Sat 23 Jan 22:58:27.039475 2021
Authorization
సాధారణంగా పెండ్లిళ్ళలో పెద్దలుంటారు. వారు ఏవేవి ఎలా చేయాలో, ఏవి చేయకూడనివో చెబుతూ,అన్ని కార్యక్రమాలు చక్కబెడుతుంటారు. వాళ్ళ పెత్తనమే కొనసాగుతూ వుంటది. ఏదేమైనా పెండ్లి జరిపించడం ఆ పెద్ద మనుషుల లక్ష్యం. కానీ పెండ్లిళ్ళు ఎవరెవరు చేసుకోకూడదో, అర్హంకారో చట్టంచేసి మరీ చెబుతున్న ఈ మతతత్వ పెత్తనాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది.
ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వం ఒక కొత్త పెళ్ళి చట్టం తీసుకొచ్చింది. అదేమంటే మతాంతర పెళ్ళిళ్ళను నిషేధిస్తూ చేసిన చట్టం. మత మార్పిడితో కూడిన పెళ్ళిళ్ళు నేరపూరితమైనవని నిర్ధారించే చట్టం. ఇదే మతతత్వ శక్తులున్న మధ్యప్రదేశ్‌లోనూ ఇలాంటివే అనుసురిస్తున్నారు. ఇప్పటి వరకు రాజ్యాంగం మనకిచ్చిన హక్కులను కాలరాసి, వ్యక్తుల స్వేచ్ఛను భంగపరిచే వివాహ చట్టమిది. ఇరవై ఒకటో శతాబ్దంలో ప్రజాస్వామిక సమాజంలో నివసిస్తున్న మనం తిరిగి ఆంక్షలు, నిషిద్ధాలు, విభజనలు, నిర్బంధాల తిరోగమన విధానాల పెత్తనాలలోకి మరలిపోతున్నాము. భావి తరాలు, కులమతాలకతీతంగా తమ జీవితాల్ని ఇష్టపూర్వకంగా, ప్రేమానురాగాలతో, కొనసాగించే హక్కును నిరాకరించడమే కాక, మత చిచ్చును మనుషుల మధ్య రగిలించడమే. ఇది చాలా దారుణమైన విషయం.
'దేశ దిమ్మరిగా తిరుగుతూ ఉండే మనిషికి ఒక చోట నిలకడ ఏర్పడే సరికి, కలిగిన మార్పు మనిషికి సొంత ఆస్తి ఏర్పడడం. దాన్ని కాపాడటం కోసం, తన తరాలకే సముపార్జితాన్ని అందివ్వడం కోసమూ పెళ్ళి, కుటుంబము పరిణమించాయి. అనేక వందలవేల సంవత్సరాల పరిణామంలో పెండ్లిళ్ళు కూడా మార్పులు జరుగుతూ ఈ దశకు వచ్చింది' అంటాడు ప్రముఖ సాహితీ పరిశోధకుడు తాపి ధర్మారావు. మన సనాతన శాస్త్రకారులు అష్ట విధ వివాహాలని సెలవిచ్చారు కాని ఎందులోనూ కుల, మత , ప్రాంత ప్రస్తావనలు తీసుకురాలేదు. 'ఐరేణి' కుండలు మన పెండ్లిళ్ళలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. వాస్తవంగా 'ఐరేణి' అనేది మన భాషకు సంబంధించినదే కాదు. ఇరాన్ దేశీయుల మాటని చెబుతున్నారు. ఎందుకంటే ఆ ప్రాంతాల తవ్వకాలలో ఇలాంటి రంగు పూసిన కుండలు (ఐరేణి కుండలు) బయల్పడ్డాయని ధర్మారావు గారు వివరిస్తారు.
ఇవన్నీ ఎందుకుదహరించానూ అంటే దేశదేశాల సంప్రదాయాలు కలుపుకుని ఏర్పడిన మన పెళ్ళి విధానాన్ని మత పరంగా విభజించాలని చూడటం చరిత్ర జ్ఞానం ఎరుగనివారి అజ్ఞానపు చర్య మాత్రమే అని తెలపటం కోసం. నేటి సంప్రదాయపు పెళ్ళి తతంగంలో వున్న అనేక మూఢ విశ్వాసాలను, స్త్రీలను అణచి పెట్టే చర్యలను వ్యతిరేకిస్తూనే స్త్రీ పురుషులు కలిసి జీవనం కొనసాగించడానికి ఆంక్షలను ఏర్పరుస్తున్న ఈ మతతత్వ తిరోగమన విధానాలను తిప్పి కొట్టాల్సి వుంది.
పెండ్లికి మూలమైన భార్యాభర్తల సంబంధంలో కూడా అనేక మార్పులు వచ్చాయి. కలిపి మెలసి జీవించగల స్నేహం, ప్రజాస్వామికంగా కొనసాగటం నేటి పెళ్ళి బంధానికి షరతులుగా మారాయి తప్ప కుల, మత, ప్రాంత, భాషా విషయాలు కానేకాదు. మతోన్మాదం, అది ఏ మతానికి చెందినదైనా మనుషుల మధ్య ప్రేమను మానవత్వాన్ని ధ్వంసం చేసేదిగానే వుంటుంది. ఒక్క పెళ్ళి విషయంలోనే కాదు, కట్టు, బొట్టు, వేషం, భాష, ఆహారం, ఆహార్యం అన్నింటిపైన ఆంక్షలకు పూనుకుంటుంది. నేడు భారతదేశంలో మనం చూస్తున్నది ఇదే. ప్రేమను కూడా మత ప్రాతిపదికన చూసే దృష్టి చాలా అనాగరికమైనది. దేశంలోని యువత అప్రమత్తమై మతోన్మాద చర్యలను గమనించి తిప్పికొట్టాలి. ప్రేమ బంధాలు, పెళ్ళి బంధాలు, ఆర్థిక సామాజిక అడ్డంకుల వల్ల విఫలమవుతున్న వాస్తవ స్థితిపై చర్చను చేయకుండా మతవాదాన్ని తెస్తున్న శక్తుల పట్ల అప్రమత్తంగా వుండాలి.