Sat 13 Feb 23:23:10.08739 2021
Authorization
- ప్రేమికుల రోజును ఎందుకు జరుపుకుంటాం
ప్రేమ.. రెండు హృదయాల స్పందన.. ఒక జీవితానికి అల్లుకునే బంధం.. రెండు మనసులతో పెనువేసుకున్న అనుబంధం... నిర్వచనలేని అద్వితీయమైన అనుభూతి.. అమృతతుల్యమైన ప్రేమను ఆస్వాదిస్తేనే తెలుస్తుంది... అలాంటి ప్రేమకు.. ప్రేమికుల కోసం ప్రత్యేకించి ఉన్నది ప్రేమికుల రోజు.. ఆ రోజు ప్రత్యేకతతో పాటు, ప్రస్తుత సమాజంలో ప్రేమ అంటే ఎలా ఉందో.. ఎలా ఉండాలో చెప్తూ... ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్ళి చేసుకున్న జంటల మనోభావాలు, అర్థం చేసుకుంటూ ఆచరణలో ఆదర్శంగా నిలుస్తున్న వారి అనుభవాలతో పాటు ఇరు కుటుంబాలతో వారు కొనసాగిస్తున్న బంధాలను, పెళ్ళి తర్వాత కూడా ప్రేమగా చిగురించిన వారి అభిప్రాయాలు సోపతితో పంచుకున్నారు. అంతేకాదు, నేటి ప్రేమల గురించి, పెళ్ళిళ్ళ గురించి, పిల్లల భవిత గురించి వాళ్ళేమంటున్నారో చూద్దాం...!!!
ప్రతి ఏటా ఫిబ్రవరి 14 వస్తూ వుంటుంది. యువ ప్రేమికుల్ని పలుకరిస్తుంది. హిందూ మత ఛాందస శక్తులు పార్క్‌ల వెంట, ప్రేమికుల వెంటపడి దౌర్జన్యంగా పెళ్ళిళ్ళు చేయడం దాడులు చేయడం వేధింపులు సాధింపులు ఈ దేశంలోనే జరగటం విషాదం. బాధాకరం. మరో వైపు మార్కెట్ శక్తులు కోట్లలో వ్యాపారం చేస్తున్నారు. ఒక వైపు కులాంతర మతాంతర వివాహాల్ని ప్రోత్సహించాలి. స్వకుల వివాహాల కంటే వర్ణాంతర వివాహాలే మిన్న అంటూ ప్రజాతంత్ర అభ్యుదయ శక్తులు అహరహం కృషి చేస్తున్నాయి. కులాంతర వివాహాలు చేసుకొన్న వారికి ఉపాధి - రక్షణ ప్రభుత్వాలు కల్పించాలనే డిమాండు ముందుకొచ్చింది. మరోవైపు పరువు హత్యలు ప్రేమికులపై దాడులు జరుగుతున్నాయి. ఇది విషాదం... ప్రేమించలేదని మహిళలపై దాడులు ఖండించాలి. అపరిపక్వత, ప్రేమపై అవగాహనలేమి ఈ ఉన్మాదానికి కారణాలు....
ఈ వ్యవస్థ మనుషుల్ని మనసు లేని మార్కెట్‌మయం చేసినా.. సృష్టి ఉన్నంతకాలం 'ప్రేమ' స్త్రీ పురుషుల మధ్య, అనురాగం చిగురిస్తూనే వుంటుంది. ఇది సహజాతంగా జరుగుతుంది. మకరందం తుమ్మెదను ఆకర్షిస్తుంది. పడిలేచే సముద్ర కెరటం తీరం తాకాలనే ఉబలాటంతో ఆటుపోటులకు గురవుతుంది. చిగురించే మొక్క భానుడి కాంతి కిరణాలకు ఆకర్షితమవుతుంది. చంద్రుని చూసిన కలువలూ, సూర్యుని చూసిన తామరలు వికసిస్తాయి. స్త్రీ పురుషుల్లో (ప్రేయసి ప్రియుల్లో) ప్రేమ అనే అయస్కాంత శక్తి ఆకర్షింపజేస్తుంది. ఈ ఆకర్షణ లో కులం, మతం, దేశం, దనం, ప్రాంతం, వయస్సు తేడాలు, హౌదాలు... కూల్చివేయబడతాయి. హద్దులు సరిహద్దులు చెరిపి వేస్తాయి. టీనేజ్ ప్రేమలు.. అందరికీ అనుభవైక వేద్యమే.. (ప్రేమ ఆకర్షణలకు తేడాలు తెల్సుకోవాలి) పురాణాలు ప్రామాణికత ప్రశ్నార్థకమే అయినా... అలనాటి రామాయణ కథా నాయకుని రాముని ముత్తాత అజమహారాజు తన భార్య శవంపై బడి సహగమనం (ప్రతి సహగమనం) చేసాడు(ట)? ఇక తారచంద్రల (ప్రణయం... చరిత్ర కథల్లో సారంగధర కథలు.. ఎన్నో... 'సలీం అనార్కలీ' ప్రేమ ఎప్పటికీ అజరామరమే. ప్రేమ గురించి చెప్పేంత కాలం లైలా మజ్ను దేవదాసు పార్వతి రోమియో జూలియట్ లాంటి కథలకు కొదవలేదు.. జీవితం విలువైనది. అందమైనది.
యువ లోకాన్ని ప్రేమ సాగరంలోకి దించిన వాలెం''టైన్స్''
క్రీ.శ.3వ శతాబ్దంలో అంటే క్రీ.శ.269 సం||లో రోమ్‌లో వాలెంటైన్ అనే మతగురువు ఉండేవాడు. ఆయన రోమ్‌చక్రవర్తియైన పొరుగు దేశాలతో యుద్ధాలు చేసేవాడు. అపరిమిత రాజ్య విస్తరణా కాంక్షాపరుడైన క్లాడిమస్ తరచు పొరుగు దేశాలతో యుద్ధాలు చేసేవాడు. బ్రహ్మచారులే (వివాహం కాని వారు) సైనికులుగా రాణించగలరని భావించాడు రాజు. యువకులు ఎవ్వరూ వివాహం చేసకోరాదని 'ఫత్వా' జారి చేశాడు. ఈ నిర్ణయం సరికాదు- తప్పు అని మతగురువైన ''వాలెంటైన్'' వ్యతిరేకించాడు. రాజు నిర్ణయాన్ని ధిక్కరించి ప్రేమికుల వివాహాలు (సైనికుల) జరిపించాడు. ప్రేమను బతికించాడు.
మత గురువైన వాలెంటైన్ తన శాసనాన్ని ఉల్లంఘించాడని భావించిన రాజు క్లాడియస్ అతనికి మరణశిక్ష విధించాడు. ఇదో కథ ప్రచారంలో వుంది. దీనికి కొనసాగింపుగా మరో కథ కూడా ప్రచారంలో ఉంది. కథలు ఏమైనా స్వేచ్ఛ ధిక్కార స్వరాలే యువతకు ఆదర్శం కావాలి. ఉరిశిక్ష పడి జైలు శిక్ష అనుభవిస్తున్న వాలెంటైన్‌కు జైలర్ కుమార్తె అయిన ఆస్టిరియన్‌తో పరిచయం కలుగుతుంది. మత గురువుపై సైతం ప్రేమలో పడేలా నాటి పరిస్థితులు మారాయి. క్రీ.శ. 269 ఫిబ్రవరి 14న ఉరిశిక్ష అమలుకు ముందు తన ప్రేమను ఓ గ్రీటింగ్ కార్డు తయారు చేసి ''నీ వాలెంటైన్'' అని సంతకం చేశాడనే కథ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధికెక్కింది. అందమైన ఆనందమైన జీవితం ప్రేమికుల హక్కు అని చెప్పాడు. ప్రేమను, ప్రేమికుల్ని కలపడానికి ప్రాణాలు ఫణంగాపెట్టిన వాలెంటైన్‌కు ఘన నివాళిగా ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవం 'వాలెంటైన్ డే' ఫిబ్రవరి 14న జరుపుతున్నారు. ముఖ్యంగా 17వ శతాబ్దం నుండి ఈ వాలెంటైన్ డే పై మోజు ఆసక్తి పెరిగింది.
నేటి యువత తమ తమ ప్రేమను ప్రపోజల్స్‌ను.. వ్యక్తం చేస్తూ, కొత్త దారులు తొక్కుతున్నారు. ప్రేమే సృష్టికి మూలం... ప్రేమే జగతికి మార్గం అంటూ.. నవలోకం నిర్మించే దిశగా ప్రయాణిస్తున్నారు ప్రేమికులంతా.. మూఢాచారాన్ని మనువాద సంస్కృతిని కుల మతాన్ని పెత్తందారీ భూస్వామ్య సంస్కృతిని యువత మనిషిని మార్కెట్ సరుకుగా, వినిమయం సంస్కృతికి నెట్టే ప్రపంచీకరణ విషపు ఫలాలు 2000 సం|| నుండి మరింత ఎక్కువైనాయి. స్త్రీని భోగ వస్తువుగా అంగడి సరుకుగా మార్చే సామ్రాజ్యవాద దుష్ట సంస్కృతిపై యువత పోరాడాలి.
నిజమైన ప్రేమలో ధనం, హౌదా, కీర్తి, అధికారం ఉండవు. నిలబడవు. ఒక ఆదర్శమైన దాంపత్య జీవనంలోకి పురుషుడు స్త్రీ ప్రవేశించి దేశభక్తి యుతమైన పౌరుల్ని తీర్చిదిద్దాలి. సంసార మధురిమలు.. విలువలు.. ఆదర్శాలతో జీవిక సాగించాలి. కోట్లాడి రూపాయల ఆర్జన కోసం 'వాలెంటైన్ డే'ను వాణిజ్జీకరించే వ్యాపార సంస్కృతిని తిప్పికొట్టాలి.
- తంగిరాల చక్రవర్తి
9393804472
ద్వంద్వరీతి మంచికాదు
పెద్దలు అంగీకరించరనే వారికి తెలియకుండానే ఆర్య సమాజ్‌లో పెళ్ళి చేసుకున్నాను. స్నేహితులు, మిత్రులు మా వివాహానికి సహకరించారు. ప్రారంభంలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. తర్వాత ఇంట్లో వాళ్ళు మాట్లాడక పోవడం కూడా మాకు కొంత ఇబ్బంది అనిపించింది. కానీ కొంతకాలానికి మాట్లాడి, దగ్గరకు తీశారు. మా ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు ఇంతవరకు రాలేదు. కానీ అప్పుడప్పుడు కోపాలొస్తాయి. అయినా సమర్థించుకుని, ఒకరినొకరం అర్థం చేసుకుంటున్నాం. ఎప్పుడూ మాట్లాడుకోకుండా ఉండలేదు. పెళ్ళి ముందు ఉన్న ప్రేమ కంటే, పెళ్ళి అయిన తర్వాత ఇంకా ఎక్కువ ప్రేమగా ఉంటున్నాం. ఏమీ తగ్గలేదు. ప్రేమ పెళ్ళిళ్ళు ఒకరిపైన ఒకరికి నమ్మకాన్నిస్తాయి. ఇప్పుడు ఒకరికొకరం అర్థం చేసుకుని కలిసి ఉంటున్నాం. పెద్దలు కూడా ఇప్పుడు బాగా చూసుకుంటున్నారు. తల్లిదండ్రులు అన్నదేమంటే, మాకు ముందుగా చెప్పి ఒప్పించి పెళ్ళి చేసుకోవాల్సింది అని అన్నారు. కులాంతర వివాహం జరిగినందున మా పిల్లల్ని కూడా కులరహితంగానే పెంచాలని అనుకుంటున్నాం. ప్రేమ వివాహాలు చేసుకునే వాళ్ళు ఒకరిమీద ఒకరికి నమ్మకం ఉండాలి. అర్థం చేసుకోవాలి. పెద్దలు ఒప్పించే పెళ్ళి చేసుకోవాలనేది మా అభిప్రాయం. నేడు యువకుల్లో ద్వంధ్వ రీతి ఉంది. ఒకరిని కొంతకాలం ప్రేమించి నచ్చక మరొకరిని పెండ్లి చేసుకోవడం కూడా జరుగుతూనే ఉంది. అలా కాకుండా ప్రేమించేపుడే ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసి అనుబంధంతో కొనసాగాలి.
- కె.అశోక్, హైదరాబాద్ జిల్లా విద్యార్థి సంఘ నాయకుడు, లక్ష్మీప్రియ, ఉపాధ్యాయురాలు
ప్రేమించి పెళ్ళి చేసుకుంటేనే... ఒకరికొకరు అర్థమవుతారు
ఆర్థిక ఇబ్బందుల వల్ల మొదట నేను అసలు పెళ్ళి చేసుకోవద్దనే అనుకున్నాను. కానీ సుధారాణికి నాకు ప్రేమ చిగురించడంతో నా మనసు మార్చుకున్నాను. ముందుగానే మా పెళ్ళి విషయం ఇరు కుటుంబాల పెద్దలకు తెలియజేశాం. వాళ్ళు అన్నీ రకాలుగా విచారించి ఒప్పుకున్నారు. అమ్మాయి తరుపు సంప్రదాయం ప్రకారమే పెళ్ళి చేసుకున్నాం. ప్రేమించి పెళ్ళి చేసుకోవడం వల్ల మేమెలాంటి సమస్యలూ ఎదుర్కోలేదు. ఆమెది చాలా అందమైన మనసు. నేను వాళ్ళ తల్లిదండ్రులతో కలివిడిగా ఉంటాను. కుటుంబాల మధ్య ఏ రకమైన సమస్యలూ తలెత్తలేదు. పెళ్ళైన తర్వాత కొద్దిగా ప్రేమలు తగ్గాయని ఇద్దరమూ అనుకుంటుంటాం. దానికి కారణం మా ప్రేమను సమయాన్ని పిల్లల మీద కేటాయించడమే కారణం. కానీ పిల్లల విషయంలో కొద్దిగా మా ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చినా.. అవి పెద్ద సమస్య కాలేదు. పిల్లలను ఆవిడ కుటుంబ సాంప్రదాయం ప్రకారమే పెంచాలని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ సాంప్రదాయమే నాకు బాగుందనిపించింది. తండ్రి సాంప్రదాయం ప్రకారమే పెంచాలని ఆమె అంటుంది. భవిష్యత్తులో ఆర్థికపరమైన ఇబ్బందులేమైనా మా మధ్య బేధాలు సృష్టిస్తాయేమో అని అప్పుడప్పుడు భయపడుతుంటాం. కానీ అలాంటివేమీ రాకుండా చూసుకునేందుకు కృషి చేస్తున్నాం. ఎప్పుడూ తిట్టుకోలేదు. ముఖ్యంగా మా తల్లిదండ్రులతో ఆమె చాలా కలిసిపోయి ఉంటుంది.
ఎంతో ఒపిక ఉన్నవాడు. అతను లాంటి వ్యక్తి దొరకడం నా అదృష్టం. అర్థం చేసుకోగల మనస్తత్వం. ఆర్థిక విషయాలు మా మధ్య ఎలాంటి సమస్యలు సృష్టించలేదు. నేడు ప్రేమికులు పరిణితి లేకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. చాలా మంది ప్రేమకు సంబంధించిన అపోహలు, భ్రమలు కలిగి ఉంటున్నారు. బహుమతులివ్వడమని, షికార్లు చేయడమని, అభినందించుకోవడమని అనుకుంటున్నారు. కానీ ప్రేమనేది మనసుకు సంబంధించినది. ఉన్నత మానసిక స్థితి వచ్చేదాక ఆచరణాత్మకమైన ప్రేమలు కలిగిన తర్వాతనే పెళ్ళిళ్ళు చేసుకోవాలి. కచ్చితంగా ప్రేమించే పెళ్ళి చేసుకోవడం మంచిదని మేమనుకుంటున్నాం.. నేటి ప్రేమికుల్లో నిబద్ధత తగ్గుతోందని అనిపిస్తోంది. నమ్మకమనేదే ప్రేమకు మూలం.
- తన్నీరు శశిధర్, ఎం.కామ్.బి.ఈడీ., సుధారాణి, బి.కామ్.,
పెద్దవాళ్ళనూ గౌరవించాలి
ఇద్దరమూ పని చేస్తున్న చోట ప్రేమలో పడ్డాం. పెద్దలకు చెప్పాం. కానీ ఒప్పుకోలేదు. ఒక రెండు సంవత్సరాలు వేచి ఉన్నాం. తల్లిదండ్రులను ఒప్పించాం. ఆ తర్వాత స్టేజీ మ్యారేజీ చేసుకున్నాం. ఇద్దరి మధ్య ఇంతవరకు పెద్ద సమస్యలేమీ రాలేదు. చిన్నచిన్నవేవైనా వస్తే, సర్దుకుపోతాం. ఇప్పటికి కూడా ప్రేమలేవీ తగ్గలేదు కానీ బాధ్యతలు పెరిగాయి. ఆర్థిక ఇబ్బందులనేవి అన్ని కుటుంబాలలోలాగే మాకూ ఉన్నాయి. మా పిల్లలను కులరహితంగానే పెంచాలనుకుంటున్నాం. ఇప్పటి ప్రేమికులు ఇంట్లోపెద్ద వాళ్ళను ఎదిరించి పారిపోవడం కాక, ఒప్పించి వాళ్ళనూ గౌరవించి పెళ్ళి చేసుకోవాలి. అంతేగానీ ఆత్మహత్యలకు పాల్పడవద్దు. ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకుపోవాలి.
- టి.మదు, రాధ, ఉద్యోగస్తులు