Sun 20 Sep 01:12:38.304532 2015
Authorization
చేసిన మేలును మరిచిపోకుండా కృతజ్ఞతలు చెప్పడం మనుషుల హృదయ సంస్కారాన్ని తెలియజేస్తుంది. వ్యక్తులు, సంస్థలు తమకు తెలిసీ తెలియకనే అనేకరకాలుగా సహకరిస్తారు. మేలు చేకూరుస్తారు. అందించిన సేవలకు మూల్యం చెల్లించడంతోనే బాధ్యత తీరిపోదు. నిజానికి చిన్నమాట సాయం కూడా గొప్ప తోడ్పాటు అవుతుంది కొన్ని సందర్భాల్లో. దానిని వెల కట్టలేం. అందుకని గుర్తు పెట్టుకొని ధన్యవాదాలు చెప్పడం మంచిది. ఆయా సందర్భాల్లో ఒక వ్యక్తి మరొక వ్యక్తికి సహాయపడటమే కాదు, సంస్థలు కూడా ఆ పనులు చేస్తాయి. సహాయం చేస్తున్నామని తెలియకనే సహాయం చేసేవాళ్ళు అనేకులు. ఉపాధ్యాయుల్ని మనం ఎందుకు తలుచుకుంటాం? తొలుత అక్షరాలు దిద్దించిన వారిని గుర్తు పెట్టుకోవడానికి కారణం ఏమిటి? ఎందుకంటే తొలినాళ్ళలో వారు నేర్పిన కౌశలమే జీవిత గమనానికి పునాదిగా ఉంటుంది. అందుకని విద్య నేర్పిన గురువుల చెంతకు ప్రత్యేకించి వెళ్ళి కృతజ్ఞతా పూర్వకంగా వారికి వందనాలు సమర్పిస్తుంటాం.
ఇలాంటి సంస్కృతి ప్రపంచమంతా వ్యాప్తి చేయాలనే సంకల్పంతో 1965లో హవాయిలో అంతర్జాతీయ సమావేశం ఒకటి జరిగింది. జీవితంలో మనకు ఎందరెందరో ఎన్నోరూపాల్లో సహాయపడుతుంటారు. వారి పట్ల మన మనసులో కృతజ్ఞతాభావం ఉంటుంది. కానీ దానిని వ్యక్తీకరించడానికి ఒకరోజును ఏర్పరుచుకుంటే మంచిదని సభికులు తలపోశారు. దీనితో 1966 సెప్టెంబర్ 21 నుంచి ప్రతి ఏడాది 'వరల్డ్ గ్రాటిట్యూడ్ డే' నిర్వహిస్తున్నారు. ఆనాటి నుంచి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
మనుషుల మధ్య సానుకూల మనస్తత్వాన్ని, మానవీయ విలువల్ని ప్రోది చేయడానికి ఈ దినోత్సవం తోడ్పడుతుంది. మన జీవితంలో అనేకమంది కారణంగా అద్భుతాలు జరుగుతుంటాయి. అసలు మనిషి జీవితమే ఒక అద్భుతం. అడగకనే సహాయం చేసేవారు ఎందరో. ఎన్నోవిధాల ఎందరో ఎన్నో సంఘటనల ద్వారా మన జీవితగమనాన్ని మెరుగు పరుస్తారు. చాలా వాటిని కాలక్రమంలో మరిచిపోతుంటాం. కొన్ని సందర్భాల్లో అలవోకగా 'థ్యాంక్స్' అని ఒక మాట చెప్పి వదిలేస్తుంటాం. కానీ జీవితంలో కొన్ని మలుపులుంటాయి. మైలురాళ్ళుంటాయి. వాటికి తోడ్పడినవారు ఎవరో గుర్తు చేసుకొని కృతజ్ఞతలు తెలియజేస్తే గొప్ప ఆనందాన్నీ, అనుభూతినీ ఇచ్చినవారమవుతాం.
ఆనాడు వారు చేసిన సహాయంతో తమ జీవితం ఊహించని మలుపు తిరిగిందని చెబుతూ ధన్యవాదాలు తెలియజేస్తూ చిన్న కార్డు పోస్టులోనైనా, వాట్పప్‌లోనైనా పంపొచ్చు. లేదంటే చిన్నపాటి మెసేజ్ ఇచ్చినా సంతోషపడతారు. ఇలా ఏదో ఒకరూపంలో మీ గ్రాట్యిటూడ్‌ని తెలియజేయడం మీకూ మంచిది. ఎదుటివారికి సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చినవారమవుతాం. ఇది మనుషుల మధ్య మానవీయ సంబంధాలు బలపడటానికి దారి తీసే ఉన్నతమైన అభివ్యక్తి.