాగా పైకి తీసుకెళ్తుంది అనడంలో ఎంతమాత్రం అనుమానం లేదు.
సెక్షన్‌ 1 ప్రకారం ఈ చట్టం గత జూన్‌, 2020 నుండి అమలులోకి వచ్చింది.
సెక్షన్‌ 2 వివిధ వ్యవసాయ ఒప్పందాలు, రైతు, వ్యక్తి, కంపనీ, వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ సేవలు, మార్కెట్‌ కమిటీలు, ఎలక్ట్రానిక్‌ వ్యాపారం, లావాదేవీల వేదిక, సంస్థ, అత్యవసర పరిస్థితి, వాణిజ్య - వ్యాపార ఒప్పందాలు, సహకార సంఘం, భాగస్వామ్య సంస్థ, అంతర్రాష్ట్ర వ్యాపారం, రాష్ట్రాంతర్గత వాణిజ్యం, వాణిజ్య సముదాయం తదితర పదాలకు నిర్వచనాలను వివరిస్తున్నది.
సెక్షన్‌ 3 ప్రకారం రైతులు, వ్యాపారులు లేదా ఎలక్ట్రానిక్‌ వ్యాపారం, లావాదేవీల వేదికలు తమ వ్యవసాయ ఉత్పత్తులతో సంబందిత రాష్ట్రంలో కాని, ఇతర రాష్ట్రాలలో కానీ స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఉన్నది.
సెక్షన్‌ 4 ప్రకారం ఆయా రాష్ట్రాలలో వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్య చట్టం కింద ప్రత్యేకించబడిన వ్యవసాయ ఉత్పత్తుల మీద వ్యాపారం చేయాలనుకునే వ్యాపారి తప్పనిసరిగా ఆదాయ పన్ను చట్టం, 1961కి లోబడి శాశ్వత ఖాతా సంఖ్య (PAN) కలిగి ఉండాలి. అయితే రైతు సంఘాలకు మినహాయింపు ఉంటుంది. అవసరమైతే కేంద్రప్రభుత్వ సంబంధిత వ్యాపారుల నమోదుకు, చెల్లింపుల విధివిధానాలను, వాణిజ్య లావాలేవీల పద్ధతులను నిర్ణయించవచ్చు. ప్రతి వ్యాపారి సేకరించిన వ్యవసాయ ఉత్పత్తుల ధరను వెంటనే చెల్లించాలి, లేదా తప్పనిసరిగా 3రోజులలోగా చెల్లించాలి. ఏ సందర్భంలోనైనా కూడా రైతుకు సరుకు స్వీకరించినట్లు, చెల్లింపు బాకీ ఉన్నట్లుగా రశీదును తప్పనిసరిగా వెంటనే ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం అవసరమైతే వివిధ రైతు ఉత్పత్తి సంస్థలు, వ్యవసాయ సహకారసంఘాల ద్వారా కూడా చెల్లింపులకు లేదా కొనుగోలు రసీదులు పొందటానికి తగిన ఏర్పాటు చేయవచ్చు.
సెక్షన్‌ 5 ప్రకారం PAN నంబరు కలిగిన ఏ సంస్థ, సంఘం లేదా కంపనీ అయినా ఎలెక్ట్రానిక్‌ వాణిజ్య, వ్యాపార లావాదేవీల వేదికను ఏర్పాటు చేసుకొని అంతర్‌ రాష్ట్ర లేదా రాష్ట్రాంతర్గత వ్యావారాన్ని ఆయా వాణిజ్య ప్రాంతాలలో చేసుకోవచ్చు. అయితే అట్టి వ్యాపార సంస్థలు లేదా కంపనీలు లేదా సంఘాలు నీతివంతమైన వ్యాపారం కోసం ప్రభుత్వ నిర్దేశిత మార్గదర్శకాలను తప్పనిసరి పాటించాలి. చెల్లింపులు, సాంకేతిక నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. ఇతర వేదికలతో పారదర్శకంగా ఉండాలి. నాణ్యతా ప్రమాణాలను, చెల్లింపు వివరాలను స్థానిక భాషలో ఆయా వ్యాపారవేదికల దగ్గర ప్రదర్శించాలి. ఒకవేళ కేంద్రప్రభుత్వం తప్పనిసరి అని భావిస్తే ఎలక్ట్రానిక్‌ వాణిజ్య వేదికల రిజిష్ట్రేషన్‌ పద్దతులు మరియు విధివిధానాలను రూపొందించవచ్చు. ఆయా సంస్థలు పాటించాల్సిన ప్రవర్తనా నియమావళిని కూడా రూపొందించవచ్చు.
సెక్షన్‌ 6 ప్రకారం ఎటువంటి మార్కెట్‌ ఫీజు లేదా లేవీని సంబంధింత రైతు, వ్యాపారి లేదా ఎలక్ట్రానిక్‌ వాణిజ్య వేదికల నుండి సంబందిత మార్కెట్‌ కమిటీలు వసూలు చేయకూడదు.
సెక్షన్‌ 7 ప్రకారం కేంద్రప్రభుత్వం తన సంస్థల ద్వారా రైతులకు సంబంధిత ఉత్పత్తుల ధరలను తెలియజేసే వేదికలను రూపొందించవచ్చు. ఆయా వ్యాపార వేదికల ప్రాంతాలలో వాటిని ప్రదర్శించవచ్చు.
సెక్షన్‌ 8 ప్రకారం రైతుకు, వ్యాపారులకు మధ్య తగవు ఏర్పడిన సందర్భంలో ఇరువర్గాలు సమస్యను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోన వచ్చును. అందుకొరకు వారు స్థానిక ''డివిజన్‌ రెవెన్యూ అధికారిని'' కలిసి కోరవచ్చును. వారు కోరుకున్న సందర్భంలో సదరు అధికారి తప్పనిసరిగా ఆ తగాదాను తానే ఏర్పాటు చేసిన పెద్దమనుషుల (మధ్యవర్తుల) బోర్డు ముందుకు పంపాల్సి ఉంటుంది. సదరు తీర్పుకు ఇరువర్గాలు కట్టుబడి ఉండాలి. అట్టి ప్రతి బోర్డుకు ఒక చైర్మెన్‌ ఉండాలి. కనీసం ఇద్దరు, అత్యధికంగా నలుగురు సభ్యులు ఉండాలి. బోర్డు చైర్మెన్‌ ఉప ప్రాంతీయ అధికారి కింద పనిచేస్తున్న వ్యక్తి అయి ఉండాలి, ఇతర సభ్యులు రైతులకు, వ్యాపారులకు సమానంగా ప్రాతినిధ్యం వహించాలి. ఒకవేళ రైతులు లేదా వ్యావారులు 7 రోజుల లోపు వారి తరుపు సభ్యులను ఎన్నుకోకపోతే ఉప ప్రాంతీయ అధికారి వారిని కూడా నియమిచాలి. ఒకవేళ 30 రోజులలో అక్కడ సమస్య పరిష్కారం కాకపొతే, వారు ఉప ప్రాంతీయ అధికారిని సంప్రదించవచ్చును. అప్పుడు సదరు అధికారి ''సబ్‌ డివిజనల్‌ అధికారి'' హౌదాలో ఆ సమస్య మీద 30 రోజులలో తీర్పు వెల్లడించాలి. అతను సొమ్ము వసూలుకు ఆదేశాలివ్వడం గాని, జరిమానా విధించడం గాని చేయవచ్చును. సబ్‌ డివిజనల్‌ అథారిటీ తీర్పు నచ్చకపోతే 30 రోజులలోపు అట్టి తీర్పు మీద కలెక్టరు లేదా అదనపు కలెక్టర్‌ ఆధ్వర్యంలోని అప్పీలేట్‌ అథారిటీని సంప్రదించాలి. అతను 30 రోజులలో సమస్య మీద తీర్పుఇవ్వాలి. సబ్‌ డివిజనల్‌ లేదా అప్పీలేట్‌ అథారిటీ తీర్పులు సివిల్‌ కోర్టు తీర్పులతో సమానం.
సెక్షన్‌ 9 ప్రకారం కేంద్రప్రభుత్వం నియమించిన వ్యవసాయ మార్కెటింగ్‌ సలహాదారు లేదా తనిఖీ డైరెక్టరు సెక్షన్‌ 5 లేదా 7లోని నిబంధనలు ఉల్లంఘించిన ఆయా సంస్థలు, కంపనీలు, సంఘాల మీద ఆరోపణలు వచ్చిన 60 రోజులలో వివిధ చర్యలు తీసుకోవచ్చు. వారికి రైతులకు చెల్లించాల్సిన ధనాన్ని వసూలు చేసే అధికారం, జరిమానాలు విధించే అధికారం, వ్యావారం నుండి కొంతకాలం సస్పెండ్‌ చేసే అధికారం ఉంటుంది. అట్టి ప్రతి ఉత్తర్వు సివిల్‌ కోర్టు తీర్పుతో సమానం.
సెక్షన్‌ 10 ప్రకారం సెక్షన్‌ 9 ప్రకారం ఇచ్చిన తీర్పు బాదితుడు 60 రోజులలోపు కేంద్రప్రభుత్వం నియమించిన జాయింట్‌ సెక్రెటరీ స్థాయి అధికారి ముందర అప్పీలు చేసుకోవచ్చు. ఇట్టి అప్పీలు 90రోజులలోపు పరిష్కరించబడాలి.
సెక్షన్‌ 11 ప్రకారం సెక్షన్‌ 4లో విధించిన నిబంధనలు ఉల్లంఘించిన వారికి కనిష్టంగా 25 వేల రూపాయల నుండి గరిష్టంగా 5లక్షల వరకు జరిమానా విధించబడుతుంది. అదే విదంగా సెక్షన్‌ 5, 7 లోని నిబంధనలు ఉల్లంఘించిన ఎలక్ట్రానిక్‌ వాణిజ్య వేదికలు, కంపనీలు, సంఘాల మీద కనిష్టంగా 50 వేల నుండి గరిష్టంగా 10 లక్షల వరకు జరిమానా విధించబడుతుంది.
సెక్షన్‌ 12 ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఈ చట్టాన్ని అమలు చేయడానికి అవసరమైన సలహాలు, దిశానిర్దేశం చేసే అధికారం ఉన్నది.
సెక్షన్‌ 13 ప్రకారం అధికారుల మీద, వారి ఉత్తర్వులను శంకిస్తూ ఎటువంటి సివిల్‌ దావాలు, క్రిమినల్‌ కేసులు వేయడానికి వీలులేదు.
సెక్షన్‌ 14 ప్రకారం ఈ చట్టంలోని నిబంధనలు ఇంతకు ముందు వచ్చిన వివిధ చట్టాల నిబందనలమీద సాదికారికతను కలిగి ఉంటాయి.
సెక్షన్‌ 15 ను అనుసరించి ఈ మొత్తం ప్రక్రియలో సివిల్‌ కోర్టులకు ఎటువంటి అధికారం ఉండదు, వారు ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయరాదు.
సెక్షన్‌ 16 ప్రకారం ఈ చట్టం స్టాక్‌ ఎక్స్చేంజి కార్పోరేషన్‌ లకు వర్తించదు
సెక్షన్‌ 17 ప్రకారం చట్ట ఉద్దేశాన్ని అమలుచేయడానికి అవసరమైన విధివిధానాలను (రూల్స్‌) కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రూపొందించవచ్చు.
సెక్షన్‌ 18 ప్రకారం ఈ చట్టఫరిధిలో కేంద్రం చేసిన ప్రతి మార్పును పార్లమెంటు ముందు పెట్టి అనుమతి తీసుకోవాలి.
సెక్షన్‌ 19 ప్రకారం భవిష్యత్తులో ఎదురయ్యే అన్ని ఇబ్బందులను తొలగించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది.
సెక్షన్‌ 20 గతంలో కేంద్రప్రభుత్వం జారీచేసిన ప్రత్యేక ఆర్డినెన్స్‌ను ఈ చట్టం ద్వారా రద్దు చేసింది.
ఇక మూడవ చట్టాన్ని పరిశీలిస్తే అది ఈ రెండు చట్టాలకు జవసత్వాలను ఇచ్చే చట్టమని చెప్పవచ్చు. అది కేవలం 3 సెక్షన్‌ లతో కూడిన ''అత్యవసర (నిత్యావసర) వస్తువుల (ఉత్పత్తుల) సవరణ చట్టం :2020''. అత్యవసర వస్తువుల చట్టం 1955 ప్రకారం ఇప్పటివరకు దేశంలో వివిధ వ్యవసాయ ఉత్పాదనల నిలవల మీద, రవాణా మీద ప్రభుత్వాల అజమాయిషీ ఉండేది, మార్కెట్‌లో ధరల నియంత్రణకు, నిత్యావసర వస్తువులు ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వాలు ఈ చట్టం పరిధిలో సెక్షన్‌ 3 ద్వారా ఆదేశాలు జారీచేసేవి. ఇప్పుడు కొత్త సవరణ చట్టం ద్వారా పాత చట్టానికి కొత్తగా సెక్షన్‌ 3 (IA) ను జతచేసింది కేంద్రప్రభుత్వం. దీని ఫలితంగా దేశంలోని అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తుల నిలువలు, సరఫరా మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కేవలం అత్యవసర పరిస్థితులలో మాత్రమే (యుద్ధ సమయంలో, తీవ్ర అనావృష్టి/ అతివృష్టి సమయంలో లేదా అసాధారణ ధరలపెరుగుదల సంభవించిన సందర్భంలో) ఉంటుంది. అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తుల నిలువలను (స్టాక్‌) కేవలం రెండు సందర్భాలలో మాత్రమే ప్రభుత్వాలు నియంత్రించడానికి అవకాశం ఉంటుంది.
1. ఉద్యానవన ఉత్పత్తుల విక్రయ ధరలు వందశాతం పెరిగినప్పుడు
2. నిలువచేయగలిగే (నాన్‌ పెరిషేబుల్‌) వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ (రిటైల్‌) ధరలలో పెరుగుదల 50 శాతం మించినప్పుడు (12 నెలల ముందటి ధర లేదా 5 సంవత్సరాల సరాసరి విక్రయధర ఏది తక్కువుంటే దాన్ని ధరల పెరుగుదల అంచనాకు లెక్కలోకి తీసుకుంటారు).
అయితే ఈ విధమైన ప్రభుత్వ నియంత్రణ అనుమతించిన మేర నిలువ ఉంచుకున్న ప్రాసెసింగ్‌ యూనిట్‌లకు, వ్యవసాయ ఉత్పత్తుల తరలింపు గొలుసులో పాల్గొనేవారికి అనగా విక్రయంలో పాల్గొనే రైతులు, వ్యాపారులు, వ్యవసాయ ఉత్పత్తుల ఉత్పత్తి నుండి తుది వినియోగం వరకు ప్రాసెసింగ్‌, ప్యాకేజీ, నిలువ, రవాణా, పంపకం తదితర అంశాలలో పాల్గోనేవారికి, (వాల్యూ చైన్‌ పార్టిసిపెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ప్రొడ్యూస్‌) వర్తించదు. అదేవిధంగా ప్రభుత్వాల ప్రజా రవాణా సంస్థలకు ఈ నిబంధన వర్తించదు. ఇదీ మూడు చట్టాల కథాకమీషు.
మొదటి చట్టాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఎదురయ్యే మొదటి ప్రశ్న రైతులతో వ్యవసాయ ఉత్పత్తుల ఒప్పందానికి అర్హులు ఎవరు? వారి ఆర్ధిక వనరులు ఏమిటి? ఆయా వ్యక్తులు లేదా సంస్థల మీద నిఘా ఎవరి భాద్యత? అనిల్‌ అంబానీ లాంటి వాళ్ళు దివాలా తీస్తే అప్పులిచ్చిన పెద్దపెద్ద బ్యాంకులు విలవిలలాడుతున్నాయి. అటువంటి పరిస్థితి రైతుకు ఎదురైతే అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్న కోట్లాది చిన్న, సన్నకారు రైతులు ఎవరిని ఆశ్రయించాలి? మధ్యవర్తులను/సంస్థలను ఒప్పందంలో పార్టీలుగా చేర్చవచ్చు అని అన్నారు. వారి విశ్వసనీయతను నిర్ణయించేది ఎవరు? కంపనీ/ వ్యాపారి కాకుండా మూడో వ్యక్తి/ సంస్థ రైతు ఉత్పత్తికి, గిట్టుబాటు ధరకు భాద్యత వహించే అవకాశం ఇవ్వడం అంటే దళారుల పాత్రను చట్టబద్దం చేయడం కాదా? మధ్యవర్తుల ఆర్థిక సామర్థ్యాన్ని నిర్ణయించేది ఎవరు? రేపు రైతుకు నష్టం జరిగితే కంపనీ/ వ్యాపారి పక్కకు జరిగితే, మధ్యవర్తి తన దగ్గర ఆర్థిక వనరులు లేవని చేతులు ఎత్తేస్తే రైతులు నష్టపరిహారం ఎలా పొందుతారు. మూడోవ్యక్తి (ధర్డ్‌ పార్టీ) ద్వారా క్వాలిటీ, క్వాంటిటీ తదితరాలు సర్టిఫై చేయబడాలి అన్నారు. భారతదేశంలో ప్రభుత్వ పరంగా అటువంటి ఏర్పాటు నామమాత్రంగా మాత్రమే ఉన్నాయి. స్వంతంగా అటువంటి సంస్థలను ఏర్పాటు చేసుకునే స్థితిలో రైతులు లేరన్నది వాస్తవం, అంటే కార్పోరేటు కనుసన్నల్లో నడిచే ప్రైవేటు వ్యక్తులు, సంస్థలే ఉత్పత్తుల నాణ్యతను నిర్ణయిస్తాయన్నది అక్షరసత్యం. తరుగు పేరుతో, తేమ పేరుతో జరుగుతున్న మోసాన్నే ఎదుర్కోలేకపోతున్న రైతు భవిష్యత్తులో ప్రైవేటు/ కార్పోరేటు సంస్థలతో సాంకేతిక పరిజ్ఞానంలో పోటీపడగలడా? అన్యాయం జరిగితే అధికారుల ముందు విజయవంతంగా ప్రశ్నించగలడా? ఉత్పత్తుల ధరల నిర్ణయంలో ఎక్కడా ప్రభుత్వాల పాత్ర లేనేలేదు. చిన్న, సన్నకారు రైతులు సరైన అవగాహన లేక, మోసపోతే 5 సంవత్సరాల వరకు నష్టాన్ని భరించాల్సిందే కదా. మందుల ఉపయోగం మీద, ఎరువుల ఉపయోగం మీద అవగాహన లేక, కార్పోరేట్‌ మాయలోపడి 5 సంవత్సరాలు ఒకే విధమైన పంటలను ఉత్పత్తిచేసి భవిష్యత్తులో భూమి నిస్సారమైతే ఆ రైతుకు దిక్కెవరు?
మొత్తం ప్రక్రియను పరిశీలిస్తే రాష్ట్రాల పాత్ర నామ మాత్రమే అని చెప్పవచ్చు. రిజిష్ట్రేషన్‌ వ్యవహారాలకు వేదికలను ఏర్పాటు చేయదం, వివాదాల పరిష్కారానికి అధికారులను నియమించడం మినహా మిగతాదంతా ప్రేక్షకపాత్రే అని చెప్పవచ్చు. ఇది సమైఖ్య స్పూర్తికి పూర్తిగా విరుద్ధం. ఆయా రాష్ట్రాలలోని పంటల మీద, మార్కెట్‌ నియంత్రణ మీద రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేకుండాపోతుంది. ఇతర రాష్ట్రాలలోని మార్కెట్‌ డిమాండుకు అనుగుణంగా పంటలు వేస్తే, సంబంధిత రాష్ట్రంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడే ప్రమాదమున్నది. అంతిమంగా అధిక సంఖ్యాకులైన వినియోగ దారుల మీద భారం పడుతుంది. ఒప్పందాలలో ప్రభుత్వాల పాత్ర లేకపోవడం వలన మార్కెట్‌ నియంత్రణ అదుపుతప్పే ప్రమాదమున్నది. ఒప్పందాల రిజిష్ట్రేషన్‌ సమయంలో ఆయా సంస్థలు/వ్యాపారులు కనీస మొత్తంలో డిపాజిట్‌ చేయాలన్న నిబంధనలు ఉండి ఉంటే రైతుకు కనీస భరోసా అయినా ఉండేది. వ్యాపారులు/ సంస్థలు సేకరించిన ఉత్పత్తులలో కనీస మొత్తం సంబంధిత రాష్ట్ర పరిధిలో వినియోగించాలన్న నిబందన లేకపోతే ఆయా రాష్ట్రాల్లో వ్యవసాయ ఉత్పత్తుల కొరత అనూహ్యంగా పెరిగిపోయే ప్రమాదమున్నది. కార్పోరేట్‌ కంపనీలు దేశవ్యాప్తంగా సేకరించిన ఉత్పత్తులను తమకు అనుకూలంగా ఉన్న ఒకటి లేదా రెండు రాష్ట్రాలకు తరలించి అక్కడ ప్రాసెసింగ్‌ యూనిట్‌లను, పరిశ్రమలను స్థాపించే ప్రమాదం కూడా పొంచి ఉన్నది. అదే జరిగితే దేశంలో అభివద్ధి కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతుంది. దీనికి సంబంధించిన విధివిధానాలు కూడా చట్టంలో రూపొందించాలి. నిత్యావసర వస్తువుల నిలువల, రవాణాల మీద ప్రభుత్వాల నియంత్రణ వదులుకోవడమంటే దేశంలోని కోట్లాదిమంది నిరుపేద, మధ్య తరగతి వినియోగదారుల జీవితాలను దురాఘాతానికి బలిచేయడమే. ఒక్క ఉల్లిగడ్డరేటు పెరిగితేనే అల్లాడిపోతున్న దేశంలో, ఇక అన్ని వ్యవసాయ ఉత్పత్తుల నిలువల మీద ప్రభుత్వ నియంత్రణ వదులుకుంటే రేపటిరోజు వినియోగ దారుల పరిస్తితి ఎంతదారుణంగా ఉండబోతుందో ఉహకు కూడా అందదు.
వ్యవసాయం కేవలం రైతుకు రాబడిని, ప్రభుత్వాలకు పన్నులను సంపాదించిపెట్టే బంగారుబాతు మాత్రమే కాదు, సమాజాన్ని బతికించే ప్రధాన జీవాదారం కూడా. రేపు అందిన అవకాశాన్ని అందిపుచ్చుకుని అందరూ వాణిజ్య పంటలకు, ఒకే విధమైన పంటలకు ఎగబడితే ఆహారదాన్యాల కొరత ఏర్పడే ప్రమాదమున్నది. ప్రభుత్వాలు ప్రోత్సాహం ఇస్తామన్నా కూడా కొన్ని పంటలు పండించడానికి విముఖత ఎదురుకావచ్చు. ఆయా రాష్ట్రాల్లో ఆహారధాన్యాల ధరలు చుక్కలను అంటే ప్రమాదమున్నది. ఈ చట్టం మొత్తంగా చూస్తే ఇది రైతులు వ్యాపారులతో ఒప్పందాలు చేసుకోవడానికి, ధరలను నిర్ణయించుకోవడానికి సంబంధించినదే తప్ప, ఇతరత్రా రైతును బలోపేతం చేసే అంశాలు ఏమీ లేవనే చెప్పాలి (బలమైన రైతు సంఘాలు ఉన్నచోట మినహా). పరిమితమైన పాత్రతో రాష్ట్రాలు భవిష్యత్తులో ధాన్యం కొనుగోళ్లను నిలిపివేస్తే సుమారు 70శాతం ఉన్న చిన్న, సన్నకారు రైతులు దళారుల చేతుల్లో నరకాన్ని చవిచుస్తారు. కార్పోరేటు సంస్థలు నిలువ గదులను (గోడౌన్‌) నిర్మించుకుని, వ్యవసాయ ఉత్పత్తులను నిలువ చేసుకుని మార్కెట్‌ మీద నియంత్రణ సాధిస్తే, సరైన నిలువ పరిస్థితులు లేని రైతులు వారితో ఎలా పోటీపడతారు? కనీస ధరను నిర్ణయించే అధికారాన్ని ప్రభుత్వం వదులుకోవడమంటే రైతును కార్పోరేట్‌ కబందహస్తాల్లోకి నెట్టడం కాదా? ఎటువంటి ముందస్తు పెట్టుబడీ పెట్టని, లేదా నామమాత్రపు పెట్టుబడులు పెట్టిన వ్యాపారులు/సంస్థలు ఎంతకాలమైనా కోర్టుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగగలవు. అందుకు విరుద్ధంగా అప్పులు చేసి వ్యవసాయం చేసిన రైతులు నెలలతరబడి అదికారుల చుట్టూ తిరుగుతూ మరో పంట కాలాన్ని కూడా వృథా చేసుకుంటాడా? నా ఖర్మ ఇంతేననుకుని సర్దుకుంటాడా? లక్షల రూపాయలకు కక్కుర్తిపడి తప్పుడు తీర్పులిస్తున్నరనే ఆరోపణతో రెవెన్యూ కోర్టులను రద్దు చేశారు. అటువంటి అధికారులకు కోట్ల రూపాయల ఒప్పందాల మీద తీర్పులిచ్చే అవకాశం ఇస్తే, అవినీతిలో అగ్రస్థానంలో ఉన్న దేశంలో బక్క రైతుకు న్యాయం జరుగుతుందా అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఈ మొత్తం వ్యవహారంలో న్యాయస్థానాల పాత్ర ప్రేక్షకపాత్ర అంటే అతిశయోక్తి ఎంతమాత్రం కాదు.

- చందుపట్ల రమణకుమార్‌ రెడ్డి,
9440449392
న్యాయవాది

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సైన్సుదే భవిష్యత్తు!
సృజనకు విత్తు స్వంత భాష
పేమ్ర పేమ్రను పేమ్రిస్తుంది..
ఆదివాసీ దర్పం నాగోబా జాతర
హొయలొలికిన భారతీయ చితక్రళ
పాత పంటల సంరక్షణే లక్ష్యంగా...
సినీ సంగీత సామ్రాజ్యంలో గాన గంధర్వుడు యేసుదాస్‌
క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే
2020లో ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా !
ఎన్ని క్రిస్ట్‌మస్‌ లో..!

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
04:13 PM

భారత్ ఘన విజయం..టెస్టు సిరీస్ కైవసం

04:08 PM

గోల్నాకలో విషాదం.. భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య

04:02 PM

హైదరాబాద్ లో ఘోర ప్రమాదం..

03:55 PM

ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 2021 ప్రారంభం

03:45 PM

బీడీ కార్మికుల ధర్నా

03:27 PM

బాలుడిని మింగెసిన మొసలి.. పొట్ట కోసి బయటకు తీశారు (వీడియో)

02:58 PM

కవి లక్ష్మీనారాయణ భట్ట కన్నుమూత

02:44 PM

విజయానికి 4 వికెట్ల దూరంలో భారత్..

02:10 PM

కేటీఆర్ పీఏనంటూ మోసాలు..మాజీ రంజీ క్రికెటర్ అరెస్ట్

01:56 PM

ఈ నెల 11 నుంచి జూబ్లీహిల్స్‌ వెంకన్న బ్రహ్మోత్సవాలు

01:36 PM

శ‌ర్వానంద్ కొత్త చిత్రం టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

01:21 PM

ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ డెస్క్‌‌ను ప్రారంభించిన సజ్జనార్

01:15 PM

నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం

01:02 PM

పెద్దపల్లిలో వృద్ధుడు దారుణ హత్య

12:48 PM

రాజేంద్రనగర్‌లో వివాహిత ఆత్మహత్య

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.