(అమ్మ మాటల పండుగ)
మాతృభాషను కాపాడుకోవడమంటే మనల్ని మనం కాపాడుకోవటమే. సామ్రాజ్యవాద ప్రపంచీకరణ పద్మవ్యూహంలో, మార్కెట్ సంస్కృతీ శర సంధనంలో చిక్కుకుని విలవిల్లాడుతున్నదశలో ప్రాంతీయ భాషలున్నాయి. ఇది ఒక్క భాషలకే పరిమితమైన విలయం కాదు. సాంస్కృతికపరమైన అన్ని అంశాలపైన, జరుగుతున్న దాడి. దీనికి తోడు మన దేశంలో ఏకీకృత సంస్కృతిని ఏర్పరచడానికి, ఒకే దేశం, ఒకే ప్రజ విధానంలో భాషలో, మతంలో, ఆహారాల్లో, ఆహార్యాలలో ఉన్న వైవిధ్యాన్ని గుర్తించ నిరాకరించి ఏకశిలా సదృశ్యంగా నిలిపే నియంతృత్వ పోకడలు బయలు దేరాయి. ప్రజాస్వామిక ఆచరణకు తిలోదకాలిచ్చి ప్రాంతీయ భిన్నత్వాన్ని గుర్తించ నిరాకరించడం పెరిగిపోతున్న తరుణంలో, దేశం మొత్తానికి ఒకే భాషను రుద్దాలని, కనుమరుగైన రాజుల, ఆస్థాన భాషలను తిరిగి తీసుకురావాలనే ఛాందసత్వం, తిరోగమన విధానం ప్రాంతీయ మాతృభాషలకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. కాబట్టి ఒక వైపు ప్రపంచ వ్యాపిత మార్కెట్ విస్తరణతో ఎదురయ్యే సాంస్కృతిక దాడిని, దేశీయ మతమౌఢ్య విధానాన్ని ఎదుర్కొని మాతృ భాషలను, సంస్కృతిని, మానవీయ సంబంధాలను కాపాడుకోవాల్సి వుంది. అందుకు పూనుకోని ముందుకు కదలడమే ఈ దినోత్సవాలకు సార్థకత..
యునెస్కో 1999 ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా ప్రకటించింది. 2000 ఫిబ్రవరి 21 నుండి ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. బంగ్లా దేశీయులు (అప్పటి తూర్పు పాకిస్తానీయులు) చేసిన భాషా ఉద్యమానికి నివాళిగా ప్రతి ఏట ఈ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.
1947లో భారత దేశం, పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు పాకిస్తాన్ భౌగోళికంగా రెండు వేర్వేరు భాగాలుగా ఏర్పడింది. ఒకటి తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుతం బంగ్లాదేశ్) రెండవది పశ్చిమ పాకిస్తాన్ (ప్రస్తుతం పాకిస్తాన్). సంస్కతి, భాష మొదలైన వాటిలో రెండు ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉండేవి. ఈ రెండు భాగాలను భారతదేశం వేరు చేసింది. తూర్పు పాకిస్తాన్ (ఇప్పుడు బంగ్లాదేశ్), పశ్చిమ పాకిస్తాన్ (ఇప్పుడు పాకిస్తాన్) కలిపి మెజారిటీ ప్రజలు బెంగాలీ లేదా బంగ్లా భాష ఎక్కువగా మాట్లాడేవారు. 1948లో అప్పటి పాకిస్తాన్ ప్రభుత్వం ఉర్దూను పాకిస్తాన్ జాతీయ భాషగా ప్రకటించింది. దీనికి తూర్పు పాకిస్తాన్ ప్రజలు అభ్యంతరం తెలిపారు. తూర్పు పాకిస్తాన్ జనాభాలో ఎక్కువ భాగం బెంగాలీ మాట్లాడతారు. ఉర్దూతో పాటు బెంగాలీ కూడా జాతీయ భాషలలో ఒకటిగా ఉండాలని వారు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌ను తూర్పు పాకిస్థాన్‌కు చెందిన ధీరేంద్రనాథ్ దత్తా 1948 ఫిబ్రవరి 23న పాకిస్తాన్ రాజ్యాంగసభలో లేవనెత్తారు. తూర్పు పాకిస్తాన్ ప్రజలు (ప్రస్తుతం బంగ్లాదేశ్) నిరసనలు చేపట్టారు. భాష సమాన హౌదా కోసం ఉద్యమం చేపట్టారు. ఈ ఉద్యమాన్ని అణచి వేయడానికి పాకిస్థాన్ ప్రభుత్వం 144 సెక్షన్, ర్యాలీలు, మొదలైనవి ఢాకా నగరంలో నిషేధించింది. ఢాకా విశ్వవిద్యాలయం విద్యార్థులు, సాధారణ ప్రజల సహకారంతో భారీ ర్యాలీలు, సమావేశాలు ఏర్పాటు చేశారు. 1952 ఫిబ్రవరి 21న ర్యాలీలో పాల్గొన్న వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సలాం, బర్కాట్, రఫీక్, జబ్బర్, షఫియూర్ మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. చరిత్రలో ఇది చాలా అరుదైన సంఘటన, ప్రజలు తమ మాతృభాష కోసం ప్రాణాలను అర్పించారు. పోలీసుల దాడికి నిరసనగా ముస్లిం లీగ్ అదే రోజు పార్లమెంటరీ పార్టీకి రాజీనామా చేశారు. ఉద్యమం పెరుగుతున్న నేపథ్యంలో, పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వం చివరకు దిగి వచ్చింది. 1954 మే 8న పాకిస్తాన్ రాజ్యాంగ సభలో బెంగాలీని రాష్ట్ర భాషలలో ఒకటిగా స్వీకరించారు. 1956లో పాకిస్తాన్ మొదటి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు, ఆర్టికల్ 214లో బెంగాలీ ఉర్దూలను పాకిస్తాన్ రాష్ట్ర భాషలుగా పేర్కొంది. 1971లో బంగ్లాదేశ్ స్వతంత్రమైనప్పుడు, బెంగాలీ ఏకైక రాష్ట్ర భాషగా ప్రవేశ పెట్టబడింది. యునెస్కో బంగ్లా భాషా ఉద్యమం, మానవ భాష సాంస్కతిక హక్కులను పురస్కరించుకుని 1999 ఫిబ్రవరి 21, న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ప్రకటించింది.
ఉన్నతమైన సమాజ నిర్మాణానికి భాషా సంస్కతులే పునాది. మాతృభాషా దినోత్సవం అంటే స్వాభిమాన దినోత్సవం. మాతృభాష నేర్చుకోవడం మాట్లడటం కోసమే కాదు, ప్రతి నాగరికత తన గొప్పతనాన్ని భాష ద్వారా వ్యక్తం చేస్తుంది. మన ఆటలు, మాటలు, పాటలు, సంగీతం, కళలు, పండుగలు, పబ్బాలు, సామూహిక కార్యక్రమాలు భాష లేకుండా పెంపొందలేవు. భాష సమాజాన్ని సృష్టించి, జాతిని బలపరచి అభివద్ధికి మార్గం వేస్తుంది. మన గతం, సంస్కతి, చిరునామాలను భవిష్యత్‌కు తెలియజేయడం భాష ద్వారా మాత్రమే సాధ్యమౌతుంది. ప్రపంచీకరణ నేపథ్యంలో పలు భాషలు అంతరించే ప్రమాదంలో పడిపోతున్నాయి. అన్ని శాస్త్రాలను వారి వారి భాషల్లో చదువుకుంటున్న ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, రష్యా, జపాన్, చైనా, ఇటలీ, బ్రెజిల్ తదితర దేశాలు అభివద్ధి చెందిన ఆంగ్ల దేశాలతో పోటీ పడుతున్నాయి. ఈ దేశాల ఒరవడి ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలి.
ఇక మన మాతృభాష తెలుగు సంగతి చూచినట్లైతే, యునెస్కో వారి లెక్కల ప్రకారమే 2050 నాటికి అంతరించి పోయే మూడు వేల భాషల్లో తెలుగు ఒకటిగా వుంది. తెలుగు ప్రజలు ఎంతో పోరాడితే తప్ప భాషా ప్రయుక్త రాష్ట్రం కూడా ఏర్పడలేదు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు పోటీ పడి ఇంగ్లీషు మీడియం స్కూల్లు ప్రారంభిస్తున్నాయి. ''ధనవంతులకేనా ఇంగ్లీషు మీడియం స్కూల్లు... మాకు వద్దా?'' అని మరీ పోరాడి తెచ్చుకోవటం అంటే, ఇంగ్లీషు మీడియం చదువుకుంటేనే ఉద్యోగాలు వస్తాయని, తెలుగు మీడియం వారికి అవకాశాలు తక్కువనే అభిప్రాయం కలగటం వలన అన్న మాట. మరో పక్క ఒకే జాతి, ఒకే మతం, ఒకే చట్టం లాంటి హిందూ మతోన్మాదం కొత్త రూపాలతో, కాలం చెల్లిన సంస్కత భాషను ఆయా ప్రాంతీయ భాషల్లోకి రుద్దే ప్రయత్నం చేస్తూ, వివిధ భారతీయ భాషల్ని కనుమరుగు చేసే ప్రయత్నం జరుగుతుంది. అంగ్లం కానిదంతా తెలుగేనా? ''ముఖ్యమంత్రి మేజా బల్లపై దస్త్రం ఉంది''- అనే మాట తెలుగేనా? ''గగన సఖి'', ''ఏక రూప వస్తాలు'' ఇలాంటి మాటలు తెలుగేనా?
ఏది అసలు తెలుగు? అచ్చ తెలుగు మనలో ఎందరికి తెలుసు? ఎందరికి మాట్లాడటం వచ్చు? ఇది వేరే చర్చ. కానీ నేను చెప్పదలచుకున్నదేమంటే, ''మాతృ భాష'' అంటే ''అమ్మ నేర్పిన మాట''. అమ్మ మనకు ఏ మాట నేర్పింది? ''దూరదర్శిని'' అని నేర్పలేదు కదా! ''టీవీ'' అని నేర్పింది. చరవాణి అని నేర్పలేదు. సెల్ నేర్పింది. ఇది అమ్మ నేర్పిన మాట. జనం మాట్లాడే భాష. అంటే ప్రజల భాష. ప్రజల భాషను పరిపాలనా రంగంలో ఉపయోగిస్తే, ప్రభత్వ ఉద్యోగులకు కావలసింది ప్రజల భాషే కదా! అప్పుడు ప్రజల భాషలో చదువుకుంటే ఉద్యోగాలు ఎందుకురావు? అంటే చదువుకున్న వారందరికీ ఈ దేశంలో ఉద్యోగాలు కల్పించలేం. విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాలి అంటే ఆంగ్లం రావాలి కదా! పాలకులు ఈ మాట చెప్పరు. సంవత్సరానికి రెండు కోట్లు, మూడు కోట్లు ఉద్యోగాలు అని గొప్పలు చెప్పుకోవాలి. నిజంగా అన్నేసి కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం కల్పిస్తే, మన పిల్లలు విదేశాలకు పోవటం ఎందుకు నానా బాధలు పడతూ?
ప్రాథమిక విద్య పరభాషలో అనేక అనర్థాలను కలిగిస్తుందని విద్యావేత్తలు చెపుతున్నా, పాలకుల చెవికెక్కదు. ఇక పులిని జూసి నక్క వాతలు పెట్టకున్న చందంగా వాడెవడో ఇంగ్లీషు మీడియం చదివి పొడిచేశాడని, తమ పిల్లల్ని వేలకు వేలు ఖర్చు పెట్టి ఇంగ్లీషు మీడియం స్కూళ్ళల్లో చదివించి, ఇటు తెలుగూ రాక అటు ఇంగ్లీషు రాకా పనికి రానివరైనప్పుడు విచారించి ఫలితమేమిటి? ఇక ''ఖర్చు'' అనే మాట ఆసరాగా తీసుకొని మరో నాటకం ఆడుతున్నారు పాలకులు. మారు మూల పల్లెల్లో, ఆదివాసీల గూడేలలో కూడా ఇంగ్లీషు మీడియం బడులు పెట్టి మీ పిల్లల్ని ఉద్ధరిస్తామని కబుర్లు చెపుతున్నారు. మైకులిచ్చి పచ్చిపచ్చిగా నాలుగు ఇంగ్లీషు ముక్కల్ని వేదికల మీద మాట్లాడించి, ''చూశారా! ఎంత సాధించామో'' అని బడాయిపోతున్నారు.
పరభాషలో ప్రాథమిక విద్య వలన నిజంగా ఏం జరుగుతుంది? నోట్స్ ఇచ్చి బట్టీ పట్టించటం. విషయం అర్థం కాకుండా చదవటం వలన ఏం ప్రయోజనం? అభినవ గిరీశంలను తయారు చేయటం మినహ! పదవ తరగతి, ఇంటర్ మార్కులు చూడండి. ఇక్కడ నేను విద్యార్థులను తప్పుబట్ట బోవటంలేదు. విద్యా వ్యవస్థ తీరును ప్రశ్నిస్తున్నాను. ఆంగ్లం, సంస్కతంలో 98, 99 మార్కులు వచ్చేవి. ఒక్కరికైనా సంస్కత శ్లోకం వచ్చా? ప్రతి పదార్థం చెప్పగలరా? ఇంగ్లీషులో 98 మార్కులు వచ్చిన విద్యార్థి ''Receipt'' సరిగ్గా రాయలేని వారెందరినో నేనెరుగుదును. ఈ పరిస్థితికి కారణం మన విద్యా వ్యవస్థ కాదా? ప్రాథమిక స్థాయి నుండి తెలుగు చదువుకోక పోవటం వలన తెలుగూ రాదు. ఏది సరిగా రాక ఏమి సాధించినట్టు? మాతృభాషలో విద్య సులభ గ్రహణశక్తికి, స్పష్టమైన వ్యక్తీకరణకు సాధనం.
ఆంగ్లభాషను విధిగా ఆధ్యయనం చేయాలనే నియమం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఐచ్చిక విషయంగా చదువుకోవచ్చు. చదువుకోవాలి కూడా. ఒక సందర్భంలో డా.రాంమనోహర్ లోహియా '' ఇంగ్లీషు భాషను రుద్దదలచుకున్నట్లయితే, ముందు తెలుగు, తమిళం, కన్నడం మొదలైన భారతీయ భాషల్ని చంపిపారేయండి. ప్రజలందరికి ఏదో ఒక మాదిరి అపభ్రంశమైనదో, అవకతవక అయినదో ఒకరకమైన ఇంగ్లీషు నేర్పండి. అదే దేశ ప్రజల మాతృభాషగా రూపొందిన తరువాత దాన్ని రాజ భాషగా కూడా కొనసాగించండని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.
ఊరకే మాతృభాషా దినోత్సవాలు, తెలుగు భాషా దినోత్సవాలు జరుపుకుంటే ప్రయోజనమేమిటి? భాషను కాపాడుకోవాలనే ధృఢ సంకల్పం వుంటే, అత్యంత తీవ్ర ప్రమాద స్థాయిలో పడినా, మరణశయ్యపైనున్నా సరే, ఒక పటిష్టమైన భాషా విధానం వుంటే ఏ భాషనైనా మనం కాపాడుకోవచ్చు. ఊరకే మాటలు చెప్పటం కాదు. మాతృభాషా పరిరక్షణకై పాలకులు, మేధావులు, భాషావేత్తలు, భాషాభి మానులు, తల్లిదండ్రులు కంకణబద్ధులైయుంటే సాధించవచ్చు. అందుకోసం విద్యారంగములో, పాలనా రంగంలో, ప్రచార ప్రసార రంగాలలో మరియు జనజీవన రంగంలో కొన్ని మార్పులు, చర్యలు తీసుకోవాలి.
విద్యారంగంలో ప్రధానంగా చేపట్టవలసిన చర్యలు, కనీసం ఇంటర్ స్థాయి వరకు మాతృభాష మాద్యమంగా విద్యా బోధన జరగాలి. డిగ్రీ స్థాయి వరకు మాతృభాష ప్రథమ భాషగా వుండాలి. ఇంగ్లీసు ద్వితీయ భాషగా తప్పనిసరి చేయవచ్చు. ఇతర భాషలు నేర్చుకోవటం ఐచ్చికంగా వుండాలి. అన్ని భారతీయ భాషల అభివృద్ధికి దోహదపడే చర్యలు చేపట్టాలి. ముఖ్యమైన విషయం ఏమంటే, మాతృభాషలో చదువుకున్న వారికి ఉన్నత విద్య, ఉపాధి తదితర రంగాలలో ప్రాధాన్యత ఇవ్వాలి.
పాలనా రంగంలో తక్షణం చేపట్టవలసిన చర్యలు, రాష్ట్రాలలో ఉండే అన్ని కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలలోనూ, అన్ని స్థాయిలలోనూ తెలుగే వాడాలి. ఇతర రాష్ట్రాలతో, దేశాలతో ఉత్తరప్రత్యుత్తరాలు ఇంగ్లీషులో వాడవచ్చు. న్యాయస్థానలలో తెలుగు భాషే వాడాలి. తీర్పులకు తెలుగు భాషే వాడాలి. చట్టాలు, శాసనాలు, ప్రభుత్వ ఆదేశాలు తెలుగు భాషలోనే ఉండాలి. వివిధ పాలన పరమైన కార్యక్రమాల నిర్వాణకు ఉపయోగించే కంప్యూటర్‌లలో తెలుగు భాషను ఉపయోగించటానికి అవసరమైన యాప్‌లను తయారు చేసుకోవాలి.
ఇక అతి ప్రధానమైన రంగం ప్రచార, ప్రసార రంగాలు. ఆకాశవాణి, దూరదర్శన్, ఇతర టీవీ ఛానాళ్ళ వారు తాము ప్రసారం చేసే కార్యక్రమాలలో తెలుగు వాడకాన్ని అభివృద్ధి చేయాలి. మంచి తెలుగు పదాలు ఉన్నా కూడా అనవసరంగా ఇంగ్లీషు పదాల్ని వాడటం పరిహరించాలి. సాంకేతికపరంగా అవసరమైనప్పుడు ప్రజలు వాడే వాడుక పదాల్ని వాడాలి. లేదా కొత్త పదాల్ని సృష్టించాలి. పత్రికల వారూ ఇంగ్లీషు పదాల వాడకాన్ని తగ్గించాలి. వ్యవహారిక పదాల్ని వాడటం తప్పేమీ కాదు. మాండలికాలూ వాడవచ్చు. ప్రజల జీవన విధానంలో ఎక్కువ ప్రభావాన్ని చూపేవి సినిమాలు. సినిమా వాళ్ళు వాడే పదాలు తొందరగా జన సమూహంలోకి వెళతాయి. ఇవ్వాళ ''బ్రో'' అనే మాట ఎక్కువగా వాడుతున్నాము. ఇది సినిమాలలో నుంచే జనంలోకి వచ్చింది. ఏం,? ''అన్న'' లేదా ''తమ్మీ'' అంటే తప్పా? ఇలా అనేక పదాలు జనబాహుళ్యం నుంచి కనుమరుగయ్యే ప్రమాదాన్ని సినిమా రచయితలు తలచుకుంటే నివారించవచ్చు.
అలాగే జనజీవన రంగంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎవరి మాతృభాషను వారు చక్కగా పరిరక్షించుకోవచ్చు. ప్రథమంగా ప్రజలంతా తమ సంతకాలు, ఉత్తరప్రత్యుత్తరాలు తెలుగులోనే చేసేలా ప్రోత్సహించాలి. బ్యాంకులు, రైల్వేలలో ప్రజలు నింప వలసిన ఫారాలు, దరఖాస్తులు తెలుగులోనే ముంద్రించి, తెలుగులోనే రాసే విధంగా చేయాలి. వ్యాపారులు తమ రశీదులు , షాపుల పేర్లు తెలుగుదనం గుబాళించే విధంగా పెట్టుకోవాలి. నిత్య జీవితంలో జనం తమ సంభాషణ సాధ్యమైనంత వరకు తెలుగులోనే చేయాలి.
ఈ సందర్భంగా ఒక వాస్తవం చెప్పాలి. లేక పోతే అన్యభాష లేదా అంగ్ల భాష ద్వేషంతో ఏదో చెపుతున్నాననే భావం కలుగవచ్చు. తెలుగు భాష వాడుకను పెంచే ఏ కార్యక్రమము ఇతర భాషలకు వ్యతిరేకము కాదు. తెలుగు సమాజంలో తెలుగు భాషను కాపాడు కోవటం ద్వారా ముందు తరాలకు తెలుగు కమ్మదనాన్ని, తెలుగు సంస్కతిని అందించే ప్రయత్నము. తద్వారా తెలుగు భాషను సజీవంగా ఉంచాలనే తపన మాత్రమే. అన్య భాషా పదాల వాడుక తప్పని సరియైతే వాటిని తెలుగు లిపిలో రాయవచ్చు. ఏ భాష అయినా అవసరమైనప్పుడు అనేక కొత్త పదాలను సృష్టించుకుంటూ ఒక ప్రవాహంలా ముందుకు వెళితే కలకాలం నిలిచి ఉంటుంది. మడి కట్టుకుని అంటి ముట్టకుండా వుంటే కాలగర్భంలో కలిసి పోక తప్పదు.
చివరగా ఛాయరాజ్ గారి మాటల్తో ,
''సృజనకు విత్తు స్వంత భాష
రచనకు సత్తువ ప్రజలభాష
భాష అమ్మ శ్రమ, అమ్మ భాష తెలుగు......'' మరో ప్రముఖ కవి చెప్పినట్టు..... ''కమ్మనైన తెలుగు భాష కలనైనా మానొద్దు అమ్మభాష తీపిదనం, మాతృభాష మరవద్దు. తమ బెంగాలీ మాతృభాషా ఉద్యమంలో అమరులైన, అబ్దుల్ బర్కత్, రఫీకుద్దీన్ అహ్మద్, షాఫిర్ రహమాన్‌లను ఈ సందర్భంగా యాది చేసుకోవటం వారికో నివాళి.
- మండవ సుబ్బారావు
9493335150
Sat 20 Feb 22:04:42.958376 2021